”వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే ……….” అంటూ సంకల్పం చెపుతూంటే, కాల స్వరూపిణి అయిన అమ్మ ”ప్రథమపాదే కాదు నాన్నా! చతుర్థపాదే” అంటూ సరిదిద్దిందట ఒక సందర్భంలో. అది నిజమే అనిపిస్తున్నది వర్తమాన కాల పరిస్థితులను గమనిస్తుంటే.
లోకంలో స్వార్థం, దర్పం, అహంకారం రాజ్య మేలుతున్నవి. స్వధర్మ నిర్వహణ, సంప్రదాయాన్ని పాటిస్తున్నవారు క్రమంగా కనుమరుగవుతున్నారు. అది ఈ సంవత్సరం మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.
ప్రేమస్వరూపులైన ఎంతమంది సోదరీ సోదరులు మన మధ్యనుండి నిష్క్రమించారో గమనిస్తే పైవాక్యంలోని సత్యం ద్యోతకమవుతుంది. ఈ సంవత్సరం పొత్తూరివారు, పన్నాలవారితో మొదలైన ఈ నిష్క్రమణ కార్యక్రమం మొన్నటికి మొన్న దుర్గపిన్నిదాకా కొనసాగటం అత్యంత దురదృష్టకరం.
అమ్మ పినతల్లి అయిన వరాలమ్మమ్మ సంతానంలో ఒకరయిన కుమ్మమూరు దుర్గాంబ అంటే ఎంతమందికి తెలుసో కాని, ‘దుర్గపిన్ని’ అంటే తెలియని వారు మన బృందంలో ఎవరూ వుండరంటే అతిశయోక్తి కాదు.
సత్సంప్రదాయ పరంపరలో, ఆదరణకు, ఆప్యాయతకు, ప్రేమకు ప్రత్యక్ష ఉదాహరణ దుర్గపిన్ని. జిల్లెళ్ళమూడి సోదరబృందంలో ప్రతి ఒక్కరికీ దుర్గపిన్ని వారి కుటుంబ సభ్యురాలే! అంత నిష్కల్మష హృదయంతో, నిండు మనస్సుతో, ప్రతి ఒక్కరినీ పలకరించి ఆదరించే మనస్తత్వం పిన్నిది. అతిథులను ఆదరించటం అంటే పిన్నికి ఎంతో ఇష్టం. ఇంటికి వచ్చిన వారిని ”అమ్మ” లాగా వారి బాగోగులు కనుక్కుని, వారి కడుపునింపి కాని పంపేది కాదు. అటువంటి పిన్ని ఈరోజు లేదు అంటే మనస్సు అంగీకరించటం లేదు.
ఏమిటి మనకు ఆమెకు సంబంధం? ఎంతటి అనారోగ్యంలో కూడా ఎంత శ్రమ అయినా కూడా ఎందుకు ఆవిడ మన ఆహ్వానాన్ని అంగీకరించి మన ఇళ్ళల్లో ఏ శుభకార్యమైనా ఎందుకు రావాలి? వాళ్ళింట్లో ఏ కార్యక్రమమైనా ఎంతో ఆప్యాయతతో ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసి పేరు పేరునా మరీ ఎందుకు పిలవాలి? ఏ చిన్న విశేషమైనా వెంటనే ఫోన్ చేసి ”కామరాజూ! ఆ కార్యక్రమం చూశావా? ఇది విన్నావా?” అంటూ ఎంతో సన్నిహితంగా పంచుకునే పిన్నిని కాలం ఎంత క్రూరంగా దూరం చేసింది? మనసులోని ఈ ఆవేదనకి ఎలా ఆనకట్ట వేయాలి? సోదరులు నరసింహమూర్తి, హరి, కృష్ణ, సోదరి వాత్సల్యలను ఎలా పలకరించాలి? ఎలా ఓదార్చాలి?
బాబాయిగారి వియోగంతో ఏర్పడిన శూన్యం భరించలేక, ఆవేదనని అణచుకోలేక ప్రతిక్షణం దుఃఖిస్తూ కొనసాగిస్తున్న జీవితంలో అకస్మాత్తుగా, పిడుగుపాటు లాగా సోదరి వత్సల అకాల మరణం అశనిపాతంలాగా తాకి జీవితభారాన్ని ఇక మోయలేక పిన్ని కూడా వెళ్ళిపోవటం ఈ సంవత్సరం మనకిచ్చిన కఠిన శిక్ష! మహాశాపం!!