1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ‘దైవాన్ని వెదికేవాడు గోపి

‘దైవాన్ని వెదికేవాడు గోపి

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 9
Month : April
Issue Number : 9
Year : 2010

‘దైవాన్ని వెదికేవాడు గోపి

ధనాన్ని వెదికేవాడు పాపి” అని అంటారు మాన్య సోదరులు, పాలకొల్లు ఆడిటర్, శ్రీకాశీనాధుని రాజగోపాల కృష్ణమూర్తి. వారిని అమ్మ ముద్దుగా ‘గోపి’ అని పిలుస్తుంది. 1973 సంవత్సరం అమ్మ స్వర్ణోత్సవాల నిర్వహణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మోరి, లక్కవరం, రాజోలు, ముంగండ, పుల్లేటికుర్రు, అంబాజీపేట, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం; పశ్చిమగోదావరిజిల్లా మార్టేరు మొగల్తూరు, ఆచంట, ఓడూరు…. ఎన్నోగ్రామాల్లో పట్టణాల్లో తొలుత అమ్మ అవగాహనా సదస్సులను నిర్వహించి, తర్వాత విరాళాలను సేకరించిన ప్రధాన కార్యకర్త శ్రీ గోపి. నరసాపురం సో॥డా॥ ఆచంట కేశవరావు గారు వారి బాబయ్య.

ముందుగా జిల్లెళ్ళమూడి వచ్చింది కేశవరావు అన్నయ్యగారు. వారు గోపి గార్కి ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’ గ్రంథం ఇచ్చి, ‘అమ్మ వాత్సల్యామృత వర్షిణి, అనుగ్రహావతారమూర్తి, జ్ఞానజలధి. తక్షణం అమ్మను దర్శించమని సలహా ఇచ్చారు. తనకు అమ్మలూ, బాబాలూ అంటే ఇష్టం లేదు అని ఖండితంగా చెప్పారు గోపి.

ఒకసారి సో॥గోపి వృత్తిరీత్యా గుంటూరు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో వారి కారు పెట్రోలు కోసం బంక్ వద్ద ఆగింది. లోపల అద్దాల్లోంచి గోడమీద అమ్మ ఫోటో కాలెండర్ కనిపిస్తోంది. ‘ఎవరామె ?’ ప్రశ్నించారు ఆయన. అక్కడ పనిచేసే కుర్రాడిని. “అమ్మ” అని సమాధానం వచ్చింది. ‘అమ్మ అంటే ఎవరు ?’ మరలా ప్రశ్నించారు. ‘అమ్మ అంటే ఎవరు అని అడుగుతారేమిటి ? అమ్మ అంటే అమ్మే’ – అని తనదైన శైలిలో సూటిగా ఘాటుగా సమాధానం వచ్చింది. ఆశ్చర్యం. ఆ మాటలు గోపి గార్కి కనువిప్పు కలిగించాయి. తన ప్రశ్న తననే వెక్కిరించింది. కారు పాలకొల్లు వైపు కాకుండా జిల్లెళ్ళమూడి వైపు పరుగుదీసింది. మమతల గర్భగుడి ద్వారాలు తెరుచుకున్నాయి. అమ్మ శ్రీచరణాలను కళ్ళకు హత్తుకున్నారు. అమ్మ హృదయాంతరాళాల్లోకి ప్రవేశించి, అమ్మ వాత్సల్యజలధిలో ప్రేమపుష్కరిణిలో స్నానం ఆచరించారు; అనుగ్రహరూప అమ్మ ప్రసాదాన్ని స్వీకరించి, ‘ధన్యోస్మి’ అని పరవశించారు. 

‘ఓంకార పంజర శుకీం ఉపషదుద్యానకేళికలకంఠం! 

ఆగమ విపిన మయూరీం ఆర్యా మంతర్విభావయేగౌరీం॥

ప్రార్థనా శ్లోకాన్ని అర్థవంతంగా ఆర్తితో అనేక సభలలో గానం చేసి అమ్మను ఓంకారస్వరూపిణిగా, వేదవేద్యగా, అంతర్ముఖసమారాధ్య, బహిర్ముఖసుదుర్లభ అయిన. పరాత్పరిగా, గౌరిగా, లక్ష్మీస్వరూపంగా చదువులతల్లిగా స్తుతించారు. గోపిగారి శ్రీమతి సోదరి అన్నపూర్ణ నొసట అమ్మ కుంకుమబొట్టు పెడుతుంటే తన సౌభాగ్య రేఖల్ని తీర్చిదిద్దుతున్నట్లు భావించారు. ఇహ పర సౌఖ్యాలకి చతుర్విధ పురుషార్థ ఫలప్రాప్తికి రాచబాట వేస్తున్నట్లు దర్శించారు. అమ్మ స్వర్ణోత్సవాల్లో, వజోత్సవాల్లో తన శక్తివంచన లేకుండా విరాళాల్ని సేకరించి అమ్మ శ్రీ చరణాలను దివ్యపరిమళ పారిజాత సుమాలలో అర్చించారు. తన వృత్తిని అమ్మ సేవకు అంకితం చేసిన ప్రవృత్తి వారిది.

జగన్మాత అమ్మసేవకు ప్రతిఫలం వెంటనే లభించింది. సర్వార్ధదాయిని అమ్మ అనుగ్రహం వలన కీర్తిప్రతిష్ఠలు, సిరిసంపదల్ని బాగా గడించారు. లక్షణమైన భవనం కట్టుకున్నారు, రంగరంగ వైభవంగా షష్ట్యబ్దిపూర్తి జరుపుకున్నారు. అది ఎందరికో కన్నెర్ర అయింది. ఒకనాడు గాఢాంధకారాన్ని చీల్చుకుని కొందరు చోరులు మారణాయుధాలతో వారింటిపై దాడి చేశారు. ఆ విపత్కర పరిస్థితుల్లో వారి గుండెల్లో ఎన్నో అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి. వారి భయాందోళనల కంపనాలకు అమ్మ చలించి పోయింది. 450 కి.మీ. దూరంలో జిల్లెళ్ళమూడిలో నిద్రిస్తున్న అమ్మ “నాన్నా! గోపీ !! భయపడకు!!!” అని కలవరించింది; కల్లోలిత హృదయానికి అభయాన్ని అనుగ్రహించింది, ఆ సాంత్వన స్వరంతో ఆ ఘోరవిపత్తుకి ఒక లక్ష్మణరేఖను గీసింది. ఆస్తినష్టం అయింది, కానీ ప్రాణనష్టం కాలేదు. తర్వాత సకుటుంబంగా వారు జిల్లెళ్ళమూడి వచ్చారు; చల్లని అమ్మ ఒడిలో కన్నీరు కార్చి గుండె కుదుటపడగా సేదతీర్చారు. కష్టాల కడలిలో విలవిలలాడే ఏ జీవికైనా ఆలంబనం, రక్షణ అమ్మ ఒడి కదా ! వారిని ఓదారుస్తూ అమ్మ, “డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. నాన్నా! నువ్వు క్షేమంగా ఉన్నావు. ప్రాణనష్టం కాలేదు. నాకు అంతే చాలు -” అన్నది. తల్లికి బిడ్డ సొమ్ము; బిడ్డకి డబ్బు సొమ్ము. కాగా ఇక్కడ మేరు సమానధీరులు గోపీ వ్యక్తిత్వం మనకి స్పష్టంగా కన్పిస్తుంది.

‘దైవాన్ని వెతికేవాడు గోపి, ధనాన్ని వెతికే వాడు పాపి’ అంటూ భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమంగా భాసిల్లారు.

వాత్సల్యయాత్రలో భాగంగా సో॥ గోపిగారి ఆహ్వానం మేరకు అమ్మ పాలకొల్లు సందర్శించింది. అది ఒక పెద్ద వాణిజ్యకేంద్రం. కనుకనే అన్నారు, ‘అమ్మా! పాపాలకొల్లు వచ్చావమ్మా’ అని. వెంటనే అమ్మ, “పాపాలకొల్లు కాదు, నాన్నా ! పాపల కొల్లు” అని తన జగన్మాతృత్వాన్ని మరొక్కసారి చాటింది. నాటి సాయంకాలం ‘బాలవిహార్’ అనే చిన్నారుల ఉద్యానవనాన్ని అమ్మ తన అమృత హస్తాల మీదుగా ప్రారంభించింది.

సోదరులు గోపి అమ్మ ఒడిలో గారంగా పెరిగిన బిడ్డ ఒకసారి తెల్లవారు ఝామున గం. 3-00 ల ప్రాంతంలో జిల్లెళ్ళమూడి వెళ్ళారు. అక్కడ వైకుంఠద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ప్రాపంచిక బరువు బాధ్యతలు, ఒత్తిడిని ప్రక్కకు నెట్టి ఆనందస్వరూపిణి అమ్మ ఒడిలో సేదదీరుతున్నారు. ఇంతలో వసుంధర అక్కయ్య కాఫీ తెచ్చింది. అమ్మ చేతిమీదుగా అందుకున్నారు. కావున అది ప్రసాదం అయింది. కానీ సంశయంతో ‘అమ్మా! ముఖం కడుక్కోలేదు’ అని అన్నారు. అందుకు అమ్మ, “కడుక్కుంటే రేపటి ఎకౌంట్లోకి వెడుతుంది, లేకపోతే నిన్నటి అకౌంట్లోకి వెడుతుంది” అన్నది చమత్కారంగా. అమ్మ హాస్యంలో రహస్యం ఉంది. నిస్సీమ కాలగమనంలో భూత భవిష్యత్ వర్తమానాలూ, నిన్న నేడు రేపు … అనేవి మైళ్ళురాళ్ళు కావు; అక్షాంశ రేఖాంశాల వలె ఊహారేఖలే, కల్పితములే.

ఒక జిజ్ఞాసువులా అమ్మ శ్రీచరణాలను ఆశ్రయించారు. అమ్మను వేదమాతగా సంభావన చేసి అంజలి ఘటించి ‘వేదం అంటే ఏమిటమ్మా?’ అని ప్రశ్నించారు. ప్రసంగవశాన అమ్మ, “వేదం అంటే తెలుసుకోవటం” అని  తేల్చి చెప్పింది.

వారు అమ్మను సర్వేశ్వరిగా, సర్వార్థదాయినిగా దర్శించారు. స్వర్ణోత్సవాల సందర్భంగా ‘ఇంటింటా నువ్వే కదా ! అందరికీ అన్నం పెడుతున్నది. ‘లక్షమందికి ఒకేపంక్తిన భోజనం పెట్టటం’ అనే కోరిక ఏమిటి !’ అని ప్రశ్నించారు. వెంటనే అమ్మ, “నేను పెడుతున్నానని నువ్వు చూడటానికి” అని సమాధానపరిచింది.

గోపి అన్నయ్య ఒక హేతువాది, సత్యాన్వేషి. తన శక్తియుక్తుల్ని, ధనసంపద, జ్ఞానసంపద, శక్తి సంపదల్ని త్రికరణ శుద్ధిగా అమ్మ సేవకుసమర్పించిన భాగవతోత్తముడు. క్రమశిక్షణకి సాకారరూపం. ‘రాజగోపాలకృష్ణమూర్తి’ అనే సార్థక నామధేయుడు. పలుకులో చర్యలో ఆఠీవి, దర్పం, హుందా స్పష్టం అవుతుంది.

నిండు మనంబు నవ్యనవనీత సమానము,

పల్కు దారుణాఖండల శస్త్ర తుల్యము’ – అనే ఆది కవి వచనాలు వారి విషయంలో అక్షర సత్యాలు. అలసత్వం, అవిద్య, అజ్ఞానం, అంధకారం … మొదలైన అవలక్షణాలకి అన్నయ్య అంటే భయం. ఆర్షధర్మం, శ్రీవిద్య వారి స్వంతం.

6.11.09 తేదీన తన పాంచభౌతికదేహాన్ని పరిత్యజించి గోపి, పరాత్పరి సువర్ణ జ్యోతి అమ్మలో లీనమైనారు. అమ్మ శ్రీచరణాలను వీడని వాడని సహస్రదళ సౌగంధిక కుసుమం అన్నయ్య. అమ్మ ప్రబోధించిన ‘సరే’ మంత్రం వారికి గాయత్రీ మంత్రం. సమయానికి ఏది వస్తే దానిని సంతోషంగా స్వీకరించే స్థితప్రజ్ఞులు.

“అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు, నాన్నా! మన క్రియలకు కర్తలం మనం కాదు అని తెలుసుకుంటే జీవితంలో ఒడిదుడుకులు ఉండవు, సుఖదుఃఖాలు ఉండవు; అంతా ఆనందమే, అంతా తృప్తే” – అనే అమ్మ సందేశాన్ని తత్త్వతః ఆచరణలో దర్శించిన ద్రష్ట. అమ్మ అనుగ్రహసాగరంలో వటపత్రశాయి వలె చిరునవ్వులతో ‘పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి’ అని నిరంతరం ఎలుగెత్తి చాటుతూనే ఉంటారు.

సత్ లేకుండా చిత్ లేదు. చిత్ లేకుండా సత్ ఎక్కడుంటుంది ? అన్నీ ఒకటే.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!