భాషారూప పదార్థ సారమయ శబ్ద బ్రహ్మ చైతన్యమే
శేషాహిన్ తన నోట దాల్చి అపర శ్రీదేవియై శారదా
యోషాకారము పూని వచ్చి, ఇటు సృష్ట్యుద్యత్కలా తత్వ పీ
యూషంబున్ మనకిచ్చు అర్కపురి చిజ్యోతిన్ మదిన్ కొల్చెదన్
ఈ పై పద్యం వ్రాయాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. అటు ప్రాచీన శాస్త్ర పరిజ్ఞానము, ఇటు అర్కపురి అనసూయాదేవి తత్త్వవైభవము, ఛందోమయ విజ్ఞానము, భాషపైన పరిపూర్ణ పటిమ, ఉన్నవాళ్ళు మాత్రమే నిర్మించగల, పద్య విద్య తెలిసినవారు మాత్రమే చేయగల శిల్పి చేతి చెక్కడం. ఈ పద్యం.
ఈ పని చేసినవారు శ్రీ కొమరవోలు వెంకట సుబ్బారావుగారు. మనకు కొమరవోలు గోపాలరావు. గారు – సరోజినక్కయ్య తెలుసుగాని ఈ వెంకట సుబ్బారావు గారంతగా తెలియదు. కాని అమ్మను గూర్చి అమ్మ సిద్ధాంత సార్వభౌమత్వాన్ని గూర్చి శ్రీపాదవారివలె పరిశోధన చేసి, అమ్మ తత్త్వాన్ని ఇంతగా అధ్యయనం చేసినవారు మరొకరు లేరేమో అనిపిస్తుంది.
అందుకే పొత్తూరి వెంకటేశ్వరరావు వీరిని గూర్చి పలుకుతూ “నేను జిల్లెళ్ళమూడిలో చూచిన పండితులలో, కోవిదులలో భద్రాద్రి రామశాస్త్రిగారు, కృష్ణభిక్షుగారు, ప్రసాదరాయ కులపతిగారు, కొమరవోలు వెంకట సుబ్బారావుగారు ఒక ప్రత్యేక శ్రేణికి చెందినవారు. వెంకట సుబ్బారావుగారు వృత్తిరీత్యా వైద్యులైనా ఆధ్యాత్మిక రంగంలో ఎన్నో గ్రంథాలను చదివి సాధన చేసినవారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వంటి మహానీయుల ప్రశంసలందుకున్న కవి అవధాని” అన్నారు.
డాక్టర్ సుబ్బారావుగారు అమ్మతో సుదీర్ఘమైన సంభాషణలు చేశారు. వారి అనుభవాలు వారికి ఉన్నాయి. ఒకసారి అమ్మ మనం చేసే పనులలో మన బాధ్యత ఎంత ఉన్నదో వివరిస్తూ “చేసేవాడు చేయించేవాడూ వాడే అనుకున్నప్పుడు నీకెలాంటి పాపపుణ్యాలూ లేవు అని భావిస్తున్నాను” అన్నది. అప్పుడు సుబ్బారావుగారు “ఒకడు మరొకడ్ని చంపుతున్నాడు అంటే అది వాడి వల్ల జరిగే జరుగుతున్న పని కాదనుకోమంటావా?” అని అడిగారు. అందుకు అమ్మ “అలాగే అనుకో నాన్నా!” అన్నది. అప్పుడు సుబ్బారావుగారు “అదేమిటమ్మా! అలా అంటావు! నీ సిద్ధాంతమే నిజమని భావిస్తే ఒకడు మరొకడిని చంపి అలా చంపబడడం తన వల్ల జరుగుతున్నది కాదనీ ఆ భారం దైవం మీదికి త్రోసి తప్పుకోడూ!” అన్నారు. అందుకు అమ్మా “అలాగా! పదనాన్నా! నీ కొక కత్తి ఇస్తాను గానీ, నీవే చంపుతున్నావు అనుకొని నలుగురిని చంపిరా! చూస్తాను. అలా నీవు చంపినందువల్ల వచ్చే పాపానికి నేను బాధ్యత వహిస్తాను” అన్నది. అలా అమ్మ ఛాలెంజి చేసి అనేటప్పటికి మతిపోయింది సుబ్బారావు గారికి. అప్పుడు అమ్మ “ఆ పై వాడి ప్రయత్నమంటూ లేనిదే ఎవడ్నీ ఎవరూ చంపలేడు. ఆ చంపేవాడు, చంపబడేవాడూ అంతా వాడి నిర్ణయమే నాన్నా!” అన్నది. ఇదే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పాడు. “ద్రోణుడు, భీష్ముడు, జయద్రధుడు, కర్ణుడు మొదలైన వీరులంతా ఇదివరకే నా చేత చంపబడ్డారు. బాధపడక యుద్ధం చెయ్యి. శత్రువులను నువ్వు జయిస్తావు” అని. “కనుక చేసేవాడూ, చేయించేవాడూ వాడే నీకెలాంటి పాపపుణ్యాలు లేవు” అని అమ్మ అన్నది నిజం.
ఎవరో అడిగారు అమ్మను “మేం మాంసాహారులం మరి హింస పాపం కాదా! మేమేం చెయ్యాలి? ఆహారం కోసం చేసేది పాపం కాదని కొందరంటారు. కాదు హింసే అంటారు కొందరు. ఏది నిజమమ్మా ! అని. అప్పుడు అమ్మ “సహించలేనిది హింస నాన్నా! మేకలను కోసేవాడు ఆవులను నరకడం సహించలేదు. కోళ్ళను కోసేవాడు గొజ్జెలను చంపడం చూడలేదు. సర్వం ప్రాణమయమే అనుకున్నప్పుడు అన్నం తినడమూ, కూరగాయలు కోయడమూ, మంచినీళ్ళు త్రాగడమూ కూడా హింసే. ఏది హింస? ఏదికాదు? అన్నది సమస్య కాదు. ఎవరు ఏది సహించలేరో అది హింస. కాబట్టి దానిని మానుకుంటే సరి – అదీ మానుకో గలిగితే” అని సమాధానం చెప్పింది.
ఒకసారి సుబ్బారావుగారు “అమ్మ” “నేను”లోని అందం అనే వ్యాసాన్ని చదివి “వాక్” అనే ఋషికన్య విశ్వమంతటితోనూ తాదాత్మ్యం చెంది వెల్లడించిన దేవీ స్తోత్రంలోని విశేషాలను వినిపిస్తున్నారు అమ్మకు. అప్పుడు అమ్మ ‘నాన్నా! దేవీ ఉపనిషత్తని ఉంది కదూ! అన్నది. సుబ్బారావుగారు అద్భుత మహర్షిపుత్రిక “వాక్” అనే ఋషికన్య చెప్పిన దేవీ స్తోత్రానికీ, దేవీ ఉపనిషత్క సంబంధం ఉంటుందని వారు గ్రహించలేదు. తరువాత వారు ఆ ఉపనిషత్ చదివి అమ్మ చెప్పిన ఆ విషయానికి విభ్రాంతులై పోయారు. అమ్మ ఇది ఎప్పుడు చదివిందా అని
ఆ ఉపనిషత్తులోని విషయాలను అమ్మ చెప్ప వాక్యాలను అన్వయం చేస్తూ “నేను నేనైన నేను” అనే వ్యాసాన్నీ, ఒక కావ్యాన్నీ వ్రాశారు. అంతగా అమ్మ తత్వాన్ని ఇమిడ్చి వ్రాసిన గ్రంథం మరొకటి లేదని చెప్పాలి. ఇంతేకాదు వారు భగవద్గీతను ‘మాతృగీత’ అనే పేరుతో ప్రతి శ్లోకానికి అమ్మ చెప్పిన వాక్యాలతో అన్వయం చేస్తూ మహాద్భుతమైన వ్యాఖ్యానం వ్రాశారు. అది చూచిన పొత్తూరివారు సుబ్బారావుగారిని గూర్చి “సాంసారిక జీవితం సాగిస్తూనే. ఆధ్యాత్మిక సాధనలో పురోగతిని సాధించిన ఋషితుల్యుడు” అన్నారు. అది నిజమే.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు వీరిని గూర్చి పలుకుతూ “ఈ కవి మిత్రుని పలుకులు చీకట్ల కడలిలో తారా కనక దీపకళికలు” “చెరగని సత్యము రవంతము తరగని ప్రేమ ప్రవాహాలు నిలుచుగాక కలకాలము” అన్నారు. ఎప్పుడో అరవై సంవత్సరాలకు పూర్వమే రాయప్రోలు – విశ్వనాధ వంటి మహాకవుల సరసన భారతిలో చోటు చేసుకున్నవి వీరి రచనలు.
భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునకు యుద్ధరంగంలో చెప్పితే వీరు ‘మాతృగీతను’ బంగ్లాదేశ్తో భారత యుద్ధం చేస్తున్నప్పుడు బంకర్లలో కూర్చుని వ్రాసారు. అప్పుడు సుబ్బారావుగారు మిలటరీలో ఆనరరీ లెఫ్టినెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. వీరు మాతృగీత, “నేను నేనైన నేను” అనే గ్రంథాలే కాక ప్రత్యూషము, రాగసుధ, అమరశ్రీ, చెకుముకిరవ్వ, భ్రమరాంబాద్రియశతకం, యామాసా, ఉగ్రభారతి, పరమాణుగాథ, సప్తశతి, ఛిన్నమస్త, మృత్యులగ్నం, దశమహావిద్యలు, హాలోగ్రామ్స్, బయోరెతిమ్స్ అండ్ రేడియానిక్స్, చిన్న కథలు, మహావంశము, ఈశావాశ్యోపనిషత్, పరిగె పిట్టలు, సర్వజిహ్వ వంటి ఎన్నో గ్రంథాలు శ్రాశారు.
1911లో గుంటూరుజిల్లా అంగలకుదురులో కొమరవోలు పెంచలరావు మణెమ్మలకు జన్మించిన శ్రీ సుబ్బారావుగారు స్టేట్ ఎక్సైజ్, రెవెన్యూ విభాగాలలో ఉద్యోగం చేస్తూ మిలటరీలోకి వెళ్ళి ఆనరరీ లప్ట్నెంట్ గా పదవీ విరమణ చేశారు. తరువాత మాతృశ్రీ ఎక్స సర్వీస్ మెన్స్ ఫ్రీ (ఉచిత) హోమియో డిస్పెన్సరీ, మాగ్నెట్ రేడియానిక్ వైద్యము చేశారు. సంగీతంలో, కిర్లియన్ ఫోటోగ్రఫీ, రేడియోనిక్ యంత్రనిర్మాణము, యోగసాధన, తాత్విక పరిశోధన, ఆకుపంక్చర్, జంత్ర వాద్యము, వైజ్ఞానిక పరిశీలన వంటి విషయాలలో ఆరితేరారు.
1985 ది రేడియానిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించి, ఆ థెరపీలో చికిత్సపై పరిశోధనలు చేసి వాటి ఫలితాలను ప్రజలకందించారు. సహస్ర చంద్ర దర్శనోత్సవం జరిగిన తర్వాత కూడా అలుపెరుగని సైనికుని వలెనే జీవితాంతం, శ్రమించి 90 సంవత్సరాల వయస్సులో అమ్మలో లీనమైనారు.
అమ్మతత్త్వ సందర్శనం చేసిన మహనీయ వ్యక్తులలో శ్రీ కొమరవోలు వెంకట సుబ్బారావుగారు విశిష్టులు అని నిస్సంశయముగా చెప్పాలి. వారి జీవితం నిజంగా ధన్యం.