అమ్మ వద్దకు యాభయ్యవ దశకం చివరలో వచ్చినవారిలో కృష్ణభిక్షు ఒకరు. సంగీతసాహిత్య విద్వత్కవి. తపస్వి. ఎన్నో యోగానుభవాలు పొందినవారు. రమణమహర్షి సాహచర్యంలో ఒక అర్ధశతాబ్ది గడిపినవాడు. మొదటిసారిగా రమణలీల పేరుతో రమణమహర్షి జీవితచరిత్ర వ్రాసిన గొప్పవ్యక్తి. 1957, 58లలో అమ్మవద్దకు వచ్చారు. కొన్ని నెలలు అమ్మ కుడి ప్రక్కన కూర్చుని ఉన్న వారు కృష్ణభిక్షుగారు అమ్మ లాలనలో ఉన్నారు. జిల్లెళ్ళమూడిలో అమ్మవద్ద ఉన్న రోజులలోనే ‘అనసూయా రామాయణం’ అనే గ్రంథాన్ని రచించారు.
కృష్ణభిక్షు అసలు పేరు ఓరుగంటి వెంకటకృష్ణయ్య. నెల్లూరు వాసి. కావలి గ్రామంలో 1904 సెప్టెంబరు 19వ తేదీన పుట్టారు. ఓరుగంటి వెంకటసుబ్బయ్య – మహాలక్ష్మి వారి తల్లిదండ్రులు. తెలుగుసాహిత్యం పట్ల ఇష్టం కలిగించినవారు శ్రీ చివుకుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, శ్రీ వేదం వెంకటరాయశాస్త్రిగారు. అంతటి ఉద్దండపండితుల వద్ద కావ్య శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందారు. ఆధ్యాత్మిక పధంలో త్రోవ చూపించిన వారు కూడా సామాన్యులు కారు. శ్రీ సదానందస్వామి, శ్రీ భారతుల నరసింహశాస్త్రి, కావ్యకంఠ వాసిష్ట గణపతిముని, శ్రీ భగవాన్ రమణ మహర్షి, శ్రీ అరవిందులు, శ్రీ మేడవరపు సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీ మోతదక సత్యనారాయణ వంటివారి శుశ్రూషలో యమ, నియమ, ప్రాణాయామాది విద్యలే కాక ధ్యానతపోసాధనలు అలవాటు చేసుకున్నారు. రాజయోగదీక్షాదాత శ్రీశ్రీ ప్రభుజీ రామలాలీ గారలు.
గుంటూరు శారదానికేతనం సంస్కృత కళాశాలలో కొంతకాలం పనిచేశారు. నందనారు చరితము (నాటకము) శ్రీ రమణలీల (జీవితకథనము), ప్రియావిలాపము (పద్యములు), ఈశ్వరశతకము (పద్యములు), దైవసన్నిధి, మానసబోధ, గీత గోవిందము, చాటువులు, అమృతబిందువులు, వంటి పద్య గ్రంథాలే కాక భగ్నప్రేమ, పునఃప్రాప్తి, బిల్వమంగళము, లీలాశుకము వంటి నాటకాలు- గురుమంత్ర భాష్యము, త్రిపురా రహస్యము, అనసూయా రామాయణము, కింకరి, మహర్షి అరుణాచల పంచక వ్యాఖ్యవంటి రచనలెన్నో వ్రాశారు.
శ్రీకృష్ణభిక్షుగారు తన ధ్యాన, సమాధులలో వివిధ లోకాలలోని ఎన్నో విషయాలు దర్శించి చెపుతుండేవారు. యోగసాధన సమయంలో కృష్ణభిక్షు గారితో కలిసి ప్రసాదరాయకులపతిగారు కూడా యోగసాధన చేసేవారు. కృష్ణభిక్షు ద్వారానే కావ్యకంఠ గణపతి సాహిత్యంతో కులపతిగారికి పరిచయమైంది. అంతేకాదు జిల్లెళ్ళమూడి అమ్మలోని దైవత్వం గురించి కూడా కులపతిగారికి చెప్పింది కృష్ణభిక్షుగారే. ఆ తర్వాతనే కులపతిగారు అమ్మ దర్శనానికి వెళ్ళటం, అమ్మవల్ల ప్రభావితం కావటం, అమ్మకోసం అనేకసార్లు జిల్లెళ్ళమూడి వెళ్ళటం, అమ్మను గూర్చి “అంబికా సాహస్రి” అనే గ్రంథం వ్రాయటం జరిగింది. అమ్మ, అనేక సిద్ధ సంబంధిత విషయాలను గూర్చి చెప్పి ఒక దివ్యమంత్రోపదేశం చేసింది. కులపతిగారికి, వీటన్నింటికీ కారకులు శ్రీ కృష్ణభిక్షుగారే.
కృష్ణభిక్షుగారు కొంతకాలం కంచి పరమాచార్యుల వద్దకూడా ఉన్నారు. కృష్ణభిక్షు ఛిన్నమస్తా సాధన చేశారు. 1958-59లలో జిల్లెళ్ళమూడిలో కొంతకాలం ఉన్న కృష్ణభిక్షుగారు మళ్ళీ రమణాశ్రమానికి వెళ్ళారు. మళ్ళీ 1968లో అమ్మ వద్దకు వచ్చారు. అమ్మతో తన ఆస్తి వ్యవహారాలు, భవిష్యత్తు, తనకున్న ఉద్దేశ్యం. గూర్చి చెపుతూ- జీవితంలో సగంకాలం భగవాన్ రమణమహర్షి సన్నిధిలో గడిచిపోయింది. ఇప్పుడు వృద్ధాప్య దశ వచ్చింది. రమణాశ్రమంలోనే ఉంటున్నాను. ఉన్నంతకాలం ఉండి ఎప్పుడైనా ఇక్కడకు రావాలనిపిస్తే వస్తాను. మీ సన్నిధిలో ఉండిపోవాలని ఉన్నది. మీరు ఏమంటారమ్మా? అని అడిగారు. అమ్మ వాత్సల్యంతో “తప్పకుండా ఉండు నాయనా! ఈ మాట పదేళ్ళ క్రితం నీవు ఇక్కడకు వచ్చినప్పుడే చెప్పాను. అమ్మ దగ్గర నీకు అడ్డూ ఆటంకం రెండూ లేవని, నీకిష్టమైనంతకాలం నీకు ఇష్టం వచ్చిన చోట ఉండు. నీకు ఇక్కడకు రావాలనిపించనప్పుడే రావచ్చు. ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి” అని చెప్పింది.
అమ్మ పాదాలు పట్టుకొని నీవే రక్షించాలమ్మా అని అంటే “అన్నిసార్లు పట్టిన ఆ పాదాలు నిన్ను రక్షించకుండా ఉంటాయా నీకేం భయంలేదు నే నెప్పుడూ నీ వెంటే ఉంటాను కవచంగా” అన్నది. కృష్ణభిక్షుగారు బ్రహ్మచారి. వివాహమాడలేదు. మొదటిసారి అమ్మపాదాలు పట్టుకున్నప్పుడు కంటి వెంటనీరు జలజలా వర్షించాయి. ఆ కన్నీటితో అమ్మ పాదాలు కడిగారు.
“ఏం జనించు తృష్ణ? మదినెల్ల వికర్షణ సేయ దృశ్యముల్
ఏలకొ యింద్రియంబులవి యీడ్చెడు నన్నిటు దృశ్యపంక్తికై
బాలుడనే పరుల్ ననువిపన్నుని జేయగ? నేనెవండు ని
త్యాలఘుబ్రహ్మమేనయనుచు ఆర్యులు చెప్పగ వింటిగాదెమున్” అని చింతతో విచికిత్స చేసుకొంటారు. అమ్మను గూర్చి ఎన్నో పద్యాలు వ్రాశారు. అమ్మ పాదాలపై తలను వాల్చితే అమ్మ ఆయన తలను తన చల్లనిచేతితో నిమిరింది. సకల శాస్త్రాలు, కావ్యాలు తెలిసిన అమ్మ ఏమీ తెలియని దానిలా ప్రజలను మాయలో ముంచే మహామాయ అంటారు. ద్వేషభావం నిండి నిబిడీకృతమై యున్న ఈ జగత్తులో అమ్మ ఉన్నచోట ఒక్క ప్రేమ మాత్రమే. ఉంటుంది అంటారు కృష్ణభిక్షు అమ్మ చూపును వర్ణిస్తూ
అదియొక దివ్యసన్నిధి మహాద్భుత సౌఖ్యములుల్లసిల్లు న
య్యది యిహలోకవాసికి సుధాంబుది చెంగట వెల్లదీవి మే
మిది యిట గాంచుటెల్లను మహేశుపదంబుల గొల్చు పుణ్య మా
పదలకు దవ్వుచోటునను పావను చేయును మాతృవీక్షయే
అమ్మ చూపు చాలు ఆపదలు బాపి పావనుని చేయటానికి అని భావిస్తారు.
“అమ్మ యను టొక్కటే గాని అన్యమెఱుగ
అమ్మ జీవుల కమృతమ్ము నందియిచ్చు
అమ్మ వాత్సల్య మధురిమ ననుభవింతు
అమ్మ అందరకును తల్లి యనుట నొప్పు”
నేను అమ్మను చూడటం కాదు. అమ్మే నన్ను చూస్తుంది. అమ్మ అమ్మగాబట్టి తప్పదు. అది అమ్మ సహజ సిద్దమైన లక్షణం” అంటారు శ్రీకృష్ణభిక్షుగారు. 1970 సంవత్సరంలో అమ్మలో ఐక్యమైన శ్రీ కృష్ణభిక్షుగారు ధన్యులు.