నర్సాపురంలో డాక్టరుగా వైద్య వృత్తి చేసే ఆచంట కేశవరావు గారు అన్నపూర్ణ దంపతులు 1970 లో మొదటి సారిగా అమ్మ వద్దకు వచ్చారు. అమ్మలోని పది మంది కావాలనుకొనే మనస్తత్వం, పది మందికి కడుపునిండా పెట్టుకోవాలనే తపన, పసిపిల్లల మాదిరిగా పిన్నల నుండి పెద్దల దాకా అందరినీ ఒడిలోనికి తీసుకుని ఆనందాన్నీ, ప్రేమనూ పంచి పెట్టే వ్యక్తిత్వం మమకారం ఆదరణ వారి మనస్సులపై గాఢంగా నాటుకున్నాయి. అమ్మను దర్శించక ముందే “మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు” చదివి ముగ్ధులైనారు. డాక్టరుగారు శ్రీరామ శ్రీ నవమి నాడు పుట్టారు. వారి పుట్టిన రోజునాడు అమ్మను శ్రీరామునిగా భావించి ప్రతి సంవత్సరం పూజించుకుంటుండేవారు.
నదీరా ఒక గేయంలో “ఎందరురానీ – ఎప్పుడు కానీ – ముందుగ విందును చేయును జనని, అది ఒక యాగం అది ఒక యోగం – ప్రేమ ప్రయోగం” అంటూ అమ్మ పెట్టేది పదార్థం కాదు పరమార్ధం అంటారు. ఆ పరమాన్నాన్ని, పరమార్థాన్ని కూడా అమ్మ చేతులమీదుగా తిన్న మహనీయులు వారు. అమ్మను మొదటి సారి చూచినప్పుడే అమ్మతో ‘అభయహస్తంలో ఉన్న నీ ఛాయాచిత్రం తీసుకుంటానమ్మా’ అని అడిగారు. “అభయం అంటే ఫోటో కాదుగా నాన్నా” అన్నది అమ్మ. అమ్మ తన మమతల గర్భగుడిలోకి తీసుకొని అభయ ప్రదానం చేసింది. ఆ సమయం వచ్చినప్పుడు డాక్టర్ గారిని జలగండం నుండి, అన్నపూర్ణమ్మగారిని జ్వరగండం నుండి కాపాడింది.
అన్నపూర్ణమ్మగారు తనకున్నంతలో కలో గంజో వచ్చినవారికి ఆదరంగా పెట్టుతూ ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులకు భోజనాలు పెట్టుతూ తనకు బిడ్డలు లేకపోయినా వారే తన బిడ్డలుగా భావించి ప్రేమ ఆదరణలతో విలసిల్లేది. జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయానికి బస్తాలకొద్ది ఉసిరికాయలు, చింతకాయలు పంపేవారు, విద్యార్థులకు నూతన వస్త్రాలు కుట్టించేది. దీపావళి పండుగకు బాణాసంచా కొని పిల్లలు కాలుస్తుంటే సంతోషించేవారు. అమ్మనుండి నేర్చుకున్న ఎన్నోవిషయాలు అమలులో పెట్టేవారు. ఆశ్చర్యమేమిటంటే డాక్టరుగారు శ్రీరామనవమి నాడు పుట్టితే అన్నపూర్ణమ్మగారు వినాయక చవితినాడు పుట్టింది. ఇద్దరూ దేవతలు ఉద్భవించిన రోజున దేవతల అనుగ్రహంతో పుట్టి మాతృమూర్తి ఒడిలోకి చేరటం ఆశ్చర్యకరం అని మనకనిపించినా ఆ జీవులకు సహజం. తన పరివారాన్ని తనతో తెచ్చుకుంటారు కదా అవతార పురుషులు.!
జిల్లెళ్ళమూడిలో వేద విద్యాలయం ఉండాలని, ఆదరణాలయం ఏర్పడాలని రెండింటికి లక్షరూపాయిల చొప్పున సమర్పించారు. ఆదరణాలయాన్ని అమ్మచేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించారు. దేవుడు డాక్టర్గా పేరు తెచ్చుకున్న డాక్టరు గారు వారి కన్సల్టేషన్ ఫీజు వారు ప్రాక్టీసు మొదలుపెట్టిన రోజులలో ఒకరూపాయి తీసుకునేవారు. చివరి వరకు సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఆ రూపాయిని ఎన్నడూ పెంచలేదు. జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ మెడికల్ సెంటర్ ఏర్పాటుకు కృషిచేశారు.
అమ్మ స్వర్ణోత్సవాల నిర్వహణ మహాద్భుత ఘట్టం. ఆ సమయంలో డాక్టర్ కేశవరావుగారు పాలకొల్లు గోపి (ఆడిటర్ కాశీనాధుని రాజ గోపాలకృష్ణమూర్తి) గారితో కలసి, పన్నాల రాధాకృష్ణశర్మని తోడు చేసుకొని 40 కేంద్రాలలో అమ్మ అవతార విశిష్టతను చెపుతూ ఊరూరూ తిరిగారు. ధనరూపేణా, వస్తురూపేణా సేకరించటమే కాక ఎంతో మంది వ్యక్తులను అమ్మ సేవాకార్యక్రమాలకు ఉద్యుక్తులను చేశారు. అమ్మ వత్రోత్సవాలలో సైతం శారీరక శక్తి లేక తిరుగులేకపోయినా తన వంతు సేవాసహకారాలను అందించారు. వందలమందికి అమ్మదర్శన భాగ్యం కలిగించారు.
అమ్మ సన్నిధిలో డాక్టరుగారు తన షష్టిపూర్తి ఉత్సవం వైభవంగా జరుపుకున్నారు. అమ్మను శ్రీరామునిగా దర్శించి భువన విజయం వంటి సాహిత్యరూపకాన్ని ఏర్పాటు చేసి ఎందరికో ఆనందాన్ని చేకూర్చారు. కరుణశ్రీ పాపయ్య శాస్త్రి, జమ్ములమడక మాధవ శర్మ, డాక్టర్ ప్రసాదరాయ కులపతి, కోగంటి సీతారామాచార్యులు వంటి ఉద్దండ కవిపండితులను పిలిపించారు. వసుంధర అక్కయ్యను, కొండముది రామకృష్ణ అన్నయ్యను, కొండముది గోపాలకృష్ణమూర్తి గారిని, శేషయ్యగారిని, భాగ్యమ్మగారిని పట్టుబట్టలతో సత్కరించారు.
అమ్మ లక్షమందికి ఒకే పంక్తిని భోజనం పెట్టి, కోటిమందికి దర్శనం ప్రసాదించాలనే ఉద్దేశ్యంలో లోక సందర్శనం చేసినపుడు నర్సాపురం డాక్టరు కేశవరావుగారింటికి కూడ వెళ్ళింది. తమ హాస్పిటల్లో తన కుర్చీలో అమ్మను కూర్చోబెట్టి స్టెతస్కోపు ఇచ్చి నన్ను పరీక్ష చేయమ్మా! అని అడిగారు. నేను రావటమే నీకు పరీక్ష అన్నది అమ్మ. లాంచీలపై అమ్మను కొన్ని వందల మంది వెంటరాగా గోదావరిపై తీసుకెళ్ళారు. అది ఒక విహారయాత్రగా కాక జ్ఞానయాత్రగా అంతర్వేది అంతరాత్మ వేదిగా సాగింది. అమ్మ తమ ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్తుండగా చీరె, సారె, పసుపు, కుంకుమ, చలిమిడితోపాటు తమ అమ్మలాంటి వ్యక్తి తమను వదిలి వెళుతున్నదనే వేదనాశ్రువులతో సాగనంపారు.
జిల్లెళ్ళమూడి నుండి ఎవరు ఏరకమైన సాయానికి వచ్చినా వైద్యం గానివ్వండి మరొక రకం పని కానివ్వండి అందరినీ ఆదరంగా చూచి వారి వారికి తగురీతిలో చేతనైన సాయం చేసి పంపేవారు.
ఎ.వి.ఆర్ సుబ్రహ్మణ్యం వ్రాసిన మహాప్రవక్త అమ్మ, హైమవతీ వ్రతకల్పం ముద్రణ చేశారు. కొండముది రామకృష్ణ అన్నయ్య వ్రాసిన అమ్మ సినిమా వ్యాఖ్యానాన్ని చూచి మురిసిపోయి గ్రంథంగా ముద్రించారు.
అన్నపూర్ణమ్మగారు కూడా సతీధర్మాన్ని పాటిస్తూ అరవై సంవత్సరాలు దాంపత్యధర్మాన్ని ఆచరించి భర్తకు ఏ లోటూ రాకుండ కడవరకూ స్వయంగా పరిచర్యలు చేసి, అంతిమ వీడ్కోలు పలికి, తర్వాతనే తను డాక్టర్ గారిని అనుసరించి పతివ్రతగా ప్రతీ గమనం చేసి నిలిచింది.
ఒక సోదరి అమ్మతో అమ్మా! చిదంబరరావు తాతగారు. ఇప్పుడెక్కడున్నారమ్మా? అని అడిగితే ఎక్కడుంటారు ఈ బొజ్జలోనే అని తన బొజ్జను చూపించింది. ఆదర్శ దంపతులు, అమ్మ అనుంగుబిడ్డలు అమ్మనామంతో నలుగురికీ తలలోని నాలుకగా మెలిగిన డాక్టర్ కేశవరావుగారు, అన్నపూర్ణమ్మగారు ఇప్పుడెక్కడున్నారంటే అమ్మ బొజ్జులో శాశ్వతంగా ఉంటారు వారు ధన్యజీవులు.