1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (అమ్మ అనురాగబంధం రాజుపాలెం శేషు)

ధన్యజీవులు (అమ్మ అనురాగబంధం రాజుపాలెం శేషు)

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 16
Month : July
Issue Number : 3
Year : 2017

హైమా! “రూపుదాల్చిన ప్రేమస్వరూపానివి నీవు. అమృతపాత్రను కాలమనే గరుత్మంతుడు తన్నుకుపోయినా – అనుక్షణం అమ్మను చూస్తూ అమ్మకు అమ్మాయై – మాయై – మాయయై – అమ్మయై – నిలచిన హైమా ! రామ్మా ! రా ! నా అసలు రంగు లోకానికి తెలియదు. అమ్మకు తెలుసు. ఇప్పుడు నీకు తెలుసు” అన్నాడు శేషు. అమ్మ హైమను లోకానికి దేవతగా ప్రసాదించిన సందర్భంలో “నాన్నా! శేష! హైమ నీవూ భరద్వాజ ఇద్దరూ కావాలని కోరుకునేది! నేను నీలో హైమను చూచుకుంటున్నారా! నీవు ఇక్కడ నుండి వెళతానంటే ఎలా? నేను నీలోనే ఉన్నాను” అన్నది. అప్పుడు శేషు అమ్మా! వెళితే గిళితే “నా జీవనలతను నీ పాదానికి కట్టివేసి ఒక కొనను చేత్తో పట్టుకొని మరీ వెళతాను” అంటాడు. నిజమే అమ్మకు బంధింపబడిన శేషు ఎక్కడ తిరిగినా అమ్మ చింతన అమ్మ ఆలోచన అమ్మ తలపులతోనే కాలం గడిపాడు. అమ్మ ఇక చాలు రారా! నా వద్దకు అన్నప్పుడు వచ్చాడు. అమ్మలో కలిశాడు.

అమ్మ వద్ద నుండి బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందో శేషు చెపుతూ అమ్మా ! “ఇంద్రభవనంలో ఉండి వచ్చాక పూరిగుడిసె కంటికి నచ్చుతుందా? అమృతం త్రాగిన తర్వాత కొబ్బరి నీళ్ళు రుచి అనిపిస్తాయా? అలాగే నీ దగ్గరి నుంచి వచ్చాక – నేనంటే నాకెంత అసహ్యంగా ఉందో ఏమని చెప్పమంటావమ్మా? నీ దగ్గర ఉంటే (బయట లంపటాలతో) పోవాల్సి వస్తున్నదే అనీ – దూరంగా ఉంటే నీ దగ్గరకు రావాలనీ, చింతమ్మా! రాజవీధిని నడుస్తున్నదీ – వంకర దారి వెంట పరుగెత్తుతున్నదీ రధానికేం (శరీరానికి) తెలుస్తుందమ్మా?’ మట్టిలో ఉన్నదీ – మకుటాలలో ఉన్నది వజ్రానికి తెలుస్తుందా? అమ్మా ! నేను నడిచే దోవమంచిదో చెడ్డదో నాకు తెలియదమ్మా! అందుకు సారధిగా నిన్నెంచుకున్నాను. నా వ్యక్తిత్వం నీలో కలసి రూపుమాసిపోవాలని కోరికమ్మా!” అంటాడు శేషు – నిజమే అతడికి కావలసింది సామీప్యమో – సాలోక్యమో సారూప్యమో కాదు సాయుజ్యమే.

అసలు ఎవరండి బాబూ ఈ శేషు – ఇంతగా ఘనంగా చెపుతున్నావు అనుకొనేరు. నేనేం ఇప్పటిదాకా పెద్దగా చెప్పిందేంలేదు. అతడు పలికిందే మీకందించాను. కాకపోతే ఒకటో రెండో నా వ్యాఖ్యానాలు మాత్రమే.

నిజానికి శేషు తండ్రి రాజుపాలెపు రామచంద్రరావుగారు జిల్లెళ్ళమూడికి తొలిరోజులలో అంటే లోకానికి బహిర్గతం కావటానికి అమ్మ నిర్ణయించుకొన్న 1956వ సంవత్సరంలో చీరాల నుండి వచ్చిన సోదరులలో ప్రముఖుడు. అమ్మ చెప్పిన మాటలను యధాతథంగా డైరీలో కెక్కించుకున్న ఆధ్యాత్మిక విజ్ఞాన సంపన్నుడు. పైగా ఒక ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు. గ్రంథాలయోద్యమంలో విశేష కృషి చేసిన అడుసుమల్లి శ్రీనివాసరావుగారికి అల్లుడు. అమ్మతో ఆధ్యాత్మిక సంభాషణలు చేసి అమ్మ చెప్పిన విషయాలు భద్రపరచినవారు. వారి పెద్దకుమారుడే ఈ రాజుపాలెపు వెంకటశేషగిరిరావుగా అసలు పేరున్న శేషు. మనం అంతా వేటపాలెం శేషు – రాగబంధం శేషు. శేషు అని పిలుచుకుంటున్న వాడు. వేటపాలెం సొంత ఊరు కావటం, తన ఉద్యోగ నిర్వహణ వేటపాలెంలోనే కావటం వల్ల వేటపాలెం శేషు అని పిలిచేవారు. తన ఉద్యోగ నిర్వహణ వేటపాలెంలోనే కావటంలో ఒక కథ ఉన్నది.

శేషు చిన్నతనం నుండే వివరీతంగా గ్రంథాలు చదివేవాడు. వేటపాలెంలోని సారస్వత నికేతనంలోని దాదాపు 65 వేల గ్రంథాలలో అతను చదువని గ్రంథం లేదంటే అతిశయోక్తి కాదు. పైగా వారి తాతగారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సుప్రసిద్ధమైన వేటపాలెం లైబ్రరీకి చిరకాలం కార్యదర్శిగా పనిచేయటంతో చిన్నతనం నుండే కవిత్వం పట్ల అభిరుచి వంట బట్టింది. వచన కవితలు వ్రాస్తుండేవాడు అమ్మ మీద. గేయాలు కూడా వ్రాసేవాడు. కొన్ని వచన కవితలు వ్రాసి అమ్మకు ‘గడ్డిపూలు’ అనే శీర్షికతో పంపాడు. అందుకు అమ్మ పెట్టిన పేరు ‘రాగబంధం’. అలా వ్రాసిన శేషు రచనలన్నీ ‘రాగబంధం’ పేరుతో శ్రీ కొండముది రామమూర్తిగారు అచ్చువేయించారు. ఆ గ్రంథ ఆవిష్కరణ రోజున పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఆ గ్రంథాన్ని గూర్చి ప్రసంగించారు. అమ్మ సన్నిధిలో. అందువల్ల ‘రాగబంధం శేషు’ అనే పేరు అమ్మ అనురాగబంధంతో ముడిపడి పోయింది. ఇక ‘శేషు’ అని అమ్మ ముద్దుగా పిలచేది గనుక ఆ పేరు అందరికీ అలవాటైంది.

1958లో అమ్మ వద్దకు మొదటిసారి వచ్చి అమ్మతో కారంబోర్డు – టేబిల్ టెన్నిస్, వైకుంఠపాళి ఆడిన రోజులున్నాయి. అమ్మ మంచం ప్రక్కన, మంచం క్రింద పడుకున్న మంచం బాబ్లో శేషు కూడా ఒకడు. ఆ రోజుల్లో వచ్చే కొద్ది మంచి సోదరీసోదరులతో హైమ (అమ్మ కూతురు) చాలా సన్నిహితంగా మెలిగేది. శేషును అన్నయ్యా ! అని పిలిచేది. తనకు ఆడపడుచులు లేకపోవటంతో శేషు కూడా హైమను సొంత చెల్లెలుగా చూచుకునేవాడు. అంతేకాక రవికూడా రామచంద్రరావు మాష్టారి ఆలనాపాలనలో చదువుకోవటం వల్ల వారి పిల్లలైన శేషు – కిష్టులతో బాగా సాన్నిహిత్యం ఏర్పడ్డది. ఒకసారి శేషుకు చదువుకొనే రోజులలో పరీక్షల ముందు మశూచి సోకింది భయంకరంగా. చివరికి ఉంటాడో ఉండడో అన్నంత భయం ఏర్పడగా హైమ అమ్మను “అన్నయ్యను బ్రతికించమ్మా!” అని వేడుకున్నది. అమ్మ ఆ మాటను ఆలకించింది. శేషును బ్రతికించింది. ఆ ఒక్కసారే కాదు మూడుసార్లు ప్రాణదానం చేసింది.

శేషు ఎ.యం.ఐ.యి. ఇంజనీరింగ్ విద్య చదివాడు. ఆంగ్ల భాషలో యం.ఎ. డిగ్రీ సాధించి బంగారు పతకాన్ని అందుకున్నాడు. బి. యిడి. చదివాడు. అయినా వేటపాలెం మీద సారస్వత నికేతనం మీద ఉన్న మమకారంతో (మాతామహ దంపతులకు సేవ చేసే అవకాశాన్ని వదులుకోలేక), వేటపాలెం వదలక అక్కడే ఉపాధ్యాయునిగా చేరి ఆంగ్లోపన్యాసకునిగా కాలేజిలో ఉద్యోగించారు. ఒక రకంగా అతని తెలివితేటలు విజ్ఞానాన్ని చూచి విద్యార్థులు వాకింగ్ లైబ్రరీ (నడిచే గ్రంథాలయం) అనీ వాకింగ్ ఎన్సైక్లోపీడియా (డిక్షనరీ) అనీ పరిపూర్ణ భారతీయుడనీ పిలిచేవారు. విద్యార్థులకు ఒక్క ఆంగ్లం, లెక్కలు, సైన్సులోనే కాక వివిధ రకాల ఆటలలో కూడా మంచి తర్ఫీదు నిచ్చేవాడు.

ఒకసారి అమ్మ “గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివింతర్వాత నీకే మనిపించింది నాన్నా!” అని అడిగింది. అందుకు శేషు “చదువక ముందు ఖాళీ గ్లాసు లాగా ఉన్నది, చదివిం తర్వాత చెత్తకుండి’గా తయారయింది అన్నాడు. అందుకే అమ్మ సాహిత్యంతో రాహిత్యం కాదు అన్నదనుకుంటా..

బ్రహ్మాండం సుబ్బారావు పెళ్ళిలో ఒకే తానులో నాలుగు పాంటుగుడ్డలు, నాలుగు చొక్కా గుడ్డలు తీయించి అమ్మ సుబ్బారావుకు, రవికి, శేషుకు, శేషుతమ్ముడు కిష్టుకు గుడ్డలు కుట్టించింది. అంటే ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు అనే భావన కలిగించింది.

సామాన్యంగా అమ్మ అన్నం కలిపి అన్నప్రసాదాన్ని అందరికీ చేతులలో పెట్టేది. అంతా ఒక చెయ్యిపెడితే శేషు దోసిలిపట్టి పెట్టించుకునేవాడు. ఇప్పుడెలా తింటావు? అని ప్రక్కనున్న వాళ్ళడిగితే, అమ్మ తినాల్సిందే అట్లాగ అని చెప్పింది. అంటే అమ్మ పెట్టే అన్నామృతాన్ని గాని, జ్ఞానామృతాన్ని గాని దోసిళ్ళతో జుట్టుకున్న అదృష్టవంతుడు.

ఒకసారి అమ్మ మంచం చుట్టూ సోదరులు పడుకొని ఉన్నారు. అందులో శేషు కూడా ఉన్నాడు. ఒక రాత్రివేళ శేషుకు మెళుకువ వచ్చి అమ్మ వైపు చూచాడు. అమ్మ మంచం పైన లేదు. డ్రైయిన్ వద్ద ఎంతో దూరాన ఉన్న అమ్మ ఒకటి రెండు సెకన్లలో గాలిలో తేలుతూ మంచం దాకా వచ్చి ఆలయాలు ఉన్న వైపుకు వెళ్లుతూ కనిపించింది. అమ్మ అంటుండేది అవకాశం ఉన్నప్పుడే వచ్చిపోతూ ఉండండి. లేకపోతే ఏడవ మైలు దగ్గర నుండే నమస్కారం పెట్టుకొని. పోవాల్సి వస్తుందేమో! అని. ఒక రకంగా శేషు అదృష్టవంతుడు. అమ్మ మంచం బాబ్లో చేరిన కొద్దిమందిలో ఒకడు. అమ్మ ఎన్ని అనుభూతులు ప్రసాదించిందో! అమ్మ ప్రేమకు నిండుగా నోచుకున్నాడు. ఎన్ని దర్శనాలు ఎన్ని నిదర్శనాలు హృదయంలో నింపుకున్నాడో! లోకంలో అందరిలా బయటకు చూడటమే గాక అంతర్నేత్రంతో లోపలికి చూచుకొనే తత్త్వాన్ని అలవరచుకున్నాడు. అమ్మవారు ‘అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ కదా! సహజ సిద్ధంగా మొహమాటస్థుడు, బిడియపడే స్వభావం కల శేషు ఎవరో కొద్దిమంది రవిలాంటి సన్నిహితులతో తప్ప కలివిడిగా ఉండేవాడు కాడు. అందుకే అమ్మతో హైమతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. అలాగే సర్వచైతన్యమూర్తి అయిన అమ్మతో చనువుగా

పరశు స్పర్శతో బంగారమైన ఇనుముకు తుప్పుపట్టదు గదమ్మా!

 నీపాదస్పర్శతో పునీతమైనా ససుకుంటున్నా – నాకెందుకుంటుందమ్మా

గర్వపు తుప్పు నాకేం కావాలి ? కామధేనువు పాలా? పారిజాతపు పూలా?

నిధి నిక్షేపాలా ? పరశువేదా? ఏది కావాలి? 

నువ్వు కావాలి – నువ్వుంటే అన్నీఉన్నట్లే –

“జీవం తొణికిసలాడే నీ ముందు –

నిర్జీవము నిస్తేజము అయిన నన్ను నేను సమర్పించుకుంటున్నాను.

 ఓరి వెధవా ! ఇదా నీ తమాషా ! అని కోప్పడబోకేం

నా జీవన మావి ఫలాన్ని (మామిడిపండు) అందరూ పెట్టినట్లు 

గిల్లి నైవేద్యం పెట్టడం లేదు. 

నేను మామిడిపండురసాన్ని – నీకు నన్నే నైవేద్యంగా ఇస్తున్నాను.

కస్తూరి నుంచి వాసననూ వజ్రం నుండి మెరుపునూ ఎవరూ తీసివేయలేనట్లే

నా నుంచి నిన్నూ – నీ నుంచినన్నూ ఎవరమ్మా వేరు చేయగలిగేది? 

నిప్పులో ఉంచాక గానుగకబ్జా – చందన కాష్టమూ కూడా 

తమ తమ ప్రత్యేకతలు కోల్పోయినట్లే 

సముద్రంలో కలిసిన ఉప్పు తన రూపం కోల్పోయినట్లే 

మురికినీటి కాల్వలూ గంగలో కలసి తమ స్వరూపం కోల్పోయినట్లే,

నీ పాదాల ముందు సురిగిపోయి – నీలో ఒరిగిపోయి

నన్ను నీలో పోగొట్టుకోనీయవా ! అమ్మా!” అని సర్వ సమర్పణం చేసుకున్నాడు.

అదృష్టవశాత్తూ ఇంటికి వచ్చిన వారిని ఆత్మీయతతో ఆదరించి, పెట్టిపోతల విషయంలో చెప్పకుండానే భర్త భావం గ్రహించి ఆదరించే గృహిణిగా అనుకూలవతి అయిన భార్య పద్మ, తండ్రి ఆరోగ్యం కోసం లక్షలు కోట్లయినా ఖర్చు చేయటానికి సిద్దపడ్డ యోగ్యులైన కుమారులు రాహుల్, కిరణ్ ను శేషు పొందగలగటం అమ్మ అనుగ్రహానికి సజీవ నిదర్శనం. 1942 నవంబరులో పుట్టిన శేషు 72 ఏళ్ళ వయస్సులో 7.6.2015న అమ్మలో లీనమైనాడు. అందరికీ సుగతిని ప్రసాదించే అమ్మ శేషుకు సాయుజ్యాన్నే ప్రసాదిస్తుందనటంలో సందేహం లేదు. నిజంగా శేషు ఆదర్శవంతుడైన ధన్యజీవి.

(శేషు రెండవ వర్ధంతి 14.6.2017ని పునస్కరించుకుని)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!