1. Home
  2. Articles
  3. Viswajanani
  4. దిసోజోర్న్ గ్రంథ సమీక్ష

దిసోజోర్న్ గ్రంథ సమీక్ష

Prasad Varma Kamarushi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : July
Issue Number : 12
Year : 2013

జిల్లెళ్ళబూడి అమ్మకు ఆంగ్లభాషలో అందించిన అపురూప నివాళి ది సోజోర్న్. దీని మాతృక ‘పావకప్రభ’. శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మగారు 1968 సంవత్సరంలో రచించిన రసరమ్య కావ్యం. అమ్మ షష్టిపూర్తి సందర్భంగా 1983లో వెలుగు చూసినదీ గ్రంథం. ఒకనాడు స్వప్నంలో అమ్మ దర్శనమైన పిమ్మట జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మదర్శనం చేసుకుని తన దీనగాథ అమ్మకు నివేదించుకుంటాడు. అప్పుడే అమ్మ జీవనయానంలోని బాధామయ సన్నివేశాలు తెలుసుకుని శోకవిహ్వలుడైన రచయిత చేసిన కరుణరస భరితగానమే పావకప్రభ. ఇందులో కనిపించే పాంథుడు ప్రధానంగా మన కవియే, అయినప్పటికీ సాధకులెవ రయిననూ కావచ్చు.

134 శ్లోకాల ఖండకావ్యంలో అఖండమైన అమ్మ స్తుతి ప్రధానంగా కానవస్తుంది. పాంథ వర్ణన, స్వప్నదర్శనం, అమ్మస్తుతి, శిశుభావాభ్యర్థన ఇత్యాది తొమ్మిది అధ్యాయాలుగా సాగుతుంది. శిశుభావాభ్యర్థనతో ముగియటం ఒక కొసమెరుపు. “మాతః ప్రయచ్ఛ శిశుభావ మకల్మషం మే” అంటూ నిష్కల్మషమైన శిశు మనస్తత్వాన్ని ప్రసాదించమని కవి అభ్యర్థన. అమ్మ ముందు శిశువగుట కన్నా ఆనందస్థితి మరేమి ఉంటుంది. విశ్వజనని అయిన అమ్మ జీవకోటికంతకూ ఆహారం అందించి, తద్రూపంగా రక్షణ కల్పించాలన్న భంగ్యంతర విన్నపంతో కావ్యం ముగుస్తుంది.

పన్నాలవారిలో ‘మదర్ ఫిక్సేషన్’ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆయన వ్యక్తిత్వంలో అది అవిభాజ్యం. కన్నతల్లి కావచ్చు, లోకంలోని తల్లులందరూ కావచ్చు, అర్కపురీశ్వరి కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, రూపాలనేకం అమ్మ ఒకటి. అమ్మ ఆశీస్సులతో జ్ఞానవైరాగ్య సిద్ధిపొందిన సిద్ధుడే కాదు రమణీయ శబ్దార్థ బంధురముగా పావకప్రభ ప్రభవింజేసిన కవితా రససిద్ధుడు కూడా ఈ పాంథుడు. అమ్మ దర్శనం కాగానే అంతశ్చేతనలో కలిగిన దొక అనిర్వచనీయ కదలిక.అమవశనిశిలాంటి అంతరంగాన మెరిసిన సప్తవర్ణ చయనిక పావక ప్రభ. ఈయన కవితలలో కొన్ని అనుభవైక వేద్యాలేగాని చర్మచక్షువులకు గోచారం కావు. అర్థతాత్పర్యాలు వ్యర్థాలు. పాంథుని స్వగతం పావకప్రభ.

కష్టాల కడలిలో అమ్మ అనుభవించిన తరంగతాడనం చూచి దుఃఖితుడైనాడు కవి. అమ్మ కోసం ఆస్తిని ఆక్షరీకరించిన అంతర్ముఖీయ భావలహరి పావకప్రభ. కవి గుండెలోతులలో రాజుకున్న ఒక నిప్పురవ్వ, వెలుగు కిరణమై జీవితంలోంచి తొంగి చూస్తున్న శబ్దం శోకతప్తమై, శోకము శ్లోకమైనట్లు వేదన కావ్యమైనది. ఆత్మనివేదనమైనది. (శ్లోకము శ్లోకమగుట అనాదిగా వస్తున్న సంప్రదాయమే కదా) Poetry is the sister of sorrow. Every man that sufers and weeps is a poet Every tear is a verse and every heart_ is a poem అన్న ఆండ్రే పండితుని మాటలు స్మరణీయమిచట. ఆకలేసిన బిడ్డకి అమ్మ స్తన్యం తప్ప ఇతరేతర preconceived notions యేముంటాయి గనుక. అమ్మ జీవితంలో పడిన కష్టాలకు ద్రవించిన కవి, తెగిన గాలిపటం లాంటి తన జీవితం అమ్మ కొమ్మకు చిక్కుకున్న ఆనందం తప్ప ! అందుకే అంత స్వచ్ఛంగా, దయార్ద్రంగా, సూటిగా పఠిత గుండెలోకి పయనించే పక్షుల సమూహం వలె అలరారుతాయి పావకప్రభ శ్లోకాలు. కావ్యం పూర్తయి పుస్తకం పక్కన పెట్టగానే ఒక్కసారిగా పెనుభారం దిగినట్టు ఒక తాజా గాలితెర వీచినట్లు, తెలిసిన నావ ఎక్కి తెలియని తీరం చేరినట్టు అనుభూతి మిగులుతుంది.

కావ్యకంఠ గణపతి మునీంద్రుల ‘ఉమాసహస్రము’ గ్రంథానికి శ్రీకపాలిశాస్త్రి గారి సంస్కృత వ్యాఖ్యకు ఆంధ్ర వివరణ – పన్నాల గారి మరో ప్రఖ్యాత గ్రంథం Magnum opus అనదగ్గది అదీ ముగురమ్ముల మూల పుటమ్మ గురించే. పావకప్రభ వెలుగులో ఉమాసహస్రస్తుతి కావ్యంలోని భక్తి, జ్ఞాన, వైరాగ్య, తంత్ర, యోగ, తత్వరహస్య సుధారసము చిలికినారు.

ఇక ఆంగ్ల అనువాద విషయానికి వస్తే – అనువాద ప్రక్రియ అనుకున్నంత సులువు కాదు. అందునా సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువాదమంటే మరింత సంక్లిష్టం. మూలగ్రంథం లోని అందాలు వసివాడరాదు. భావాలు గతి తప్పరాదు. అర్థాలు అటు యిటు బెసకరాదు. ఇట్టి అసిధారావ్రతం చేపట్టి కృతకృత్యుడైనాడు జననాంతర సౌహృదుడైన అనవాదకుడు శ్రీ దినకర్.

గుండెలోతుల నుండి పెల్లుబికిన హృదయార్తికి భాషాభేదాలు అడ్డురావన్న భావానికి అద్దంపట్టే రచన. ఆంగ్ల కవితానుగుణమైన ఛందస్సు (మీటర్) పాటించినట్లు లేదు. అయినా అద్భుత పదవిన్యాసంతో పట్టి చదివిస్తుంది. చదవటం మొదలు పెడితే అలవోకగా పేజీలు దొర్లిపోతాయి. అందుకే కాబోలు Coleridge మహాశయుడు Poetry in its best form may exist without meter అన్నాడు. దినకర్ గారి ఆంగ్లభాషా శైలి అపురూపమైనది. హైదరాబాద్ ఎగ్జిబిషన్లో పెట్టిన అమ్మ స్టాల్ గురించి రాసినా, చింతలతోపు గురించి రాసినా, ధాన్యాభిషేకాన్ని గురించి రాసినా, కేశవన్నయ్య గురించి రాసినా మరొకటి రాసినా ఆ డిక్షన్ అనర్గళంగా syntax నిర్దిష్టంగా సాగి పఠితను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. The Sojourn అని గ్రంథానికి పేరుపెట్టడంలోని ఔచిత్యం అత్యంత ప్రశంసనీయము.

పావకప్రభ దినకర్ అంతశ్చేతనలో జ్వలించి, చలించి, జీవించిన దాని ప్రతిచర్యలో పెల్లుబికిన విద్యుద్దానం. ఏ ఆర్తి, ఏ వేదన పావకప్రభని వెలిగించిందో అదే ఆర్తి, అదే స్ఫూర్తి, అదే వేదన హృదయ శోధనయై ‘సొజొర్న్ ‘ని పలికించింది. అందుకే What is poetry. but the thought and words in which emotion spontaneously embodies అన్న John stewart Miller మాటలు జ్ఞప్తికి వస్తాయి. 

ఇది యధామాతృకానువాదం కాదు. అది అభిలషణీయమూ కాదు. కొన్ని సంస్కృత పదాలకు, పడికట్టురాళ్ళకు సమాన పదాలు ఆంగ్లంలో లేవు. దొరకవు. అందువల్ల మూలభావాన్ని స్వీకరించి స్వేచ్ఛానువాదం చేశారు. అలాగే తనదైన అవగాహనతో వివరణా ఇచ్చారు.శ్రీ దినకర్ కావ్యగత వస్తువూ, కావ్యనాయిక, కవి హృదయమూ తెలిసినవాడు గాన అందంగా అను వదించటమే గాక చాలా శ్లోకాల నేపథ్యమూ, సందర్భమూ వివరించారు. అమ్మ జీవిత ఘట్టాలు, సంఘటనలు తెలియని పాఠకులు కూడా కావ్యరసాస్వాదన చెయ్యటానికి మార్గం సుగమం చేశారు. ఈ కావ్యమున మార్మిక గుణ భూయిష్టత అధికమే. ఈ మార్మికతను పరకాయ ప్రవేశము చేయించి సజీవంగా ఆంగ్లంలోకి ప్రవహింపజేశారు శ్రీ దినకర్.

చివర ఇచ్చిన పదార్థ సూచిలో అద్వైతం, చైతన్యం, ఆదిభౌతికం, జీవాత్మ, తితిక్ష, సంచితం వంటి ఆధ్యాత్మిక పరిభాషా పదాలకే గాక, వివరించు, ఉంది. రుచి, నన్ను, నాది, చేతలు, బాధలు వంటి నిత్యజీవితంలో ఉపయోగించే సామాన్య పదాలకు కూడా అర్థవివరణ చెయ్యటం ముదావహం. సహచింతన గలవారు, సహధర్ములు, సంస్కృతాంధ్రములు అంతగా తెలియనివారు అయిన ఆంగ్ల పాఠకులకు కావ్యం కరతలామలకం చేసే కరదీపిక ఈ సూచిక.

ఇది ఒక సంక్షిప్త అవలోకనం మాత్రమే. ఈ మహోదధిలోంచి వెలికి తియ్యవలసిన మణులింకా అనేకం ఉన్నాయి. ఇంకా ఈ Odyssey కొనసాగవలసిందే 

ప్రసాదవర్మ కామరుషి

(‘దర్శనమ్’ ఆధ్యాత్మిక వార్తాపత్రిక వారి సౌజన్యంతో)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!