అమ్మనే పరదేవతగా భావించి సేవించిన ధన్యజీవి పి.యన్.ఆర్. ఆంజనేయప్రసాద్ అన్నయ్యగారు. జిల్లెళ్ళమూడిలో ఏ సభ అయినా శ్రీ పి.యస్.ఆర్. లేనిదే జరుగదు. అధ్యక్షులుగా, సంచాలకులుగా సభను కవితాత్మకంగా అలరింపచేస్తూ నిర్వహించటం ఆయన ప్రత్యేకత. అన్నపూర్ణాలయ అభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పురోగతికై శ్రద్ధ చూపించారు. ‘మాతృశ్రీ’, ‘విశ్వజనని’ మాసపత్రికలలో ఎన్నో దశాబ్దాలుగా వందలాది వ్యాసాలు, సంపాదకీయాలు వ్రాసి అమ్మకు అక్షరార్చన చేశారు. పి.యస్.ఆర్. అమ్మ అనంత వాత్సల్య దీధితులను ఆసక్తికరంగా వర్ణించారు. అమ్మ దివ్యత్వాన్ని వేనోళ్ళ కొనియాడారు. కవి, సభా నిర్వహణదక్షుడు, సజ్జనుడు, స్నేహశీలి, సేవాపరాయణుడు, నాకు ఎంతో ఆత్మీయుడు శ్రీ పి.యస్.ఆర్.
వారి నిర్యాణం అత్యంత బాధాకరం. అమ్మఒడిని చేరిన పి.యస్.ఆర్.కు నివాళులు అర్పిస్తున్నాను.
అమ్మ యందు భక్తి
ఆంజనేయుని కెప్పు
డధికతమము గాదె
అవని యందు,
ఎప్పుడిచటి సభలు
ఇంపుగా నడిపింప
ఆంజనేయు లచట
అమరి యుండు.
అమ్మను మాతృదేవతగ అక్షరమాలలతోడ గొల్వగా సమ్మతి చేకురెం దనదు సాధన పూర్ణఫలంబు నీయగా నమ్మిన దైవ మింతగను నాదర భావన తోడు నీడగా చిమ్మిన వెల్గుతో బ్రతుకు చేరెను సిద్ధిని శాశ్వతంబుగన్.
అమ్మ నెదను నిలిపి
ఆదర భావమ్ము
కలిగి జీవితమ్ము
సంస్థ సేవ చేసె
సంపూర్ణ మగు రీతి
సాధనముగ నెంచి
సఫలుడయ్యె.
ఇదియే మేలగు జీవనంబు
నిలలో నింకేమి కోరంగనౌ
మదిలో సర్వము అమ్మయే యనెడి
మాధుర్యంబు నిండారగా
కదిలెన్ నిశ్చయ రూప సాధనకు
కారుణ్యంబు వర్షింపగా
తుదిచేరం గద ఆంజనేయు డిక
దూరం బౌచు నీ నేలకున్.
అమ్మ చింతన ఊపిరై
అహరహమ్ము
గుండె గుడిలోన అమ్మయే
కొలువు తీర
అమ్మ సేవకు బ్రతుకెల్ల
అంకితముగ
అమ్మ చూపిన బాటతో
అమరుడయ్యె .