శర్మగారి స్వర్ణ గ్రామం. చీరాల డాక్టరుగారు (పోట్లూరి సుబ్బారావు), జిడ్డు ప్రసాదు (భీమరాజు వెంకట సుబ్బ ప్రసాదరావు), కటిక కోటేశ్వరరావులతో కలసి చీరాల నుండి అమ్మను చూడటానికి మొదటిసారి 1957 డిసెంబరులో జిల్లెళ్ళమూడి వచ్చారు.
శ్రీ రామకృష్ణశర్మగారు సంస్కృతాంధ్రాలు బాగా అధ్యయనం చేసినవారు. కవి, పౌరాణికుడు, గురుముఖతః భాష్యత్రయశాంతి చేసినవారు. అమ్మ ఉన్న తాటియాకుల పాకలోకి తలవంచుకొని లోపలికి వెళ్ళారు, ఎవరికైనా ఇక్కడ తలవంచక తప్పదన్నట్లుగా. నమస్కారాలు చేసుకొన్న తర్వాత చీరాల డాక్టరుగారు శర్మగారిని పరిచయం చేయబోయినారు. అమ్మ ‘వారు నాకు తెలుసు నాన్నా! బాపట్లలో చూచాను’ అన్నది. మీరు బాపట్ల వచ్చారా? అని శర్మగారడుగగా రాలేదన్నారు అమ్మ. రాకుండానే చూచిందన్న మాట. అంతేకాదు 13 సంవత్సరాల క్రితం ఎక్కడ ఎలా చూచింది ఆ సన్నివేశాన్నంతా వర్ణించి చెప్పింది. శర్మగారు దిమ్మెరపోయినారు. కొంత సేపు గడచింతర్వాత ఏదైనా ఒక పద్యం చదువు నాన్నా! అన్నారు అమ్మ. శర్మగారు పద్యం ఎత్తుకున్నారు ఒక పాదం చదివారు రెండవ పాదం జ్ఞప్తికి రావటం లేదు. పోనీ వచ్చింది ఇంకొక పద్యం చదువు నాన్న! అన్నారు అమ్మ – అదీ అంతే మూడు వేల పద్యాలు నోటికి వచ్చిన శర్మగారు ఒక్క పద్యం చదవలేక పోయారు. అనర్గళంగా పుస్తకాపేక్ష లేకుండా సంజయ రాయభార ఘట్టం, శ్రీకృష్ణ రాయబార ఘట్టం, పురాణం చెప్పినవారే. అయినా పద్యం సాగలేదు. శర్మగారికి సిగ్గు వేసింది. అహంకారం అణగిపోయింది. అమ్మ ‘ఇప్పుడొక పాటపాడు’ అన్నారు. పాటపాడారు. ఆగలేదు. ఇదంతా అమ్మ చేస్తున్న పనే అని తెలియటానికి చాలా కాలం పట్టింది.
తరువాత అమ్మ ఒక స్వాముల వారిని గూర్చి చెప్పారు. ఆ ప్రసంగంలో శర్మగారు కొంచెం బిరుసుగా వారిని విమర్శించారు. అమ్మ వారు తెల్లగుడ్డలు విసర్జించి కాషాయం కట్టే త్యాగమైనా చేశారు. మనం ఆ మాత్రం కూడా చేయలేదు. కదా? “తన్ను తాను విమర్శించుకోవడం వివేకం ఇతరులను విమర్శించడం అవివేకం” అన్నారు. దాంతో శర్మగారు బాధకలిగినా సంబాళించుకున్నారు. అమ్మ అన్న ఆ మాట తర్వాత తర్వాత జీవితంలో వారికి ఎంతో ఉపయోగపడింది.
ఆనాడు వచ్చిన వారంతా అమ్మకు పూజ చేసుకుందామనుకున్నారు. శర్మగారు లలితా నామాలు చెప్పారు. తర్వాత శర్మగారే అమ్మను గూర్చి అష్టోత్తర శతనామాలు వ్రాసే అదృష్టాన్ని పొందారు. అమ్మ పూజలో, సమాధి స్థితిలో ఉండటం గమనించారు.
అది ధనుర్మాసం కావడంతో సాయంత్రం అమ్మ సందెగొబ్బెమ్మ పెట్టి అందరి చేత పూజ చేయించింది. పద్యాలు, పాటలు నామ సంకీర్తన చేయించింది. మంత్ర పుష్పం చెప్పమన్నది అమ్మ. మంత్రపుష్పానికి చేతిలో పూలులేవే అనుకుంటుండగా అందరి చేతులలో మట్టి పెట్టింది అమ్మ. అదే గొబ్బెమ్మ పై వేసి నమస్కరించారు. మామూలుగా పేడకు నమస్కరించం, పసుపుకుగాని, కుంకుమకుగాని సమస్కరించం. ఆవు పేడను గొబ్బెమ్మను చేసి పసుపు పూసి కుంకుమ పెట్టగానే భగవతి అనే భావన వచ్చి పూజించి హారతి ఇచ్చి నమస్కరిస్తున్నాం. అలాగే వేప చెట్టు, రావిచెట్టు విడివిడిగా పూజించం. రెండూ కలిపి లక్ష్మీనారాయణులని పూజిస్తాం. వివాహాదులలో గుండ్రాయిని పూజిస్తాం. అంటే సర్వత్రా ఉన్న బ్రహ్మమే. ఇన్ని రూపాలలో ఉన్నది అని తెలియచేయడమే అని అమ్మ చెపుతుంటే మబ్బులు విడిపోయి ఆకాశం నిర్మలమైనట్లు మనస్సు జ్ఞానరోచిస్సులతో ప్రకాశవంతం అయింది శర్మగారికి ఆనాడు.
ఆనాటి నుండి శర్మగారు తరచుగా అమ్మ వద్దకు వెళ్ళటం అమ్మ మాట్లాడే మాటల్లోని ఆణిముత్యాలు ఏరుకుంటూ అవి తమ ఉపన్యాసాలలో, పురాణాలలో, కవితలలో ఉపయోగించడం జరుగుతుండేది.
ఒకసారి అమ్మ బిడ్డలందరిని మాఘపూర్ణిమకు రమ్మని చెపుతూ శర్మగారితో అమ్మాయిని కూడా తీసుకొనిరా అన్నది. 4.2.1958 మాఘపూర్ణిమ. 3వతారీకు సాయంత్రానికే అందరు జిల్లెళ్ళమూడి చేరారు. విశేషమేమిటో శర్మగారికి తెలియదు. షుమారు 1500 మంది చేరారు ఆరోజు అమ్మ వద్దకు. జనసందోహం కోలాహలం. కొమరవోలు గోపాలరావుగారు చామదుంపల బస్తా తెచ్చారు. ఏడవ మైలు నుండి ఎవరు మోసుకొస్తారా! అని ఆలోచిస్తుండగా రామకృష్ణ శర్మగారే ఆ బస్తా నెత్తిపై పెట్టుకొని మోసుకొచ్చారు జిల్లెళ్ళమూడికి.
తెల్లవారు ఝామున 2 గంటలకు డ్రైయిను కాల్వకు అమ్మ బయలు దేరింది. అమ్మతో పాటు అందరూ బయలు దేరారు హైమతో సహా. సన్నగా బలహీనంగా ఉన్న అమ్మతో ఎవరూ నడవ లేకపోయారు. నామం చేస్తూ అందరూ అమ్మను అనుసరించారు. ఆ వెన్నెల వెలుగులో అమ్మ షుమారు వెయ్యి మందికి మంత్రోపదేశం చేసింది. అందులో శర్మగారు, శర్మగారి భార్య కూడా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం చొప్పున పట్టినా షుమారు పదిగంటల కాలం పైన పట్టాలి. కాని కాలం అమ్మ ఆధీనం, 4 గంటలలోనే అంత మందికి ఉపదేశం చేసింది.
మామూలుగా అమ్మ ఎవరికీ మంత్రోపదేశాలు చేయదు. ఉపనయనాలలో తప్ప. ఆ రోజు దేశిరాజు రాజమ్మగారికిచ్చిన మాట ప్రకారం అంత మందికి చేసింది. శర్మగారు, శర్మగారి భార్య ఆ రోజు అమ్మచే ఉపదేశం పొందటం నిజంగా వారి అదృష్టం.
“మమపరిపాలిని పావనీ! పరమేశ్వరి శ్రీ భువనేశ్వరీ అంబ, విమల హృదంతర్వర్తినీ జననీ, వేద స్వరూపిణి మాంపాహి” అని సంస్కృతంలోనూ,
“సర్వాదర్శ సమన్వయాన్విత భవత్సాన్నిధ్య లోలత్వమే
సర్వాధ్యాత్మిక సంపదాళి నొసగునే సందేహమున్ లేదులే
సర్వాలంబనమివె వేదపరిషత్ సంస్తుత్యదివ్యాకృతీ!
గర్వోన్మూలిని! కార్యకారణ విముక్తక్షేత్ర సంవాసినీ!” అని తెలుగులోనూ శర్మగారు ఎన్నో పాటలు పద్యాలు వ్రాశారు. వారు వ్రాసిన “మాతృదేవికి మంగళం మా మంగళాంగికి మంగళం. శ్రీకరంబై దివ్యమై భాసిల్లు తల్లికి మంగళం” అనే మంగళ హారతి పాట నిత్యం జిల్లెళ్ళమూడిలోనూ, ఎక్కడ అమ్మ పూజ జరిగినా పాడుకుంటూనే ఉన్నాం.
శ్రీరామకృష్ణ శర్మగారు కొన్ని సంవత్సరాలు “మాతృశ్రీ ప్రింటర్స్”లో మేనేజర్గా సేవలు చేశారు. వీరు వ్రాసిన “అమ్మ అష్టోత్తర శతనామావాళి”ని జిల్లెళ్ళమూడిలో తొలి రోజులలో పూజలలో వాడబడేది. శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణచే ఆ నామాలు చదివించేది అమ్మ పూజలలో వేదశాస్త్ర పరిజ్ఞానమంతా నామాలలో పొదిగి నిబంధించారు శ్రీ శర్మగారు.
ఆ రకంగా శర్మగారు అమ్మ సేవలో నిరంతర అమ్మ భావనలో తరించిన ధన్యజీవులు.