1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (అన్నంరాజు రామకృష్ణారావు)

ధన్యజీవులు (అన్నంరాజు రామకృష్ణారావు)

Pillalamarri Srinivasa Rao
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 13
Month : October
Issue Number : 4
Year : 2014

శ్రీ అన్నంరాజు రామకృష్ణారావు 1969లో అమ్మను దర్శించారు. సహజంగా ఆయన సాయిబాబా భక్తుడు. అలా ఆ భక్తి కూడా విచిత్రంగానే కుదిరింది. చిన్నతనం నుండి అల్లరి చిల్లరగా తిరిగిన రామకృష్ణారావు ఒకరోజు వాళ్ళున్న ఇంటి సందు చివర ఏదో కోలాహలం జరుగుతున్నది. ఏమిటో చూద్దాం వీలైతే అల్లరి చెయ్యవచ్చు అని అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక యోగిపటం పెట్టుకొని జనం సాయినామం చేస్తూ చిందులు త్రొక్కుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఉన్నారు. కొందరు సాయిబాబాకీ జై అంటూ జయజయ ధ్వానాలు చేస్తున్నారు. ఒక గడ్డం ఉన్న వ్యక్తి వాళ్ళందరికీ నాయకుడిలాగా ఉన్నాడు. ఆ నామము-ఆ భజన-ఆ జనం ఆనందము చూచిన రామకృష్ణారావు ఆ గడ్డపాయన దగ్గరకువెళ్ళి ఎవరు ఆ పటంలో ఉన్నది? ఈ భజనేమిటి? అని అడిగాడు. ఆ వ్యక్తి సాయిబాబాను గూర్చి ఆ మహాయోగి మహాత్మ్యాన్ని గూర్చిచెప్పి ఆ సద్గురువు సన్నిధికి షిరిడీకి వెళ్ళితే నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. చెప్పిన వ్యక్తి చిత్తశుద్ధిమీద, బాబామీద నమ్మకం కలిగి ఎలాగైనా షిరిడీ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. అవి తాను చదువుకుంటున్న రోజులు. ఎవరిస్తారు డబ్బులు అల్లరి చిల్లరగా తిరిగేవాడికి.

ఆ రోజుల్లో కుసుమ (ఇప్పుడు కుసుమాచక్రవర్తి-విశాఖ) చిన్నపిల్ల. ఆడుకుంటుంటే నీ గాజు లియ్యమని అడిగి తీసుకొని వాటిని కుదువబెట్టి ఎవరికీ చెప్పకుండా షిరిడీ వెళ్ళారు. అక్కడ సమాధివద్ద కూర్చోగానే తనకు తెలియకుండానే ఏదోమార్పు తనలో వస్తున్నట్లనిపించింది. కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. తను చేస్తున్న అల్లరిని గూర్చి తల్లిదండ్రులు తనను గూర్చి బాధపడుతుండటం వంటివి జ్ఞాపకానికి వచ్చాయి. ఇకపైన అబద్ధం ఆడనని, తల్లిదండ్రులను బాధించనని, అల్లరి పనులు చేయనని ఒట్టుపెట్టుకున్నాడు. ఇప్పటిదాకా చేసిన తప్పులు క్షమించమని సాయిబాబాను వేడుకున్నాడు. మూడురోజులు అక్కడే ఒక గదిలో తిండీ తిప్పలు మానేసి, ఎవరితో మాట్లాడకుండా ధ్యానంలో గడిపాడు. బాబా కరుణించాడనే దానికి నిదర్శనంగా ఒక బాలుడు “ఏమయ్యా! బయటికిరా! అన్నం తిను, ఎవరికోసం ఈ ఉపవాసాలు?” అని వినిపించింది. తలుపు తెరిచి చూస్తే ఏ బాలుడూ లేడు. అప్పుడు దాహమేసి ఒక పంపు వద్ద నీళ్ళు తాగి ఎదురుగా ఉన్న మామిడి చెట్టునుచూచి దానికున్న రెండు మామిడి పండ్లను చూచి అవి రాలి చేతిలో పడితే ఎంత బాగుండును అనుకున్నాడు. అవి ఒకటి వెంట ఒకటి రాలి ఆయన చేతులలో పడ్డాయి. ఇది బాబా కరుణే. ఆయన నన్ను క్షమించారనుకున్నాడు. ఆకలి తీర్చుకున్నాడు. తల్లిదండ్రులు అప్పుడు గుర్తుకొచ్చారు. ఒక ఉత్తరం వ్రాశాడు. తాను కుసుమ గాజులు తీసుకొన్నది, అవి ఎక్కడ తాకట్టు పెట్టింది, విడిపించి వారికిమ్మని. ఆ తర్వాత షిరిడీ నుండి ఇంటికి వచ్చాడు. పూర్వపు రామకృష్ణుడికి తిరిగి వచ్చిన రామకృష్ణుడికీ పోలికేలేదు. అంత బుద్దిమంతుడిగా కనిపించాడు. కాలేజికి వెళ్ళి చదువుకోమన్నారు తలిదండ్రులు. తనకిష్టంలేదని చెప్పాడు. బాడ్మింటన్ ఆట చాలాబాగా ఆడేవాడు. ఏంచేయాలి? అని ఆలోచనలో పూర్వ సాయిబాబా భక్తుడు, తనకు షిరిడీ మార్గదర్శనం చేసిన వారి దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. ఆయన రైల్వేలో ఉద్యోగం చేసేవాడు. ఒక దరఖాస్తు ఇమ్మని, రామకృష్ణారావుగారికి గుమాస్తా ఉద్యోగం ఇప్పించాడు. ఇలా రాను రానూ సాయిబాబాపై భక్తి పెరుగుతూ వచ్చింది.

రైల్వేలో ఉద్యోగం చేస్తూ అసిస్టెంట్ స్టేషన్ మాస్టరుగా ఉద్యోగోన్నతిని కూడా పొందారు. 1952లో ఉషతో వివాహమయింది. 1954 కల్లా అసిస్టెంట్ స్టేషన్ మాస్టరై కారేపల్లి, నాంపల్లి, మంచిర్యాలలో ఉద్యోగంచేసి మళ్ళీ కారేపల్లికివచ్చి అక్కడ ఒక వినాయకుడి దేవాలయం కట్టించ గలిగారు అందరి సహకారంతో. తాను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. అప్పటికే ముగ్గురు మగ పిల్లలు, ఆడపిల్ల జన్మించారు. ఉద్యోగంలో వచ్చే జీతం చాలదనే ఆలోచనతో కొందరితో కలిసి వ్యాపారం పెట్టాడు. బాగానే జరుగుతున్నది వ్యాపారం. ఈలోగా రామకృష్ణారావు గారి తండ్రి అన్నంరాజు వెంకటేశ్వరరావు గారు చనిపోవడంతో 1968లో తెనాలి వచ్చి అక్కడి పనులు చక్కదిద్దుకోవడంలో రెండు నెలల సమయం పట్టింది. తిరిగి వెళ్ళేటప్పటికి భాగస్తులు వ్యాపారంలో నష్టం చూపించారు. రామకృష్ణారావుకు దిమ్మ తిరిగిపోయింది. ఎలాగా ఇప్పుడు? వ్యాపారాన్ని నమ్మి ఉద్యోగాన్ని వదిలాను. వ్యాపారంవల్ల అప్పులపాలైనాను. ఈ పిల్లలను, ఈ సంసారాన్ని ఎలా పోషించాలి? విరాగిగా మారి సంసారాన్ని వదిలి శ్రీశైలం వెళ్ళిపోయాడు. శరీరాన్ని చాలిద్దాం, ఈ కష్టాలను తట్టుకోలేను అనుకుంటుండగా శ్రీశైలంలో ఒక యోగి పూర్ణానందస్వామి పరమశివునిలా ప్రత్యక్షమైనాడు. వారికి తన విషయాలన్నీ మొఱపెట్టుకొని తనకు ఏదైనా మంత్రమిచ్చి కాపాడమన్నాడు.

పూర్ణానందస్వామి వారుకుడా వాత్సల్యంతో శిష్యునిగా రామకృష్ణారావును స్వీకరించి నాలుక పై బీజాక్షరాలు వ్రాసి, మంత్రోపదేశం చేసి, నీటితో అభిషేకించారు. జపం ఎంత చేయమంటారు? ఎంత చేస్తే ఏమి వస్తుంది? అని అడగ్గా లక్షజపం చేయి అమ్మవారు నీకు దర్శనమిస్తారు. నీతో ఉంటారు, నీతో మాట్లాడుతారు, నీతో తింటారు, నీవే నీలో వచ్చిన మార్పును గమనిస్తావు. అన్నారు. వారు చెప్పిన నియమనిష్ఠలతో కారేపల్లి వెళ్ళి 70వేలు మంత్రజపం చేశాడు రామకృష్ణారావు.

ఇంతలో పొన్నూరు దగ్గర నండూరులో కామేశ్వరమ్మగారు కట్టించిన సాయిబాబాకు రెడ్డిపాలెం కాంతయ్య యోగి కిరీటం పెడతారు రమ్మని ఆహ్వానం వస్తే వెళ్ళారు. ఆ మరుసటిరోజే తండ్రి వెంకటేశ్వరరావు గారి మాసికం. దగ్గరలో జిల్లెళ్లమూడిలో తన సోదరి కొమరవోలు సరోజిని (గోపాలరావు గారి భార్య) ఉన్నది కదా అక్కడ మాసికం పెట్టుకోవచ్చని జిల్లెళ్లమూడి వచ్చారు. అక్కడ అమ్మ మాసికం పెట్టించిన పద్ధతికి ముగ్ధుడయ్యాడు. 10 మంది కన్యలతో శ్రీసూక్తం చెప్పించి తన పాదాలు కడిగించుకొని, గంధం చేతులకు, పాదాలకు రాయించుకొని పూజ చేయించుకొని, ఇది మీనాన్నకిష్టం కదరా అని కొసరి కొసరి అడిగి నివేదన తిని తనకు, అక్కడ ఉన్న అందరికీ ప్రసాదం పెట్టింది. కారేపల్లిలో తాను కట్టించిన దేవాలయ విశేషాలు చెపుతూ రామకృష్ణారావును ఆనందంలో ముంచేసింది. తన తండ్రి ఏడూడి కూడా ఇక్కడే జరుపుకునే అవకాశం ఇమ్మని అమ్మను ప్రార్థించాడు. అమ్మ సరేనన్నది. తిరిగి కారేపల్లికి వెళ్ళి స్వామి చెప్పిన లక్షజపం పూర్తిచేశాడు. ఇంతలో జిల్లెళ్ళమూడి నుండి అమ్మ నిన్ను రమ్మంటున్నది, వెంటనే రమ్మని టెలిగ్రాం వచ్చింది. రెండు రోజులు ఆలస్యం చేయగా మళ్ళీ టెలిగ్రాం, జిల్లెళ్ళమూడి వెళ్ళాడు. అమ్మ “నీవేం చేస్తున్నావు?” అని అడిగింది. నేనేం చెయ్యటంలేదు. ఒక్క భువనేశ్వరీ మంత్రం తప్ప అన్నారాయన. “నేనే భువనేశ్వరిని, నీవు నన్ను కావాలనుకున్నావు- నేను నిన్ను కావాలనుకుంటున్నాను. నీ బాధ్యతలన్నీ నేను చూచుకొంటాను. నీవు జిల్లెళ్ళమూడి వచ్చెయ్యమని చెప్పింది. అమ్మ ముద్దలు కలిపి నోటిలో పెట్టుతుంటే పూర్ణానందస్వామి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. “దేవుని చూస్తావు, దేవునితో ఉంటావు, దేవునితో తింటావు” అన్నవి అక్షరాల జరిగింది. కారేపల్లి వెళ్ళుదామని బయలుదేరి గుంటూరు బస్టాండులో నిలుచుంటే శ్రీశైలం బస్సు ఎదురుగా వచ్చింది. సరేనని శ్రీశైలం వెళ్ళాడు. స్వామిని కలిసి “మీరు చెప్పింది నిజమైంది స్వామీ! అంటూ నమస్కారం చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్కిరాల భరద్వాజ వ్రాసిన ఇంగ్లీషు వ్యాసం చూపించారు. స్వామి చదివి “అమ్మ భువనేశ్వరి – ఈ రకమైన మాటలు మరొకరు చెప్పలేరు” అని చెప్పి రెండురోజుల తర్వాత నేనూ జిల్లెళ్ళమూడి వస్తాను అన్నారు, స్వామి వారితో కలిసి గుంటూరు అన్నంరాజు మాధవరావుగారి యింటికి వచ్చి రామకృష్ణారావుగారు తమ కుటుంబాన్ని గుంటూరు పిలిపించి అందరూ కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళారు. అక్కడ జిల్లెళ్ళమూడిలో రామకృష్ణారావు గారికి ఒక పోర్షన్ ఇచ్చారు ఉండటానికి. పూర్ణానంద స్వామీజీ కూడా వారితో ఆ భాగంలోనే ఉన్నారు. స్వామివారు తమిళనాడులోని పాపనాశనానికి వెళతామంటే అమ్మ వారిని రామకృష్ణారావు గారి తండ్రిగారి ఏడూడికి రమ్మని చెప్పింది. వారు అంగీకరించారు. అలాగే వచ్చారు కూడా. అమ్మ వారికి కాషాయ గుడ్డలు తెప్పించి పెట్టింది. ఈసారి వచ్చేటప్పుడు వారి తల్లిని గూడా తీసుకు రమ్మన్నది. స్వామికూడా అలా వారి అమ్మను తీసుకొచ్చారు.

ఒకరోజు స్వామీజీకి అన్నం ఆప్యాయంగా తినిపించింది అమ్మ తన చేతులతో. అప్పుడు స్వామీజీ ఆనందంగా “తల్లిలేని శివుడు తన తల్లిని చూచాడు. Now the motherless Shiva has found his mother అన్నారు.

రామకృష్ణారావుగారు జిల్లెళ్ళమూడి 7వ మైలు నుండి రోడ్డు వేయటానికి కాంట్రాక్టు తీసుకోమంది అమ్మ. దాంట్లో నష్టం వచ్చేట్టుంది. లారీలు కొంటే మంచి దమ్మా! అన్నారు ఆయన. కొనమంది. నా దగ్గర డబ్బులేవమ్మా ! నీవిస్తే కొంటానన్నారు. “ఇస్తా” నన్నది అమ్మ. ఆ మాట అన్నవారం రోజులలో శ్రీ పర్సా దుర్గాప్రసాదావు గారు 13వేలు, అన్నంరాజు మాధవరావు గారు 7వేలు, రామకృష్ణారావు గారి స్నేహితుడు సీతారామారావు 2 వేలు ఇచ్చారు. ఆశ్చర్యం వెంటనే అమ్మవద్దకు వెళ్ళి నీదయవల్ల డబ్బు దొరికిందమ్మా అంటే. అమ్మ “నీ సంకల్పసిద్ది అది, నా దయకాదు” అని తన గొప్పతనాన్ని కప్పి పుచ్చుకొన్నది. ఆ లారీ పనులతో నష్టం వస్తుందనుకున్న కాంట్రాక్టు లాభాలతో పూర్తిచేశారు. తరువాత ఆ లారీ డబ్బుతోనే మరొక లారీ కొని, 1973లో స్వర్ణోత్సవాల సేవకు ఉపయోగించారు. జిల్లెళ్ళమూడిలో సంస్థ సేవకు ఒక వ్యాను కూడా నడిపారు. జిల్లెళ్ళమూడిలో అమ్మతో క్యారంబోర్డు ఆడేవారు. అలాగే రవి, రవి పిల్లలు చైతన్య, శరత్ తో ఆడేవారు. బ్యాట్మింటన్, క్యారమ్స్ లో మంచి ప్రావీణ్యంగల స్టేట్ ప్లేయరు, రైల్వేస్ తరపున ఆడి బహుమతులు సాధించాడు. రామకృష్ణారావుగారు రాకపోతే అమ్మ కబురుచేసి పిలిపించేది.

1969లో జిల్లెళ్ళమూడి చేరిన రామకృష్ణారావుగారు 1985లో అమ్మ ఆలయంలో చేరేదాకా అక్కడే ఉండి సేవచేశారు. 1971లో రామకృష్ణారావు గారి కూతురు శేషును, అమ్మ తన తమ్ముడు లక్ష్మీనరసింహారావు కిచ్చి వివాహం జరిపించింది. అంతేకాదు రామకృష్ణారావుగారి తమ్ముడు చంద్రమోహను గోపాలన్నయ్య పెద్దకూతురునిచ్చి వివాహం జరిపించింది.

శ్రీరామకృష్ణారావు తన తండ్రికి పెద్దకొడుకు. తెనాలిలోని సుప్రసిద్ధ న్యాయవాది శ్రీ అన్నంరాజు వెంకటేశ్వరరావు, రామశేషమ్మలకు 1930లో జన్మించారు. తెనాలిలోనే హైస్కూలు విద్య, కాలేజి విద్య గుంటూరులో అన్నంరాజు సీతాపతిరావు గారి ఇంట్లో ఉండి చదువుకొన్నాడు.

రామకృష్ణారావుగారు సహనశీలి. ఆటుపోటులను తట్టుకొని నిలబడగల ఆత్మస్థైర్యాన్ని సాధించిన ధ్యానయోగి- కార్యశీలి – భక్తుడు. ఆ మహనీయుని ఆలంబనంగానే శ్రీపూర్ణానందస్వామి జిల్లెళ్లమూడి వచ్చారు. ఆ పరమశివుని రాకకు కారణమైన అన్నంరాజు రామకృష్ణారావు ధన్యజీవి. ఆయన 22-7-2008న అమ్మలో ఐక్యమైనారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!