1. Home
  2. Articles
  3. Viswajanani
  4. దోషవర్జితా

దోషవర్జితా

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : August
Issue Number : 1
Year : 2015

“కామక్రోధాదులైన అరిషడ్వర్గాలు, రాగద్వేషాలు జీవుని, దోషాలు. ఈ దోషాలన్నీ మనస్సునకు సంబంధించినవి. కనుక, జీవుణ్ణి బాధిస్తాయి. మనోలయ కారిణి అయిన దేవికి ఈ దోషాలు అంటవు. ఆమె దోషవర్జిత. సాధకులను కూడా దోషవర్జితులను చేసి పునీతులను గావించి, అనుగ్రహించే శ్రీమాత దోషవర్జిత.”……. భారతీవ్యాఖ్య.

కామక్రోధలోభమోహమదమాత్సర్యాలకు అరి షడ్వర్గాలని పేరు. ‘అరి’ అంటే శత్రువు. ప్రతి వ్యక్తీ అంతర్గతంగా ఈ అరిషడ్వర్గాల వల్ల అశాంతికి గురవుతూ ఉంటాడు. “ఏ కట్టెకు నిప్పు ఉంటే ఆ కట్టే కాలుతుంది” అనే సామెత ఉన్నది. ఈ ఆరు అంతశ్శత్రువులు మన మనస్సును ఆక్రమించి, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. మనస్సు ప్రశాంతంగా లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ నిజాన్ని గ్రహించలేని మనం ఈ ఆరింటికి మన మనస్సులో పెద్ద పీట వేసి, కూర్చోబెట్టి బాధలు పడుతూ ఉంటాం. కామం (కోరిక) తీరకపోతే క్రోధం (కోపం) కలుగుతుంది. లోభం కారణంగా (వ్యామోహం ఏర్పడుతుంది. మదం నుంచి పొరుగుపచ్చని చూడలేని మాత్సర్యం (అసూయ) పుడుతుంది. ఎదురుగా కనిపించే బాహ్యశత్రువుల కంటే, కనిపించని మనసులోని అంతశ్శత్రువులను జయించడమే కష్టం. శ్రీ లలితాదేవికి ఈ దోషాలేవీ ఉండవు కనుక ఆమె దోషవర్జిత. అంతేకాదు. పశ్చాత్తప్త హృదయంతో ఆమె పాదాలను ఆశ్రయించిన భక్తులను కూడా దోషవర్జితులుగా చేసి అనుగ్రహించే శ్రీమాత దోషవర్జిత.

“అమ్మ” దోషవర్జిత. “అమ్మ”కు కామక్రోధాది దోషాలు లేవు. అంతేకాదు. తన బిడ్డలను కూడా అరిషడ్వర్గాలనుంచి దూరం చేయగల శక్తిస్వరూపిణి “అమ్మ”.

సంస్థలో క్రమశిక్షణను ప్రవేశపెట్టాలన్న కార్యవర్గసభ్యుల కోరికను “అమ్మ” అంగీకరించింది. క్రమశిక్షణ అవసరమని, సాధనలు చేయడం, నియమనిష్ఠలు పాటించడం వల్ల వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సంస్థ అభివృద్ధికోసం, పటిష్ఠత కోసం కృషి చేయాలి అని నిర్ద్వంద్వంగా చెప్పిన “అమ్మ” – తన బిడ్డల దోష నిర్మూలనం కోసం ఎంత ఆలోచించిందో, ఎంత ప్రణాళికా బద్ధంగా ఏర్పాటు చేయాలి అనుకుందో తెలుస్తుంది (మాతృ సంహిత – 462) అంతేకాదు. తన సర్వాధికారాన్ని ప్రకటిస్తూ “నేను మీ ఇష్టప్రకారం నడుస్తున్నట్లు కనిపిస్తాను. కాని, నా ఇష్టప్రకారమే మిమ్మల్ని నడుపుకుంటాను” అని స్పష్టంగా చెప్పిన సర్వానుల్లంఘ్యశాసన “అమ్మ”. అయితే “అమ్మ” మందలింపు సున్నితంగా ఉంటూనే, సునిశితంగా ఉంటుంది. “పరిగెత్తే వాడికి ఎదురుపడి ఎప్పుడూ ఆపకూడదు. వాడితోపాటు కొంత దూరం మనమూ పరిగెత్తి, వాడు అలిసిపోయి ఆగినప్పుడే మన వైపుకు త్రిప్పుకోవాలి” అని క్రమశిక్షణ శిక్షలాగా కాక రక్షణ కల్పించేదిగా ఉండాలనే వీక్షణ కల “అమ్మ” దోషవర్జిత.

ఆవరణలోని ఒక సోదరునిలోని దోషాన్ని పరిహరించిన తీరు ఎంత గంభీరంగా, నిగూఢంగా ఉందో గమనిస్తే, “అమ్మ” – దిద్దుబాటులోని మార్దవం మనకు అర్థమవుతుంది. ఆ సోదరుడు ప్రతిరాత్రీ ఆవరణలో తన పని పూర్తి చేసుకుని బాపట్లకు వెళుతున్న విషయం “అమ్మ” గమనించింది. ఆ విషయమై అతణ్ణి ప్రశ్నించింది “అమ్మ”. ఆ సోదరుడు చెప్పిన సమాధానం సంతృప్తిగా లేకపోవడంతో “అమ్మ” అతణ్ణి ‘అమ్మాయి (అతని భార్య) ఏ ఊరు వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది ? అని ఆరాగా అడిగింది. అతని జవాబు విన్న వెంటనే “అమ్మ” – ‘అమ్మాయిని త్వరగా రమ్మని కబురు పంపు. ప్రతిదినం రెండవ ఆట సినిమాకు వెళ్ళి ఆరోగ్యం పాడుచేసుకోకు” అని అతణ్ణి మందలించింది. అతడు మారు మాట్లాడలేదు. ‘ఈరోజు కూడా బాపట్లకు వెళతావా?’ అనే “అమ్మ” ప్రశ్నకు అతడు వెళ్ళనని చెప్పి, కొద్దిసేపు మౌనంగా తలదించుకొని కూర్చొని, తర్వాత “అమ్మ” పాదాలకు నమస్కరించి, సెలవు తీసుకున్నాడు. “ఈ ఆవరణలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో నాకంతా తెలుసు” అని చెప్పిన “అమ్మ” వాక్యానికి ఈ సన్నివేశం అద్దంపడుతోంది. ఒక్క అందరింటి ఆవరణేనా? సర్వాంతర్యామిని అయిన “అమ్మ” ఒడిలోని వారమే కదా మనమంతా. ఎల్లప్పుడూ “అమ్మ” మనలను ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది అనే భావం మనలో ఉంటే దోషరహితమైన జీవనమార్గంలో పయనిస్తూ దోషవర్జిత అయిన “అమ్మ”ను త్రికరణశుద్ధిగా సేవించుకోగలుగుతాం. “అమ్మ” దివ్యచరిత్రలోని సంఘటనలు ఎన్నో “అమ్మ”ను దోషవర్జితగా ప్రత్యక్షం చేస్తాయి. (పై సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షిని నేనే).

అర్కపురవాసిని, మన హృదయనివాసిని అయిన “అమ్మ”ను దోషవర్జితగా దర్శించి, స్మరించి తరించుదాం.

“అమ్మ” గుడిలోని ఇటుకనై

“అమ్మ” గుడిలోని రాయినై

“అమ్మ” గుడిలోని జేగంటనై

“అమ్మ” గుడిలోని గడపనై

క్షణము మసలిన చాలును; నా చరిత ధన్యము.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!