అమ్మ వద్దకు వచ్చేవారిలో ఎవరెవరి ఆరాధన, సమర్పణ ఎలాంటిదో తెలుసుకోవటం కష్టం. అందరూ అమ్మతో ఎవరికి వాళ్ళు తామే సన్నిహితులము అనే మనసులో భావిస్తుంటారు. దాని కారణం అమ్మలో నిక్షిప్తమై ఉన్న వాత్సల్యము, ప్రేమామృతము, సర్వవ్యాపకమైన అంతర్యామిత్వము, విచక్షణ లేని వీక్షణ.
సోదరుడు ఆలపాటి పూర్ణచంద్రరావును 1964లోనే జిల్లెళ్ళమూడిలో నేను మొదటిసారి చూచాను. ఖద్దరు చొక్కా, ఖద్దరు ధోవతి, తలపైన నల్లటి టోపీ, ఒక బంగారపు పన్ను ముఖంపై చిరునవ్వుతో ఉండేవారు. గుంటూరు నుండి పోలిసెట్టి కుమారస్వామి, దోరెడ్ల చలపతిరావు, దింటుకుర్తి సుబ్బారావు, దెందుకూరి శ్రీనివాసరావు (తంగిరాల కేశవశర్మ బావమరిది) వంటి వారితో కలిసి వస్తూండేవారు. అమ్మ పట్ల అచంచలమైన భక్తి, ప్రపత్తి.
గుంటూరు జిల్లా, కొల్లిపరలో కనకరత్నమ్మ – వీరరాఘవయ్య దంపతులకు 5.8.1923న జన్మించారు. వీరే ఇంటికి పెద్ద కొడుకు. వీరికి నలుగురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. సహజంగా వైశ్యకులానికి చెందినవారు కావటం, 7వ తరగతి దాకా చదువుకొని తండ్రిగారు తెనాలిలో నిర్వహించే కిరాణాషాపులో పనిచేయటం ప్రారంభించారు. యుక్తవయసురాగానే సుగుణ లలితాంబతో వివాహం జరిపించారు. జగదీశ్వరి అనే కుమార్తె, మధుసూదనరావు అనే కుమారుడు కలిగారు.
తెనాలిలో కిరాణాషాపు మీద వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. పూర్ణచంద్రరావుగారు తండ్రితో చెప్పి తాను మరొక వ్యాపారం చేస్తానన్నారు. పెద్దకొడుకును దూరంగా ఉంచటానికి తండ్రి ఇష్టపడలేదు. కాని తండ్రికి నచ్చచెప్పి గుంటూరు వచ్చి ఒక నూనె ఫ్యాక్టరీలో భాగస్తునిగా చేరడం దురదృష్టవశాత్తు ఆ ఫ్యాక్టరీ తగలబడటంతో పెట్టుబడి పోగొట్టుకొని నష్టపోయాడు, అప్పుల పాలయ్యాడు. దిక్కులేని వారికి దేవుడే దిక్కని తలచి మిత్రుల సలహాతో అమ్మవద్దకు చేరాడు. తన నిస్సహాయస్థితిని చెప్పి తల్లిదండ్రుల వద్దకు కూడా వెళ్ళలేనని చెప్పాడు. అమ్మ దానికి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులను చూచి వారికి కష్టసుఖాలు చెప్పి, వారి ఆశీస్సులు తీసుకొని అప్పుడురా నావద్దకు అన్నది. అమ్మ చెప్పినట్లు చేసి తిరిగి జిల్లెళ్ళమూడి చేరారు అమ్మ సన్నిధికి. అమ్మకు చెప్పి 1964లో ‘ఓం అమ్మ’ అనే పేరుతో నూనె వ్యాపారము మొదలు పెట్టారు.
ఇంతలో ఒక విచిత్రం జరిగింది. పూర్ణచంద్రరావుగారింట్లో బల్లపై అమ్మ ఫొటో పెట్టి రోజూ అగరువత్తులు వెలిగిస్తుండేవారు. అలా అగరవత్తులు వెలిగించే ఆ స్టాండ్ వెండిది. ఆ స్టాండ్ను దానితో టేబులుపై ఉన్న చేతిగడియారాన్ని ఎవరో దొంగిలించారు. అమ్మ ఫోటోను భార్యతీసి అలమరాలో పెట్టింది. పూర్ణచంద్రరావు బజారునుండి వచ్చి చూచి భార్యను మందలించి మరల అమ్మ ఫోటోను బల్లపై పెట్టి పోలీసులకు రిపోర్టుచేశారు. అమ్మకు ఈ విషయం తెలియపరిచారు. ఆశ్చర్యంగా ఆ వెండిస్టాండ్, గడియారము వారంరోజులలోగానే పోలీసువారు దొంగను పట్టుకొని ఇవ్వటం జరిగింది. దాంతో వారి భార్యకు కూడ అమ్మ మీద విశ్వాసం ఏర్పడింది. పూజామందిరంలో అమ్మ ఫోటో పెట్టి పూజించేవారు భార్యాభర్తలు.
పూర్ణచంద్రరావు గారు తన ఖాతా పుస్తకాలలో ఆవర్జాలో ప్రతి పేజీ మీద ‘ఓం’అమ్మ’ అని వ్రాసేవారు. తనకు వచ్చే లాభాలలో కొంతశాతం జిల్లెళ్ళమూడిలో జరిగే అన్నదానానికి, సేవాకార్యక్రమాలకు సమర్పించేవారు. ప్రతి ధనుర్మానంలో అమ్మ పూజ చేసి ప్రసాదాలు అందరికీ పంచిపెట్టుతుండేవారు. పూర్ణచంద్రరావుగారు అమ్మ కోటి వ్రాస్తే, భార్య లలితాంబగారు శ్రీరామకోటి వ్రాసేవారు. ఏ నామమైనా తన నామమే అని చెప్పే అమ్మ భార్యాభర్తలను అనుగ్రహించింది. శ్రీపూర్ణచంద్రరావుగారు ఎన్నడూ ఏ సినిమా చూచి ఎరుగరు. ఒకసారి ఇంట్లో కుటుంబం అంతా ఆశ్చర్యపోయేటట్లుగా సినిమా టిక్కెట్లు కొనుక్కొని వచ్చారు. అది అమ్మ సినిమా తల్లిదండ్రులతో కలసి సినిమా చూడాలనే పిల్లల కోరిక ఆ రకంగా అమ్మ తీర్చింది. కుటుంబం అంతా సంతోషించింది.
ఒకరోజు పూర్ణచంద్రరావుగారు అర్థరాత్రి 12 గంటలకు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మగది తలుపుతట్టాడు. గోపాలన్నయ్య లోపల ఉన్నాడు. తలుపుతీయలేదు. మళ్ళీ తట్టాడు. అప్పుడు గోపాలన్నయ్య వచ్చి తలుపు తీసి ఇప్పుడు అమ్మ నిద్దర పోతున్నారు, అమ్మను చూడటానికి ప్రొద్దుననే రండి అన్నాడు. పూర్ణచంద్రరావుగారు మరేం మాట్లాడకుండా వెనక్కు వెళ్ళిపోయారు. కొంతసేపటికి అమ్మ లేచి గోపాలన్నయ్యతో నాన్నా! ఎవరన్నా వచ్చారా నన్ను చూడటానికి అని అడిగింది. అవునమ్మా! ఆలపాటి పూర్ణచంద్రరావుగారు వచ్చారు. ఇప్పుడు కాదు రేపు ప్రొద్దుననే రమ్మని చెప్పాను అన్నాడు. అమ్మ వాడ్ని పిలుచుకుని రా! అని చెప్పింది. గోపాలన్నయ్య ఎక్కడని వెతకాలి? అప్పుడే కొత్తగా అందరింటికి శ్లాబ్ వేయటానికి నిట్లాడుల కట్టి ఉన్నారు 10 భాగాలకు. గోపాలన్నయ్య ఏడుస్తూ అక్కడ కూర్చుని ఉన్న పూర్ణచంద్రరావు గారితో అమ్మ రమ్మన్నదండీ! అని చెప్పి అమ్మ వద్దకు తీసుకొని వెళ్ళాడు. అమ్మను చూచాడు. అమ్మకు నమస్కరించాడు. అమ్మ మాట్లాడలేదు. పూర్ణచంద్రరావు మాట్లాడలేదు. మళ్ళీ నమస్కరించి వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళాడో ఆ అర్థరాత్రి? ఎందుకు వచ్చాడో! ఎందుకు వెళ్ళాడో? అమ్మను చూడటంలోనే గుంటూరు నుండి ఆర్తితో వచ్చిన ఆయన ఏం పొందాడో, అమ్మ ఏం ప్రసాదించిందో, మనకు తెలియదు. అమ్మకు పూర్ణచంద్రరావుగారికే తెలియాలి ఆ అనుభూతి విషయం. ఆ రాకలోని రహస్యం.
ఒక రోజు అకస్మాత్తుగా చెప్పాపెట్టకుండా అమ్మ పూర్ణచంద్రరావుగారింట్లో అడుగు పెట్టింది. ఆశ్చర్యపోయారందరూ. అకారణ కరుణామయుడైన భగవంతుడు అడక్కుండా ప్రత్యక్షమైతే ఏం చేయాలో తోచదు. ఏం అడగాలో తోచదు. నిరంతరం మనసులో అమ్మ నామం చేసుకొనే పూర్ణచంద్రరావుగారికి అమ్మకు నమస్కారం చేయటం తప్ప నామం చేయటం కూడా మరచి అమ్మను చూస్తూ కన్నీరు కారుస్తూ ఆనంద తన్మయుడై పోయాడు. అమ్మ దగ్గరకు తీసుకొని పండువలచి ప్రసాదం తినిపించింది. తన జీవితమే ధన్యమైందని భావించాడు.
వయస్సు ప్రభావం, తెనాలిలోని అవసరాలవల్ల పూర్ణచంద్రరావుగారు తెనాలికి మకాం మార్చారు. ఆ సమయంలోనే వారి శ్రీమతి లలితాంబగారు అమ్మలో లీనమైనారు., ఆ వియోగ బాధతో రాను రాను పూర్ణచంద్రరావుగారు. మంచానికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. అమ్మనామం చేసుకొంటూ కాలక్షేపం చేసేవారు. అమ్మ ఆలయంలోచేరిన తర్వాత జల్లెళ్ళమూడి రాకపోకలు తగ్గినా ధ్యాసమాత్రం నిరంతరం అమ్మ పైనే ఉండేది. ఎప్పుడు ఎక్కడ ఎవరు కనిపించినా ప్రేమతో చిరునవ్వుతో పలకరించేవారు.
ఫిబ్రవరి 2012లో తెనాలిలో తనకు చివరి క్షణాలు దగ్గరపడుతున్నాయని భావించిన పూర్ణచంద్రరావుగారు 90 సంవత్సరాల వయసులో కూడా తన పిల్లవాడ్ని ఒక్కసారి జిల్లెళ్ళమూడి తీసుకొని వెళ్ళి అమ్మను చూపించమని కోరారు. ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా అది అసాధ్యమని భావించి పిల్లలు బంధువులు తిరస్కరించారు. కాని వారి ఆవేదన, ఆర్తి చూచిన పూర్ణచంద్రరావుగారి తమ్ముడు వెంకట వీరసుబ్రహ్మణ్యంగారు కుమారుడు మధుసూదనరావుకు ధైర్యం చెప్పి తగురీతి వసతులు ఏర్పాటు చేసుకొని వీల్ ఛైర్ వాన్లో పెట్టి వారిని జిల్లెళ్ళమూడి తీసుకొని వచ్చి అమ్మను, హైమాలయాన్ని సందర్శింపచేశారు. పూర్ణచంద్రరావుగారు ‘జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి నామాన్ని గానం చేస్తూ కళ్ళ వెంట ఆనందబాష్పాలు కారుస్తూ పరవశించిపోయారు. తాను వచ్చే రోజులలో ఉన్న వసుంధర, రాముడక్కయ్య, భాస్కరరావు అన్నయ్య, బ్రహ్మాండం శేషు వంటివారిని పలకరించి తన పూర్వస్మృతులు అమ్మతో గడిపినవి చెప్పి కన్నీరు పెట్టారు. అమ్మ అన్న ప్రసాదం స్వీకరించి నిత్యాన్నవితరణ పథకానికి, మాసపత్రికకు కానుకలు సమర్పిచి ఆనందంతో అందరికీ వీడ్కోలు చెపుతూ నమస్కరిస్తూ తెనాలికి బయలుదేరారు.
పూర్ణచంద్రరావుగారికి అమ్మే గురువు, అమ్మే దైవం, అమ్మ వాక్కే శాసనం, అమ్మ సలహాలే నిత్య ఆచరణీయాలు. ఏ పనిచేసినా అమ్మ ఆశీస్సులతోనే.
2015 ఫిబ్రవరి 18న శివరాత్రి. ఆ మరుసటి రోజు అమ్మ జపం చేస్తూ అమ్మ నామం టేపు పెట్టించుకొని వింటూ అమ్మ నుండి నాకు పిలుపు వచ్చింది. నేను అమ్మ వద్దకు వెళుతున్నాను అని చెప్పి మరీ అమ్మలో లీనమైనారు. పూర్ణచంద్రరావుగారి వంటి ధన్యజీవులెందరో మనకు తెలిసిన వారు, తెలియనివారు కూడా ఉంటారు. ఒకసారి వారిని స్మరించుకుందాం.