కృష్ణారావుగారు అమ్మ కృపకు పాత్రులైన బిడ్డలలో ఒకరు. అమ్మ కృప లేకపోతే అమ్మ మీద విశ్వాసం ఏర్పడటం కూడా కష్టమే. ఎందుకంటే అమ్మ వద్దకు వచ్చిన లక్షల మందిలో కొన్ని వందల మందితోనైనా సన్నిహితంగా సంబంధం కలిగినవారున్నారు. అమ్మకు అత్యంత సన్నిహితంగా మెలిగినవారున్నారు. సంవత్సరాల తరబడి వస్తూ వస్తూ రావడం ఆగిపోయిన వారున్నారు. అప్పుడప్పుడు వస్తూ అమ్మను నిరంతరం మనస్సులలో ధ్యానించే వాళ్ళున్నారు. ఎవరికి మనస్సులో ఏ బాధ వుందో చెప్పలేం. మనం అమ్మకోసం వస్తున్నాం, ఇంకా కొంచెం తరచి తరచి ఆలోచిస్తే మనం మన కోసమే వస్తున్నాం, ఇతరుల కొరకు కాదు అని మరచిపోతుంటాం. ఏది ఏమైనా కృష్ణారావుగారు జిల్లెళ్ళమూడి రావటం కూడా ఒక విచిత్రమైన సన్నివేశమే.
కాకినాడ గవర్నమెంట్ కాలేజీలో చేరిన కృష్ణారావుగారు చిత్తూరులో గవర్నమెంటు కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేవారు. వారి భార్య శ్రీమతి వరలక్ష్మి మన్నవ వారింటి అడబడుచు. అమ్మకు ఒక పినతండ్రి కూతురు. వాళ్ళింట్లో బంధువులంతా ఒకచోటికి చేరితే అమ్మ విషయం ప్రస్తావనకు వచ్చేది. అమ్మ మహిమలను గూర్చి చిత్రవిచిత్రంగా చెప్పుకొనేవారు. మన్నవలో అమ్మ చేసిన లీలలు, చెన్నకేశవస్వామి ఆలయంలో, రాజ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో, చింతల తోపులో జరిగినవి చెప్పుకొనేవారు. కృష్ణారావుగారు నమ్మేవారు కాదు. ‘అంతా మీ భ్రమ’ అని అవహేళన చేస్తుండేవారు. విధి బలీయమని తెలుసుకోవటం కష్టం. అమ్మ ‘విధే దైవం’ అన్నది. విధే విధానమన్నది. మనకు వింతగా తోచే విధి లీలవల్ల కృష్ణారావుగారికి 1971లో పక్షవాతం వచ్చింది. అప్పటికి 40 ఏళ్ళవయసులోనే ఉన్నాడు. నోటమాటలేదు మూగవాడైనాడు. నడువలేడు కుంటివాడైనాడు., తీవ్ర అస్వస్థత, అప్పుడు ఇంట్లోవాళ్ళు మీ కోసం కాకపోయినా, మా కోసమైనా జిల్లెళ్ళమూడి వెళ్ళుదాం, అమ్మను దర్శించుకొందాం అని పట్టుబట్టితే చివరకు ఒక నియమం మీద జిల్లెళ్ళమూడి రావటానికి ఒప్పుకున్నాడు. ఏమిటంటే నా జీవితాన్ని గూర్చి గానీ నా జబ్బును గూర్చి నయం చేయమని అడగవద్దు. ఆమె మహత్తు కలిగినదైతే ఆమె గ్రహించగలదు అన్నాడు. ‘బ్రతుకు జీవుడా రావడానికి ఒప్పుకొన్నాడు చాలు” అని ఆయన షరతులకు అంగీకరించారు.
ఎట్టకేలకు జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మ దర్శన స్పర్శనలతో ఆయనలో ఆయనకు తెలియకుండానే మార్పు వచ్చింది. అమ్మ వాత్సల్యము, ప్రేమ, ఆప్యాయతలతో అమ్మలోని దివ్యత్వం వైపు ఆకర్షింపబడ్డాడు. అమ్మ పట్ల విశ్వాసం ఏర్పడ్డది. అమ్మ ఆ ప్రథమ దర్శనంలోనే కిరీటధారిణియై దేదీప్యమానంగా విలసిల్లుతున్న రాజరాజేశ్వరిగా వారి కన్నులకు కనిపించింది. ఆ తర్వాత ఆయన మాట్లాడాడు. నడిచాడు. మళ్ళీ ఆయనకు పునర్జన్మ ప్రసాదింపబడి మళ్ళీ కాలేజీకి వెళ్ళి ఉద్యోగం చేయగల్గాడు.
“మూకం కరోతి వాచాలం ఫంగుంలంఘయతేగిరిం
యత్కృపాత మహం వందే పరమానంద మాతరం”
అనే విషయం ఆయన జీవితంలో అక్షర సత్యమైనిలిచింది. ఆనాటి నుండి ఆయన అమ్మలో లీనమయ్యే వరకు అమ్మ తప్ప మరే దైవము లేరు. ఆనాటి నుండి వారు అమ్మ తపస్సు చేశారు. అమ్మ ధ్యానం చేశారు. . అమ్మ భావనే బ్రహ్మభావనై నిలిచారు. ఆయన ఇల్లే అమ్మాలయం అయింది. ఆయనను కలవటానికి వచ్చిన బాధితులకు, అమ్మను తలచుకొని, అమ్మ నామం ఉచ్చరించి కుంకుమ ఇచ్చేవాడు. వారికి సర్వవ్యాధులు నయమయ్యేవి. ఆయన ఇల్లు నిత్యం ఇలా వచ్చే ఆర్తులతో, ఆయన తీర్థప్రసాదాల కోసం వచ్చే వారితో నిండిపోయేది. అమ్మను మనస్సులో తలచుకొని ఆయన చెప్పే మాట అక్షర సత్యమయ్యేది తన స్వర్ణోత్సవాలలో లక్షమందికి ఒకే పంక్తిన భోజనం పెట్టిన అమ్మ కోటి మందికి దర్శనం ఇవ్వాలనే కోర్కెతో రాష్ట్రరాష్టేతర ప్రాంతాలు తిరుగుతూ తిరుపతి వెళ్ళి ఆ తర్వాత చిత్తూరు వెళ్ళినప్పుడు కృష్ణారావుగారింటికి వెళ్ళిన అమ్మ ఆసీనురాలైన పవిత్రమైన ఆసనం వారి ఇంట్లో భద్రంగా అమ్మ చిత్రపటం అలంకరించి నిత్య ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తూ ఉంచుకున్నారు. ఆ యిల్లు మరొక జిల్లెళ్ళమూడిగా విరాజిల్లుతున్నది. ఆ ఇంట్లో అమ్మ భజనలు, ఏకాహాలు జరగటమేగాక అమ్మ జన్మించిన ప్రతి ఆశ్లేషా నక్షత్రం రోజున, ప్రతి ఏకాదశి తిథి రోజున పూజలు వైభవంగా జరిపి వచ్చిన ఆర్తులకు, భక్తులకు అన్నం పెట్టడం జరిగేది. అమ్మను నమ్మిన కృష్ణారావు ఆయనను నమ్మిన జనానికి మార్గదర్శకుడైనాడు.
ఆయన ఏం చెబితే అది జరిగేది. ఆయనకు అమ్మ ప్రసాదించిన వాక్సుద్ధి అలాంటిది. ఇదంతా అమ్మదయే అనేవాడు. అహంకారం లేని నిగర్వి. ఆయన వద్దకు వచ్చేవారిలో ముస్లిములు, క్రైస్తవులు కూడా వుండేవారు. అన్ని మతాలవారు విచక్షణ లేకుండా అమ్మకు మ్రొక్కేవారు. ఆ బజారులో పూలమ్మే పూల వర్తకుడికి అమ్మ కనిపించి నేను ఫలానా వాళ్ళ ఇంట్లో ఉంటాను నీ పూలమాల అక్కడే ఇమ్మంటే కృష్ణయ్య అనే ఆ పూలవ్యాపారి రోజూ తానే అమ్మకు పూలమాల తెచ్చి ఇచ్చేవాడు.
అమ్మ దక్షిణ దేశయాత్రలో చిత్తూరులో వాళ్ళ ఇంటికి వెళ్ళేనాటికి పూర్తి ఆరోగ్యం రాలేదు ఇంకా నడక పూర్తిగాలేదు. అయినా ఆశ్చర్యం అమ్మకారు వెంబడి పరుగెత్తాడు. ఆనాడు అమ్మ వెలిగించిన జ్యోతి వాళ్ళింట్లో అఖండ జ్యోతిగా వెలుగొందింది. అంటే అతిశయోక్తి కాదు. అమ్మ చెప్పిన ‘నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో’ అన్నదానికి నిదర్శనంగా వేలాది మందికి వస్త్రదానం, అన్నదానం చేసుకొన్నారు.
వారికి అమ్మ మీద ఉన్న ప్రగాఢ విశ్వాసం ఏలాంటి దంటే చిన్న బిడ్డ చేష్టతో తెచ్చిన పాపకు అమ్మ కుంకుమపెట్టి మందు అక్కరలేదు అంటే నిజంగా రెండో రోజుకే పాప తల్లి తండ్రులు వచ్చి బిడ్డ కులాసాగా ఉన్నట్లు చెప్పి వెళ్ళారు. దసరాలలో 104 డిగ్రీల జ్వరంతో ఒక మహిళ వస్తే దసరా అయ్యేటప్పటికి తగ్గుతుంది అని చెప్పితే మహర్నవమి నాటికే ఆరోగ్యం కలిగింది. అమ్మ తప్ప వేరే దైవం లేదని నమ్మి ఏకాదశి రోజు అమ్మ పూజచేసుకొని రాయవెల్లూరు. ఆస్పత్రిలో అనారోగ్యంతో చేరి అమావాస్యనాడు ఆశ్లేషా పూజాప్రసాదం తీసుకొని 16-8-2004న అమ్మలో లీనమైనారు. ఆ అంతిమ సమయంలో వారికి అమ్మ గాజులసవ్వడి వినిపించింది. అమ్మ పాదాలపై వాలిన మహత్తర పూజా పుష్పం. అలాంటి భక్తి, విశ్వాసము కలిగిన మహనీయుడు కృష్ణారావు ధన్యజీవి.