(ఆచార్య లంక శివరామకృష్ణ శాస్త్రి)
“అరుణోదయం చూస్తే కవి గుండె పులకరిస్తుంది. శరచ్చంద్రిక చూస్తే కవి హృదయం పరవ శిస్తుంది. హిమాలయం చూస్తే కవి. మనస్సు పరవళ్ళు తొక్కుతుంది. ఉత్తుంగ తరంగితమైన సముద్రాన్ని చూస్తే కవిగుండె లాస్యం చేస్తుంది. కోకిల కూజితం వింటే కవి మనస్సులో వీణలు పలుకుతాయి. లతానికుంజం చూస్తే కవి హృదయం శతపత్రమౌతుంది. పసిబిడ్డకు పాలుపడుతున్న తన్మయం చెందే మాతృమూర్తి నయనయుగళిలో భాసించే కమనీయ దీప్తి కవిని ఉత్తేజ పరుస్తుంది. బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ, లాలిస్తూ ఆనందడోలికలలో ఊయలలూగే తల్లి మనసును చూసిన కవిలో రసోద్దీపనం కలుగుతుంది”. ఈ మాటలు అన్నది సత్యం, శివం, సుందరం అయి సర్వమూ తానయిన శక్తి, రక్తమాంసాలతో, కరచరణాలతో మానవాకృతి ధరించి మాతృమూర్తియై జిల్లెళ్ళమూడిలోని అమ్మను చూచి పరవశించిన హృదయంతో ఆచార్య లంక శివరామకృష్ణ శాస్త్రి గారు. ఎల్. శివ రామకృష్ణ
ఆయన జిల్లెళ్ళమూడి రావటం కూడా ఒక విచిత్ర, విశిష్ట సన్నివేశమే. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న శాస్త్రిగారు ఆ విశ్వవిద్యాలయ పనిపై బాపట్ల వచ్చారు. అంతకుముందే అమ్మను గూర్చి విని ఉండడం వల్ల పోనీ జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను చూచి రావచ్చు గదా! రాత్రి పూట బాపట్లలో ఉండి చేసే పనేముంది అనుకొని బస్టాండ్ చేరి జిల్లెళ్ళమూడి ఎలా వెళ్ళాలో వాకబు చేస్తున్నారు. ఆ సమయంలో రామకృష్ణన్నయ్య కనిపించి జిల్లెళ్ళమూడి తీసుకొని వెళ్ళాడు. అమ్మను దర్శనం చేయించాడు. ఆ రాత్రి అమ్మ స్వయంగా శాస్త్రిగారికి అన్నం తెప్పించి ముద్దలు కలిపి పెట్టింది. మొదటిసారి దర్శనంలోనే ఎంత అదృష్టానికి నోచుకున్నారో అమ్మ చేతిముద్దలు తిని ఆ ప్రేమలో పరవశించి పసిపిల్లవాడై అమ్మ ఒడిలో వాలిపోయారు. అంతేకాదు ఆ రాత్రి ఎంతో సన్నిహితులైన సేవకులకుగాని దొరకని అమ్మ మంచం ప్రక్కనే పడుకునే అదృష్టం కూడా పట్టింది. రాత్రి ఎంతో ప్రొద్దుపోయేదాకా అమ్మతో లౌకిక, అలౌకిక, కళాసంబంధమైన అంశాలెన్నొ సంభాషిస్తూ తెల్లవారు ఝామున నిద్రపోయారు. ఆ సంభాషణ ద్వారా శాస్త్రిగారిలోని ఆధ్యాత్మిక దృక్పథానికీ, లౌకిక ప్రజ్ఞాపాటవాలకూ, కళావైదుష్యానికి క్రొత్త వెలుగులు ప్రసరించినట్లయింది.
వారిని అమ్మ ఆశయాలు, భావాలు, అమ్మ ఆశ్రమంలోని కార్యక్రమాలు ఎంతో ఆకర్షించాయి, ప్రభావితం చేశాయి. అమ్మ మాటలలో మార్దవము, తార్కిక ప్రజ్ఞ, సవరణలు అవసరం లేని వివరణలు, శేముషీవైభవం, మానవతా సమ్మిళితమైన మాధవత్వ లక్షణాలు మంత్రముగ్ధుణ్ణి చేశాయి. ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్య శేఖరులైన శ్రీశాస్త్రిగారు, ఎంతో మంది పోష్టుగ్రాడ్యుయేటు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే శాస్త్రిగారు, ఎంతోమంది పరిశోధకులకు మార్గదర్శనం చేయగల్గిన శాస్త్రిగారు అమ్మవద్ద పసిపిల్లవానివలె అయిపోయి, ఒక మనీషిగా లోకంలో ప్రసిద్ధులైనా మాధవత్వ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకొని అమ్మకు తలవంచారు.
1938 జులై 15న మచిలీపట్నంలో వెంకట కామేశ్వరరావు – సరస్వతులకు పుట్టిన శాస్త్రిగారు అక్కడే పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య దాకా అభ్యసించారు. 1958లో విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో బి.ఎ., ఆనర్స్ డిగ్రీలో విశ్వవిద్యాలయ ప్రధములుగా వచ్చారు. 1960లో M.A. డిగ్రీ తీసికొని విశ్వవిద్యాలయంలోనే అధ్యాపకునిగా చేరారు. ఆ తర్వాత పరిశోధన చేసి పి.హెచ్.డి. డిగ్రీ సాధించి రీడర్గా, ప్రొఫెసర్గా అభివృద్ధి పథంలో సాగారు. ఆంగ్లంలో ప్రామాణికమైన ఎన్నో గ్రంథాలు రచించడమే గాక భారతీయ విశ్వవిద్యాలయాలలో ఆంగ్లభాషగా అధ్యాపకత్వ అధ్యయనాల లోతుపాతుల మీద యాభైకి పైగా ప్రామాణిక వ్యాసాలు వ్రాశారు. షుమారుగా 20 తెలుగు కథలను ఆంగ్లంలోకి అనువదించారు.
వారు ఆంగ్లభాషాచార్యులుగా మాత్రమే కాక ఆంగ్లంలో తెలుగులో కూడా ఛందోబద్ధమైన కవితలు వ్రాయటం చూచి ఆశ్చర్యపోయాను. అమ్మకు 1983లో వబ్రోత్సవాల సందర్భంగా వారి ప్రధాన సంపాదకత్వంలో అక్షరాంజలి కవితా సంకలనం ఆవిష్కరింపబడింది. విశాఖ మాతృశ్రీ అధ్యయన పరిషత్వారు ఆ బాధ్యతను కృష్ణశాస్త్రిగారి భుజస్కంధాలపై పెట్టారు. వారు ఆపనిని సమర్ధవంతంగా నిర్వహించారు.
వారు ఆ సంకలనానికి ముందుమాట వ్రాస్తూ “కాలాతీతశక్తి కాలబద్ధమైనవ్యక్తిగా దిగి రావటమే అవతార లక్షణం. ఈ దిగిరావటం మానవకోటిని తరింప చేయటానికే” అన్నారు. అమ్మ “వర్గంలేనిది స్వర్గం అంటారు. ఈ స్వర్గం మనకు జిల్లెళ్ళమూడిలో ఎదురవుతుంది. ఎవరినోట విన్నా అన్నయ్యా ! అక్కయ్యా! అన్న సాదరమైన పిలుపే. ఆధ్యాత్మికంగా దైనందిన జీవితానికి వ్యత్యాసమూ వైరుధ్యమూ లేదనటానికి జిల్లెళ్ళమూడి సమాజం ఒక ఉజ్జ్వల నిదర్శనం. ఇటువంటి సమాజం వాడవాడలా నెలకొన్నవాడు మరి కావల్సిందే ముంది? అదే అమ్మ మనముందుంచిన ఆదర్శం అంటారు శాస్త్రిగారు.
ఎవరో జ్యోతిష్కుడు అమ్మను ప్రశ్నవెయ్యమంటే “ప్రపంచం మొత్తమ్మీద ఆకలి తీరకుండా ఒక్కరూ కూడా బాధపడని స్థితి ఎప్పటికైనా వస్తుందా నాన్నా!” అని అడిగిందట. మరొక సందర్భంలో “మనకు వలెనే పశుపక్ష్యాదులకు కూడా తిండి విషయంలో ఏదో ఒక ఏర్పాటు ఉంటే ఎంత బాగుంటుంది నాన్నా! వాటికీ వెతుకులాట తప్పుతుంది” అన్నది. అమ్మ విశ్వజననీత్వానికి ఇంతకన్నా ఏంకావాలి? ఇటువంటి ఉదాహరణలెన్నో! అంటూ అమ్మలోని మానవతా పరాకాష్ఠనూ, మాధవత్వ లక్షణాలను తెలుసుకొని శాస్త్రిగారు వివశులైనారు.
అమ్మలోని తాత్విక చింతనను అధ్యయనం చేసి దాని సారాన్ని పిండి. అందించటానికి కూడా ప్రయత్నించారు. ఒకసారి అమ్మ “బాబూ ! నీవు కావాలని అనుకున్నవి, వద్దని అనుకున్నవి అన్నీ నీ పాత్రలో వేస్తున్నా! అవన్నీ నీవు స్వీకరించాల్సిందే. సంతోషం కలిగించినా, దుఃఖం కలిగించినా ఆ అనుభవాలన్నీ నా వరాలని ఆనందంతో అనుభవించు. గెలిచినా ఓడినా పొంగవద్దు, క్రుంగవద్దు. ఎందుకంటే నేనే అనుభవాలన్నీ ఇచ్చా” అన్నదిట. కాని ఆచరణలో పెట్టటం ఎంతకష్టం అనుకుంటారు శాస్త్రిగారు. తానే ఇచ్చానని ధృవీకరించి నప్పుడు అంగీకరించితీరాల్సిందేకదా ! అమ్మ ప్రసాదిస్తే కాదనగలమా ? ఆ అవకాశం, ఆ ధైర్యం ఉన్నదా ?
అమ్మ మరోసారి ఇంకో సూక్ష్మం చెప్పింది. “నేనే అన్ని సమయాలలోనూ ప్రతిదీ మీకు ఇస్తున్నాను” అన్నది. మనం కోరేవన్నీ ఇస్తున్నదా ? అని విచికిత్స చేసి శాస్త్రిగారు మనం కోరినవి కాదు మనకు కావలసినవి ఇస్తుంది. మనకంటే మనకేం కావాలో అమ్మకే బాగా తెలుసు. మనం ఎంత ఎదిగినా అమ్మ ఒడిలో ఒదిగి ఉన్న బిడ్డలమే అన్న స్పృహ స్థిరంగా ఉన్నప్పుడు ‘అడక్కుండానే అన్నీ ఇచ్చే వ్యక్తే అమ్మ’ అన్న వాస్తవాన్ని సరిగా జీర్ణించుకుంటాం అంటారు శాస్త్రిగారు. ఎంత నిశితమైన పరిశీలన చేసి నిగ్గు తేల్చారో విషయాన్ని గమనించండి.
ప్రతిమానవుడూ, సుఖం కోరుకుంటాడు, ఇంకొంచెం ముందుకు పోయి ఆనందంకావాలని కోరుకుంటాడు. శాస్త్రిగారు యీ విషయంలో అమ్మ ఏమి చెప్పిందో చూశారు. “ఆనందమంటే దుఃఖము, సంతోషము రెండింటికీ సంబంధించినది. ఆ రెండింటి కలయికే – దుఃఖంకాని, సంతోషం కాని వద్దని ప్రయత్నం చేయక ఏది వచ్చినా స్వీకరించి అనుభవించే స్థితియే ఆనందం” అన్నది అమ్మ. పైగా ఈ రెండింటికి మూలం ‘తానే’ అని చెప్పి ఏ వెంపర్లాటలు, శాస్త్రజ్ఞానాల గందరగోళాలు లేకుండా వాటిని అంగీకరించటం తేలిక చేసింది. అమ్మ అంటారు శాస్త్రిగారు.
దుష్కర్మలకు, సత్కర్మలకు రెండింటికీ కర్తవైన తల్లివి కదా ! మానవులు దుష్కర్మలు చేయకుండా బిడ్డల మనస్సు మార్చి సన్మార్గంలో పెట్టవచ్చు గదా! అని ప్రశ్నిస్తే అమ్మ ! “నాకు దుష్కర్మ కనబడితేగా” అని అన్నదిట. ఈ సమాధానం విని శాస్త్రిగారు ఎంత చలించిపోయారో ! ఎంత కలవరపడ్డారో ! మాకు కనిపిస్తున్నవి కదమ్మా! మీరు మా మనస్సులు త్రిప్పి అన్నీ సత్కర్మలే చేయిస్తే జగత్తులో సంక్షోభం తప్పుతుంది కదా ! అంటే – అమ్మ కాదనకుండా అవసరమైనప్పుడు త్రిప్పుతాను అని చెప్పిందిట. ఇలాంటి విషయాలు శాస్త్రిగారు ఎంత వివేకవంతమైన జిజ్ఞాస చేశారో చూస్తే మన తత్వచింతన సదస్సులలో వారంటే ఎంత బాగుండేది అనిపించింది.
శాస్త్రిగారు ఆంగ్లంలోనే కాక తెలుగులో కూడా కవిత్వం వ్రాశారు అని చెప్పాను.
ఆంగ్లంలో అమ్మను గూర్చి వ్రాస్తూ
“Thy smile the flow of Grace
Thy sight is life’s accumulated virtue
Thy glance the gift of peace
Thy love is boundless, barrierless, humanity’s
Wondrous Teacher art Thou!
Thy Lotus Feet are O’r haven, takes us into Thy fold here and now” అంటారు.
“తలచినంతనే శాపాలు తొలగిపోవు
కాంచినంతనే పాపాలు కరిగిపోవు
పదములంటిన జీవన పథము మారు
చూపు కలిసిన యంత ‘లోచూపు’ కలుగు
స్పర్శనమ్మున విడు బంధపటల మెల్ల
భాషణమ్మున ఆనందపరవశమ్ము
ముజ్జగముల ‘తొల్లి’ జిల్లెళ్ళమూడి తల్లి” అన్న తేటగీతిని చదివితే తెలుగు కవిత్వంలో వారికున్న పట్టు అర్ధమౌతుంది.
“సింగరాజు గారి చెలిమియు బలిమియు
గంగమాంబ వల్ల గణుతికెక్కి
గంగమాంబ గనుక గయ్యాళియైనచో
సింగరాజు ఏమి చేయగలడు” అని ఒక చాటువు ఉన్నది. అలాగే శ్రీశాస్త్రి గారి భార్య శ్రీ లలితగారు అనుకూలవతియైన భార్యగా, “షట్కర్మయుక్తో కులధర్మపత్నీ” అన్నట్లుగా సేవలు చేసినందువల్లనే శాస్త్రిగారు చక్కని గృహస్థుగా పేరుప్రతిష్ఠలు అందుకోగలిగారు. శాస్త్రిగారు తన సంతానాన్ని కూడా ఆదర్శభారతీయ పౌరులుగా తీర్చిదిద్దారు. శ్రీ యల్వీ సుబ్రహ్మణ్యంగారు ఐ.ఏ.యస్. ఆఫీసరై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక శాఖకు ప్రధాన కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పేరు ప్రతిష్ఠలు సాధించారు. అలాగే రెండవ కుమారుడు శ్రీ నందకిషోర్, కుమార్తె లక్ష్మీప్రభ తల్లిదండ్రుల పేరు పెంచే బిడ్డలుగా తమ కర్తవ్య నిర్వహణ చేస్తున్నారు.
శ్రీ శాస్త్రిగారు సంగీత సాహిత్యరంగాలలోనే కాక ఆధ్యాత్మిక రంగంలోనూ అనన్యసామాన్యమైన కృషి చేశారు. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, దక్కన్ క్రానికల్ వంటి పత్రికలకు సాంస్కృతిక విలేఖరిగా ఆయారంగాలకు సేవచేసి భారతీయ సంస్కృతిని పరిపుష్టం చేశారు.
తృప్త జీవనుడైన శాస్త్రిగారిని 1994లో అమ్మ తనవద్దకు అకస్మాత్తుగా పిలిపించుకుంది. మాతృలోకంలో మరో “అక్షరాంజలి”కి సంపాదకత్వం వహించాల్సిన అవసరమొచ్చిందేమో ! ఏమో ఏమైనా కృష్ణశాస్త్రిగారు అమ్మకు నచ్చిన, అమ్మ మెచ్చిన ధన్యజీవి.