సుమారు ఏబది సంవత్సరముల నుండి ‘అమ్మ’ను సేవిస్తూ ‘అమ్మే’ సర్వస్వంగా, సకల దేవతా స్వరూపిణిగా సంభావించి ‘అమ్మ’ సేవలో అహర్నిశమూ మనసా, వాచా, కర్మణా జపించి పునీతమైన దంపతులు శ్రీ హరిదాసు అన్నయ్య, శ్రీమతి కృష్ణవేణక్కయ దంపతులు.
శ్రీహరిదాసు అన్నయ్య దంపతులు జిల్లెళ్ళమూడిలో స్థిరపడిన 1958-59 నాటి నుండి ‘అమ్మ’చే ప్రారంభించబడిన ‘అన్నపూర్ణాలయ’ నిత్యకార్యక్రమాలను అహర్నిశలు సంయమనంతో, సమయస్ఫూర్తితో నిర్వహించేవారు. ఆ రోజులలో జిల్లెళ్ళమూడి ఓ కుగ్రామమైనందున ఏ విధమైన వసతులు వుండేవి కావు. అన్నపూర్ణాలయానికి కావలసిన వస్తుసామగ్రి కానీ, కూరగాయలు, పాలు, మజ్జిగలు కూడా దొరికేవి కావు. ముఖ్యంగా పాలు, మజ్జిగలు పొరుగు గ్రామాలైన అప్పికట్ల, పూండ్ల, మర్రిపూడి మొదలైన గ్రామాల నుండి తెచ్చుకోవలసి వచ్చేది. అందుకని తానే స్వయంగా ఆయా గ్రామాలు తిరిగి మజ్జిగ సేకరించి మోసుకొని వచ్చేవారు. అంతేగాక సరుకులు కూడా బాపట్ల నుండి వీలువెంట తాను వెళ్ళిగానీ, ఇతరులెవరి ద్వారా నైనా తెప్పించి అన్నపూర్ణాలయాన్ని ఎంతో దక్షతతో నిర్వహించేవారు.
శ్రీహరిదాసు అన్నయ్య అమ్మలో లీనమైన తదాది అనారోగ్యంతో శయ్యాగతయై, బాహ్యప్రపంచానికి దూరమై కూడా ‘అమ్మ’ ధ్యాసను మరువక తనను చూడవచ్చినవారిని పేరుపేరునా పలుకరిస్తూ యోగక్షేమాలు విచారిస్తూ – ‘అమ్మ’ను సదా జపిస్తూ ది. 7.7.2007 తెల్లవారుజామున అమ్మలో ఐక్యమైన కృష్ణవేణక్కయ్య జిల్లెళ్ళమూడి చరిత్రలో ఒక ‘యోగిని’.
తాను జిల్లెళ్ళమూడిలో అడుగు పెట్టిన నాటి నుండి ‘అమ్మ’ ధ్యాసలోనే గడుపుతూ కొన్ని సమయాలలో ధ్యానముద్రలో బాహ్యస్మృతి లేకుండా కొన్ని గంటలు వుండిపోయేది. ఆ సమయంలో ఎవరు పిలిచినా, ఎంతకదిల్చినా ఏమాత్రం కదలిక లేక అలా. వుండిపోయేది. అంతేగాక ఆహార, పానీయాదుల విషయంలో కూడా – తగుమాత్రం సేవిస్తూ వుండేది. నిత్యం ‘అమ్మ’ కు స్నానపానాదులు చేయిస్తూ, అమ్మ ధరించే గుడ్డలను సుదూరంగా వున్న ఓంకార నదికి (డ్రైన్ కాలువ) తీసుకుపోయి, అర్చనాపూర్వకంగా భావించి ఉతికి, ఆరవేసి, మడతలు పెట్టి తీసుకుని వస్తుండేది. ఇది మధ్యాహ్న సమయంలో చేస్తూ, ఉదయం, సాయంత్రం వేళల్లో ‘అమ్మ’ సేవా కార్యక్రమాలు జరుపుతుండేది.
తనకు బిడ్డలు లేకపోయినా కలత చెందక, జిల్లెళ్ళమూడి వచ్చే సోదరీసోదరుల బిడ్డలే తమ బిడ్డలుగా భావించి వారిని లాలించి వారివారి అవసరాలు తీర్చేది. ముఖ్యంగా తమతోపాటు జిల్లెళ్ళమూడిలో స్థిరనివాసియై, అన్నపూర్ణాలయంలో ఉండే శ్రీమతి లక్ష్మీనరసమ్మక్కయ్య గారి కుమార్తె చి॥ లక్ష్మిని శ్రీహరిదాసు అన్నయ్య, కృష్ణవేణక్కయ్యలు తమ దగ్గరే ఉంచుకొని కన్నకూతురు కన్నా మిన్నగా చూసేవారు. అలాగే గుంటూరు సోదరులు శ్రీరాచర్ల లక్ష్మీనారాయణ శ్రీమతి కమలక్కయ్యల పిల్లలు చి॥ బంగారుబాబు, చి॥ భగవతి, చి॥ రహిలను కూడా ఎంతో అపురూపంగా చూసుకునే వారు. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలు చి॥ బంగారుబాబును తమ దగ్గరే ఉంచుకొని ఎనలేని వాత్సల్యంతో చూసుకున్నారు. కృష్ణవేణక్కయ్య చివరి క్షణం వరకు బంగారు బాబును తల్చుకునే వుంటుండేది.
గత ఏబది సంవత్సరముల నుండి జిల్లెళ్ళమూడి వస్తున్న సోదరీ సోదరులకు శ్రీ హరిదాసు అన్నయ్య, కృష్ణవేణక్కయ్యలు చేసిన సేవలు, వారి ఆత్మీయతా అనురాగాలు గురించి చెప్పటం ఓ సాహసం అవుతుందేమో!!
చివరగా కొన్ని సంవత్సరాలు శయ్యాగతమై కూడా ఎలాంటి శరీర సంబంధ బాధలు – అంటే – వ్రణములు గానీ, పుండ్లు గానీ పడకుండా వుండటం – వైద్యశాస్త్ర ప్రకారం అరుదు. మరి చివరి వరకు ఎంతో పరిశుభ్రంగా వుండటం అక్కయ్య విషయంలో ‘అమ్మ’ ప్రసాదించిన వరప్రభావమేమో!
సదా స్మరించుకొనదగిన వ్యక్తులలో ఒకరిగా మిగిలిపోయిన మన కృష్ణవేణక్కయ్య