శ్రీ పి.ఎన్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు గుంటూరు వాస్తవ్యుడు. విశ్వవిఖ్యాతి చెందిన శ్రీ ప్రసాదరాయ కులపతి గారి తమ్ముడు. అన్నగారు నిర్మల గంగాఝురీ, తమ్ముడు మహోగ్ర కెరటం. అన్నగారు పండిత జనరంజకుడు, తమ్ముడు సామాన్యుల హృదయాల్లోనికి సూటిగా గుచ్చుకునే పూలశరం. పురుషోత్తముని బిడ్డలయిన వీరు తండ్రికి పురుషోత్తములుగా వన్నె తెచ్చిన మహనీయులు. తంగిరాల కేశవశర్మ, ఆంజనేయులు అన్నయ్య మంచి స్నేహితులు.
ఒకమారు ఒంటరిగా అమ్మ దర్శనార్థం వస్తున్నాడు. కాలువగట్టు వెంబడే అటూ ఇటూ తిరిగాడు. స్థానికులు ఎవరైనా కనిపిస్తే ఏ ప్రదేశంలో కాలువ దాటవచ్చో చెప్తారని మళ్ళీ తిరిగాడు. ఆ చలిలో రాత్రిపూట ఒకడు కాలువగట్టున గడ్డికప్పుకుని పడుకుని ఉండటం కనిపించింది. అతన్ని లేపి తోవచూపించమని అడిగాడు. అతను బద్ధకంతో, విసుగుదలతో అమ్మ దగ్గరకా వెళ్ళేది అంటూ కాలవ ఎక్కడ దాటాలో చూపించాడు. అతనికి కాఫీ తాగమని కొంత చిల్లర ఇచ్చాడు. అతను చూపిన దగ్గర అర్ధరాత్రి కాలవదాటి 12 గం||లకు అమ్మ దగ్గరకు చేరి అమ్మకు నమస్కరించి కూర్చున్నాడు. వెంటనే అమ్మ కాలవదాటించిన వాడికి ఎంత డబ్బులిచ్చావన్నది. డబ్బులేమిటి? అన్నాడు. కాఫీ త్రాగమని డబ్బులిచ్చావు గదా! అని అడిగింది. దానితో విస్తుపోయాడు. అమ్మ విశ్వవ్యాప్తిని కదా! అమ్మ ఆ విధంగా అడిగేటప్పటికి అమ్మే అర్ధరాత్రి తనకు త్రోవచూపించిందన్న విశ్వాసం పెరిగింది.
ఒకరోజు అమ్మ ఆవరణలో వుండగా కడుపునొప్పితో మెలికలు తిరుగుతూ బాధపడ్తున్నాడు. అమ్మ చిన్న కొడుకు రవి అది చూసి అమ్మ దగ్గరకు వెళ్ళి అన్నయ్య బాధపడ్తున్న విషయం చెప్పాడు. అమ్మ “వాడ్ని ఇటు తీసుకురండి”అని చెప్పింది. అన్నయ్య వెళ్ళి అమ్మదగ్గర కూర్చున్నాడు. ఏమిటిరా? అని అమ్మ అడిగింది. తన బాధ అమ్మకు నివేదించుకున్నాడు. “ఏమి లేదులే”అని అమ్మ అన్నది. “ఏమీ లేదు అంటే ఎలా అమ్మా? అనుభవిస్తున్నాను కదా!”అన్నాడు.
తాను ఇంత బాధపడుతుంటే అమ్మ లేదంటుందేమిటి అని మథనపడ్డాడు. ఈలోగా పాస్కు బయటకు వెళ్ళాలనిపించి వెళ్ళి పాస్పోసుకుంటుంటే అందులో రాయి పడిపోయిన అనుభూతి కలిగింది. ఆ తరువాత 30 ఏళ్ళపాటు ఏ రకమైన బాధా లేకుండా హాయిగా వుండగల్గటం అమ్మ అనుగ్రహమే కారణమని అన్నయ్య విశ్వాసం. “తోలు నోరు కాదు కదా! తాలు మాట రావటానికి.
దసరాల్లో నవరాత్రి పూజలయ్యాక ఆ నిర్మాల్యాన్ని ఓంకారనదిలో కలిపి రావటం ఆచారం. అందరూ కలిసి కాలవకు వెళ్ళి తిరిగి వస్తుండగా తంగిరాల సింహాద్రి. శాస్త్రి గారి భార్య విజయలక్ష్మి అక్కయ్య తాళిబొట్టు, తాడు కాలువలో పడిపోయిందని గోలపెట్టింది. తిరిగి అంతా నది దగ్గరకు వెళ్ళి వెతికారు. ఆశ్చర్యం మొలలోతు నీళ్ళలో తాళిబొట్టుతోవున్న బంగారపుతాడు అన్నయ్యకు దొరికింది. ఆ విషయాన్ని అమ్మతో శాస్త్రి అన్నయ్య చెప్పాడు. వాడు ఆంజనేయుడు కదా! వాడికి దొరక్కపోతే ఎవరికి దొరుకుతుంది? అన్న ఆ మాటతో అన్నయ్య హృదయం ఆనందపారవశ్యంతో నిండిపోయింది.
అమ్మ అదృశ్యశక్తిగా అన్నయ్యచేత అనేక రచనలు చేయించింది. “ఆనంద నందనం” “తులసీ దళాలు” “మాతృశ్రీ దర్పణం” అనే పద్యవచన సంకలనాలు, గిరిబాల గీతాలు అనే గేయ సంకలనం, మాతృశ్రీ మాహాత్మ్యం అనే వ్యాస సంకలనం, మల్లెలు మొల్లలు అనే భావ పుష్పాలు అమ్మకు అన్నయ్య విరిమాలగా సమర్పించాడు. వత్రోత్సవాల సందర్భంగా అమ్మకు సమర్పించిన మరోపుష్పం “అనుభవాలమూట – అమ్మ మాట”. అన్నయ్య లేఖిని నుండి ఇంకా ఎన్నెన్నో అనర్ఘ రత్నాలను వెలువరించారు.
పి.యస్.ఆర్.అన్నయ్య పూర్తిగా అమ్మకే అంకిత మయ్యాడు. ‘మదర్ ఆఫ్ ఆల్’ పత్రికలో ఎంతో మంది జీవితాలను ధన్యజీవులు పేరిట రాసి తానూ ధన్యజీవి అయ్యాడు. ఆఖరిగా వసుంధరక్కయ్య కనకాభిషేకం చేసి ధన్యుడయ్యాడు.
నా రచనలన్నింటికీ ఎంతో ప్రేమగా ముందు మాటలను సమయకుసుమం, అమ్మ వద్ద కుసుమ స్థానంకు కుసుమదే, అమ్మసేవలో కుసుమాచక్రవర్తి మొదలగు వ్యాసాలను పంపి నన్ను ఆశీర్వదించారు. ***