తమిళనాడు నుండి జిల్లెళ్ళమూడి వచ్చే సోదరులలో శ్రీ కె. పద్మనాభన్ ప్రముఖుడు. ఆయన భార్య రాజ్యలక్ష్మి గారు కూడా వారికి తగిన భార్య. అమ్మను విశ్వసించి ఒక దేవతగా ఆరాధించి, అమ్మ అపారమైన ప్రేమలో ఓలలాడి, అమ్మ నామమే జపంగా, అమ్మ ఆలోచనలే నిరంతర ధ్యానంగా, అమ్మ తలపులే తపనగా జీవించిన పుణ్యదంపతులు వారు.
మదరాసు సోదరులు చాల మంది 1973లో అమ్మ స్వర్ణోత్సవాల తర్వాత అమ్మ కోటిమంది బిడ్డలను చూడాలనే ఆప్యాయతతో తిరిగిన రోజులలో అమ్మకు దగ్గరైనారు. అమ్మ మద్రాసు యాత్ర ఏర్పాటు చూచినవారిలో ఎంబెరుమన్నార్చెట్టి, పొత్తూరి వెంకటేశ్వర్లు గారితో సోదరుడు పద్మనాభన్ కూడా ఒకరు.
మద్రాసులో హేమమాలినీ కళ్యాణ మండపంలో అమ్మ జనానికి దర్శనాలు ప్రసాదిస్తుండేది. ఒకరోజు పద్మనాభన్ సకుటుంబంగా వచ్చి తమ ఇంటి కి రావలసిందిగా అమ్మను అభ్యర్థించాడు. అమ్మ అంగీకరించింది. వాళ్ళింటికి వెళ్ళింది. అమ్మను తృప్తిగా అభిషేకించుకున్నారు. వారి కుటుంబమేకాదు వారింటికి వచ్చిన వారందరూ కూడా. ఆనాడు అమ్మ వారికి కంచి కామాక్షిగా దర్శనమిచ్చి అనురాగవర్షంలో వారిని ముంచి వేసింది. ఆనాడు వారు అమ్మకు పెట్టిన చీరెను అమ్మ కొన్ని నెలలు కట్టుకొని తర్వాత పద్మనాభన్ కుటుంబం జిల్లెళ్ళమూడి వచ్చినప్పుడు రాజ్యలక్ష్మిగారికి శేషవస్త్రంగా బహూకరిచింది.
అమ్మతో కలిసి ఫొటో తీయించుకోవాలని వాళ్ళకోరిక. చాలాకాలంగా అదిమనసులోనే ఉన్నది. నోరువిడిచి అమ్మను ఎప్పుడూ అడుగలేదు. అందరిమనసులో ఉండి వాటిని నడిపించే శక్తి అమ్మే కదా! జిల్లెళ్ళమూడిలో అమ్మవద్ద పద్మనాభన్ రాజ్యలక్ష్మిలు కూర్చుని ఉండగా అమ్మే ఫొటో గ్రాఫరును పిలిపించి ఫొటోతీయించి వారిమనసులోని కోర్కె తీర్చింది.
ఒకసారి పద్మనాభన్ తన స్నేహితునితో రూర్కెలా నుండి మద్రాసుపోతూ మధ్యలో జిల్లెళ్ళమూడి వచ్చాడు. ఆ సమయానికి రామకృష్ణన్నయ్య అమ్మకు ఒక అమ్మ ఫొటో ఇచ్చి దానికి ప్రాణప్రతిష్ఠ చేయమని అడుగుతున్నాడు ఎవరికో ఇవ్వటానికి. అమ్మ “అదేమిటిరా! ఇపుడా ఫొటోకు ప్రాణం లేదనా? నీ ఉద్దేశ్యం” అన్నది. అమ్మ ఫొటోనే కాదు అమ్మ ఆలోచనే అమ్మను ప్రత్యక్షంగా మన ముందుంచుతుంది. అక్కడే ఉన్న పద్మనాభన్కు ఒక ఆలోచన వచ్చింది. మరి అమ్మను చూడనివారికి అమ్మనుగూర్చి తెలియని వారి సంగతేంటి? అని దానికి సమాధానం వెంటనే వారికి దొరికింది. వారితో వచ్చిన యువ మిత్రుడు ఇంతకు ముందు అమ్మను చూడలేదు. అమ్మను గూర్చి వినలేదు. అతనిని చూడగానే అమ్మ దగ్గరకు పిలిచింది తన నుండి దూరంగా ఎక్కడో ఉద్యోగం చేయడానికి వెళ్ళిన బిడ్డ దగ్గరకు వస్తే ఎంత ఆప్యాయత, ఆదరణ, వాత్సల్యము ఉంటుందో అలాగా పిలచింది. కలిపి ముద్దలు పెట్టింది పసిపిల్లవాడికిలా. అతడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అన్నగారి దగ్గర పెరిగాడు. అన్నకు పెళ్ళై వదిన వచ్చిం తర్వాత ప్రేమ తగ్గింది. వదిన కూడ తనతో సరిగా ఉండటంలేదు. ఆసమయంలో ‘అమ్మ చూపించిన ప్రేమ అతని హృదయాన్ని కదిలించింది. మద్రాసు వెళ్ళింతర్వాత వదిన కూడా చాలా వాత్సల్యంగా చూచిందిట.
పద్మనాభన్ గారి భార్యకు అమ్మను దర్శించిన నాటి నుండి అమ్మే సర్వస్వమైనది. అమ్మధ్యాసలోనే గడపటం అలవాటైనది. అమ్మ మీద పాటలు వ్రాసి తానే స్వరపరచి అమ్మ వద్ద భక్తితో, ఆర్తితో తన్మయత్వంగా పాడటంతో అమ్మ ఆనందించింది.
గంధపు చక్కను లక్షల లక్షలు అమ్మ నామజపంతో అరగదీసి ఆ గంధంతో ఉండలు చేసి ఆ ఉండలతో ఒక మాలను తయారు చేసింది. ఆ మాలను తెచ్చి అమ్మ మెడలో వేసింది. అమ్మకు పూలమాలలు, బంగారు హారాలు వేసినప్పటి కంటే నామంతో కట్టిన ఈ మాల పరిమళం అమ్మను ఎంత ఆనందపరచిందంటే జిల్లెళ్ళమూడి వచ్చిన ప్రతి బిడ్డకు రాజ్యలక్ష్మిగారు ఆ హారం తయారుచేయటంలోని భక్తి శ్రద్ధలను వివరించారు. ఎప్పుడో శ్రీరంగనాధునకు తాను ధరించిన పూలమాలను సమర్పించిన గోదాదేవి భక్తికంటే ఇది ఇంకా శోభస్కరంగా అమ్మ భావించింది.
మన మనసులోని భావాలను తెలుసుకోవటం అమ్మకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే అమ్మే అందరి మనసులలో మనసై ఉన్నది. ఒకసారి పద్మనాభన్ గారు వారి భార్య క్రొత్త సంవత్సరాది జనవరి ఫష్ట్కు జిల్లెళ్ళమూడి వచ్చారు. జనం వివపరీతంగా ఉన్నారు. అమ్మ దగ్గరకు వెళ్ళే అవకాశం కనిపించక బాధపడ్డారు. ఇంతలో అమ్మ వద్ద నుండి పిలుపు, వసుంధర వచ్చి అమ్మ మిమ్మల్ని రమ్మంటున్నదని, ఆనందంతో అమ్మ వద్దకు వెళ్ళారు. రాజ్యలక్ష్మి గారికి అమ్మ పాద సంవాహనము, పద్మనాభన్ గారి చేతికి విసనకఱ్ఱ ఇచ్చింది. ఇద్దరూ అమ్మకు సేవచేసుకొనే అదృష్టాన్ని పొందారు. అమ్మ ప్రసాదంతో జబ్బులు తగ్గటం, ఏవీ తినటానికి దొరకలేదనుకున్నప్పుడు దొరకటం, కుంకుమ పొట్లాలు చేసే మహాత్మ్యాలు లెక్కలేనన్ని వారి జీవితంలో ఉన్నాయి. ఇంతటి భక్తి ప్రపత్తులు ఉన్నాయి గనుకనే అమ్మ తాను ధరించే పాదుకలను వారికి ప్రసాదించింది పూజకు,
పద్మనాభన్ గారి భార్యకు అమ్మ కలలో కనిపించి మద్రాసులో గుడి కట్టించమని చెప్పిందిట. పద్మనాభన్ గారికి మహాబలిపురం పాతరోడ్డులో కొంత జాగా ఉన్నది. తమకు చేతైనంతలో చిన్నగుడి కట్టిద్దామని భార్యాభర్తల ఆలోచన. వారు స్థలం కొన్న యజమానిని గుడికట్టాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలి అని అడిగారు. అమ్మను చూడని ఆ యజమాని ఈ మాటవిని 1500 గజాల స్థలం విరాళంగా ఇచ్చాడు. ఈ ఉత్సాహంతో “అమ్మ సేవా ట్రస్టును” ఏర్పాటు చేసి వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డిని కలుపుకొని బృహత్ప్రణాళిక సిద్ధంచేసుకొని అమ్మ ఆలయమేకాక అనుబంధంగా శివుడు, వినాయకుడు, కుమారస్వామి, సీతారామలక్ష్మణులు, సత్యనారాయణస్వామి, లక్ష్మీదేవి, అయ్యప్ప, శ్రీకృష్ణుడు, నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించి ఒక ఆలయ సముదాయాన్ని నిర్మింపచేశారు.
పద్మనాథను బ్రెయిన్ హెమరేజి వచ్చి ఆశలు వదులుకున్న పరిస్థితిలో అమ్మ అనుగ్రహంతో కోలుకొని మళ్ళీ నాలుగు నెలల్లో నడవగలగటం అమ్మ దయ. హైదరాబాద్ గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగబోతుందని తెలిసిన పద్మనాభన్ గారు మద్రాసు సోదరులతో సంప్రదించి అమ్మ అనుమతితో మూడు నెలల్లో మద్రాసు గెస్ట్ హౌస్ను పూర్తిచేయగలగటం అమ్మ అపారకరుణ వారిపై ఉన్నదనటానికి నిదర్శనం. పద్మనాభన్ గారు అనారోగ్యంతో అమ్మలో కలిసినా, వారి పిల్లలు జిల్లెళ్ళమూడి వచ్చి మే 5న అమ్మ కళ్యాణంలో పాల్గొంటూ పద్మనాభన్గారి అమ్మసేవలోని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తండ్రికి తగ్గ తనయులనిపించు కుంటున్నారు. పిల్లలలో అమ్మ పట్ల భక్తి విశ్వాసాలను కలిగించటంలో పద్మనాభన్రు కృతకృత్యులై నలుగురికీ ఆదర్శంగా నిలచిన ధన్యజీవి.