గుంటూరు జిల్లాలో బాపట్ల తాలూకాలో జిల్లెళ్ళమూడికి దగ్గరగా పెదనందిపాడుకు రెండు కి.మీ. దూరంలో ‘కొమ్మూరు’ అనే గ్రామం ఉన్నది. కొమ్మూరులో ఉన్న ‘అగస్తేశ్వరాలయం’ చాలా ప్రాచీనమైనది చారిత్రక ప్రసిద్ధి వహించింది. ఆ ఆలయానికి పూజారి జంధ్యాల మల్లయ్యశాస్త్రిగారు. మల్లయ్య శాస్త్రిగారు లలితా సహస్రనామాలతో 1958-59లలోనే అమ్మను అర్చించుకొన్న మహానుభావుడు.
కొమ్మూరులో గంగరాజు లోకనాథం గారని రాజుబావ మేనమామ ఉండేవారు. గంగరాజు శ్రీధరరావుగారు, గంగరాజు సూర్యప్రకాశరావుగారు, గంగరాజు చిదంబరరావుగారు అందరూ దాయాదులే. అమ్మ తరచుగా కొమ్మూరు వాళ్ళ ఆహ్వానంపై వెళుతుండేది. లోకనాథం గారికి అమ్మంటే పరమవిశ్వాసం. ఏ మాత్రం ఒంట్లో బాగాలేకపోయినా తనకే కాదు తన ఇంట్లో ఎవరికి బాగా లేకపోయినా అమ్మ వద్ద నుండి కుంకుమతీర్థం తెప్పించుకోవటం అలవాటు. అంతటి విశ్వాసంతో అమ్మను తన ఇంటికి ఆహ్వానించుకొని పూజించుకొనేవాడు. ఆ పూజాకార్యక్రమ నిర్వహణ శ్రీ మల్లయ్యశాస్త్రిగారు చేసేవారు.
కొమ్మూరు నుండి అమ్మ అనారోగ్యంతో ఉంటే మందులివ్వటానికి శ్రీ అనంత శీతాచలంగారని ఒక ఆర్.యం.పి. డాక్టరుగారు వచ్చేవారు. అమ్మకు మందులు, ఇంజక్షనులు ఇచ్చే సందర్భాలలో అమ్మలోని అతిమానుషశక్తిని దర్శించిన మహానుభావుడు. తర్వాత సంస్థ నిర్వహణ బాధ్యత, ఆలయ నిర్మాణ బాధ్యతలలో పాలుపంచుకొన్నవాడు. శీతాచలంగారు ప్రతి ఉగాదికి అమ్మకు పూజచేయటానికి శ్రీ మల్లయ్యశాస్త్రిగారిని కొమ్మూరు నుండి జిల్లెళ్ళమూడి తీసుకొని వచ్చేవాడు. అమ్మకు ఆయన పూజచేయించే విధానం నచ్చేది. అలా ప్రతి ఉగాదికి, అమ్మ పుట్టినరోజు పండుగలకు మల్లయ్య శాస్త్రి గారు జిల్లెళ్ళమూడి వస్తుండేవారు.
మల్లయ్య శ్రాస్తిగారు జంధ్యాల పరదేశయ్య మహాలక్ష్మమ్మల అయిదుగురు మగపిల్లలలో నాల్గవవారు. మల్లయ్యశాస్త్రి – రామలక్ష్మమ్మ కవల పిల్లలు. మల్లయ్యశాస్త్రిగారు తల్లిపోలిక. తండ్రిపోలికతో ఆడపిల్లలు, తల్లి పోలికతో మగపిల్లలు పుడితే అదృష్టవంతులౌతారు అంటారు. జగన్మాత, జగదీశ్వరి అమ్మను పూజించుకునే అవకాశం పొందటం అదృష్టమే కదా! అదృష్టాన్ని దృష్టం చేసుకొన్న పుణ్యపురుషుడు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు మల్లయ్యశాస్త్రిగారి తమ్ముడే – కరుణశ్రీ కూడా అమ్మను దర్శించుకున్నారు. పద్మపుష్పార్చన చేశారు.
మల్లయ్యశాస్త్రిగారు నిత్యాభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్న అగస్త్యేశ్వరాలయానికి అమ్మ చాలాసార్లు వెళ్ళింది. వారి అభిషేకాలు, పూజలు చూచింది. ఆ నిష్ఠ, ఆ విధానము, ఆ ఈశ్వరార్చన కళాశీలత, ఆ పార్వతీ పాదపద్మ సమారాధనలే అమ్మ మనసును ఆకర్షించాయి. తన బిడ్డగా ఆదరించింది. ప్రేమించింది. వారింటికి వెళ్లి ఆ యింటిని పావనం చేసింది. వారి శ్రీమతి కృష్ణవేణమ్మ గారికి మంత్రోపదేశం చేసింది. అసలు మల్లయ్యశాస్త్రిగారి తండ్రి పరదేశయ్యగారు శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శనం చేసుకొన్న పిమ్మట పుట్టినవాడు కావటంతో మల్లయ్య అని బిడ్డకు పేరు పెట్టుకున్నారు.
మల్లయ్య శాస్త్రిగారు శివానంద భారతీస్వామివారి వద్ద స్మార్తం తర్క మీమాంసాదులు అధ్యయనం చేశారు. శ్రీ కుప్పా ఆంజనేయశ్రాస్త్రిగారి వద్ద కాళిదాస కావ్యాలు పఠించారు. వారి సోదరులంతా ఆగమశాస్త్ర కోవిదులే. కొంతకాలం ప్రత్తిపాడు సమీపంలోని యామర్రు గ్రామంలో అర్చకులుగా చేసి తదనంతరం కొమ్మూరుకు చేరారు. అర్ధశతాబ్దం పాటు అగస్త్యేశ్వరాలయంలో పార్వతీ, పరమేశ్వరుల సేవలో చరితార్థులైనారు. పరుష వాక్యమెరుగని మృదుస్వభావులు మల్లయ్యగారు. వారి ఆరుగురు కుమారులలో సుప్రసిద్ధుడైన మహతీశంకర్ మన అమ్మ పెద్దబిడ్డ సుబ్బారావుతో కలసి బాపట్లలో చదువుకొన్నాడు.
మల్లయ్యశాస్త్రిగారు అమ్మ యెడల అచంచల విశ్వాసం కలవారు. ఏ పాదాలకు పూజచేసినా నాకే అందుతుంది అన్న అమ్మ వాక్యానికి నిదర్శనంగా అవకాశం దొరికినపుడల్లా జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మకు పూజ చేయించేవాడు. మిగతా సమయంలో అగస్త్యేశ్వరాలయంలో పూజలలో, అభిషేకాలలో నిమగ్నమై ఉండేవారు. 1909లో జన్మించిన మల్లయ్యగారు 1989లో అశీతి వత్సరాలు నిండిన సమయంలో అమ్మలో లీనమైనారు.