అమ్మకు ఎప్పుడు ఏ రకంగా ఎవరిమీద అనుగ్రహం ప్రసరిస్తుందో చెప్పలేం. అందుకే భగవంతుడిది అకారణకరుణ అంటారు పెద్దలు. అమ్మ మాత్రం తరుణం అంటుంది. అడవులదీవిలో యల్లాప్రగడవారు అమ్మకు. ఆప్తులైనారు ఆధారకులైనారు. ఆ ఊరిలో వారిది సంపన్న కుటుంబం కావడంతో చాలామంది వారి ఆదరణకు ఆత్మీయతకు నోచుకొనేవారు. అలాటి వారిలో తలగడదీవి వారి కుటుంబం ఒకటి.
తలగడదీవి వెంకటసుబ్బారావుగారు సీతారావమ్మగారు ఆదర్శ దంపతులు. సత్పురుషులు సాధుమూర్తులు వినయసంపన్నులు అయిన వెంకట సుబ్బారావుగారు వారి పూర్వీకులు స్థాపించిన ఎలిమెంటరీ పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయులుగా బోధన మార్గంలో జీవనం సాగించారు. ఆ రోజులలో బ్రతకలేని బడిపంతులు అనే సామెతకు గుర్తుగా కష్టాలతోనే కాలం గడిచేది. ఇంతలో గ్రామపంచాయితీ కార్యాలయంలో గుమాస్తా ఖాళీ ఉన్నదని తెలిసి పెద్దల సహకారంతో అందులో గుమాస్తాగా ఉద్యోగంలో చేరారు.
సుబ్బారావుగారి భార్య సీతారావమ్మగారు అనుకూలవతి అయిన గృహిణి. స్నేహశీలి, అమృతమూర్తి, శ్రమజీవి అయిన ఉత్తమురాలు. నలుగురికి తోడుపడే మనస్తత్వం. చెప్పకుండానే అడగకుండానే అందరికీ పనులలో సాయపడుతుండేది.
అమ్మను గూర్చి ఆ దంపతులు అడవులదీవి మధువాళ్ళ కుటుంబం ద్వారా వింటున్నా మధుపెళ్ళికి జిల్లెళ్ళమూడికి పెళ్ళివారి బృందంతో రావటం జరిగింది. అమ్మ దృష్ఠి వాళ్ళమీద ప్రసరించింది. అమ్మ అడవుల దీవి వెళ్ళినపుడు మధువాళ్లింట్లో సుబ్బారావుగారి రెండవ కూతురిని చూచి ఆశీర్వదించారు. సుబ్బారావుగార్కి ఏడుగురు సంతానం. అమ్మ మధు వాళ్ళ ద్వారా సుబ్బారావుగారికి, సీతారావమ్మగారికి తన ప్రసాదంగా వస్త్రాలు పంపింది. మహాప్రసాదంగా స్వీకరించారు వాళ్ళు.
పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని శ్రీరాముని అంటారు. అలాగే అమ్మ తాను స్త్రీయై అందరినీ సైతం తల్లిగా పాలిస్తున్నా స్త్రీలచేత మోహింపబడింది. వసుంధరక్కయ్యను వివాహం చేసుకున్నది. ఆ తరువాత ఎంతోమంది సోదరీమణులు అమ్మచేత తాళి కట్టించుకున్నా రుక్మిణీ దేవి వసుంధరయే వసుంధర తమ్ముడు కోన సత్యనారాయణమూర్తి హోమియో డాక్టరై వివాహవయసుకు రాగానే అమ్మ అడవులదీవి మధు ద్వారా సుబ్బారావు గారికి కబురుచేసి రాజ్యాన్ని జిల్లెళ్ళమూడి పిలిపించి సత్యానికి సంబంధం కుదిర్చింది. వెంకటసుబ్బారావుగారి ఆర్థిక పరిస్థితి తెలిసిన అమ్మ కట్టుబట్టలతో పెళ్ళికి తరలి రమ్మని, తానే అంతా చూచుకుంటానని చెప్పింది. అలా సుబ్బారావుగారి రెండవ కుమార్తె రాజ్యం పెళ్ళి డాక్టర్ సత్యంతో జరిగింది.
ఆ పెళ్లిలోనే పదవతరగతి చదువుతున్న సుబ్బారావుగారి మరొక కుమార్తె సుగుణతో, జిల్లెళ్ళమూడివచ్చి నా దగ్గర ఉండి చదువుకో అన్నీ నేనే చూస్తాను అని హామీ ఇవ్వటం జరిగింది. 1976లోనే ఒకసారి వెంకటసుబ్బారావుగారు జిల్లెళ్ళమూడి వస్తే – “నీవేం దిగులు పడకు నాన్నా! నీ కుటుంబ బాధ్యత అ నీ పిల్లలు నలుగురికి పెట్టేంతటి వాళ్ళవుతారు. నీ పిల్లలను గూర్చి నీవేం ఆలోచించ వద్దు – నే చూసుకుంటాను నిశ్చింతగా ఉండు” అని హామీ ఇచ్చింది. అప్పుడు వెంకట సుబ్బారావుగారు పొందిన ఆనందానికి అంతులేదు. కళ్ళవెంట నీళ్ళు తిరిగి ఆనందబాష్పాలు వచ్చాయి. 1977 ఫిబ్రవరిలో అమ్మ యిచ్చిన ఆ హామీతో ఏ చింతా లేకుండా మనశ్శాంతితో అమ్మలో లీనమైనారు.
అమ్మ హామీ ఇచ్చినట్లుగా ఆ కుటుంబాన్ని ఆదుకున్నది. సుగుణ భాషా ప్రవీణలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. తండ్రిపోయి దిక్కుతోచని స్థితిలో సుగుణ అమ్మకు చెప్పుకొని బాధపడితే ఆ కుటుంబాన్ని జిల్లెళ్ళమూడికి పిలిపించి అక్కడే ఉంచింది. 1980లో ఆగష్టులో జిల్లెళ్ళమూడిలోనే సుగుణకు కాలేజీలో ఉద్యోగం వచ్చింది. సుగుణతల్లి సీతారావమ్మగారు నిరంతరం అమ్మ నామం చేస్తూండేది. సంధ్యావందన సుప్రభాతాలు చేసేది. జిల్లెళ్ళమూడిలో ఉన్నంతకాలం ఆమెకు అదే నిత్యకృత్యం. సుగుణ అండదండలతో అమ్మ ఆశీస్సులతో తమ్ముళ్ళందరూ చదువుకున్నారు. వాళ్ళు ఏ చదువులు చదవాలో కూడా అమ్మే సూచించేది.
ఆ విధంగా అందరి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు అమ్మ అనుగ్రహంతో జరిగాయి. సీతారావమ్మగారు జిల్లెళ్ళమూడిలోనే ఎక్కువకాలం గడిపింది. అమ్మ నామం చేసుకుంటూ, కాలేజి పిల్లలు అనారోగ్యంతో ఉండే వాళ్ళకు సేవచేస్తూ ఉండేది.
మగపిల్లలు ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళయి తమ తల్లిని తీసుకొని వెళ్ళి తమ దగ్గర అట్టి పెట్టుకున్నా సుప్రభాత, సంధ్యావందనాలు అమ్మ నామం మానేది కాదు. అనారోగ్యంతో బాధతో మాటరాని దశలో కూడా చేతిలో అమ్మా అని వ్రాయడం అమ్మ వద్దకు తీసుకెళ్ళమని సంజ్ఞ చేయటంతో 2005 అక్టోబరులో అందరింటికి అమ్మ వద్దకు తెచ్చిన తర్వాత మూడురోజులన్నది. ఆమెకు ఆ మూడు రోజులు జిల్లెళ్ళమూడిలో లలితా సహస్రనామాలు సంధ్యావందన సుప్రభాతాలు వినిపించారు. ఆమె మనస్సు ఏ రూపంలో అమ్మతో లీనమై ఉందో ఊహించుకుంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. టేప్ రికార్డరు పెట్టి అమ్మ నామాన్ని హైమ జపాన్ని వినిపిస్తుంటే హాయిగా ఆనందంగా తెల్లవారుఝామున అమ్మలో లీనమైంది.
సత్సంగత్వే నిస్సంగత్వం – నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తిః” – అని శంకరులన్నారు. అడవుల దీవిలో సుశీలక్కయ్య మధువాళ్ళ సాంగత్యం. జిల్లెళ్ళమూడిలో సోదరీ సోదరుల అనుబంధం – అందరికీ సుగతే అని అమ్మ ఇచ్చిన హామీ – సుబ్బారావు గారి విషయంలో సీతారావమ్మగారి విషయంలో నిజమై నిలిచింది. నిజంగా ఆ దంపతులు ధన్యజీవులు.