1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (జమ్మి వెంకటరత్నం)

ధన్యజీవులు (జమ్మి వెంకటరత్నం)

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 14
Month : January
Issue Number : 1
Year : 2015

అమ్మచేత ‘రత్నంబాబు’ గా ఎంతో మందికి ‘గాడ్ఫాదర్’ గా బాధాతప్త హృదయులకు ఆత్మబంధువుగా, జిల్లెళ్ళమూడి సోదరులందరిచే ఆత్మీయతా ముద్ర వేయించుకొన్న జమ్మి వెంకటరత్నంగారికి జిల్లెళ్ళమూడితో అనుబంధం ఏర్పడటం కూడా ఒక విచిత్రమూ, విశిష్టమూ అయిన సన్నివేశమే.

సోదరుడు శ్రీ బ్రహ్మాండం సుబ్బారావు (అమ్మ పెద్దకుమారుడు) 1967లో జిల్లెళ్ళమూడి అందరింటికి టెలిఫోను సౌకర్యం కలిగించటానికి ప్రయత్నిస్తున్న రోజులలో యాదృచ్ఛింగా హైదరాబాద్ పోష్టు మాస్టర్ జనరల్ ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వెంకటరత్నం గారిని కలవటం తటస్థించింది. ముందుగా అమ్మ ముఖచిత్రం ఉన్న మాతృశ్రీ మాసపత్రికను, కుంకుమ పొట్లాలను వారికి ప్రసాదంగా ఇచ్చాడు. ఆ చిత్రంలోని అమ్మచూపు ఆయనలో ఏదో ఆకర్షణ కలిగించి వివరాలడిగి తెలుసుకోవటం జరిగింది. సుబ్బారావు తానెవరో చెప్పకుండా అమ్మను గూర్చి విశేషాలు, జిల్లెళ్ళమూడి క్షేత్ర విశిష్టత చెప్పి హైదరాబాదులో గల కొందరు అమ్మ భక్తులను గూర్చి చెప్పాడు. వెంకటరత్నం గారి ఉత్సుకతను చూచిన సుబ్బారావు తంగిరాల శాస్త్రిగారింట్లో జరిగే పూజకు తీసుకొని వెళ్ళాడు. ఆ పూజ ఆ పద్ధతి అక్కడికి చేరిన వారిలోని ఆప్యాయత సోదర సోదరీ భావం చూచిన వెంకటరత్నం గారి మనసులో అమ్మ పట్ల అత్యంత భక్తిభావం చోటుచేసుకున్నది. అంతకు ముందుగానే జిల్లెళ్ళమూడి అమ్మననీ, రాజరాజేశ్వరిననీ ప్రచారం చేసుకుంటున్న మన్నవ మంగమ్మగారిని గూర్చి తన స్నేహితుని ద్వారా విని తన ఇంట్లో ఆమె పూజ ఏర్పాటు చేయాలనుకున్న వెంకటరత్నం గారు వాస్తవాలు తెలిసికొని ఆ పూజా విరమించుకొన్నారు.

శాస్త్రి గారింట్లో పూజ చూచిన రత్నంబాబు తన కొత్తగా కట్టుకున్న యింట్లో కూడా అమ్మ పూజా పెట్టుకుంటే బాగుందే అనుకున్నారు. ఆశ్చర్యమేమిటంటే వారింట్లో పూజ పెట్టుకున్న రోజుననే అమ్మ ఉన్న అందరింట్లో ఫోను రావటం ఫోనును అందుకోవటం వెంకటరత్నం గారికి ఫోను చేయటం ఆయనతో మాట్లాడటం అంతేకాదు ఆ రోజు పూజలో ఉన్నవారితో, ఇంట్లో వారితో మాట్లాడటం అమ్మ నిర్ణయంలో ఒక భాగం. వెంకటరత్నం గారికి మహదానందం కలిగింది. పూజలో జరిగిన ఇంకొక విచిత్ర మేమిటంటే అమ్మ ఆ పూజలో పెట్టిన నివేదన స్వీకరించింది అనే దానికి నిదర్శనంగా అమ్మ మీరంతా గారెలలో పచ్చడి వేసికొని తింటూ నాకు పచ్చడి వేయకుండా పెట్టారే అని అడగటం. అప్పుడు నివేదన వైపు చూచారు వెంకటరత్నంగారు నిజమే ఆ నివేదనలలో పచ్చడి వేయలేదు. ఆయనెంతో మనసు నొచ్చుకొని నిర్ఘాంతపోయి అమ్మను క్షమించమని మనస్సు లోనే వేడుకున్నారు. అమ్మ శారీరకంగా జిల్లెళ్ళమూడిలో ఉన్నా సర్వత్రా ఉండి మనల్ని గమనిస్తూ మనలను తీర్చిదిద్దగలదు అనే నమ్మకం ఏర్పడింది.

అప్పటి నుండి జిల్లెళ్ళమూడికి సంబంధించిన ప్రతికార్యక్రమంలోనూ ఇటు హైదరాబాదులో అటు జిల్లెళ్ళమూడిలో పాల్గొంటూ వచ్చారు. 1967లో మొదలైన వారి జిల్లెళ్ళమూడి రాక …. వారి జీవితాంతం కొనసాగించారు. 1968లో హైమ ఔరంగాబాదు నుండి అనారోగ్యంతో హైదరాబాదు వచ్చింది. ఆ సమయంలో 20 రోజులపాటు వారు నిత్యం డాక్టర్ భూమన్న అనే హోమియో వైద్యుని దగ్గర నుండి మందులు తెచ్చి వల్లూరి మోహనరావు గారింట్లో ఉన్న హైమకు ఇచ్చేవారు. అతి సున్నితమైన హైమ మనస్సును తన సేవతో ఆకర్షించారు.

అలాగే శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మగారు జిల్లెళ్ళమూడిలో సంస్కృతకళాశాల కార్యక్రమాలలో తలమునకలవుతూ వారింటికి చేరితే తన యింట్లో సాదరంగా ఆతిథ్యమివ్వటమే గాక వారిని వెంటబెట్టుకొని ఎంతోమంది వద్దకు ఆర్థిక సహాయం కొరకు తీసుకొని వెళ్ళేవారు. వెంకటరత్నంగారు విశ్వకుటుంబభావన గల ఉదారశీలి. నిరాడంబరుడు, నిష్కల్మష హృదయుడు, నీతినిజాయితీలు మూర్తీభవించిన వ్యక్తి, సాధుభూషణుడు, అమ్మ ఏర్పరచిన సోదరీ సోదరుల యెడ అవ్యాజమైన ప్రేమను చూపే సహజ సజ్జనుడు. హైదరాబాదులోని అమ్మ బిడ్డలందరినీ వారి ఆహ్వానంతో నిమిత్తం లేకుండా తరచుగా దర్శించి వారి యోగ క్షేమాలను విచారించే పుణ్యపురుషుడు. అమ్మ పూజ ఎక్కడ జరిగినా భక్తిశ్రద్ధలతో ఆ కార్యక్రమాలలో పాల్గొనేవారు.

హైదరాబాదు విద్యానగర్ కమ్యూనిటీహాలులో 1970లో హైదరాబాదులోని మాతృశ్రీ అధ్యయనపరిషత్, శ్రీ విశ్వజననీ పరిషత్ సహకారంతో అమ్మ ఉత్సవాలు జరిపింది. శ్రీ తంగిరాలు సింహాద్రిశాస్త్రి, శ్రీ చంద్రమౌళి వెంకటకృష్ణ వంటి పెద్దలతో కలిసి మూడురోజులపాటు ఆ ఉత్సవాలలో ఒక సుశిక్షుతుడైన కార్యకర్తగా, నిర్వాహకులలో ఒకనిగా నిలచి సుప్రభాతసేవ నుండి రాత్రి సభాకార్యక్రమాలు ముగిసేవరకు శ్రద్ధాభక్తులతో పాల్గొని విజయవంతం చేశారు.

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నిర్మాణానికి, ప్రారంభానికి కావలసిన నిధులు సమీకరించే ప్రయత్నంలో ప్రచురించి ఒక సావనీరు ఉపద్రష్ట మధుసూదనరావుగారి ద్వారా, జి.కె. రావు గారి ద్వారా ప్రకటనలు సేకరించటంలో మన సోదరులకు సహకరించారు. అంతేకాదు వెంకటరత్నంగారు మంచి జ్యోతిషశాస్త్రవేత్త. మాతృశ్రీ కళాశాల ప్రారంభోత్సవానికి అమ్మ ఆశీస్సులతో ముహూర్తం నిర్ణయించింది కూడా వారే. ఈ రోజు రాష్ట్రంలో ప్రముఖ సంస్కృత కళాశాలలో ఒకటిగా జగజ్జేగీయమానంగా సర్వతోముఖాభివృద్ధికి విలసిల్లుతున్నదంటే అమ్మ ఆశీస్సులతో పాటు వారు పెట్టిన ముహూర్తబలం కూడా బాగా తోడుపడ్డాయి.

తన ఉద్యోగవిధులను అసిధారావ్రతంగా నిర్వహించిన వెంకటరత్నంగారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనటమే కాక, అనారోగ్యం ఉన్న తన అవసరమైన సేవలు అందిస్తూ ఆమెకు శారీరకంగా, మానసికంగా స్థైర్యాన్ని కలిగిస్తూ అమ్మ చెప్పినట్లు ఆదర్శ భర్తగా నిలబడ్డారు.

1973లో స్వర్ణోత్సవాలలో లక్షమందికి ఒకే పంక్తిన భోజనాలు పెట్టిన అమ్మ తదనంతరం 1974లో కోటిమందికి దర్శనం ప్రసాదించే మహత్తర కార్యక్రమంలో హైదరాబాదులో శ్రీ టి. రాజగోపాలచారిగారి ఇంటిలో బసచేసింది. నగరంలోని వివిధ మురికివాడలు, అస్పత్రులు, అనాధశరణాలయాలు, పాఠశాలలు పర్యటించినపుడు సేవాకార్యక్రమాలలో కీలకపాత్ర వహించి కార్యకర్తలకు తోడ్పడ్డారు. అదే సంవత్సరం హాలెండ్కు చెందిన జె.యఫ్. నీలాండ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినప్పుడు ఎంతో సేవచేశాడు.

1980లో అమ్మ అనారోగ్య కారణంతో హైదరాబాద్కు వెళ్ళినప్పుడు వైద్య పరీక్షలకు డాక్టర్లను సంప్రదించటంలో, కావలసిన ఏర్పాట్లు చేయడంలో తనవంతు సేవలను అందించారు వెంకటరత్నంగారు.

1924 అక్టోబర్ 6న మద్రాసు మహానగరంలో జమ్మి సంపత్, కృష్ణవేణిలకు జన్మించిన వెంకటరత్నంగారు అక్కడే లయోలా కాలేజీలో బి.ఎ. ఆనర్స్ చదివి రజితపతకాన్ని సాధించారు. “ది హిందూ గ్రూపు” కు చెందిన “హిగ్గిన్ బోధమ్స్” అనే పత్రికలో ఉపసంపాదకులుగా జీవితాన్ని ప్రారంభించి తర్వాత పోస్టు అండ్ టెలిగ్రాఫ్ డిపార్టుమెంట్లో ఉద్యోగస్తునిగా చేరారు. 1948లో శ్రీమతి రామతిలకాన్ని వివాహం చేసుకున్నారు. విజయవాడ, కర్నూలు, హైదరాబాదు వంటి నగరాలలో పనిచేసి 1968లో పోస్టుమాస్టరు జనరల్ ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేశారు. 1981లో అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చి కలకత్తా సర్కిల్కు బదిలీచేయగా అనారోగ్యకారణాలతో ప్రమోషన్ నిరాకరించి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

వెంకటరత్నంగారు అవ్యాజంగా ఇతరులపై చూపే ప్రేమ, ఇతరుల కస్టసుఖాలలో స్పందించే తీరు సహజసిద్ధంగా ఉండేది. ఆత్మీయుల ఆరోగ్యాలను గురించి, వారికి మందులందించడంలో వారు పడే తాపత్రయం, వారికి అమ్మ ప్రసాదం అందించటంలో శ్రద్ధ ఆదర్శనీయంగా ఉండేది. అలా మందులంద జేయబడిన వారిలో ముఖ్యులు శ్రీ దామరాజు సుబ్బారావుగారి శ్రీమతి ఒకరు. శ్రీ వి.యం. ప్రసాదరావుగారి కోడలు ఆక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఆపరేషన్ బల్లపై ఉంటే అమ్మ తీర్థము ప్రసాదము అందించి బంధువులలో విశ్వాసాన్ని కలిగించి ఆమెకు ప్రాణం దానం చేశారనిపించింది.

అమ్మ ఆలయంలో చేరిన తర్వాత జిల్లెళ్ళమూడి రావటం తగ్గిపోయినా సేవాకార్యక్రమాల ఆరాటం మాత్రం తగ్గలేదు. 2004లో అమ్మలో కలసిపోయే దాకా జిల్లెళ్ళమూడి సోదరులతో ఉన్న అనుబంధం నిత్యనూతనంగానే ఉంచుకున్నారు. శిష్టా శాంత లాంటి సోదరీమణులు, తంగిరాల శాస్త్రి, డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మ, శ్రీ దామరాజు సుబ్బారావు వంటి ఎందరో సోదరుల హృదయాలలో సమున్నతమైన స్థానాన్ని సంపాదించుకొన్నారు.

“అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసామ్

ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకమ్” అన్న ఆర్యోక్తికి ఆలంబనగా నిలచిన శ్రీ వెంకటరత్నంగారు మాతృసేవా దురంధరుడైన ధన్యజీవి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!