1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (ఎక్కిరాల రాణీ సంయుక్త వ్యాస్)

ధన్యజీవులు (ఎక్కిరాల రాణీ సంయుక్త వ్యాస్)

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 20
Month : April
Issue Number : 2
Year : 2021

దేవుడమ్మ ఎవరు? రాణీ సంయుక్త ఎవరు? ముందు ఈ విషయం తెలిస్తే దేవుడమ్మ సన్నిధికి ఎలా చేరిందో తర్వాత తెలుసుకుందాం.

బాపట్ల దగ్గరలో జిల్లెళ్ళమూడి అమ్మను గూర్చి ఈనాడు ప్రపంచంలో నలుమూలలకూ తెలుసు. అయితే ఆ అమ్మను అమ్మ అని పిలవటమే తెలుసుగాని దేవుడమ్మ అని పిలిచేవాళ్ళు తక్కువ. అమ్మను రకరకాల పేర్లతో పిలిచేవాళ్లున్నారు. ‘జేజెమ్మ’ అని ‘జిల్లెళ్ళమ్మ’ అని ‘అమ్మలమ్మ’ అని పిలిచేవారు అక్కడక్కడా కనిపిస్తుంటారు. ‘దేవుడమ్మ’ అనే వాళ్ళు కూడా లేకపోలేదు. కాని చాలా తక్కువ. అలా పిలిపించుకొనేవాళ్ళు ఇంకా ఎందరో ఉన్నట్లు తెలుస్తున్నది.

బాపట్లలో ఎక్కిరాల అనంతాచార్యులవారని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు ఉండేవారు. వారికి నలుగురు కుమారులు. ఎక్కిరాల కృష్ణమాచార్య, ఎక్కిరాల వేదవ్యాస్, ఎక్కిరాల బోధాయన, ఎక్కిరాల భరద్వాజ. నలుగురు కుమారులు మేధావులే. అయితే తండ్రిగారి ఆయుర్వేద వైద్యాన్ని అందుకొని జీవనం సాగించినవారు బోధాయన ఒక్కరే – మిగతా వారందరూ ఆధ్యాత్మికంగా లోకంలో సమున్నత స్థానంలో సుప్రసిద్ధులైనారు. కృష్ణమాచార్య జగద్గురు పీఠం పెట్టి 300 పైగా దేశాలలో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. వేదవ్యాస ఐ.ఎ.యస్. ఆఫీసరు. భారతీయ సంస్కృతి విద్యాసముద్ధరణ సంస్థ (USCEFI) పెట్టి ఆధ్యాత్మిక ఉపన్యాసాలిచ్చేవారు. భరద్వాజ ‘సాయి కల్చరల్ మిషన్’ పెట్టి షిర్డీసాయి ప్రచారం ఆంధ్రదేశమంతా విస్తృతంగా చేసి ఆలయాలు కట్టించినవారు. అన్నదమ్ములు ముగ్గురు తమ తమ సిద్ధాంత ప్రచారానికి భారతీయ సంస్కృతి ప్రచారానికీ ఎన్నో గ్రంథాలు సాధికారమైనవి వ్రాశారు. వాళ్ళు ముగ్గురూ మాస్టర్స్

ఇక రెండవ వారైన వేదవ్యాస భార్య “రాణీ సంయుక్త”. ఆమె జిల్లెళ్ళమూడి అమ్మ వద్దకు ఎలా వచ్చింది? ఎలా అమ్మ అనుగ్రహాన్ని పొందింది. అమ్మ సన్నిధిలో ఏమి అనుభవించింది? ఏమి ఆదర్శంగా తీసుకొన్నది. సర్వత్రా వ్యాపించిన అమ్మ సన్నిధికి శాశ్వతంగా ఎప్పుడు చేరుకున్నది సంగ్రహంగా తెలుసుకుందాం.

జిల్లెళ్ళమూడి అమ్మ వద్దకు వచ్చే వాళ్ళందరూ గ్రుడ్డిగా దేనినీ నమ్మరు. రావటానికి ఎవరో ఒకరు కారణమైనా అనుభవం లేకపోతే విశ్వసించరు. అమ్మ, కూడా నేనేం చెప్పినా నా అనుభవంలోంచే చెపుతాను అనేది. భరద్వాజ, వేదవ్యాస్, కృష్ణమాచార్య అమ్మ వద్దకు వచ్చినవారే. 1963లో వేదవ్యాస్ తన శ్రీమతి రాణీ సంయుక్త నాల్గవసారి గర్భవతిగా ఉండగా “నీకు ప్రస్తుతం జిల్లెళ్ళమూడియే పుట్టిల్లు” అని భరద్వాజను తోడిచ్చి అమ్మ వద్దకు పంపాడు. అప్పటికే ముగ్గురు కొడుకులు. ఆమె జిలెళ్ళమూడి రావటం అదే ప్రథమం. ఆనాటి డొంకమార్గంలో కష్టపడి అమ్మను చేరారు నడిచి. అమ్మ ముఖాన రూపాయంత బొట్టుతో దుర్గాదేవిలా కనిపించింది. మొదటి చూపులోనే ఆకర్షించింది. ఏమన్నా పాటలు వస్తే పాడమన్నారు అమ్మ. అడిగిందే చాలని ఎన్నో పాటలు పాడింది సంయుక్త. అమ్మ దగ్గరకు తీసింది. అమ్మ ఒడిలో తలపెట్టి ఏడ్చింది. అమ్మ తల నిమిరి బుజ్జగించింది. ఆ ఆనందంతో ఆశ్రమమంతా గిరగిరా తిరిగింది – అమ్మ కూడా సంయుక్తను గూర్చి “ముగ్గురు బిడ్డల తల్లిలాలేదు. చిన్నతనం పోలేదు. కాలేజిలో చదివే పిల్లలా నవ్వుతూ తిరుగుతున్నది” అన్నది.

ఆ రోజులలో రాజుబావ తాను వ్రాసిన “ఆధారం ఎవరమ్మా! ఆదరించు వారెవ్వరమ్మా! దారములేని గాలిపటానికి – వానజల్లులో నీటిబుడగకు – ప్రళయ తుఫానులో పథమే తెలియక ఊగేతూగే ఓటి పడవకూ ఆధారం ఎవరమ్మా!” అని పాడితే శిలలు కూడా కరిగి పోయేంతగా హృదయాలు కదిలిపోయేవిట. సంయుక్త పాడేపాటలలో “ఎవరు కన్నారెవరు పెంచారు? నవనీతచోరుని . గోపాలబాలుని ఎవరు కన్నారెవరు పెంచారు” అనే పాట అమ్మకు బాగా నచ్చింది. ఎవరు క్రొత్తవారు వచ్చినా సంయుక్తను పిలిచి పాడిస్తుండేది. ఆ రోజుల్లో అమ్మ, సన్నిధిలో తల్లి మురిపెమంతా అనుభవించింది సంయుక్త. ఈ పాటనే గణపతి సచ్చిదానంద స్వామివద్ద పాడగా వారు శ్రీకృష్ణ విగ్రహాన్ని సృష్టించి ఇచ్చారు.

నండూరు పార్థసారథి – చిట్టెమ్మలకు 1937లో పుట్టిన సంయుక్తకు 18 యేళ్ళకే వేదవ్యాస్తో వివాహమైంది. కాలేజీలో చదివే రోజులలో సరదాగా పాటలు పాడుతూ, అల్లరి చేస్తూ కాలం గడిపేది. ఒకసారి కాలేజీలో రామదాసు పాత్రధారి అనివార్య కారణాలతో రాలేకపోతే తను ఆ పాత్ర ధరించి వచ్చిన పాటలు పాడి మెప్పించింది. ఒకసారి పుట్టింట్లో ఉండగా వాళ్ళ నాన్నగారికి జబ్బు చేస్తే తనే హాస్పిటల్లో చేర్చి తగినరీతిలో ధైర్యంగా నిలబడి అన్నీ నిర్వహించింది.

వేదవ్యాస్ వివాహం అయిన తర్వాత ఐ.ఎ.యస్. పాసై ప్రభుత్వంలో ఒక్క నిమిషం తీరికలేని బాధ్యతలు నిర్వర్తిస్తుండగా పిల్లల బాగోగులు, చదువులు ధైర్యంగా తానే నిర్వహించేది. నిరంతరం ఉద్యోగ బాధ్యతలే కాక ఒక గురువుగా శిష్య బృందానికి మార్గదర్శనం చేసే మాప్టర్గా క్షణం తీరికలేని భర్తకు వెసలుబాటు కల్పిస్తూ అందరినీ ఆదరిస్తుండేది. అటు భర్త శిష్యులు, ఇటు పుట్టింటివారు, అత్తింటివారు ఇంటికి వచ్చే అందరినీ ఒక అమ్మలా ఆదరించి గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించింది. ఎన్నో కష్టాలూ అనుభవించింది, అయితే సహనంతో కష్టాలను కష్టాలుగా కాక బాధతో కాక ప్రేమతో అనుభవించింది. “బాధలు లేకపోతే సహనమనే మాటకు అర్థం ఏముంటుంది?” అనే అమ్మ మాట సంయుక్తకు శిరోధార్యమైంది. అన్నీ తానే చేస్తూ అందరికీ పెడుతూ ఉపవాసం వుండటం అంటే ఆశ లేకుండా కర్తవ్యాలను నెరవేర్చాలనే భావాన్ని ఆదర్శంగా తీసుకొని ఆచరణలో చూపించింది.

పిల్లలతో జిల్లెళ్ళమూడిలో ఉన్న రోజులలో పిల్లల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా అమ్మమ్మ (కామేశ్వరమ్మ) గారు మందలిస్తుండేది. నీకు అత్తగారు. లేని లోటు అమ్మమ్మ తీరుస్తుందిలే అని అమ్మ చమత్కరించేది. ఒకసారి తను పాయసం చేసి అమ్మకు నివేదించాలనుకుంటుంటే అమ్మమ్మ ఎందుకు అంత శ్రమపడతావు అమ్మ నాలుకకు రాసుకుని ఇస్తుంది కాని తాగదు అన్నది. కాని అమ్మ ఆ నివేదనను మొత్తం తానే త్రాగింది. ఒక చెంచాడు మాత్రం ప్రసాదంగా మిగిల్చింది.

అలాగే సంయుక్త నాన్నగారు 3 చీరలు తన కుమార్తెకని తీసుకొని జిల్లెళ్లమూడికి వచ్చారు. సంయుక్త అందులో ఒకటి తీసి అమ్మకు సమర్పించింది. తాను మామూలుగా భుజం మీద వేసుకొని తిరిగి తనకే ఇస్తుందిలే అనుకుంది. కాని అమ్మ ఇవ్వలేదు. తను ఇచ్చిన రవిక చీర మరొకసారి సంయుక్త వచ్చినప్పుడు “ఇదిగో నీవిచ్చిన గుడ్డలు కట్టుకున్నాను” అని చూపించింది. అదీ బిడ్డల పట్ల అమ్మ ప్రేమ.

మామూలుగా సరదాగా పిల్లలతో దాగుడు మూత లాడే అమ్మ జిల్లెళ్లమూడి లో 1963 ప్రాంతాలలో పూజా సమయాలలో శిలా విగ్రహంలా కదలకుండా గంటల తరబడి కూర్చోవటం రకరకల దేవతా ముద్రలు పడడం తను చూచి అమ్మయోగ విభూతికి ఆశ్చర్య పోయింది. తను జిల్లెళ్లమూడిలో ఉన్న రోజులలో బద్ధకంగా ఉదయం 8 గంటలకు లేచేది. తాపీగా కార్యక్రమాలు పూర్తి చేసుకొని అమ్మవద్దకు వెళ్ళేది. అమ్మ అది గమనించినా ఏమీ అనలేదు. కానీ ఒకరోజు అమ్మ పార్శ్వపు నెప్పితో బాధపడటం చూచి అమ్మతో సంయుక్త మా మామగారు ఒక మందు చెప్పేవారమ్మా! అదివేస్తే తగ్గుతుంది అన్నది. ఏమి చెప్పారంటే సూర్యోదయానికి ముందే ఖాళీకడుపుతో శొంఠి పొడి, ధనియాలు నానబెట్టి ఆ నీళ్ళు సేవిస్తే తగ్గిపోతుందన్నది. అయితే రోజూ ఆ వైద్యం నీవు నాకు చేయి అన్నది. సంయుక్త అమ్మ ఆజ్ఞ కదా, తెల్లవారు జామున నాల్గింటికే లేచి అన్నీ సిద్ధం చేసుకొని సుప్రభాతం కాగానే అమ్మకు ఇచ్చేది. అమ్మకు పోయిందో లేదో కాని నాకు తెల్లవారుఝామునే లేచే క్రమ శిక్షణ నేర్పి బద్దకం పోగొట్టింది అన్నది సంయుక్త. గర్భవతిగా వచ్చిన సంయుక్తను అమ్మ పసిపిల్ల లాగా చూచుకొన్నది. పిల్లలు విక్రమాదిత్య, శ్రీనివాస్, సాయిలు విభూతి పెట్టుకొని అమ్మ వద్ద శ్రీ సూక్తం, పురుష సూక్తం చదువుతుంటే అమ్మ ఎంత ఆనందించేదో – సంయుక్త చేత ఎలా పాటలు పాడించేదో అలా ఆ పిల్లల చేత మళ్ళీ మళ్ళీ చదివించేది. ఆ తర్వాత పుట్టినవాడు దత్తాత్రేయ, కూతురు లక్ష్మీగాయత్రి. రెండవ బిడ్డ శ్రీనివాస్ను అమ్మ చాలా ముద్దు చేసేది.

ఒకరోజు వేదవ్యాస్ హైదరాబాద్ నుండి వచ్చాడు. భార్యాపిల్లలనూ, అమ్మనూ చూడటానికి. సంయుక్త, వేదవ్యాస్ ను కూర్చోబెట్టి ఇద్దరి చేత పూజ చేయించుకొని ఇద్దరికీ కలిపి తన మెడలో ఉన్న పూలదండ వేసింది. జీవితాంతం ఇంతే కలసి ఉండమని. ఎప్పుడో వాళ్ళ నాన్న తెచ్చిన ముతకచీరె అమ్మకు తను ఇస్తే గురుపత్నిగా తనకు వేదవ్యాస్ శిష్యులు తమ తల్లిగా భావించి కొన్ని వందలు, వేల చీరెలు పెట్టేవారు. శ్రీకృష్ణుడు ద్రౌపది ఇచ్చిన నూలుపోగు తీసుకొని వస్త్రదానం చేసినట్లుగా ఉన్నది అనుకున్నది సంయుక్త. వాటిని అందరికీ పంచేది.

రాణీ సంయుక్త దృష్టిలో అమ్మ ఒక ప్రేమ పిపాసి. తన వద్దకు వచ్చే వారిలో ప్రేమ జ్యోతిని వెలిగించి ప్రేమ జ్వాలను రగిలింప చేసేది. ఎటువంటి మాలిన్యాలూ అంటని నిర్మల గంగాజలం వంటిది. ప్రేమే మోక్షం. ప్రేమిస్తూ జీవించటమే అమ్మ నేర్పిన పాఠం అంటుంది సంయుక్త. వేదవ్యాస్ కొంతకాలం వానప్రస్థాశ్రమం స్వీకరించినా, భార్య మంచి చెడులు చూస్తూనే ఉండేవాడు. బంగారం వంటి, ముత్యాల రత్నాల వంటి పిల్లలను ప్రసాదించిన భర్తను దేవుడిగా కొలుస్తూ గురుపత్నిగా వేదవ్యాస్ అనంతరం శేషజీవితాన్ని గడిపి శిష్యులను బిడ్డలుగా ఆదరించి వారికి మార్గదర్శనం చేసింది.

అమ్మ వద్దకు వచ్చిన నాలుగు దశాబ్దాల తర్వాత సోదరుడు తంగిరాల శాస్త్రిని కలిసి రాణీ సంయుక్త వారి ప్రోద్బలంతో 10 వ్యాసాలు వ్రాసి మదరాఫ్ ఆఫ్ ఆల్ పత్రికలో ముద్రించిన వాటిని “శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మతో నా అనుభూతులు” అనే గ్రంథంగా ప్రచురించి శ్రీ పొత్తూరి వారిచే, శ్రీ శాస్త్రిగారిచే ముందుమాట కూడా వ్రాయించుకుంది, అమ్మ సాహిత్యానికి మరో మణికాంతిని పొదిగిన ధన్యురాలు.

“నా పిల్లలకు నేను ప్రాణం, నాకు అమ్మే ప్రాణం” అనే రాణీ సంయుక్తను పిల్లలు సంయుక్తను జీవితాంతం ప్రేమతో చూచుకున్నారు. దేవుడమ్మ సన్నిధికి 1963లో మొదటిసారి వచ్చిన రాణీ సంయుక్త వ్యాస్ చివరిగా 2019 ఏప్రియల్ 20న బెంగుళూరులో అమ్మ చిన్నప్పుడు బాగా ముద్దు చేసిన తన రెండవ కుమారుడు శ్రీనివాస్ ఇంట్లో అమ్మలో ఐక్యమైంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!