1. Home
  2. Articles
  3. Mother of All
  4. ద్విపాత్రాభినయం

ద్విపాత్రాభినయం

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 14
Month : October
Issue Number : 4
Year : 2015

అమ్మ ద్విపాత్రాభినయాన్ని తత్త్వపరంగా అభివర్ణించాలంటే సంకల్పరహిత సంకల్పసహిత: నామరూప వివర్జిత నామరూప సమన్వితః నిర్మమ మహనీయ కమనీయ మధురమాతృత్వ మామకారస్వరూపం… ఇలా ఎన్నో. 

ఇక కళ్ళకి కనిపించే విధం – స్త్రీలను ‘అమ్మా!’ అనీ, పురుషులను ‘నాన్నా!’ అని నోరారా, మనసారా సంబోధిస్తూ మన కన్నతల్లిగా, మన కడుపున పుట్టిన బిడ్డగా రెండు పాత్రలను పోషించటం.

ఆయా సన్నివేశాల్లో సోదరీ సోదరులూ అంతే; అమ్మను అమ్మగానూ, అమ్మాయిగాను తలపోస్తారు. ఒకసారి అమ్మే మనకి ఆత్మబంధువు, ఆప్తబంధువు, దిక్కు, గురువు, దైవం, పరమ గమ్యం అనిపిస్తుంది. మరొకసారి అమ్మని మన చేతులతో నడిపిస్తూ భుజానవేసుకుని జోకొట్టే పాపాయిలా వేసుకుని లాలించే చిన్నారిలా భావిస్తూ అమ్మ మంచి చెడ్డల్నీ, సుఖదుఃఖాల్నీ పట్టించుకుంటూ, అమ్మ వ్యవహారాల్ని చక్కబెడుతూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలనిపిస్తుంది. ఒకసారి శ్రీ రాజుబావగారితో “నాన్నా! దారిలో ముళ్ళు, గాజు పెంకులు, ఎత్తు పల్లాలు ఉన్నాయి అని నడిపిస్తున్నావు. నా జీవితంలో కూడా దారి చూపుతూ నడిపిస్తావా?” అన్నది. మరొకసారి శ్రీ వై.వి. శ్రీరామమూర్తిగారితో “నాన్నా! నా చిక్కులన్నీ తీశావు” అన్నది. ఒకవైపు “ఈలోకంలో తల్లి లేని వారెవరూ లేరు. నేను మీ అమ్మను” అంటుంది. మరొకవైపు బ్రహ్మాండం అనసూయ, తంగిరాల అనసూయ, దేశిరాజు అనసూయ, ఆకెళ్ల అనసూయ రూపాల్లో ఇంటింటా ముద్దు మురిపాలను అందిస్తుంది.

తండ్రి శబ్దం నిజానికి సృష్ట్యాదిలో లేదు. ఉన్నది తల్లే. ఆదిమూలం. అది తల్లిలేని తల్లి. ORIGIN. ప్రప్రథమ ఏకకణ జీవి అమీబా ప్రత్యుత్పత్తి పరంగా తల్లి, తండ్రి; స్త్రీపురుష పాత్రల ప్రస్తావన ప్రసక్తి లేదు. “మాతృత్వం వేరు, మాతృతత్వం వేరు. మగవాడిలోనూ తల్లి ప్రేమ ఉంటుంది” అన్నది అమ్మ. కనుక స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ అమ్మకి తల్లులే.

‘The child is father of the man.’

అపుడు అమ్మ ఎవరు? బిడ్డ ఎవరు?

ఈ సంగతి మాతృశ్రీ గోత్రోద్భవ కధనాన్ని అవ్యక్త మధురంగా వినిపిస్తుంది. “అమ్మా! అనసూయా!!” అని ప్రేమతో పిలిచే ప్రతిహృదయ స్పందనా చిదంబరరావు తాతగారి సాకారరూపమే. చరిత్రను చూస్తే – ఆయన అమ్మ ఒడిలో పసివాడుగా సేదతీరారు. అమ్మకి సంరక్షకునిలా నిలిచారు. ఈ సారాంశాన్నీ ఒక ఉదాహరణతో వివరిస్తాను.

అమ్మ జన్మప్రభృతి ఎందరో తలుపుల్ని, గుండె తలుపుల్ని తట్టి ‘నేను ”మీ అమ్మను’ అని తనను తాను పరిచయం చేసుకుని వాళ్ళ కన్నీళ్ళు తుడిచి ఆదరించింది. అది తన విధి, తనకి తృప్తి. ధనవంతుల ఇళ్ళకు వెళ్ళింది. మురికి వాడలను సందర్శించింది; ఏనుగుపై ఊరేగింది – పాదచారియై దివిసీమ ఉప్పెన బాధితులను అక్కున చేర్చుకుంది; పీఠాధిపతులు, సోమయాజులు, పండితులతో చర్చించింది – పాషాణ హృదయులను సంస్కరించింది. అమ్మ వచ్చింది మాతృధర్మం కోసం.

ఒకనాడు వరంగల్లు లోని సద్గురు శ్రీ శివానన్దమూర్తిగారి ఇంటికి వెళ్ళింది. వారు మహాశైవ పీఠాధిపతులు, ఆర్ద్రహృదయులు, జ్ఞానయోగి, కర్మయోగి, అమ్మ, మానస సరోవరంలో వికసించిన సహస్రదళపద్మం. ఆత్మ బంధువులా వారి ఇల్లంతా చూసింది. వారి సహధర్మచారిణితో “అమ్మా! అతను నీ భర్త అనేది ఒక పాత్ర. అతను లోకబంధువు. మీరంతా అలా పిలవండి” అని చెప్పింది. అలా సద్గురువుల వాస్తవ చిత్రణ చేసింది. వారు పాలు, పండ్లు ఫలహారాలను నిండు మనస్సుతో అమ్మకి సమర్పించారు. అమ్మ నిరాహారకదా! కనుకనే “ఏదో ఒకటి తీసుకోండి” అని కోరారు. “ఒకటేమిటి? అంతా తీసుకుంటాను” అన్నది. అమ్మ. ‘అంతా’ అంటే ఏమిటో ఆ తల్లీ బిడ్డలకే తెలియాలి.

తర్వాత అమ్మకి Lung Abscess వచ్చి హైదరాబాదులో సో॥ శ్రీ. టి. రాజగోపాలాచారి గారింట్లో ఉన్నప్పుడు శ్రీ శివానన్దమూర్తిగారు సతీసమేతంగా అమ్మను చూడటానికి వచ్చారు. అమ్మ వారి చెయ్యిపట్టుకుంది. వారు అమ్మ నాడి చూశారు. “అమ్మా! ఆరోగ్యం ఎలా ఉంది? మీరు ఎలా ఉన్నారు?” అని కుశలప్రశ్నలు వేశారు. అమ్మ నవ్వింది. “ఒక ప్రార్థన. మీరు ఉండాలి. ఎంతకాలం వీలవుతుందో; మీకు ఎంతశ్రమ అయినప్పటికీ, ఈ శరీరంలో ఉండటం ఎంత బాధాకరం అయినప్పటికీ లోకం ముందు మీకు ఉండేటటువంటి దయముందు మీకు ఉండే బాధ అంత గొప్పది కాదు. వీలైనంత కాలం ఉండాలి” అన్నారు. అక్కడ ఉండి తనకు వైద్యం చేస్తున్న సోదరి డా॥ ఇనజకుమారిని ఉద్దేశించి అమ్మ “వీళ్ళు డాక్టర్లు. ఏదో చేస్తున్నారు.

నన్ను కాపాడగలరా ఎవరైనా? నేను ఉండాలంటే ఉంటాను; వెళ్ళాలంటే వెళ్ళిపోతాను” అన్నది.

ఇటు శివానన్దమూర్తిగారితో “నాన్నా! నేను కొంతకాలం ఉండాలని నువ్వు అంటున్నావు. ఉంటే – అపసవ్యాలేవైనా జరిగితే అది ఫర్వాలేదా?” అని అడిగింది. ఇంకా కొంతకాలం అమ్మ ఉంటే అపసవ్యాలేవైనా జరుగుతాయి. భవిష్యత్ని వర్తమానంగా చూస్తోంది అమ్మ. అది అమ్మ జీవన్మరణ సమస్య. తన పతిదేవుని తన చేతుల మీదుగా సాగనంపటం. తను ఎక్కిన కొమ్మను తానే నరుక్కోవటం. తన జీవన కుసుమం తన సౌభాగ్య జ్యోతి తన కళ్ళముందే రాలిపోవటం, ఆరిపోవటం. ఆ దావానల భీకర సదృశ సమస్యని అమ్మ ఎవరితో చర్చించాలి?

జ్ఞాని, ఎదిగి వచ్చిన బిడ్డ అయిన శ్రీ శివానన్దమూర్తిగారితో చర్చించింది. ‘అపసవ్యాలేవైనా జరిగితే అది ఫర్వాలేదా?’ అని ప్రశ్నించటంలో అర్థం అదే. వెంటనే ఆయన గ్రహించారు పరిస్థితి వాస్తవికతను. ఆ క్షణంలో వారు అమ్మకి బిడ్డగా కాక పెద్దగా సలహా ఇచ్చారు ఒక విజ్ఞాపన రూపంలో ఎంతో అనునయంగా – తత్త్వజలధిలోతుల్లో ఒక మునక వేసి ఒడ్డున నిలబడి “నీకు సవ్యం లేదు; అపసవ్యం లేదు. ఎవరి ముందు వెనుకలు ఎక్కడ జరిగినా నీ దగ్గరకే వస్తారు. ఇంకొక చోటికి పోరు. కాబట్టి ఉండండి” అన్నారు.

చిదంబరరావు తాతగారు, అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య, శ్రీపాద గోపాల కృష్ణమూర్తిగారు అమ్మ కంటే ముందే వెళ్ళిపోయారు. కృష్ణవేణమ్మక్కయ్య, కేశవఅన్నయ్య, శేషు మొదలైనవారు అమ్మ తర్వాత వెళ్ళిపోయారు.

‘నదీనాం సాగరోగతిః’ అన్నారు. నిత్యమైనదే సత్యం. ‘సత్యంచ అనృతంచ సత్యమభవత్’ అని ఉపనిషత్తులు ప్రబోధించే సత్యస్వరూపమే అమ్మ. కావున కాస్త ముందు, వెనక ఎక్కడ జరిగినా ప్రతి ఒక్కరూ అమ్మలో లీనం కావాల్సిందే. వచ్చిన చోటికే పోవటం ధర్మం, ఆనందదాయకం; కనుకనే అమ్మకు ‘సవ్యం లేదు, అపసవ్యం లేదు’ అని సిద్ధాంతీకరించారు వారు. అది బేషరతుగా అందరికీ సుగతే.

శ్రీ శివానన్దమూర్తిగారు అమ్మను భౌతికంగా చూసింది రెండుసార్లే. ముందుగా వారి దగ్గరకు అమ్మ వెళ్ళింది. తర్వాత వారు అమ్మ వద్దకు వచ్చారు. కాగా “అందరికీ సుగతే – కాస్త ముందూ వెనకా” అనే అమ్మ వాక్యసారాన్ని సూటిగా స్పష్టంగా విశదీకరించారు. ‘కాస్త’ అనేది వందలు, వేలు, లక్షల సంవత్సరాలు కావచ్చు.

అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత శ్రీ శివానన్దమూర్తిగారు జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మ మహాభినిష్క్రమణం చేసిన రోజున శ్రీ అనసూయేశ్వరాలయంలో మూల విగ్రహరూపిణి అమ్మకి అన్నంతో అభిషేకం చేసే సత్సంప్రదాయాన్ని, ఉత్సవాన్ని ప్రారంభించారు. కాళీ స్వరూపంగా అమ్మను వ్యక్తీకరించారు.

అమ్మ అటు బిడ్డలు చేసే ఈ ద్విపాత్రాభినయాన్ని మరొక్క చిన్న సన్నివేశం ద్వారా వివరిస్తాను. ఒకనాడు ఒక సోదరుడు ఐదారు నెలల ప్రాయంగల తన కన్న బిడ్డను ఎత్తుకుని అమ్మ వద్దకు వచ్చారు. ఆ పాప Premature delivery – నెల తక్కువ పిల్ల. ఆ పాపను అమ్మకు అందించారు. ఆ పసిపాపను అమ్మ ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ముద్దుపెట్టుకుని తిరిగి వారి చేతుల్లో పెట్టింది. ఆ ప్రక్కనే ఉన్న రామకృష్ణ అన్నయ్య ‘నెల తక్కువ కానీ వెల తక్కువకాదు’ అని చమత్కరించాడు. అమ్మ నవ్వింది. ఇంతలో ఆ సోదరుడు ‘మా అమ్మాయికి ఎడమ కన్ను మెల్ల. అదృష్టం అని అంటున్నారమ్మా’ అన్నారు. వెంటనే అమ్మ “నాన్నా! నీకడుపున పుట్టటమే అదృష్టం” అన్నది. అదీ అమ్మ అనురాగ రక్త సంబంధ బంధమహిమ, గరిమ. (శ్రీ శివానన్దమూర్తిగారి ప్రసంగాన్ని You-tube లో వీడియోగా భద్రపరచిన శ్రీ గంటి కాళీ ప్రసాద్ గార్కి కృతజ్ఞతలు)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!