1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (జిడ్డు ప్రసాద్)

ధన్యజీవులు (జిడ్డు ప్రసాద్)

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 15
Month : April
Issue Number : 2
Year : 2016

శ్రీ భీమరాజు ప్రసాదరావుగారు అమ్మ లోకానికి బహిర్గతమైన తొలి రోజులలో అంటే 20వ శతాబ్దం 50 దశకం చివరలో అమ్మ వద్దకు చీరాల నుండి జిల్లెళ్ళమూడి వచ్చిన సోదరులలో వారు కూడా ఒకరు. మంచి హాస్య ప్రియుడు. చీరాల డాక్టరు పోట్లూరి సుబ్బారావుగారు. శ్రీ నోరి వెంకటేశ్వర్లుగారు, బుద్ధిమంతుడు (శ్రీ వై.వి. సుబ్రహ్మణ్యం), ఆచారిగారు శ్రీ రాజుపాలెం రామచంద్రరావుగారు, శ్రీ వల్లూరి మోహనరావు, శ్రీ శ్రీహర్షరావుగారు, శ్రీ బెండపూడి అక్కిరాజుగారు, శ్రీ లింగేశ్వరరావుగారు, శ్రీ యోగయ్యగారు, శ్రీ పి. వెంకయ్యగారు వంటివారు చీరాల నుండి తరచుగా వస్తుండేవారు.

ఒకసారి కొంతకాలం ప్రసాదరావుగారు భార్యతో జిల్లెళ్ళమూడిలో ఉండటం తటస్థించింది. లోకంలో ఉన్న అలవాటు ప్రకారం వాళ్ళిట్లా, వీళ్ళెట్లా చేస్తున్నారు అని ప్రసాద్ గారు విమర్శించటం జరిగింది. అది విన్న కొంతమంది అమ్మకుపోయి చెప్పారు. అమ్మ ప్రసాద్ గారిని పిలిపించింది. ఏంటిరా ఇలా అన్నావుట అని అడిగింది. “ఏలినవారు కూడా వారు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నిజమని నమ్ముతున్నారన్నమాట – దేవుడు కూడా చెప్పుడు మాటలు వింటుంటే ఇక మాబోటివాళ్ళ విషయం ఏముంది? మేమూ ఎవరో చెప్పిన మాటలేగా మాట్లాడేది’ అన్నాడట. అందరూ నవ్వుకున్నారు.

మరొకసారి రామకృష్ణన్నయ్య అమ్మ దర్శనం కోసం జనం వందల మంది వేచి ఉన్నారని చూచి రావటానికి ఆ వాత్సల్యాలయం నుండి క్రిందకు దిగుతున్నాడు. ప్రసాదరావుగారు ఎదురుపడి బావగారూ! ఒక్క మాట (రామకృష్ణను బావగారు అనటం అతని అలవాటు. దూరపు బంధుత్వం కూడా ఉన్నది రామకృష్ణతో) అంత హడావుడిగా దిగుతున్నారేమిటి? అమ్మ వచ్చినా వాళ్ళ చేతిలోని వస్తువులు మీరే కదా తీసుకొని తాకి ఇచ్చేది. వాళ్ళను నేను ఇక్కడకే పిలుస్తాను. ఒక్కొక్కరే వరుసలో వస్తారు. మీరే తాకి ఇవ్వండి. అప్పుడైనా ఇప్పుడైనా అమ్మ తాకదు కదా! అన్నారు. ఆశ్చర్యపోవటం అన్నయ్య వంతై బలేవాడివే అంటూ నవ్వారు. 

అమ్మతో కూడా చాలా స్నేహంగా మాట్లాడేవాడు. మొదట్లో వచ్చిన వాళ్ళకు అమ్మతో చనువె క్కువ వుండేది. ప్రసాదరావుగారు ఐ.యల్.టి.డి. కంపెనీలో సీజనల్ క్లర్కుగా చేస్తుండేవాడు. ప్రసాదరావుగారి భార్య వరలక్ష్మి కొత్తగా పెళ్ళయి భర్తకు ఉద్యోగం మంచిది లేదే అని బాధపడుతుండేది. ప్రసాదరావుగారి తల్లి రాజమ్మ, జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయంలో పనిచేస్తుండేది. అన్నపూర్ణాలయంలో వల్లూరి పాండురంగారావు గారి అత్తగారు అన్నపూర్ణమ్మ గారుండేది. వీళ్ళిద్దరూ వంట చేస్తుండే వాళ్ళు. వాళ్ళిద్దరినీ అమ్మ రాముడు, భీముడు అని పిలిచేది. అమ్మ రాజమ్మను రాజమ్మగారు అని పిలుస్తుండేది. అదేంటమ్మా! గారు అని పిలుస్తావంటే మా గురువుగారి పేరు కూడా రాజమ్మ గారేలే (దేశరాజు రాజమ్మగారు) అందుకే అలా పిలవాలనిపిస్తుంది అన్నదిట.

ప్రసాదరావుగారు జిల్లెళ్ళమూడి మొదటిసారి రావటం పోట్లూరి సుబ్బారావుగారి బృందంతోనే కలిసివచ్చారు. ఒకసారి చీరాల డాక్టరుగారు ప్రసాద్రితో బాపట్ల సమీపాన జిల్లెళ్ళమూడిలో అమ్మగారు ఉన్నారట. చూచివద్దాం ఒకసారి అని అంటే సరేనని వెళ్ళారు. దారిలో అమ్మవారున్నారు కదా! ఆడవాళ్ళకు నమస్కారం చెయ్యాలా? వద్దా! అని తర్కించుకుంటూ వెళ్ళి అసంకల్పితంగానే అమ్మను చూచి నమస్కారం చేశారట. అమ్మలోని ఆ ఆకర్షణశక్తి మాహాత్మ్యం అలాంటిది. ఒక పూరింట్లో సామాన్యకరణం గారి భార్య, బక్క చిక్కిన స్త్రీలో ఇంత ఆకర్షణ శక్తి ఏమిటి? ఈ మాయ ఏమిటి? అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ప్రతి శనివారం సాయంత్రం వెళ్ళటం, ఆదివారం అమ్మతో కాలం గడపటం, కాలం ఎలా గడిచిపోయిందో తెలియని స్థితిలో చీరాలు చేరటం జరుగుతుండేది. ఆ తర్వాత తల్లి రాజమ్య గారికి జిల్లెళ్ళమూడిలో అమ్మతో జరిగిన సంభాషణలు చెపుతుంటే ఆమె పెద్దగా అరిచి పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ రకరకాలుగా ప్రవర్తించేది. ప్రసాదరావుగారు కర్పూరం వెలిగించి హారతి ఇస్తే మామూలు మనిషి అయ్యేది. ఏంటమ్మా! ఏమయింది అని ప్రసాదరావుగారు అడిగితే “అమ్మ ఎర్ర అంచు కల ఆకుపచ్చ పట్టుచీరకట్టుకొని, ఇంత బొట్టు పెట్టుకొని, చారడేసి కళ్ళతో కనిపించింది అని చెప్పేది. ఆ తర్వాత కుటుంబాన్ని మొత్తాన్ని అమ్మ వద్దకు తీసుకెళ్ళి చూపించారు. ప్రసాదరావుగారి తండ్రి సత్యనారాయణగారిదీ చీరాలే.

ప్రసాదరావుగారు అమ్మ వద్దకు ఒకసారి వెళ్ళినపుడు అమ్మ వద్ద కూర్చొని అమ్మ వేలికి ఉన్న ఉంగరపు వైపు ఏకాగ్రతకు చూస్తున్నారు. తాను ఒక చిన్న పిల్లవాడుగా అమ్మ చేయి పట్టుకొని నడుస్తూ వెళుతున్నట్లు అనుభూతమైంది. అవును అమ్మ వద్ద అందరం పసిపిల్లలమే. అమ్మ ప్రసాదావుగారిని రెండు నెలలు జిల్లెళ్ళమూడిలో ఉండరా! అన్నది. ఆ రోజులలో లక్ష్మీనరసమ్మగారు, రాజు బావ, ప్రభావతక్కయ్య ఉండేవాళ్ళు, సుబ్బారావు, హైమ, రవి వాళ్ళందరితో బంధువులతో కన్నా ఎక్కువ ఆత్మీయంగా ఉండేవారు. ఆ వాతావరణం అలాంటిది. అమ్మ కాంతివలయంలో ఉన్నవారెవరైనా ఒక కుటుంబ భావం సన్నిహితత్వం సహజ సిద్ధమైన ఆప్యాయతలు అలవాటు అవుతాయి.

ప్రసాదరావుగారు తన పిల్లలకెవరికీ తాను నామకరణం చేయలేదు. రెడ్డిపాలెం లక్ష్మీకాంతయ్య యోగిగారికి పుట్టినవేళ, తిధి, వార, నక్షత్రాలు చెబితే వారు ఏ పేరు పెట్టాలో చెప్పేవారు. అమ్మ వద్దకు వచ్చి ప్రసాదరావుగారి పేర్లు చెపితే అమ్మ పేర్లు పెట్టేది. హరిప్రసాద్ అని వారు పెడితే ‘లడ్డు’ అని, వెంకటేశ్వర శర్మ అని వారు పెడితే ‘తెడ్డు’ అని, చివరివాడు కృష్ణమోహన్అని కాంతయ్యగారు పెడితే ‘బడ్డు’ అని, కూతురుకు అన్నపూర్ణ అని వారు పెడితే ‘లంఖిణి’ అని అమ్మ పెట్టేది. ఇలా ప్రసాదరావుగారితో సరదాగా అమ్మ కాలక్షేపం చేసేది.

ప్రసాదరావుగారు అమ్మను ఎన్నో ప్రశ్నలు వేస్తుండేవారు. వేసిన ప్రశ్నకు అనుబంధ ప్రశ్నలు వేసి ఒక పట్టాన విషయం తెగనిచ్చేవాడు కాదు. అందుకని అమ్మ ‘జిడ్డు’ అని పేరు పెట్టింది. నిజానికి భీమరాజు ప్రసాదరావంటే జిల్లెళ్ళమూడి సోదరులకు తెలియదు. ‘జిడ్డుప్రసాద్’ అంటేనే అందరికీ తెలుస్తుంది. ప్రసాదరావుకు మరొక ఊతపదం కూడా ఉంది. ఎవరన్నా ఏదన్నా చెప్పినా – అమ్మతో చెప్పినా ‘లేనిపోంది’ నీతో పెట్టుకున్నాను అనేవాడు. ప్రతి దానికి ‘లేనిపోనిది’ అని వాడటంతో అమ్మ ప్రసాదరావుగారి ఏదీ ‘లేనిపోనిది’ రాలేదా, కనిపించలేదే అంటూ ఉండేది. శ్రీ రాజుపాలెం రామచంద్రరావుగారిని కొబ్బరి నూనె జిడ్డు అని, ప్రసాదరావుగారిని ఆముదపు జిడ్డు అని అనేదట అమ్మ. ప్రసాదరావుగారి కూతురు దాక్షాయణి జిల్లెళ్ళమూడి నుండి ఇంటికి వెళ్ళుదామని బొట్టుపెట్టించుకోడానికి అమ్మ వద్దకు వెళ్ళింది. తన జడలో దాక్షాయణి జడ అల్లి ఇక పో యింటికి అనేది. అలా అంటే ఎలాగమ్మా! అని ప్రసాదరావుగారు బ్రతిమాలాడితే వదిలిపెట్టేది. అమ్మకు ఈ పిల్లలతో ఆడుకోవటం అదొక సరదా – అమ్మ రాచర్ల లక్ష్మీనారాయణ, రవివాళ్ళతో ఛెస్ ఆడుతూ కాసేపయింతర్వాత మీరాడుకోండి ఇంక అని కూర్చున్నది. నీవు లేని ఆటలో మజా ఏముందమ్మా! మేమూ ఆపేస్తాం అన్నాడు లక్ష్మీనారాయణ. నా ఆట నాకెట్లాగూ ఉన్నది మీ అందరితో, మీరాడుకోండి అన్నది. ఇలా అమ్మ సృష్టితో ఆడుకుంటుంది. అంటే తనతోనే తను ఆడుకుంటుంది. తానే సృష్టిగా వచ్చింది కదా!

ప్రసాదరావుగారితో అమ్మ ఎర్రచీరె తేరా, తెల్లచీర తేరా అని తెప్పించు కుంటుండేది అప్పుడప్పుడు. ఒకసారి నల్లచీరె తేరా అన్నది. నల్లచీరెక్కడ దొరుకుతుందమ్మా! కష్టం అన్నారుట ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉండి. అమ్మకు తెలియదా! ఒరే గుగ్గిలం యానాదిశెట్టి కొట్లో ఏ అరలో ఉందో ఎన్నో చీరెగా ఉందో చెప్పింది. ప్రసాదరావుగారు వెళ్ళి అడిగితే, శెట్టిగారు మేము నల్లచీరలు అమ్మ మండీ! అని చెప్పాడు. అప్పుడు ప్రసాదరావుగారు ఏ అరలో ఎక్కడ ఉందో చెప్పి చూడమన్నారట. వారు వెళ్ళి చూచి ఆ చీరె తెచ్చి అమ్మ మమ్ము, మా కొట్టును అక్కడ నుండే చూస్తున్నది. అమ్మ కృపకు పాత్రులమైనందుకు మా జన్మధన్యమైంది అన్నారు.

ప్రసాదరావుగారికి సీజనల్ ఉద్యోగం, పైగా క్యాంపులు తిరగటం. కుటుంబంతో కలసి ఉండలేకపోవటం వలన ఆయన భార్య వరలక్ష్మిగారికి బాధకలిగి అమ్మ వద్దకు వచ్చి తన బాధనంతా వెళ్ళగ్రక్కి ఏడ్చింది. అమ్మ బొట్టు పెట్టి వరలక్ష్మీ! వెళ్ళిరా! ఏం ఫర్వాలేదు అన్నది. ఆ తర్వాత యూనియన్ బ్యాంకులో పర్మనెంటు ఉద్యోగం రావటమే కాకుండా ఏకంగా 6 నెలల్లో మేనేజరుగా ప్రమోషన్ రావటం కుటుంబం అంతా ఒక చోట కలసి హాయిగా ఉండడం జరిగిపోయాయి. వరలక్ష్మిగారికి అమ్మ మీద బాగ నమ్మకం ఏర్పడింది.

ఆడపిల్ల పెళ్ళి విషయంలో అమ్మను అడగమని ప్రసాదరావుగారిని భార్య సతాయిస్తుండేది. అమ్మకు మనం చెప్పటమేంటి? ఆమెకు తెలియందేం లేదు. అమ్మది పిడుగురాళ్ళ రూల్సు అనేవాడు ప్రసాదరావుగారు. ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు వరలక్ష్మిగారు అమ్మను అడగమని చెపుతుంటే అమ్మ చూచి ఏమిటిరా వరలక్ష్మి ఏదో అంటున్నది అంటే దాని చాదస్తం లేమ్మా ఏమి లేదు అన్నాడు. అమ్మే నవ్వి దాక్షాయణి చేత 108 కొబ్బరికాయలు హైమాలయంలో కొట్టించరా! అన్నది. నా దగ్గర డబ్బు లెక్కడివమ్మా? ఒక్క కొబ్బరికాయకే లేవు అంటే గజేంద్రమ్మ దగ్గర ఉంటవి తీసుకోరా అన్నది. అలా కొబ్బరికాయలు కొట్టిన ఆరునెలల్లోపే దాక్షాయణి పెళ్ళి జరిగింది. అంతేకాదు ప్రసాదరావు గారి కొడుకులు ముగ్గురికీ ఒకేసారి ఉపనయనాలు చేసింది. ముగ్గురికీ ఒకేసారి చేయకూడదని ఎవరో అంటే అమ్మ పెద్దవాడికి ఆరునెలల్లో పెళ్ళి జరిగితే నాలుగవ శుభం జరిగినట్లు అని చెప్పింది. అమ్మ చెప్పినట్లుగానే వాడి పెళ్ళి జరిగింది. ఇలా ప్రసాదరావుగారి జీవితంలో అమ్మ పెనవేసుకొని పోయింది. ఎంత ధన్యజీవి. తనే కాదు తన పిల్లలందరికీ అమ్మ పట్ల అచంచల విశ్వాసం.

1990లో తన 70వ యేట నిరంతరం అమ్మ చింతనంతో గడుపుతూ అమ్మలో లీనమైన ప్రసాదరావుగారు ఎందరికో ఆదర్శనీయుడు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!