అమ్మ ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎన్నుకుంటుందో మనకు తెలియదు. అమ్మ ప్రణాళిక చాల చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఆశ్చర్యము, అద్భుతము అనిపిస్తుంటుంది. 1959లో సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు శ్రీ కోటంరాజు రామారావు గారు అమ్మ వద్దకు వచ్చి అమ్మను చూచి, అమ్మ వాక్కులు విని ఆనందంతో తన్మయుడై, అమ్మా! మిమ్మల్ని గూర్చి పత్రికలో వ్రాయటానికి అనుమతివ్వమని అర్ధించాడు. ఎందుకు నాన్నా! నీవే పత్రిక చూచి వచ్చావు? అని అడిగింది. అలా కాదమ్మా! ఈ ఆనందం అందరూ అనుభవించాలి. జీవితాలు అమృతమయం చేసుకోవాలి అన్నారు. అపుడు అమ్మ ఎవరికి తరుణం వస్తే వారు వస్తారు అన్నది. నిజమే అమ్మ అనుగ్రహమే తరుణంగా వస్తారు అమ్మ వద్దకు. ఎందుకంటే “నేను అనుకుంటేనేగా ఇక్కడకు వచ్చేది. లేకపోతే నేను ప్రక్కన నడుస్తున్నా నన్ను గుర్తించలేరు” అన్నది. మనం ఎంత అదృష్టవంతులం. మనల్ని అమ్మ తన ఒడిలోకి లాక్కున్నది. అలా వచ్చిన వారిలో క్రోసూరు కరణం శ్రీ కొమర రామకోటేశ్వరరావు గారు ఒకరు.
మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీ కొమర బక్కయ్య వెంకటరమణమ్మలకు 1919 ఏప్రియల్ 23వ తారీకున క్రోసూరు గ్రామంలోనే జన్మించారు రామకోటేశ్వరరావుగారు. గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకాలో ఉన్న ఒక కుగ్రామం అది. ఆ ఊరి కరణీకం వారిది. తండ్రి వ్యసాయదారుడు కావడంతో అంతంత మాత్రపు బ్రాహ్మణ వ్యవసాయంతో తన 15వ యేటనే కరణీకాన్ని స్వీకరించి కుటుంబాన్ని పోషించవలసి వచ్చింది. సహజంగా చిన్నప్పటి నుండీ పద్యాలు వ్రాయం కూడా అలవాటయింది. బాల్యం నుండి వంశ పరంపరగా వచ్చిన ఆధ్యాత్మిక చింతన, కవితావాసనతో వారు “రామశతకం” కూడా వ్రాశారు.
అమ్మను మొదటిసారి దర్శించినపుడు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముని గుండేలురావుగారిలా అమ్మలో దర్శించి తరించిన మహానీయుడు.
రామకోటేశ్వరరావు గారు భృగుబండ నారాయణరావు గారు – తిరుమలక్కయ్యలు అమ్మను గూర్చి చెప్పటంతో 1959లోనే అమ్మను దర్శించారు. అప్పటికే తాను కరణంగా చేస్తుండటంతో, జిల్లెళ్ళమూడి కరణీకం నాన్నగారు (బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు) కావటంతో ఇద్దరికీ సాన్నిహితం ఏర్పడ్డది. ఎప్పుడు జిల్లెళ్ళమూడి వచ్చినా నాన్నగారితో సంప్రదింపులు జరుపుతుండేవారు. అమ్మ పెద్దకుమారుడు సుబ్బారావుతోనూ అలాగే పరిచయం పెరిగింది.
పైగా నాన్నగారు క్రోసూరు, భృగుబండ దగ్గరలో గల మొక్కపాడులో పొలం తీసుకొని దొర పొగాకు పండిస్తూండేవారు. ఆ కారణంగా నాన్నగారు, సుబ్బారావు క్రోసూరు వెళ్ళటం అక్కడ రామకోటేశ్వరరావు గారింట్లో విశ్రాంతి, భోజనాలు చేయటం జరుగుతుండేది. ఇటు అమ్మ భక్తి – నాన్నగారిసేవ రెండు సమపాళ్ళలో రామకోటేశ్వరరావు గారికి అందటం వారి అదృష్టం.
అమ్మ గూర్చి తెలిసిందగ్గర నుండి తమ గ్రామంలోనూ చుట్టుప్రక్కల గ్రామాలలోనూ అమ్మను గూర్చి తెలియచేయాలనే తపన రామకోటేశ్వరరావు గారిలో మొదలైంది. అందుకు మాధ్యమాలుగా అమ్మ నామసంకీర్తన చేయించటం, అమ్మను గూర్చి నలుగురికి ఉపన్యాసాల ద్వారా తెలియచేయటం, అమ్మ చరిత్రను హరికథల రూపంలో చెప్పించటం, సోదరుడు కాసు రాధాకృష్ణరెడ్డి (అంధుడు – సంగీత విద్యాంసుడు – నాదయోగి)ని తీసుకొని వెళ్ళి అమ్మ నామ సంకీర్తనలు ఏకాహాలు పెట్టించేవారు. ప్రతి శుక్రవారం పూజలు – సంకీర్తనలు చేయించేవారు. ఇంట్లో, రామాలయంలో కార్యక్రమాలు – నిర్వహించి గ్రామస్థులందరినీ ఆహ్వానించి ప్రసాదాలు, అమ్మ ఫొటోలు, కుంకుమ పొట్లాలు పంచేవారు. మరొక అంధసోదరుడు యార్లగడ్డ రాఘవయ్యగారిని గ్రామానికి తీసుకొని వెళ్ళి అమ్మ హరికథా గానం చేయించేవారు. ఆ రకంగా గ్రామంలో అమ్మను గూర్చి ప్రతి ఒక్కరికి తెలియచేయటం ఒక విశేషం. శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారి తండ్రి అనంతరామయ్యగారు వచ్చి అమ్మ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూండేవారు. రామకోటేశ్వరరావుగారి కోరిక మేరకు మాతృశ్రీ సంస్కృత కళాశాల ఉపాధ్యాయులను వారి ఊరు పిలిపించి అమ్మను గూర్చి ఉపన్యాసాలిప్పించి జిల్లెళ్ళమూడిలో జరిగే అన్నదాన, విద్యాదాన, వైద్యదాన కార్యక్రమాలను గూర్చి చెప్పించటంతో గ్రామ ప్రజలలో కూడా తమ వంతు సేవ చేయాలనే భావం కల్గించారు. ఆ రకంగా శ్రీమన్నారాయణ మూర్తిగారు, ఝాన్సీగారు, శిష్టి – కుమారశర్మగారు వంటి పండితులు ఆ ఊరు దర్శించి అన్నపూర్ణాలయానికి తగు సహాయాన్ని కూడా తేగలిగారు.
శ్రీ రామకోటేశ్వరరావుగారికి సంతానం లేకపోవటం వల్ల వారి తమ్ముడైన కట్టమూరి కరణం శ్రీ కట్టమూరి హనుమంతరావుగారి జ్యేష్ఠపుత్రుని చిన్న తనంలోనే దత్తత తీసుకొని అమ్మ సన్నిధిలో ఉపనయనం చేయించారు. బ్రహ్మోపదేశం చేసే సమయంలో భద్రాద్రి రామశాస్త్రిగారు అమ్మతో వాడికి “జ్ఞానభిక్ష” పెట్టమ్మా! అని అభ్యర్థించారు. అమ్మ జ్ఞానం అంటే ఏముంది నేను పెట్టే భిక్ష “బియ్యాన్ని బియ్యంగా గుర్తించటమే”గా అన్నది. అవును దేనికైనా దాని అసలు స్వరూపాన్ని గుర్తించటమే జ్ఞానం. వేదాలు, పురాణాలు, ఈ శాస్త్రాలు చదివి గ్రహించలేకపోతున్న విషయ పరిజ్ఞానాన్ని ఎంత సులువుగా చెప్పింది అమ్మ. కాని దాన్ని దానిగా గుర్తించే శక్తి కూడా అమ్మ ఇవ్వాల్సిందే. లేకపోతే దానిలోని అంతర్యామిత్వాన్ని గుర్తించలేము.
జిల్లెళ్ళమూడిలో హైమకు సంస్కృత పాఠాలు చెప్పి హైమాలయంలో ప్రథమ అర్చకునిగా పనిచేసిన పండిత శ్రేష్ఠుడు శ్రీ రాయప్రోలు భద్రాద్రి రామశాస్త్రిగారు, గుంటూరు రామచంద్రాపుర అగ్రహారం శివాలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ పన్నాల వెంకట లక్ష్మీనారాయణశాస్త్రిగారు తమకు స్వాతంత్య్ర సమరవీరుల క్రింద ఇచ్చిన పొలం అమ్మకు దఖలు దస్తావేజు వ్రాయించి ఇచ్చారు అన్నదానం కొరకు దానిని ఈ మధ్యనే మన శ్రీ విశ్వజననీపరిషత్వారు అమ్మి జిల్లెళ్ళమూడిలో ఒక స్థలం తీసుకున్నారు కూడా. అమ్మకు దాఖలు పరచిన ఆ యిరుకుంటుంబాల వారి కుమారులు, మనుమలు కూడా అమ్మను దేవతగాను నమ్మి సేవ చేస్తున్నారు.
ఇక రామకోటేశ్వరరావుగారి పుత్రుడు, మనుమలు – వారి తమ్ముని పుత్రులు, మనమళ్ళు అమ్మ సంస్థకు ఇతోధిక సేవచేస్తున్నారు- అందులో ఒకరైనా శ్రీ కట్టమూరి వెంకటేశ్వరరావు శ్రీ విశ్వజననీ పరిషత్కు కొంతకాలం
ట్రెజరర్గా పనిచేసి, ప్రస్తుతం కార్యవర్గ సభ్యునిగా పనిచేస్తున్నారు. మామూలుగా ఏ సంస్థకైనా తాము సేవ చేయటం వరకు అది తమ అభిమతం. కానీ తమ సంతానాన్ని, తమ సంతాన సంతానాన్ని, తమ బంధువర్గాన్ని కూడా ఆ సంస్థ సేవలో ఉంచగలగటం గొప్ప విషయం. అలాంటి వారు కొద్దిమంటే ఉంటారు. అలాంటివారిలో శ్రీ రామకోటేశ్వరరావు గారు కూడా ఒకరు కావటం ఆదర్శనీయం. ఆ రకంగా అమ్మ సేవలో తనువు వదిలినా తరతరాలుగా సేవిస్తున్న ధన్మజీవి. 1982 జూలై ఆరవ తేదీన అమ్మలో లీనమైనారు.