అస్థిత్వమును గూర్చి విశ్లేషించిన భౌతిక పదార్ధములకు అస్తిత్వము లేదన్నది నిర్ధారిత సత్యము. ఇక జ్ఞానేంద్రియముల తోడ స్పర్శ రస గంధ విశేషముల గ్రహించి వస్తు ఆధారిత స్పర్శ జ్ఞానమును బుద్ధీంద్రియముల వలన పొందుచున్నాము. ఇక్కడ మనస్సుదే ప్రధానపాత్ర. ఈ మనస్సుని కేంద్రముగా చేసుకొని సర్వజ్ఞతను సాధించిన మహనీయులను నేటికిని మనము ఆరాధించుచునే యున్నాము. వేదరూపములో గల సారము జన సామాన్యములోనికి జొప్పించుటకు కొన్ని దివ్యావతారములు దివి నుండి భువికి వస్తాయి. ఆ కోవకి చెందిన దివ్యావతారమే జిల్లెళ్ళమూడి అనసూయేశ్వరి మాత. ఈ పరాత్పరి అవతార సందేశాలని విశ్లేషించుకుందాము.
రెండు విరుద్ధ అంశములతో కూడిన విషయములు కలిపిన యొక సమగ్ర లేక విస్తృత రూపముగ ఏర్పడుటను విషయమును సమన్వయపరచుకొందుము. బంగారం మనమివ్వని యెడల స్వర్ణకారుడు మనకు కావలసిన ఆభరణములు మనము మెచ్చిన రీతిలో తయారుచేయ లేడన్నది సత్యమే కదా ! అలాగే స్వర్ణకారుడు అనుభవరాహిత్యు డైనచో బంగారము ఉండియు ఉపయోగము లేదన్నది కూడ అక్షర సత్యమే. బంగారం – స్వర్ణకారుడు విభిన్న అంశము లైనను ఆ యిద్దరి సమన్వయం మంచి ఆభరణము. ఈ సమన్వయము అమ్మ సందేశ సంస్కారాలలో విశ్లేషించుకుందాము. ఆనందము – బ్రహ్మానందము అనే విషయాల గురించి అమ్మ మాట్లాడుతూ “బ్రహ్మానందం అంటే ఏది వచ్చినా సమంగా చూడగల ప్రగాఢమైనట్టియు, మార్పులేనట్టియు ఏర్పడే భావమే బ్రహ్మానందం” అన్నది కష్టం – సుఖం ఈ రెండు మనిషికి నిత్యజీవితంలో ఎదురయ్యే విషయాలు. మానవుడు సహజంగా కష్టాలకి క్రుంగిపోతాడు. సుఖాలకి పొంగిపోతాడు. కానీ కష్టం – సుఖం ఈ రెండు ఒకటే అనుకునే భావం మనిషికి మనస్సులో స్థిరనివాసం ఏర్పడితే అతనిలో కలిగే మార్పు ఏదో అదే బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం గురించి “అమ్మ” తేలికగా అర్థమయ్యేలా సులువైన రీతిలో చెప్పింది” అని అందరం అనుకుంటున్నాము. అమ్మ ప్రసాదించిన ఈ బ్రహ్మానంద నిర్వచన పాయసాన్ని ఆస్వాదిస్తునే అమ్మ చెప్పే ఆ వేదసారాన్ని అనుభవైక వేద్యం చేసుకోగలగాలి. అమ్మ తన బిడ్డలు జిల్లెళ్ళమూడి వస్తే వారి పెళ్ళిరోజని, షష్ఠిపూర్తి రోజని అమ్మవాళ్ళకి క్రొత్త బట్టలు పెడితే అమ్మ మాకు బట్టలు పెట్టిందని మురిసిపోయి మరచిపోకుండా చెప్పిన చోటు చెప్పకుండా చెప్పుకుంటారు. అమ్మ ఆదరించి క్రొత్తబట్టలు పెట్టడం ఆనందకరమైన విషయమే కదా ! ఆ ఆనందం అనిర్వచనీయం. కానీ ఈ ఆనందం బ్రహ్మానంద మాత్రం కాదని మనం గమనించుకోవాలి.
ఒకసారి ఒక పిల్లవాడు కారు క్రిందపడి గాయాలయి ప్రమాదకర పరిస్థితిలో యున్నాడు. అతడు ఎవరబ్బాయి అని విచారణ చేసి ఫలానా పిన్ని గారబ్బాయి అని తేల్చారు. కబురు చేసారు. పిన్నిగారు గుండెలవిసేలా ఏడుస్తూ పరిగెత్తు కొచ్చారు. పిల్లవాడి దగ్గర కూర్చుని రోదిస్తున్నారు. ఇంతలో ఎవరో పిల్లవాడిని ప్రక్కకి తిప్పారు. ఆశ్చర్యం ఆ అబ్బాయి పిన్నిగారబ్బాయి కాదు. పిన్నిగారు కూడా గమనించారు. ఆవిడ విచారం కాస్త ఆనందంగా మారిపోయింది. వీడు నా కొడుకు కాదు అని ఆనందంగా అరుస్తు అక్కడి నుండి లేచిపోయింది. మరి పిన్నిగారిలో వచ్చిన ఆనందాన్ని బ్రహ్మానందం అనుకుందామా మనము ? కానీ కాదు. ఇక అమ్మ నిత్యం ఆనందంగా ఉంటుందని అందరిని ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఒకసారి అందరూ మొక్క జొన్నపొత్తులు తింటుంటే అమ్మ ఆనందిస్తున్నది. ఇంతలో ఎవరో “అమ్మా నువ్వు కూడా తినమ్మా” అన్నారు. దానికి అమ్మ “మీరు తింటే నేను తిన్నట్లేరా” అన్నది. ఇదెలా సాధ్యం ? నిజంగా అసాధ్యం. తాను తినకుండగ ఇతరులు తింటుంటే తాను తిన్నట్లుగ ఆనందం అనుభవించగల మానసిక పరిణతి అమ్మది. అమ్మకే అది సాధ్యం. అసాధ్యాల్ని సుసాధ్యాలు చేయగల నేర్పరి అమ్మ. కనుకనే అమ్మ పొందే ఆనందం, బ్రహ్మానందం. అందుకే అమ్మ ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ నిర్వచించ గలిగింది. కష్టాలకి క్రుంగిపోకుండగ, సుఖాలకి పొంగిపోకుండగ సమత్వం ప్రదర్శించకలిగితే అమ్మ పరిపూర్ణ దర్శనం దొరుకుతుంది. అమ్మ పొందిన బ్రహ్మానందం మనదవుతుంది.
కానీ దానికి సాధకులుగా చేయవలసింది షష్టిపూర్తికి, పెళ్ళిరోజుకి అమ్మ చేతుల మీదుగ నూతన వస్త్రములు లందుకున్న భాగ్యం పొందిన మనం, ‘వర్షానికి తడిసి గజగజావణికిపోతు పొడిగుడ్డలు కూడ నోచుకొని స్త్రీమూర్తికి నేరుగా బీరువాలో నుండి ప్రక్కవారు వారిస్తున్నా వినకుండగ పట్టుచీర యిచ్చి ఆమె కట్టుకుంటే చూచి ఆనందించగల మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. అలాగే ప్రమాద పరిస్థితిలో ఉన్నది తన బిడ్డ కాదని తెలిసినా గాయపడ్డ పరాయి బిడ్డకోసం తన బిడ్డననుకొని రోదించినట్లే రోదిస్తు పరమాత్మని ప్రార్థించగల యున్నత మనస్సును సంపాదించుకోవాలి. అప్పుడే అమ్మలా మనం కూడా బ్రహ్మానందాన్ని పొందగలుగుతాము. అమ్మ నిర్వచించిన బ్రహ్మానందంలో ఎంతో గొప్ప వేదార్థ సారము యిమిడి యున్నది. ఇక్కడ కష్టం – సుఖం విరుద్ధ అంశాలని మనకి తెలుసు. కష్టానికి గల ధర్మాలు. సుఖానికి గల ధర్మాలు వేరు వేరు. వాటి నుండి పొందే ప్రతిఫలాల రుచిగానీ, వ్యక్తమగు పరిణతి గాని విభిన్నాలే. కానీ పరస్పర విరుద్ధమైన అంశాలు రెంటిని సమదృష్టితో సమన్వయ పర్చగల విస్తృత స్వరూపమే బ్రహ్మానందం.
కనుక ఈ మనస్సుకు గల ప్రాధాన్యతను అమ్మ చర్యల ద్వారా సూక్తుల ద్వారా అవగాహన చేసుకొని, అమ్మ బిడ్డలుగ మనం మనస్సుమీద ఆధిపత్యం సాధించి, అమ్మ చేరి చూపిన సన్మార్గంలో నడువగలిగిననాడు అమ్మ బిడ్డలుగ గర్వించగల స్థితికి ఎదుగుతాము. రసవద్గీత అయిన భగవద్గీతలో పరమాత్మ కూడ ఈ మనస్సుని నిగ్రహించ గలగడం కష్టమైన పనే అయినా అసాధ్యం కాదు. నిరంతరాభ్యాసం వలన చంచలమైన మనస్సుపై ఆధిపత్యం సాధించగలమని బోధిస్తున్నాడు.
అసంశయం మహాబాహో – మనోదుర్నిగ్రహంచలమ్|
అభ్యాసేన తు కొనేయ – వైరాగ్యేణ చ గృహ్యతే ॥
నిరంతరాభ్యాసం వలన మనస్సు నిగ్రహించ వచ్చని పరమాత్మ ఉపదేశిస్తే, అమ్మ మనస్సును నిగ్రహించి ఆచరణలో విజయమార్గాన్ని సుసాధ్యం చేసి మార్గదర్శనం మనకి చేసింది. అందుకే “దివి నుండి భువికి దిగిన దివ్యావతారం అమ్మ”.. అమ్మని గమనించు కుంటే మనకి గమ్యం లేకపోతే పునరపి జననం.
తప్పులు, అప్పులు అందరికీ ఉంటాయి.