‘దారి తెన్ను తెలియరాని
దుర్గమంబగు మార్గమందున….’ కింకర్తవ్యమ్ ? – అని ప్రశ్నిస్తే అందుకు సరియైన సమాదానాన్ని పరిష్కారాన్ని పరమ భాగవతోత్తములు భగవాన్ వాల్మీకి మహర్షి, శ్రీ అన్నమయ్య చక్కగా వివరించారు.
సమస్యల సుడిగుండం అనీ, బాధలతోరణం అనీ అంటాం; అదేదో ఊహకాదు, కల్పన కాదు; వాస్తవం. ఒక ఉదాహరణ : 80 ఏళ్లు పై బడ్డ నాకు మిత్రులు ఒకరున్నారు. తన గర్భవాసాన పుట్టిన సంతానమే ఆగర్భ శత్రువుల్లా పీడిస్తున్నారు. ఊపిరిపోక, జీవచ్ఛవంలా ఆయన శ్వాసిస్తున్నారు.
అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండవచ్చును. కాగా – వృత్తిలోగానీ నిజజీవనయానంలో గానీ కన్ను పొడుచుకున్నా దారి కానరాకుంటే ఎలా అడుగువేయటం? అని ప్రశ్నిస్తే సమాధానం ఒక్కటే అని ముక్త కంఠంతో చాటాయి ఆ రెండు గళాలు.
- వాల్మీకి మహర్షి : సుందరకాండలో ఆంజనేయస్వామి కర్తవ్య దీక్ష, నిష్ఠను ఒక ఆదర్శంగా చక్కని సందేశంగా చిత్రించారు. హనుమ సీతాన్వేషణ తత్పరత్వమతుడై లంకా నగరంలో రాత్రి భాగంలో, గూఢచారిలా ప్రవేశించి ఆయుధాగారాలు, ఉద్యానవనాలు, పాఠశాలలు, పుష్పక విమానం, రమ్య హర్మ్యాలు ఎన్నో దర్శించాడు. రావణాంతఃపురంలో పతివ్రతా లలామ మండోదరిని చూసి సీతామాత అని క్షణ కాలం భ్రమ పడ్డాడు. ‘చతురంగుళ మాత్రో పి’ నాలుగు అంగుళాల స్థలాన్ని సైతం విడిచిపెట్టలేదు. సీతమ్మ జాడ తెలియ లేదు. కావున నిరాశోపహతుడైనాడు. కిం కర్తవ్యం అని మధన పడ్డాడు. పరిష్కారం తక్షణం స్ఫురించింది. ఆరాధ్య దైవం యొక్క నామ స్మరణ అని. ‘నమోస్తు రామాయ సలక్ష్మణాయ’ అని మదిలో నమశ్శతములను సమర్పించాడు. అంతే. అశోకవనం అందు ఒక పతివ్రతా శిరోమణి దర్శన భాగ్యం ప్రాప్తించింది.
‘ధర్మజ్ఞన్య కృతజ్ఞన్య రామస్య విదితాత్మనః |
ఇయం సా దయితా భార్యా రాక్షసీ వశమాగతాః ॥’
ఆమె శ్రీరాముని ధర్మపతి సీత అనే, ఒక నిశ్చయాత్మక భావన చేశాడు. అంతేకాదు. ‘రాజా దశరధోనాము..’ అంటూ రామ కథను ఒకటికి రెండు సార్లు గానం చేశాడు. ‘రామః కమల పత్రాక్షః’ – అంటూ ఆరాధ్య దైవాన్ని కీర్తించాడు. ‘జయత్యతి బలో రామో’, ‘దాసో హం కోసలేంద్రస్య’, ‘న రావణ సహస్రం మే యుద్దే ప్రతిబలం భవేత్’ – అని ఎలుగెత్తి చాటాడు. తన శక్తికి విజయానికి కారణం రామనామ స్మరణ, రామ చంద్రుని ఆశీస్సులు అని అవగతమైంది. కనుకనే 1000 మంది రావణులనైనా మట్టి కరిపిస్తాను అని ధైర్యంగా శతృసంహారం చేశాడు.
- శ్రీ అన్నమాచార్యుల వారు అదే తాత్పర్యంతో
– ‘ఆకటి వేళల అలపైన వేళలను
తేకువ హరినామమే దిక్కు మరిలేదు॥
సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ధి పొరలిన మరిలేదు తెరగు ॥ ఆకటి వేళల॥’ –
అంటూ ఒక దివ్యోపదేశం చేశారు. కన్నీరు అంటే, కారాగార శిక్ష అంటే అనుభవించిన వాడు; తిరుమలేశుని అనుగ్రహంతో అధిగమించిన వాడు కనుక అంత సూటిగా ఘాటుగా ఉద్బోధించారు. ఆ ఉపదేశం సార్వత్రికం సార్వ కాలికం….. అందరికీ వర్తిస్తుంది. కన్నీటి కడలిలో నిండా మునిగి ‘త్రాహిమాం’ అని ఆక్రోశించే వారందరికీ.
నేడు కరోన మహమ్మారి యావత్ప్రంచాన్ని గజగజ లాడిస్తోంది. తరతమ భేదం లేక ప్రతి ఒక్కరూ మృత్యు పరిష్వంగంలో ఉన్నట్లు భయవిహ్వలురై ఉత్కంఠ భరింతంగా శ్వాసిస్తున్నారు. అకాలమృత్యువాత పడకుండా బ్రతికి బట్ట కట్టాలంటే ఒకటే మార్గం – సర్వ వ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి జగజ్జనని శ్రీ చరణసమాశ్రయం.
ఈ సందర్భంగా ఒక సున్నితమైన విశేషాంశం – మనం నిద్ర లేస్తూనే దైవానికి నమస్కరిస్తాం; యథాశక్తి ఉపచారాలూ నివేదనలూ సమర్పిస్తాం. వాటి స్వరూప స్వభావాలు ఎలా ఉండాలో వేదం స్పష్టపరిచింది.
‘అగ్నే నయ సుపధారాయే అస్మాన్’ ( ఓ అగ్నిదేవా! మమ్మల్ని సన్మార్గంలో నడిపించు. ‘భూయిష్ఠా౦తే నమ ఉక్తిం విధేమ’ (నీకు నమస్కారం అని కేవలం మాటలలో వ్యక్తం చేస్తున్నాను’ అంటే త్రికరణశుద్ధిగా కాదు; – కేవలం నోటిమాటగా – అంతే. దీని అర్థం మనస్ఫూర్తిగా చేయనపుడు పూజలకి ప్రార్ధనలకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు – అని. ఈ సత్యాన్నే వెలయిస్తూ అమ్మ “చేతుల కలయిక కాదు నమస్కారమంటే – అందుకు సంస్కారమే ఆస్కారం – అని అన్నది.
స్వీయానుభవం: – 1984 ప్రాంతం. మా అమ్మ హృద్రోగంతో బాధ పడుతున్నది. చిరకాలంగా. మేము ప॥గో॥జిలా పాలకొల్లు దగ్గర వల్లూరు గ్రామంలో ఉన్నాం. వైద్యం కాకినాడలో డా॥ఎన్.వి.ఎస్. నాయుడి గారి వద్ద. ఒకసారి కొన్ని సమస్యలతో కాకినాడ వెళ్ళి వారి పర్యవేక్షణలో ఆస్పత్రిలో చేర్చాం. ఐదారు రోజుల చికిత్సానంతరం మందులు వ్రాసి ఇచ్చి ఇంటికి తీసుకు వెళ్ళమన్నారు. నేను అడిగాను “మళ్ళీ ఎప్పుడు తీసుకురమ్మంటారు? అని. అందుకు డాక్టర్ అన్నారు – ‘మీరు మళ్ళీ తీసుకురారు. Reserve Power of the Heart అని ఉంటుంది. కాగానే అంతే”- అని.
నాకు ముచ్చెమటలు పట్టాయి. అతః పూర్వమే మా ఆఖరు చెల్లెలు పెళ్ళి – నిశ్చయ తాంబూలాలు తీసుకున్నాం. రెండు నెలల్లో సుముహూర్తం. ఆ పెళ్ళి తన కళ్ళతో చూసుకోవాలి అని మా అమ్మ కడసారి కోరిక. కిం కర్తవ్యం? – అని తల చేత్తో పట్టుకున్నాను.
తక్షణం మెరుపులా ఆలోచన వచ్చింది. ఆస్పత్రి నుంచే ‘అమ్మకి’ ఉత్తరం’ వ్రాశాను. ‘ఇదీ విపత్కర పరిస్థితి. మా అమ్మకి 3 నెలలు ఆయుర్దాయం ఇవ్వు’ అని. అలా ఎవరిని అడగగలం? నిఖిలలోక శరణ్య, కారుణ్య రస స్వరూప ‘అమ్మ’ని తప్ప.
అంతే! అమ్మ కనికరించింది. రెండు నెలలకి అనుకున్న ముహూర్తానికి పెళ్ళి వైభవంగా జరిగింది. ఆ సంరంభంలో నేను ‘అమ్మ’కి చేసుకున్న అభ్యర్ధన మరిచిపోయా. కానీ, అది అమ్మ ఆజ్ఞ/అనుజ్ఞ. సరిగ్గా వివాహం అయిన నెల రోజులకు అదే రోజు, అదే సమయం మా అమ్మ, అంతిమ శ్వాస విడిచింది. ఎందుకు ‘మూడు నెలల ఆయుర్దాయం’ కావాలని కోరుకున్నానో తెలియదు. అంతే. అమ్మ రోజులు, గంటలు, నిముషాలు లెక్కించి సరిగ్గా మూడు నెలలు sanction చేసింది. నేను ‘అమ్మ’ను ఆశ్రయించి ఉండకపోతే ఏ ప్రమాదం వచ్చి ముంచెత్తి వేసేదో! శ్రీ రాజుబావ ఎలుగెత్తి చాటినట్లు –
‘ఎంత మంచిదానవో యమ్మా
నీదెంత మంచి విధానమో యమ్మా ॥ఎంత॥
దారి తెన్ను తెలియరాని
దుర్గమంబగు మార్గమందున దారి జూ పెడి దివ్యజ్యోతివి
తీరు తెలిపెడి వేగుచుక్కవు’ ఎంత॥ – అంటూ భావములోన బాహ్యము నందును సర్వాత్మనా అమ్మను ఆశ్రయించటమే ఏకైక తరుణోపాయం, మార్గం.