1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (ఓగేటి సాంబయ్య)

ధన్యజీవులు (ఓగేటి సాంబయ్య)

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 18
Month : April
Issue Number : 2
Year : 2019

అమ్మ వివాహం అయిం తర్వాత కొంతకాలం తెనాలి తాతగారు వారింటికి తీసుకెళ్ళారు అమ్మను. అక్కడ మేనమామ సీతారామయ్య గారి కాపురాన్ని చక్కదిద్దింది. నాలుగు నెలలు అక్కడ ఉన్న తర్వాత నాన్నగారు బామ్మ అమ్మను కాపురానికి పంపమని కబురు చేశారు సీతాపతితాతగారికి. తాతగారు తెనాలి వెళ్ళి అమ్మను మన్నవకు తీసుకొని వచ్చారు.

అమ్మ చిన్నప్పుడు అమ్మ పినతండ్రి అంబారావు గారు తన ఆడపిల్లల బళ్ళో రెండవతరగతిలో చేర్పించారు గాని ఏమీ చెప్పలేదు. ఇప్పుడు తెనాలి నుండి వచ్చిం తర్వాత అంబారావు గారి బళ్ళో కొత్తగా మాష్టారుగా వచ్చిన ఓగేటి సాంబయ్య గారు. అమ్మ చురుకైనదని గమనించి, అమ్మ చూపించిన మర్యాదలు, తెలివితేటలకు చదువు కూడా ఉంటే ఇంకా బాగా రాణించేది అనుకుంటారు. వారిది యాజలి. చంద్రమౌళి వారికి బాగా తెలిసిన దగ్గరి వారు.

ఒకరోజు ఏం చదువుకున్నావ్ అమ్మాయ్ అని అమ్మను అడిగారు. నేను ఏం చదువుకోలేదని ఇదివరకే చెప్పాను గదా! అంటుంది. ప్రక్కనే ఉన్న సీతాపతి తాతగారు. నేను చెప్పించదలుచుకోదు. నాకిష్టం లేదంటారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. అమ్మాయి కిష్టమైతే నేను చెపుతాను చదివించండి అన్నారు. అమ్మ చదువుకుంటానన్నది. తాతగారు పలకా బలపం తెప్పిస్తారు. మాఘపూర్ణిమ నాడు అమ్మకు గుణింతంతో చదువు మొదలు పెట్టారు. వారు చూపకుండా అమ్మ అన్ని అక్షరాలతో గుణింతం వ్రాసి చూపిస్తుంది. అమ్మ వ్రాసిన పద్ధతి చూచి అన్ని వచ్చే రాదని మభ్యపెడుతున్నదేమో అనుకుంటారు సాంబయ్యగారు.

మరుసటి రోజు భగవద్గీత తెచ్చి సాంబయ్య గారు మొదటి శ్లోకం చదవమన్నారు. అమ్మ నెమ్మదిగా తప్పులేకుండా చదివి వినిపించింది. రెండవ శ్లోకం చదివిస్తారు. అమ్మ అదీ చదువుతుంది. సాయంకాలానికి ప్రథమ అధ్యాయం చూడకుండా అప్పచెపుతుంది. అమ్మ ఏక సంతాగ్రాహి అని సీతాపతి గారితో సాంబయ్య గారు చెప్పి వారం రోజులలో గీత మొత్తం చెప్పగలదు మీ అమ్మాయి. హిందీ కూడా నేర్పిద్దాం అని హిందీ అక్షరాలు వ్రాసి ఇస్తారు. అమ్మ మొత్తం అక్షరాలు పలక వెనుకకు త్రిప్పి అన్నీ వ్రాసి చూపించింది. మరుసటి రోజు ఇంగ్లీషు, జాగ్రఫీ మొదలు పెడతానంటారు. అమ్మ పదిహేను రోజులలో ఎంత చెప్పగలిగితే అంత చెప్పండి చదువుకుంటా అంటుంది అమ్మ. అమ్మ మరుసటి రోజు గీతలో రెండు అధ్యాయాలు వ్రాసి చూపించింది. ఆ తర్వాత గీత మొత్తం అప్ప చెప్పింది. చెప్పకుండానే గీత మొత్తం ఎలా వచ్చింది యీ అమ్మాయికి అని ఆశ్చర్యపోయారు. అక్షరాలు అచ్చు అక్షరాల్లా గుండ్రంగా ఉన్నాయి. సాంబయ్యగారు లెక్కలు నేర్చుకో ఒకట్లు కూడా తెలియదు కదా! అన్నారు. అమ్మ “ఏ ఒకటి బాగా తెలిసినా అన్నీ తెలిసేవే. తెలియకపోగా నాకేమీ తెలియదని కూడా తెలియదు” అన్నది. భలే సూత్రం వదిలావమ్మా! అన్నారు. సాంబయ్యగారు. సూత్రం అంటే ఇదేనా అని మెడలోని మంగళసూత్రం చూపించింది. అమ్మ. ఇది కాదమ్మా నీవు తెలివిగలదానవనుకున్నాను అన్నారు సాంబయ్య గారు. “నేను తెలివి లేని దాన్ని కావచ్చు గాని ఈ మంగళసూత్రం సర్వసూత్రాలనూ తెలియచేస్తుంది” అన్నది అమ్మ. ఇలాగే సాంబయ్యగారికి గుణింతము కాదు. కూడింతమనీ, కూడింతమంటే అక్షరంలో అక్షరం కలపటం, రెండు రెళ్ళు నాలుగు లాగా అనేక అక్షరాలను కలిపి ఒకేసారి పలకటమనీ, అన్ని భాషలకు శబ్దం మూలమనీ, ఒక భావాన్ని అనేక భాషలలో వ్రాయవచ్చుననీ, ఒకే భావం వచ్చే శబ్దం అన్ని భాషలలో ఒకేరకంగా ఉండదనీ, ఏ భాష ప్రత్యేకత దానిదనీ, జంతువులకు జ్ఞానం లేదనీ, మానవులకు మాత్రమే జ్ఞానం ఉన్నదనుకుంటారనీ, జంతువులలోని జ్ఞానం తెలియక వాటికున్నదనే జ్ఞానం తెలియక అలా అంటారనీ, పట్టుదల అంటే యేది యెట్లా జరిగినా చేసి తీరాలని తోచటమే దాని గుణం అనీ, సంకల్పసిద్ధులు అంటే యేదీ కోర్కెగా మిగిలి ఉండని వారేననీ, గురువులలో బోధ గురువులు, బాధ గురువులు కూడా ఉన్నారనీ, చైతన్యం అన్నింటిలో ఉన్నదనీ, చిన్నతనం నుండే పెద్దతనం వచ్చిందనీ, ఒక పండు ఉపయోగపడే సమయంలో మంచిది ఉపయోగపడనప్పుడు చెడు అవుతున్నది అంటూ అమ్మ సాంబయ్యగారికే బోధిస్తుంది.

గురువు అంటే మహా బరువైనది. బాల్యంలో తల్లిదండ్రులెంతో, యౌవనంలో భర్త యెంతో, వృద్ధాప్యంలో బిడ్డలు యెంతో విద్యయందు గురువు అంతటివాడు. ఏదైనా మనసును బట్టి అర్థమౌతుంది. స్వభోధిని అంటే గురువులేకుండా బోధ చేసేది. గురువు అంటే గుర్తు చూపించేవాడు. తెలియంది తెలియచెప్పేవాడల్లా గురువే. తెలియవచ్చేవాడు దైవం. గురువు అంటే బాటసారి, మార్గదర్శి. గురువుకు దైవానికీ తేడా లేదు అని అమ్మ మాటల సందర్భంలో సాంబయ్యగారికి తెలియజేసింది.

మహాగురువుల్ని చూచినట్లు, ఓనమాలు రాని దానివి అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నావే అన్నారు సాంబయ్యగారు. ఏమీ తెలియని దానితో మాట్లాడుతున్నారు. మీకేం తెలిసినట్టు? అంటుంది అమ్మ. అమ్మాయి నీకు పెద్దలంటే గౌరవం లేనట్టుందే అంటారు సాంబయ్యగారు. మీరు గురువులం అన్నారుగా! పెద్దలేమిటి? పెద్దలన్నా గురువులన్నా ఒకటేనా? అన్నది అమ్మ. వయసులో తనకంటే పెద్దలంతా పెద్దవాళ్ళే. అన్నారు సాంబయ్య. ఒకడు 80 ఏళ్ళ వాడు దొంగతనాలు చేస్తూంటాడు, ఒక యేడెనిమిదేళ్ళ వాడు మంచి పనులు చేస్తాడు. ఇందులో యెవరో పెద్దలు? అన్నది అమ్మ. గొంతులో వెలక్కాయ పడ్డట్టయి నీవే సమాధానం చెప్పమన్నారు సాంబయ్య. నాకు ఓనమాలే రావంటిరి నేనేం సమాధానం చెపుతాను అన్నది అమ్మ. కాదు చెప్పమని బ్రతిమాలాడారు. ఇందాకనే చెప్పాను గురువుకు దైవానికి తేడా లేదని. అట్లా చూడగలిగినవాడే శిష్యుడు, అలా చూపించగలిగినవాడే గురువు. ప్రతివారి యందు పూజ్యభావంతో ప్రవర్తించటానికే తల్లి అని, తండ్రి అని, గురువు అని, దైవమని అన్నారు తప్ప లక్ష్యసిద్ధి యెక్కడ వుంటే వారంతా గురువులే అంటూ మీకు ‘నా’ వచ్చుగాని ‘ఓం’ అంటే ఏమిటో తెలియదు, అందుకే మీరు గురువుగా పనికి రారు అన్నది సాంబయ్యగారితో, సాంబయ్యగారు ‘శబ్దమంజరి’ పుస్తకంలో పది వాక్యాలు చదివి అమ్మ చేతికిచ్చారు. అమ్మ చూడకుండానే చదివేసింది శబ్దాలన్నీ.

అమ్మ చాలా తెలివిగలది అని సాంబయ్య గారంటే సీతాపతి తాతగారు ఒప్పుకోరు. చిదంబరరావుగారి దగ్గర, మరిడమ్మ గారి దగ్గర పెరగటం వల్ల ఏవైనా వచ్చినయ్యేమో! అంటారు. మీ నాన్నగారు నీవు తెలివిగలదానివంటే ఒప్పుకోవటం లేదమ్మా! అంటారు. ప్రతివాళ్ళు అంతే ఎవరి వాళ్ళను, వాళ్లు మెచ్చుకోరు అన్న అమ్మతో కష్టపడకుండా చదువురావాలను కుంటారు అనే భావంతో చెపుతున్నాను అంటారు సాంబయ్యగారు. ఎవరు ఏ వృత్తి చేసినా తన బ్రతుకుతెరువు కోసమే చేస్తాడు. తన అవసరం ఇతరులకు ఉపయోగపడవచ్చు. చదువురాని పిల్లలుంటే గదా మీ ఉపాధ్యాయత్వం. ఈ హెచ్చుతగ్గులే సర్వం. ఉన్నవన్నీ ద్వంద్వమే. మంచీచెడ్డలు, చీకటి వెలుగులు, పెద్ద చిన్నా, తల్లీ బిడ్డా ఇందులో ఏది కొద్దిది? ఏది గొప్పది? అన్నీ ఒకటి లేనిది రెండవది లేదు. ఒకటిలో ఇంకొకటి కలిసినప్పుడే రెండు అయినాయి అన్న అమ్మతో సాంబయ్యగారు ఇంకా రెండు చెప్పు అన్నారు. చెప్పేవారు గురువు వినేవారు శిష్యుడు. నేను గురువు మీరు శిష్యులు అనుకుంటే బాధ కదా అంటుంది అమ్మ. బిడ్డ ఉంటేనే తల్లి ఔతుంది అన్నావే అది చాలా బాగుందమ్మా అన్నారు సాంబయ్య. అవునండీ ప్రేమింపబడే వాడు ఉన్నప్పుడే ప్రేమించే వాని గొప్పతనం, పూజించేవాడు ఉన్నప్పుడే పూజింపబడేవాని గొప్పతనం, ఇందులో ఎవరి గొప్పో ఏది తక్కువో అర్థం కావటం లేదు అంటుంది అమ్మ. అది పూర్ణమైన అద్వైత సిద్ధి అన్నారు సాంబయ్యగారు.

సాంబయ్యగారు అమ్మతో రంగారావుగారికీ నీకు సంబంధం ఉన్నదని ఊళ్ళో అనుకుంటున్నారమ్మా! అసలు నిజం ఏంటి అని అడిగారు. అమ్మ మీరు గురువవైతే నన్నా ప్రశ్న అడగకూడదు. మీకే తెలిసి ఉండాలి. నా మనస్సు నా నడక పరిశుద్ధంగా ఉన్నంతవరకు ఎవరేమనుకున్నా ఎన్ననుకున్నా నా ఆధారం నాకు కాకపోడు అన్నది. ఆధారమేమిటి? అర్థం కాలేదన్నారు సాంబయ్యగారు. ఆధారం అంటే ఏమిటో తెలియనప్పుడు నేను చెప్పినా అర్థమవుతుందా? భార్యకు ఆధారం ఎవరు? భర్త. భర్తే దేవుడు, ఆధారం. భర్తను దేవునిగా చూచుకొనే వారెవరమ్మా ఈ రోజుల్లో. నీవు భ్రమలో పడుతున్నావు అన్నారు సాంబయ్యగారు. ఉయ్యాలలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నట్లు అంటారే పెద్దలు అట్లా ఉన్నది అన్నది అమ్మ. సాంబయ్యగారికి ఇవేమీ పట్టవు. వెళ్ళేలోగా నా కోర్కె తీర్చు అంటూ బడికి వెళ్ళారు. ఆ తర్వాత ఊరికి వెళ్ళారు.

ఊళ్ళో రకరకాల మాటలు విని రాఘవరావు మామయ్య అమ్మను భయంకరంగా కొట్టారు. అమ్మ వారం రోజులు లేవలేదు. ఎనిమిదవరోజు కాస్త తాతమ్మ పథ్యం పెట్టింది. సాంబయ్య గారు 15 రోజుల తర్వాత వచ్చారు ఊరి నుండి. అమ్మ గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయి ఉండటం చూశారు. ఆ తర్వాత మర్నాటికి బంగారపు రంగుతో ముద్దబంతి పువ్వుల్లే ఉండటం చూచి ఆశ్చర్యపోయారు. పాఠం చెపుతానని భగవద్గీతలోని ఏకాదశాధ్యాయం అర్థం చెపుతూ జగత్తులోని రూపాలన్నీ నావే అని కృష్ణపరమాత్మ అన్నాడు. సంకల్పాలన్నీ వాడిరూపాలే. భారం వాడిమీద వేసి చేసినప్పుడు ఏ పాపం, అంటడు అన్నారు. పాపం అంటూ ఉంటే ఎందుకంటదు? పుణ్యం తనరూపమయితే పాపం కూడా తన రూపం కాకుండా ఉండదు అన్నది అమ్మ.

ప్రక్కనే ఉన్న మల్లెపూలు మంచి వాసన వస్తున్నవి, నాలుగు పూలు కోసుకొని రమ్మంటారు సాంబయ్యగారు. అమ్మ పూలు కోస్తుంటుంది. అమ్మ కాళ్ళు పట్టుకొని క్రిందకు లాగుతారు. పడ్డ అమ్మతో గురువు, భగవంతుడు ఒకటే, నాకు నీపై కోర్కె కలిగింది, ఒప్పుకో లేకపోతే నీగతి చూడు తెల్లవారేటప్పటికి మనిద్దరికీ సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తా, నీ భర్తకు తెలియజేస్తా అంటూ బలాత్కారం చేయబోయాడు. అమ్మ వారించింది. ఆ సమయంలో ఆకుల సందులో నుండి చిన్న పాము వచ్చింది.

చూచి భయపడి స్పృహ తప్పిపడిపోయాడు. సాంబయ్యగారికి పెద్ద దెబ్బ తగిలింది. అమ్మ సాంబయ్యగారి తలను తొడపై పెట్టుకొని “పిచ్చినాయనా! క్షణానికి వచ్చేది. తెలియదు. ఈ క్షణికమైన సుఖం కోసం ఎంత మోసపోయావో చూడు. నిన్ను నీవు మరచి నేనెవరో మరచి నన్ను బాధపెట్టాలనుకొని నీవు బాధపడ్డావు గదా! పిచ్చినాయన!” అంటూ ఒళ్ళంతా సవరించింది. ఒక గంట తర్వాత కళ్ళు తెరిచి అమ్మ వంక చూస్తూ భయపడతాడు. “భయపడకు తల్లి ఒడిలో ఉన్నావు” అంటూ లేపి ఇవతలకు తెచ్చి పడుకో బెడుతుంది. ఇంతలో తాతగారు లేచి ఏమిటి? అని అడుగుతారు. సాంబయ్యగారు ‘పాసు కెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయానండీ ! చిన్నపిల్లయినా ప్రమాదం జరగకుండా కాపాడింది’ అన్నారు. అమ్మ తేనె నీళ్ళు కలిపి యిచ్చి ‘ధైర్యంగా పడుకోండి, యేం ఫర్వాలేదు, మీ దగ్గరనే కూర్చుంటాను’ అంటుంది అమ్మ. అనుమానాలన్నీ వీడి రక్షించిన తల్లిగా అమ్మను మనస్ఫూర్తిగా భావించి తరించాడు సాంబయ్యగారు. అమ్మకు పాఠాలు చెప్పటానికి మొదలు పెట్టి తను పాఠాలు చెప్పించుకొని పాపులను, రాక్షసులను, సర్వులనూ తరింప చేసే తల్లి. పాదాలపై పడి తరించిన సాంబయ్యగారు – ధన్యజీవి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!