అమ్మ రక్షణ కటాక్షాలు తెలుసుకోవటం చాలా కష్టం. అసాధ్యం కూడా. అమ్మపై అచంచలమైన భక్తి, విశ్వాసం ఏర్పరచుకున్న అనేక కుటుంబాలలో మా కుటుంబం ఒకటి. అమ్మ అపారమైన కరుణా కటాక్షాలతోనే జీవితంలో అనేక ఒడిదుడుకులు తట్టుకో గలిగాము. ఆయా సందర్భాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అమ్మ చూపిన మహిమలు అనుభవమై అమ్మపై నమ్మకంతో, అమ్మే దైవంగా భావించిన అమ్మ బిడ్డలం.
ఒక్కొక్కప్పుడు అమ్మ సందేశం అన్యాపదేశంగా ఉండటమే గాక క్రియాత్మకంగా కూడా ఉంటుంది. తెలుసుకోవటం చాలా కష్టం. మీరంతా నా సంతానమే నాన్నా! మీకు సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, అది నేనిచ్చినదే! అని అమ్మ అనేకసార్లు చెప్పింది. ఒక్కొక్కసారి నేనూ మీలాంటిదాన్నే నాన్నా! నాది తెలిసీ తెలియని స్థితి, నేను ఏమీ చేయలేనని సామాన్య మానవ మాతృరాలివలె మాట్లాడుతుంది. సమయం వచ్చినపుడు అమ్మ తన యదార్థస్థితి ప్రకటిస్తుంది. ఆపద్భాంధవి అమ్మ ఘటనాఘటన సమర్థురాలు. ఈ సంఘటన ఉదాహరణ.
1964 సంవత్సరం మా అమ్మ (శ్రీ గిరిరాజు రంగనాయకమ్మ) ఎప్పుడూ అమ్మ సాన్నిధ్యంలో గడుపుతుండేది. మేము సంతోషపడే వాళ్ళం. అమ్మ దగ్గర అంత మనశ్శాంతి పొందేది. మేము గుంటూరులో ఉండే వాళ్ళం. మా నాన్నగారి ఆరోగ్యం బాగుండేది కాదు. మేము ఆయన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళం.
ఒకరోజు జిల్లెళ్ళమూడిలో అమ్మ సర్వాలంకృతమై దర్శనం ఇస్తోంది. చాలామంది మంచానికి ఎదురుగా కూర్చున్నారు. పక్కన రామకృష్ణ అన్నయ్య అమ్మ మెడలో కనకాంబరం దండవేసి పూజ మొదలు పెట్టారు. పూజ పూర్తికాగానే ముఖాన కుంకుమబొట్టు పెట్టి స్వయంగా అందరికీ అమ్మ ప్రసాదం ఇస్తోంది. ఆ రోజు మెడలో దండతీసి చిన్న, చిన్న ముక్కలుగా తెంపి, విసిరేయ సాగింది. అందరూ ఉత్సాహంగా అందుకుంటున్నారు.
ఆ జనసందోహంలో మా అమ్మ కూడా ఉంది. ఒక్క ముక్క కూడా అందుకోలేకపోయింది. అమ్మ నేర్పుగా క్రీగంట చూస్తూ దండలు విసిరేయసాగింది. మా అమ్మకు పూలు అందలేదు. దండ అయిపోయింది. ఇంక అందరూ బొట్టుపెట్టించుకుని, ప్రసాదం తీసుకోసాగారు. మా అమ్మ వద్దకు వచ్చేసరికి దర్శనం, ఆపేసి లోపలికి వెళ్ళిపోయింది అమ్మ. మా అమ్మ ఎంతో బాధపడి, ఏదో అపశకునంలా తోచి, భృగుబండ తిరుమలమ్మ గారితో చెప్పుకుంది. (ఆమె మా అమ్మకు మేనత్త) కొద్దిసేపటికి నైవేద్యం తీసుకు వెళ్ళింది తిరుమలమ్మగారు మేడమీదకు. “రంగను భోజనం చేయగానే వెంటనే గుంటూరు బయలుదేరమని చెప్పు” అన్నది అమ్మ. అన్నది అనే కంటే ఆజ్ఞాపించింది అనటం నిజం. అప్పట్లో జీపులో బాపట్ల నుండి, కూరగాయలు తీసుకుని వచ్చేవారు. ఎప్పుడూ జీపు అందుబాటులో ఉండేది. వెంటనే ఆ జీపులో బాపట్ల వరకు వచ్చి బస్సులో గుంటూరు వచ్చింది మా అమ్మ. ఇక్కడ ఆ రోజు ఉదయం నుండి మా నాన్నగారి ఆరోగ్యం క్షీణించినందున గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాము. వెంటనే మా అన్నయ్య జిల్లెళ్ళమూడికి ఫోన్ చేసి టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు. అప్పట్లో జిల్లెళ్ళమూడి ఆఫీసులో మాత్రమే లాండ్లైన్ ఫోన్ ఉండేది. ఎవరికైనా ఫోన్ వస్తే వెళ్ళి చెప్పి పిలుచుకు వచ్చేవాళ్ళు. అలాగే గుంటూరు నుండి ఫోన్ వచ్చిందని, రంగక్కయ్య కోసం అడుగుతున్నారు. ఫోన్, టెలిగ్రామ్ కంటే ముందుగా సరైన సమయానికి మా అమ్మ గుంటూరు చేరటం, నాన్నగారిని చివరి చూపు చూసుకోవటం, ఆయన అమ్మలో ఐక్యమవ్వటం జరిగిపోయాయి.
శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య వ్రాసిన మాతృసంహిత గ్రంథం చదువుతుంటే ఒక చోట అమ్మ చెప్పిన మాట ఇది చదివాను “నా కబురు సరాసరి చేరుతుంది. మీ కబురు పోస్టాఫీసులో ముద్రలు, పడితేనే గానీ చేరదు” అని అన్నది అమ్మ. అనుభవానికి వస్తే గాని అమ్మ మహిమ తెలియదు. ఆపద్బాంధవి అనాధరక్షకి అమ్మ పాదపద్మాలకు నమస్కారం చేసు కుంటున్నాను.