“భవానీకుమారి” అంటే చాలా తక్కువ మందికి తెలుసు. కుమారి అంటేనే జిల్లెళ్ళమూడికి 1970లోపు వచ్చిన చాలా మందికి తెలుసు. అసలు పేరు. జి. సాయీకుమారి.
వరంగల్లో ఫోటోగ్రాఫర్గా ఉన్నవాళ్ళ నాన్నతో తన చెల్లెలు నిర్మలతో కలసి అమ్మ వద్దకు వచ్చింది. అమ్మ దగ్గర ఉండిపోతానన్నది. అమ్మ సరే అన్నది. అలా కుమారి అమ్మ దగ్గర అందరింట్లో ఉండటం తటస్థించింది.
ఆ రోజులలో అమ్మ ఎన్నో విషయాలు దగ్గర చేరినవారికి చెబుతూ ఉండేది. అంతేకాదు అమ్మ పూజలలో అమ్మకు ఎన్నో ముద్రలు పడుతుండేవి. వాటన్నింటిని ప్రత్యక్షంగా చూచిన కుమారి అమ్మలోని అతిమానుష శక్తిని గుర్తించి అమ్మను గూర్చి లోకానికి తెలియచేయాలనే తపన పడ్డది. అమ్మాయి వచ్చేనాటికి మనకే రకమైన పత్రికలు, గ్రంథాలు పెద్దగా వెలువడలేదు. 1962 నుండి సంవత్సరానికొకసారి అమ్మ జన్మదినోత్సవ సంచిక మాతృశ్రీ పేరుతో తీసుకొని రావటం జరిగింది. 1963లో మొదటిసారిగా కుమారి రచన అందులో చోటు చేసుకొన్నది “నివేదన” అన్న పేరుతో. అందులోనే కుమారి రచనా పాటవం స్పష్టంగా గోచరిస్తున్నది.
అమ్మ దర్శనంతో తన శిథిల జీవితానికి సుప్రభాతమైందనీ, ఆ ఉషస్సులో తన భవిష్యజ్జీవితానికి గమ్యం ఏర్పడిందని తెలుసుకొన్నది. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. మారుటి తల్లి వద్ద నానా కష్టాలు అనుభవించింది. అమ్మలోని మాతృవాత్సల్యం ఆ హృదయాన్ని కదిలించింది, కరిగించింది. బంధువులు, స్నేహితులు ఇదేమిటి ఈ పిచ్చిది, అమ్మంటూ ఇల్లు వదిలి అక్కడే ఉన్నది అని గెలిచేశారు. తండ్రి బలవంతం చేశాడు ఇంటికి రమ్మని. కాని కుమారి దృఢనిశ్చయంతో జిల్లెళ్ళమూడిలో అమ్మ దగ్గరే ఉండిపోయింది. అక్కడి వాళ్ళే అన్నయ్యలు, అక్కయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అయ్యారు. వారితోనే జీవితం ముడివేసుకొని పోయింది. ఈ విశ్వకుటుంబంలో ఒక సభ్యురాలైంది. అమ్మ చల్లని ఒడిలోనే సేదదీర్చుకొన్నది. అంతే ఆ అమ్మాయిలో క్రొత్తరక్తం పట్టింది.
సోదరీసోదరులతో కలిసి క్రొత్తగా ఏర్పడే భవన నిర్మాణంలో ఇటుకలు మోసింది. లారీల మీద వెళ్ళి ఇసుకను నింపి తెచ్చేది. బండిమీద బస్తాలతో వరిపొట్టు ఎత్తుకొని వచ్చేది. భవనానికి పునాదులు త్రవ్యేది. పలుగు పారలు పట్టుకొని తలపై గడ్డి చుట్టలు పెట్టుకొని మట్టి తట్టలు మోసేది. అమ్మస్నానానికి, అన్నపూర్ణాలయానికి, పశువులకు కావలసిన నీళ్ళు బుంగలతోనో, బళ్ళ మీద పీపాలతోనో తీసుకొని వచ్చేది. అంట్లు తోమేది. గుడ్డలు ఉతికేది. ఒకటేమిటి అన్ని పనులూ చేసేది. మగ, ఆడా తేడా లేకుండా కలిసి పని చేసేది. అంతా అమ్మ ఆరాధనగా చేసేది. అమ్మ పలకరింపు అమ్మ చూపు తనలో క్రొత్త ఉత్తేజాన్ని నింపేది. కష్టాన్ని మరిపింప చేసేది. ఎంతకాలమున్నా అమ్మను విడిచి పెట్టలేని ఆకర్షణ, ఆనందము. ఎప్పుడైనా కొద్దికాలం విడిచిపోవాల్సి వచ్చినా కన్నీరు కార్చేది.
అసలు అమ్మలోని ఈ ఆకర్షణ ఏమిటి? తనకు తనే ఆలోచించుకున్న కుమారికి ఒక ఊహ తట్టింది. ఆనాడు రాముడు అరణ్యానికి బయలుదేరితే అయోధ్య ప్రజలంతా ఎందుకు ఆయన వెంటపడ్డారు? అరణ్యాలకు వెళ్ళితే వానరులు అన్నీ మరచి రఘువల్లభుని వెంట ఎందుకు సంచరించారు? శ్రీకృష్ణుని వేణునాదం విన్న గోపికలు సర్వం వదిలి ఎందుకు పరుగులు తీశారు? ఆ ప్రేమతత్వానికే తాను బందీనైనాను అనుకున్నది. అంతే కాదు ఆ ప్రేమ మహాసాగరంలో స్నానం చేయకపోయినా దోసిళ్ళతో జలపానం మాత్రం చేసింది.
కుమారిని జిల్లెళ్ళమూడి ఒక వ్యక్తిగా నిలబెట్టింది అమ్మ డైరీరాయటం. అసలు ఆ సంకల్పం రావటమే గొప్ప విషయం. రమణాశ్రమంలో రమణ మహర్షి దినచర్యను నాగమ్మ అనే సోదరి వ్రాసేది. అవి చదివిన కుమారి మనస్సులో అమ్మ డైరీ వ్రాయాలనే ఆలోచన వచ్చింది. డైరీ వ్రాసే మెలకువలు తెలుసుకోవటం కోసం తిరువణ్ణామలై లోని రమణాశ్రమానికి వెళ్ళి నాగమ్మను కలిసి సంప్రదించింది. అలా పట్టుదలతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మాతృశ్రీ పత్రిక 1966 జూన్లో మాసపత్రికగా మొదలైంది. 1966కు ముందు అమ్మ జన్మదినోత్సవ సంచికలలో వ్రాసేది. ఆ తర్వాత ప్రతినెల దాదాపు ఐదు సంవత్సరాలు నిరాఘాటంగా “అర్కపురి లేఖలు” శీర్షికతో “అర్కపురి విశేషాలు” శీర్షికలతో వ్రాసింది. అప్పుడప్పుడు విశేషమైన ఘట్టాలను అత్యంత సమర్ధవంతంగా చేయి తిరిగిన రచయిత్రిగా వ్రాసింది. శ్రీపాదవారు అమ్మ సంభాషణలు, అమ్మ-అమ్మవాక్యాలు సంకలనం చేయడానికి కావలసిన ముడిసరుకు వసుంధర, కుమారి వ్రాసిన డైరీల నుండి సేకరింపబడిందే. ఆ విషయాన్ని శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు తమ ముందుమాటలలో వ్యక్తపరచారు కూడా.
అమ్మ వైకుంఠపాళి ఆడుతున్నది పిల్లలతో కలసి, శేషగిరిరావన్నయ్య మనుమడు ఫణి నీకు ఆటలంటే ఇష్టమా? అమ్మా! అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. “అవును నాయనా! నేను వచ్చింది అందుకే. నేను చేస్తున్నదే అది” అన్నది. అమ్మ పందెం వేస్తున్నది. కుమారి అమ్మతో ముందు దేవుడి వెయ్యాలి అన్నది. అప్పుడమ్మ “దేవుడి పందెం ఏముంది దేవుడే పందెం వేస్తుంటే” అన్నది. అమ్మ తాను దేవుడినని ఒప్పుకొన్న సందర్భాలు తక్కువ. కుమారి దగ్గర ఒప్పుకొన్నది మరి.
నిజమే ఆ దేవతతో, పరాశక్తితో ఆడుకొనే అదృష్టం కల్గిన కుమారి లాంటివారు ధన్యులే. ఒకసారి వసుంధర తల్లి కోన వెంకాయమ్మగారు చనిపోయినప్పుడు అమ్మే చితికి నిప్పటించింది. శవం కాలిన వాసనే రాలేదే అని అందరూ ఆశ్చర్యపోతుంటే అమ్మ చేతిమీదిగా అగ్నికి ఆహుతి ఐతే ఇంకా వాసన లెక్కడుంటాయి అనుకున్నారట అక్కడికి వచ్చిన పెద్దలు. అమ్మతో ఓంకారనదిలో స్నానానికి వెళ్ళిన కుమారి లాంటి వాళ్ళకు మానసిక తాపం ఎలా ఉన్నా శారీరక తాపం తీరిందట. అమ్మ అందరి మీద నీళ్ళు చల్లుతూ, కేరింతలు కొట్టుతూ, నవ్విస్తూ అల్లరి చేస్తుంటే జలదేవత ప్రత్యక్షమైనట్టే భావించింది కుమారి.
ఒక రోజు హైమ అమ్మ వద్దకు వచ్చి లలితా సహస్రనామం చేస్తున్నా, జపం చేస్తున్నా తాను పొందాల్సిన దేదో పొందలేకపోతున్నాని, తన సంగతేమిటో చెప్పమని అడిగింది. అప్పుడు అమ్మ హైమతో “ఏమిటో హైమా! నీలా ఈ గమ్యాలు చేరటం వీటి గురించి ఆలోచన ఉండదు. నాకు పిల్లలతో ఆడుకోవటం అల్లరి చేయటంలోనే ఆనందంగా, హాయిగా ఉంటుంది” అన్నది. అప్పుడు ప్రక్కనే ఉన్నా కుమారి “అందుకేనమ్మా! నీ దగ్గర మాకింత చనువున్నది. హైమ ఎందుకు ఆలోచిస్తున్నదో కాని, ఈ సాధనలూ, గమ్యాన్వేషణలూ అంటూ బాధపడేకంటే నీ దగ్గర ఇట్లా ఆడుకుంటూ నీ అల్లరిలో పాలు పంచుకుంటుంటేనే బాగుంటుందనిపిస్తుంది” అన్నది. అవును భగవంతుడితో ఆడుకోవటం కంటే కావల్సిందేముంది? శ్రీ కృష్ణుడితో ఆడుకున్న గోపబాలురెంత పుణ్యం చేసుకొన్నారో? భగవంతుడవతార మెత్తితే తనతోపాటే పరివారాన్నీ తెచ్చుకుంటారట. అలాగే మనమూనూ, దర్శన స్పర్శనాదులిచ్చి మనల్ని ఉద్ధరించటమే భగవంతుని లక్ష్యం. కేశవశర్మ అందుకే అన్నాడు. “శ్రీకృష్ణునితో పుట్టి ఆడుకోలేదే – రామకృష్ణ పరమహంస కాలములో ఆయనను చూడలేకపోయానే అనే చింత నాకు లేదు. అమ్మతో ఆడుకోవటం పాడుకోవటం చేశాము అని. గుడిపాటి వెంకటాచలం కూడా అమ్మ అతని వద్దకు వెళ్ళి వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నప్పుడు “భగవంతు డెక్కడున్నాడని ఎవరైనా అడిగితే ఇప్పుడు చెపుతాను ఇదిగో ఇక్కడ అమ్మ రూపంలో ఉన్నాడని” అన్నాడు. కుమారి కూడా అలా అమ్మతో ఆడుకొని ధన్యురాలైన గోపికలలో ఒకరు అని చెప్పవచ్చు. అయితే కుమారి అప్పుడప్పుడు అమ్మ మీద అలుగుతుండేది. అందుకే అందరూ “సత్యభామ” అంటుండేవారు. ఆ రోజుల్లో వసుంధరను రుక్మిణి అని కుమారిని సత్యభామ అని అనటం జరుగుతుండేది.
ఒకనాడు అమ్మ చెప్పే మాటను కుమారి డైరీలో త్వరత్వరగా వ్రాస్తున్నది. అమ్మ “ఇప్పుడు నే నన్నమాట వినపడిందా” అన్నది కుమారితో, కుమారి రోషంగా నేనేం నీ కోడలిని (ఒక సోదరిని అమ్మ ముద్దుగా పిలిచే పిలుపు) కాదమ్మా! వినబడక పోవటానికి” అన్నది. అప్పుడు అమ్మ “నా కోడలివి కాదుకానీ నా కూడలివి” అన్నది. అమ్మ కూడలిలో ఉండటం మాత్రం సామాన్యమైన విషయమా? మనం ఉండటం కాదేమో! అమ్మ ఉంచుకోవటమే నేమో! అనిపిస్తుంది. లేకపోతే క్షణం కూడా అమ్మ దగ్గర ఉండలేం.
కుమారి మాతృశ్రీ ప్రింటర్స్లో పనిచేసేది. అందరింటి నిర్వాహకులు ఏ పనిచెపితే ఆపని చేసేది. అమ్మవద్ద ఉండాలని వచ్చే ఎవరైనా అమ్మతో ఆ ఆవరణలో ఉండాలనే కోరుకుంటారు. బాపట్లలో ప్రెస్ ఉండటం వల్ల కొందరు రోజూ అక్కడ పనిచేస్తూ పోయి వచ్చేవారు. కాని కుమారి బాపట్లలోనే ప్రెస్లోనే ఉండేది.
జిల్లెళ్ళమూడి వచ్చేనాటికి యస్.యస్.యల్.సి. చదివిన కుమారికి హిందీ పరీక్షలకు చదవాలనే ఆలోచన వచ్చింది. మధ్యమ, రాష్ట్రభాష, ప్రవేశిక, విశారద ఇలా అన్ని పరీక్షలకు నాచేత పుస్తకాలు తెప్పించుకుని చదివి ఉత్తీర్ణురాలైంది. ఆ తర్వాత ఇంటర్, బి.ఏ., యం.ఏ. హిందీ పరీక్షలు కూడా స్వతంత్రంగా చదివి చక్కటి మార్కులు తెచ్చుకొని ఉత్తీర్ణురాలై హిందీ ట్రయినింగ్ చదివి హిందీ టీచర్ గా చేరింది. పది సంవత్సరాలు అమ్మ సన్నిధిలో గడిపి అక్కడి వారందరి మనస్సులలో ఒక సముచిత స్థానాన్ని సంపాదించుకున్న కుమారి జిల్లెళ్ళమూడిని, అమ్మను వదలి ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరినా ఇక్కడి సోదరీ సోదరులతో ఏర్పడిన అనుబంధాలు ఎలా పొగొట్టుకుంటుంది? కాత్యాయని అక్కయ్య, రాధాకృష్ణశర్మగారి కుటుంబంతో, రామకృష్ణన్నయ్యతో చిరకాలం తన సోదరీ బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. అమ్మను తాను భౌతికంగా వదిలినా మానసికంగా అమ్మ వదలదు కదా! నన్ను వదిలి ఎవరూ లేరు అన్న అమ్మ మాట సార్ధకమే. కుమారి కూడా ఆ తానులోని గుడ్డే.
కుమారి తేది 8.12.2009న అమ్మలో ఐక్యమైంది. కాని జిల్లెళ్ళమూడిలో సంచరించిన ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. రామాయణంలో శ్రీరామచంద్రుడు చిన్న మేలు చేసిన వారిని కూడా మరచి పోరు అని చెప్పబడింది. అలాగే అమ్మ సేవచేసిన కుమారిని అమ్మ మరచి పోతుందా? కుమారి చిరంజీవి – ధన్యురాలు.