అన్నయ్యా!
చూశావా, ఎప్పటికప్పుడు నీకు ఉత్తరము వ్రాద్దామనుకుంటుండగానే శ్రావణ భాద్రపదాలు గడచి ఆశ్వయుజం ఆరంభమైనది.
మళ్లీ కార్తీకం ప్రవేశించేలోగా నిత్యకళ్యాణం పచ్చతోరణమైన ఈ లోగిట్లో ఈ మధ్యజరిగిన పర్వదినాలు చేసిన “పండుగ సందడి” ఏమిటో చూద్దాము.
మంగళవారం నోములతో, శుక్రవారం పూజలతో, కళకళలాడే శ్రావణ మాసంలో ఆ నాలుగువారాలూ ఇక్కడ బృందమే కాక ఇతర ఊళ్ళనుండి వచ్చి ఆ నోములు నోచుకున్నారు కొంతమంది అక్కయ్యలు.
ఏ దేవత నుద్దేశించి వారీ నోముపట్టారో, ఆ దేవికే ప్రత్యక్షంగా పూజ చేసుకుని వాయినాలు చెల్లించుకునే అవకాశం ఆనాడు తాను “మంగళగౌరియై” లభింపచేసిన అమ్మ, వరలక్ష్మీ వ్రతంనాడు వరలక్ష్మియై, శ్రీకృష్ణజయంతినాడు కృష్ణభగవానుడై జాతి మత కుల గుణ వర్గ వర్ణ విభేదరహితంగా అర్కపురిలో “అందరిల్లు”కు పునాదివేయబడిన ఆ శుభదినాన (ఆగష్టు 15వ తేదీన) స్వతంత్ర లక్ష్మియై, చవితినాడు పూలుపండ్లు ఆకులతో అందంగా కన్నుల పండువుగా అలంకరింపబడిన పాలవెల్లి క్రింద విఘ్నేశ్వరుడై, అదేరోజు, చివర మంగళవారమున గౌరీదేవిని ఓలలాడించుటకు వీలుపడనందున ఆ రోజు ఓలలాడించగా మంగళగౌరియై, ఉండ్రాళ్ళ తద్దెరోజు తదియగౌరియై పూజలందుకున్నారు.
అదేవిధంగా సుధాంశుడి వెలుగులోని స్వచ్ఛతను ధవళతను పూర్ణంగా ప్రస్ఫుటం చేసే శరత్కాలారంభంలో జరుపబడే దేవీనవరాత్రోత్సవాలలో నిత్యమూ ఒక్కొక్క అలంకార విశేషంతో పూజలందుకున్నారు.
ఈ తొమ్మిదిరోజులు అమ్మ ధరించే వస్త్రాలు, ఆభరణాలలోనే గాక సదా పవిత్ర ఫాలభాగంలో భ్రుకుటిన అరుణకాంతి తేజస్సును ధిక్కరిస్తూ పూర్ణబింబాకృతిలో శోభిల్లుతుండే కుంకుమ స్థానం కూడా పూటకో రీతిగా అలంకరింపబడేది. ఒక్కొక్కసారి బంగారపు బొట్లుపెట్టి చుట్టూ కుంకుమ, విభూతితో రేఖలు దిద్దితే మరొకసారి కేవలం విభూతితో కుంకుమతో గంధంతో పెట్టుకునేవారు. ఆ బొట్టు పెట్టుకోవటము కూడా నిలువుగానో, గుండ్రంగానో లేక రెండూ మిళితమయ్యో ఉండేది.
మరి ఈ “బొట్ల”ని గురించి ఏ శాస్త్రాలలోనైనా ఇది ఈ దేవతకు అలంకారం, ఈ బొట్టు ఈ దేవత ధరిస్తుందని ఉన్నదో లేదో కాని లలితాంబగారు అమ్మతో దీనిని గురించి ప్రస్తావించే “పూటకోవిధంగా పెట్టుకుంటున్నావు కదమ్మా, అవి ఏ దేవీ అవతారానికి చిహ్న” మని ప్రశ్నించినప్పుడు – అమ్మ చిరునవ్వుతో సమాధానమిచ్చారు – “ఏమోనమ్మా, నాకావిధంగా పెట్టుకోవాలనిపిస్తుంది. పెట్టుకుంటున్నాను” అని.
పూజావేళలలో కూడా ఒక్కొక్కసారి ఎంత గంభీరంగా, మౌనంగా నిశ్చలంగా కనిపించేవారో మరొకసారి అంత చిలిపిగా అల్లరిచేస్తుండేవారు. దీని అంతరార్థమేమిటని ప్రశ్నించినా సమాధానంగా చిరునవ్వే ఎదురయ్యేది అమ్మ నుండి.
అంతేకాక చిత్రమేమిటంటే అన్నయ్యా ! జగజ్జనని ఈ నవరాత్రులలో ధరించిన బాలా, లలితా, జ్వాలాముఖీ, వైష్ణవీ, గాయత్రీ, చండీ, సరస్వతీ, దుర్గా, కాళీ మొదలైన వివిధ నామాలు గల మూర్తులను ఒకేమూర్తిలో దర్శించినా, ఒక మూర్తికి మరొకమూర్తికి సంబంధం లేదు. అలంకారంలోనే కాదు, దేహచ్ఛాయ లోను, శరీర కదలికలోనూ కూడా.
కాంతులీనే పసిడి మేనిఛాయతో, ముడుచుకున్న మల్లెమొగ్గలోని ముగ్ధత్వం గులాబీలలోని మార్దవం జోహారు చేసేంత ముగ్ధమనోహరమైన రూపులో లలితగా, బాలగా సాక్షాత్కరిస్తే… ధరించిన ధవళ వస్త్రాలకంటే స్వచ్ఛంగా ఉన్న పాలవన్నె దేహచ్ఛాయతో, గళసీమను అలంకరించిన పుష్పహారాల నవ్వులకంటే నిర్మలమైన కాంతితో నిండిన చిరునవ్వు ప్రశాంతము ప్రకాశవంతము అయిన మోములో అలరారుతుండగా వామహస్తములోని తంబురా మీటుతూ దక్షిణ హస్తములోని చిరుతలు వాయిస్తూ విశ్వభారతిగా దర్శనమిస్తే… అష్టమినాడు నలుపూ, ఎరుపూ వన్నెల కాంతు లీనుతున్న తేజోవిలసిత వదనంలో గాంభీర్యం తాండవిస్తోంటే త్రిశూలధారిణియై దుర్గగానూ, నవమినాడు నల్లని దుస్తులు ధరించి త్రిశూల, చక్రధారిణియై “కాళిక”గానూ ప్రత్యక్షమయ్యారు.
పది సంవత్సరాలుగా కలశం పెట్టి నవరాత్రోత్సవాలు చేసుకుంటున్న కేశవశర్మ అన్నయ్య ఈ సంవత్సరం అమ్మ సన్నిధిలో చేసుకున్నాడు. అన్నయ్య లాగే వరంగల్ నుండి మరొక అక్కయ్య ప్రత్యక్షంగా పూజలందుకునే జగజ్జననే ఉంటే కలశంతో పని ఏమిటి అని అమ్మ సన్నిధికి వచ్చి ఇక్కడే చేసుకున్నది.
అక్కయ్య రెండువేళలా, కేశవ అన్నయ్య రాత్రివేళ ప్రతిరోజు పూజ చేసుకున్నారు. వీళ్ళతో పాటు ప్రతిపూటా ఎవరో ఒకరు ప్రత్యేకంగా పాదాలు కడిగి సకలోపచారాలతో పూజచేసుకునేవారు. మిగతా వారందరూ తాము తెచ్చిన పూలూ పళ్ళూ సమర్పించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించేవారు. ఒక పూట ఇక్కడున్నవారంతా సమష్టిగానూ, మరొకపూట లలితాంబగారు, ఇంకొకరోజు కస్తూరి, శారదాంబగారూ… సప్తమినాడు మాతృశ్రీ పబ్లికేషన్స్ వారూ, అష్టమినాడు కొప్పురావూరి సత్యనారాయణ గారూ… నవమినాడు కొమ్మరాజు నాగేశ్వరరావుగారూ దశమినాడు ఆనాడు ఇక్కడ ఆవేళకు ఉన్నవారందరూ పూజలు చేసుకున్నారు.
దశమిరోజున నామకరణలు, అన్నప్రాశనలు, అక్షరాభ్యాసాలు, కేశఖండనలు ఒక వరసగా దాదాపు పాతికమందికి జరిగాయి. రాత్రి జమ్మిచెట్టును, దాని చుట్టూ ముగ్గులతో, దీపాలతో అలంకరించి ఆ ప్రక్కనే వేదిక అమర్చగా అక్కడ అమ్మకు పూజ జరిగింది. ఆ పూట వల్లూరి పాండురంగారావుగారు పూజచేసుకున్నారు. పూజ ముగిసాక డాక్టర్ అడపా రామకృష్ణరావు గారు అమ్మ జన్మదినోత్సవ సందర్భంగా తీసిన ఫోటో సైడ్స్ కొన్ని ప్రదర్శించారు.
(‘అర్కపురి లేఖలు’ గ్రంథం నుండి )