1956లోనే అమ్మ వద్దకు వచ్చిన వారిలో చీరాల భాస్కరరావు ఒకరు. గుంటూరులోని రామరాజు కృష్ణమూర్తి, భాస్కరరావు మంచి స్నేహితులు. ఇద్దరూ కలసి కాలేజీలో చదువుకున్నారు. ఇద్దరికీ ఆధ్యాత్మిక జిజ్ఞాస ఎక్కువ. భాస్కరరావుగారి తల్లిదండ్రులు గుంటూరు నుండి చీరాల రావటంతో భాస్కరరావుగారి బస చీరాలకు మారింది. చీరాలలో ఉన్న రోజులలో కూడా అరవిందయోగిని గురించి, రామకృష్ణ పరమహంసను గూర్చి వారి యోగ సాధనలను గూర్చి ప్రచురింపబడిన గ్రంథాలను చదువుతుండేవాడు. గుంటూరులో ఉన్న రోజులలోనే రామరాజు కృష్ణమూర్తి గారి ద్వారా అమ్మను గూర్చి వింటుండేవాడు కాని ఎప్పుడూ అమ్మవద్దకు పోవడం జరగలేదు.
వారికి ఒకసారి ఒక విచిత్రమైన అనుభవం కలిగింది. రాత్రి నిద్రపోయే ముందు కిటికీలో నుండి ఒక స్త్రీరూపం కదలాడినట్లు కనబడింది. గోడమీద ఒక స్త్రీ ఆకారం చిన్నదిగా కనిపించి ఆకాశం ఎత్తుకు ఎదుగుతూ కనిపించింది. భాస్కరరావుగారికి భయమేసింది. అలాగే చీరాలలో ఉన్నరోజులలో చిత్రమైన దర్శనాలవుతుండేవి. ఒకసారి మూడునాలుగు రోజులు జ్వరం వచ్చింది. తగ్గి పథ్యం పుచ్చుకొన్నారుగాని బాగా నీరసంగా ఉన్నది. అదే రోజు గుంటూరు నుండి రామరాజు కృష్ణమూర్తిగారు వచ్చి అమ్మను చూడటానికి జిల్లెళ్లమూడికి వెళ్ళుదాం రమ్మన్నారు. భాస్కరరావుగారి తల్లి వాడికి నీరసంగా ఉన్నది. జ్వరం ఇప్పుడే తగ్గింది మళ్ళీ తిరగబెడుతుందేమో వద్దన్నది. కాని కృష్ణమూర్తి పట్టుబట్టటంతో భాస్కరరావుకు కూడా అమ్మను చూడాలనే ఉత్సాహం ఉండడంతో 17-10-1956న బస్సులో బయలుదేరారు జిల్లెళ్ళమూడికి. ప్రయాణం చేస్తున్నసమయంలో భాస్కరరావుగారికి దేహస్మృతి పోయి ఏదో ఒక అలౌకిక అనుభూతికి లోనయ్యాడు.
తర్వాత బాపట్ల నుండి జిల్లెళ్ళమూడికి రిక్షాలో వెళ్ళారు. వీరు వెళ్ళే సమయానికి అమ్మ కూడ సమాధి స్థితిలోనే ఉన్నది. అప్పటికి అమ్మ ఇప్పుడు హైమాలయం ఉన్నచోట ఒకపాక ఉండేది. ఆ పాకలో ఉన్నది. సమాధి స్థితి నుండి కొంతసేపటికి బయటకు వచ్చిన అమ్మ మాటల సందర్భంలో బాపట్ల నుండి జిల్లెళ్ళమూడి వచ్చేదాకా వారు మాట్లాడుకున్న మాటలన్నీ ఏకరువు పెట్టిందట. వాళ్ళు అప్రతిభులైనారు. సర్వవ్యాపకత్వాన్ని గూర్చి, సర్వజ్ఞత్వాన్ని గూర్చి వారు చదువుకొని ఉన్నారు. ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనం కనిపించింది.
భాస్కరరావుగారిని “ఏమి సాధన చేశావు నాన్నా” అని అమ్మ అడిగింది. “సాధన అంటూ ఏమీ చేయలేదమ్మా, గ్రంథాలు చదవవటం తప్ప” అన్నాడు. “పుస్తకజ్ఞానం అనుభవం కాదుగా నాన్నా!” అన్నది అమ్మ. అమ్మ మాట్లాడుతుంటే వీణాస్వర మాధుర్యం వినిపించినట్లు ఒక్కొక్క మాట ఆత్మీయంగా హృదయాన్ని తాకుతున్నట్లు అనిపించింది. అమ్మ స్వయంగా వంట చేసి పెట్టింది ఇద్దరికీ. కలిపి ముద్దలు నోటి కందించింది. పొయ్యి, గిన్నె, గరిటె, కట్టెలు చూపించి ఇవే నా సాధన సామాగ్రి అన్నది. కణకణమందే నిప్పులో కాల్చిన మేలిమి బంగారంగా ఉన్నది అమ్మ శరీరకాంతి అనిపించింది భాస్కరరావుగారికి. ఆ రోజులలోనే – అమ్మ “ఈ శరీరాన్ని వదిలిపెట్టాలని ఉంది నాన్నా” అన్నది. అందుకు భాస్కరరావుగారు ‘శరీరం మార్చాలి గాని వదలవద్దు’ అని అరవిందులు చెప్పిన మాట చెప్పారుట అమ్మతో. అమ్మ కూడా తర్వాత పరిణామ సిద్ధాంతాన్నే చెప్పింది.
రఘువరదాసుగారు నామయోగిగా లోకంలో ప్రసిద్ధుడు. ఎన్నివందల వేల రామనామ సంకీర్తన, యజ్ఞాలలో పాల్గొని ఆయన తరించడమేగాక ఎంతమందిని తరింపచేశాడో! అ మహనీయుని శిష్యులు కొందరు భాస్కరరావు గారున్న రోజుల్లో జిల్లెళ్ళమూడి అమ్మవద్దకు వచ్చారు. వారు అమ్మ అనుజ్ఞతో రామనామం చేస్తుంటే ఒక నల్ల కుక్క అక్కడకు వచ్చి తన్మయత్వంతో నాట్యం చేసింది. నామంచేసేవారితోపాటు అందరికీ ఆనందభాష్పాలు వచ్చాయి. ఆ నల్ల కుక్కే తర్వాత తర్వాత జిల్లెళ్ళమూడి వచ్చే సోదరీ, సోదరులను ఏడవ మైలు వంతెన నుండి అమ్మవద్దకు తీసుకొనిరావటం, అమ్మ వద్ద నుండి వెళ్ళే వారిని ఏడవమైలు దాకా దించిరావటం చేసేది. అది ఎంత సంస్కారం చేసుకొన్నదో, అందుకే అమ్మ మానవులకే కాదు జంతువులకీ మనస్సున్నది అని చెప్పింది. ఆ సమయంలో భాస్కరరావు చేతిని అమ్మ పట్టుకుంటే అమ్మతోపాటు భాస్కరరావుగారు కూడా సమాధి స్థితిలోకి వెళ్ళారు.
అదే పట్టున మండలం రోజులున్నారు అమ్మ దగ్గరవారు. బయలుదేరే రోజున అమ్మ వాళ్ళను కార్తీక పూర్ణిమకు రమ్మని చెప్పింది. భాస్కరరావుగారు వచ్చారు. అమ్మ భాస్కరరావుగారి నుదుట కుంకుమ పెట్టుతూ అమ్మ బొటనవ్రేలు భృకుటిని తాకగానే భావ సమాధిలోకి వెళ్ళిపోయారు. అమ్మ ఎవరి యోగ్యతను బట్టి వారికివ్వవలసినవి ఇస్తుంది. అనభ్యాసంగానే అమ్మవారికీ సమాధి స్థితులు ప్రసాదించింది. అమ్మ దగ్గర కూర్చొని మహాత్ముల గ్రంథాలు చదివి వినిపిస్తుండేవారు. అమ్మ “మహాత్ముల భావకర్పూరంతో నీ జిజ్ఞాసా హారతిని ఇస్తున్నావురా నాకు” అన్నదిట. నిజమే అమ్మకు అందులో తెలుసుకోవలసినవి ఏమీ లేవు. తెలివే ఆమె కదా! మనకు తెలియచేయటానికే మనకు ఏదో ఈ రకమైన ప్రేరణను ఇస్తుంటుంది.
ఆ రోజుల్లో ప్రతి పూర్ణిమకు అమ్మ ఓంకారనదిలో (డ్రైన్కాలువ) స్నానం చేయటానికి వెళ్ళుతుండేది. అమ్మతో బిడ్డలందరూ వెళ్లేవారు. భాస్కరరావుగారు కూడా వెళ్ళారు. చాలా లోతుగా ఉరవడితో ప్రవహిస్తున్న ఆ కాలవలో అమ్మ ఈతకొడుతూ నీటి మీద తేలడం, వెల్లికిలాపడుకొని వెళ్ళడం చూచి ఆశ్చర్యపోయారు. అణిమ, లఘిమ, మహిమ, గరిమ వంటి అష్టసిద్ధులు అమ్మకు సహజసిద్ధంగానే ఉన్నవి అనిపించింది వారికి.
అమ్మ ఎవరైనా తన దగ్గర నుంచి ప్రయాణమై బయలుదేరుతుంటే కుంకుమ పొట్లాలు ప్రసాదంగా ఇవ్వటం మామూలు. కొందరు అది ప్రసాదం కాదనుకొని ప్రసాదం (అరటి పండో, పటిక బెల్లమో) ఇమ్మని అడగటం కూడా కద్దు. భాస్కరరావుగారికి అమ్మ ఒకసారి ప్రక్కనే ఉన్న కుంకుమ పొట్లం చేతిలోకి తీసుకొని నీకు పటిక బెల్లం ప్రసాదం ఇస్తున్నానురా అని ఇచ్చింది. ఆ కుంకుమ పొట్లంలో కుంకుమ లేదు పటిక బెల్లమే ఉన్నది. ద్రాక్ష పళ్ళలోని గింజలు తీసి గుజ్జును నోటికి అందించేది. తొక్కలులేని అరటి పండ్లను పెట్టేది. ఇవ్వన్నీ అక్కడ ఉండేవి కాదు. అమ్మ లోపలికి పోయి కనిపించకుండా సృష్టించి పెట్టేది. ద్రాక్షగింజలుగాని, అరటి తొక్కలు గానీ ఎక్కడా కనిపించేవి కావు. అదృష్టవంతుడు భాస్కరరావు. భాస్కరరావేకాదు ఆ రోజులలో అమ్మ దగ్గరకు వచ్చిన వారందరూ అమ్మ అత్యద్భుత మహిమలు దర్శించినవారే.
భాస్కరరావుగారు అరవిందుల క్రియాయోగం పట్ల ఆకర్షితులైనారు. ఆ సంస్థలలో చాలాకాలం సేవలు చేశారు. అరవిందుల తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు. ఎప్పుడైనా కనిపిస్తే ఎలా అమ్మ అనుభవాలు ప్రసాదిస్తుందో, అమ్మలోని మానవతాతీత శక్తులను గూర్చి, యోగ శక్తిని గూర్చి చెపుతుండేవారు. అమ్మ ఆలయాలలో చేరిన తర్వాత జిల్లెళ్ళమూడి వచ్చి కొంతకాలం అమ్మ సన్నిధిలో గడిపి శాంతిని పొందారు. చిన్న తనం నుండే ఆధ్యాత్మిక చింతనతో, యోగం పట్ల ఆకర్షితులై అదే జీవము జీవనముగా గడిపిన వారు అరుదుగా కనిపిస్తారు. ఏమైన అమ్మ అనురాగము పొందిన ధన్యుడు, మాన్యుడు భాస్కరరావు.