బాపట్ల తాలూకా అప్పికట్లలోనూ, మఱిపూడిలోను రామనామ సప్తాహాలు జరిగే రోజులలో అమ్మ వాటికి వెళ్ళేది. అక్కడ ఆ కార్యక్రమాలలో పాల్గొంటుండేది. లోకనాధం బాబాయి అప్పికట్ల హైస్కూలులో ఉపాధ్యాయునిగా పని చేస్తుండేవాడు. అక్కడే అమ్మ కుమారులు సుబ్బారావు, రవి మొదట్లో చదువుకున్నారు.
ఆ రోజులలో శ్రీ తంగిరాల సత్యనారాయణగారు జిల్లాపరిషత్ వైద్యునిగా ఆ ఊళ్ళో ఉండేవారు. ఆనాడు అమ్మను చూచినా డాక్టర్గారి కుటుంబ సభ్యులు అమ్మను సుబ్బారావు వాళ్ళ అమ్మగానే తెలుసు. అంతేగాని అమ్మలోని విశిష్టతను గుర్తించటానికి కొంత కాలం పట్టింది. అంటే అమ్మ అనుగ్రహం ఎవరి మీద ఎప్పుడు పడుతుందో చెప్పలేంకదా!
1958లో డాక్టరు సత్యనారాయణగారు పర్చూరుకు బదిలీ మీద వెళ్ళారు. అక్కడి నుండి జిల్లెళ్ళమూడి వచ్చే సోదర సోదరీమణులెందరో ఉండేవారు. బృందావనం రంగాచార్యులవారు, పరుచూరు రామాచార్యులవారు, అంధుడు సిరిగిరి సుబ్బారావు, వంటి వారెందరో – తరచుగా జిల్లెళ్ళమూడి వస్తుండేవారు. అలా వచ్చే ఎందరివల్లనో డాక్టరుగారు అమ్మను గూర్చి తెలుసుకున్నారు. అలా తెలుసుకోగా 1961లో కుటుంబంతో సహా జిల్లెళ్ళమూడి వచ్చారు. ఆ వచ్చిన వారిలో సత్యనారాయణగారి పెద్ద కుమారుడు సుబ్బారావన్నయ్య కూడా ఒకరు. శ్రీ సత్యనారాయణగారి శ్రీమతి దమయంతులకు పుట్టిన సుబ్బారావు డాక్టర్ గారి ప్రథమపుత్రుడు. 1932లో తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన సుబ్బారావు డాక్టర్గారు అప్పికట్లలో ఉండగా స్కూలు ఫైనల్ పూర్తి చేశాడు. అప్పటికే రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న సుబ్బారావు 1948లో గాంధీగారు మరణించినపుడు సంఘంపై నిషేధం రాగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిం తర్వాత గుంటూరు హిందూ కాలేజిలో ఇంటర్మీడియట్ చదివాడు. సేవాకార్యక్రమాల మీద ఉన్న శ్రద్ధ విద్యార్జనపై లేకపోవటంతో సుబ్బారావు ఉద్యోగాన్వేషణలో పడి కొన్నాళ్ళు హైదారబాద్లోనూ, కొన్నాళ్ళు ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్ కాకర్ల సుబ్బారావు వద్ద ఎక్కరే యూనిట్లో పనిచేశాడు. కొన్నాళ్ళు హుజూర్ నగర్లో తాలూకా ఆఫీసులో గుమస్తాగా చేశాడు. మనస్సు శరీరము సహకరించక సబ్బు తయారీ కుటీర పరిశ్రనేర్చుకున్నాడు ఎన్ని నేర్చినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఏదీ కలిసి రాలేదు.
1961లో అమ్మ వద్దకు వచ్చిం తర్వాత ఆరోగ్యము – మనస్సు కుదట పడటం మొదలైంది. ఆ రోజుల్లోనే అంటే పర్చూరులో డాక్టరుగారు ఉన్న రోజులలోనే అమ్మ పెద్ద కుమారుడు బ్రహ్మాండం సుబ్బారావు – హైమ కొన్నాళ్ళపాటు వైద్యం నిమిత్తం వాళ్ళింట్లో ఉండటం జరిగింది. అప్పుడు బ్రహ్మాండం సుబ్బారావు వంటికి వేపనూనె పట్టించడం, సున్నిపిండితో నలుగుపెట్టి స్నానం చేయించటం, అతని బట్టలు ఉతకడం, హైమ బట్టలు ఉతకడం వంటి సేవా కార్యక్రమాలన్నీ తంగిరాల సుబ్బారావన్నయ్యే స్వయంగా చేసేవాడు. ఆ సేవ అమ్మ సేవగా భావించేవాడు. అమ్మ చెప్పినట్లుగా అందరినీ నారాయణ స్వరూపులుగా భావించి సేవించటం సామాన్యమైన విషయం కాదు. మూడు పదులు కూడా నిండని వయసులో – 1961 డిసెంబరులో సొంత వూరు తణుకు వెళ్ళగానే డాక్టరుగారి బావమరిది తన దత్తపుత్రికను సుబ్బారావన్నయ్యకు ఇవ్వాలని ప్రతిపాదనరాగా, డాక్టర్గారి కుటుంబంతో పాటు అక్కడకు వెళ్ళిన ‘హైమ’ను చూపించి, డాక్టరుగారి భార్య దమయంతిగారు నా ఇద్దరు ఆడపిల్లలతోపాటు జిల్లెళ్ళమూడి అమ్మగారి కుమార్తె ‘హైమ’కు కూడా ఆడబిడ్డలాంఛనాలు జరిపితే నాకభ్యంతరంలేదని తమ్ముడికి చెప్పింది. అలాగే ‘హైమ’ను కూడా తమ కుటుంబంలో ఒకరుగా భావించటం అన్ని లాంఛనాలు జరపటం జరిగింది. సుబ్బారావు పుట్టిన ఊరు, తల్లి దమయంతిగారు పుట్టిన ఉళ్ళోనే – అతని పెళ్ళి మేనమామ కూతురు సూర్యకుమారితో జరిగింది.
1962లో తెనాలి దగ్గర కొల్లూరుకు బదిలీ కాగా అక్కడికి వచ్చింది. డాక్టరుగారి కుటుంబం. అక్కడ సుబ్బారావు తల్లి దమయంతికి కేన్సర్ వ్యాధి ఉన్నట్లు బయట పడటంతో గుంటూరులో ఆమెను వైద్యం నిమిత్తం చేర్చగా తల్లికి సేవచేసే అవకాశం, అదృష్టం అతనికి లభించింది. 1963లో తల్లి అమ్మలో లీనం కావటం, తండ్రి ఉద్యోగ విరమణ చేయటంతో తండ్రిని తీసుకొని స్వగ్రామమైన తణుకులోని సొంత యింటికి చేరాడు భార్యతో సహా.
అమ్మ యెడల అచంచల భక్తి విశ్వాసము, సేవాతత్పరత కల్గిన సుబ్బారావు తన ఇంట్లో వారికే, బంధువులకే కాదు, ఎవరికి ఏ అనారోగ్యం చేసినా అమ్మ దగ్గర నుండి తెచ్చిన పాద తీర్థమే సర్వరోగ నివారిణిగా అమ్మ నామం చెప్పి ఇచ్చేవాడు.
1966లో అమ్మ వద్దకు జిల్లెళ్ళమూడి చేరి అక్కడ కార్యక్రమాలలో పాల్గొంటూ సంస్థకు సంబంధించిన అన్ని పనులలోనూ పాల్గొనటంలో అమ్మ సేవలో రెండేళ్ళు గడిపాడు. తన పిల్లలందరికీ అమ్మ చేతనే పేర్లు పెట్టించాడు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి వెళ్ళే రోజులలో పరిచయమైన అంగర సూర్యనారాయణగారు (ఇప్పుడు బెంగుళూరులో హైదరాబాద్లో భార్యా పిల్లలతో ఉండగా భార్య, పిల్లలు జ్వరంతో బాధ పడుతుంటే, పాలు కూడా దగ్గర దొరకని స్థితిలో ఉంటే విద్యానగర్లో ఉన్న సుబ్బారావు ‘అమ్మ’ చెప్పినట్లుగా ఒక బాటిల్లో పాలు, అమ్మ ఫొటో, అమ్మ కుంకుమ పొట్లం తీసుకొని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేంద్రనగర్లో ఉన్న సూర్యనారాయణ గారింటికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చి పిల్లలకు కుంకుమ నీటిలో కలిపి ఇమ్మని చెప్పి వారికి ఊరట కలిగించాడు. అప్పటికి సూర్యనారాయణగారికి అమ్మను గూర్చి తెలియదు. అయినా మిత్రుడు సమయానికి వచ్చిన ఆపద్బాంధవునిగా భావించి సుబ్బారావు చెప్పినట్లు చేశాడు. ఆశ్చర్యం. మరుసటి రోజు పిల్లలకు, భార్యకు జ్వరం తగ్గింది. దానితో అంగరవారు ఎంతో ప్రభావితులై సుబ్బారావును తోడు తీసుకొని అమ్మ వద్దకు వచ్చాడు. ఈ రకంగా ఎందరికో అమ్మ యిచ్చిన స్ఫూర్తితో సేవ చేసేవాడు. వారిని అమ్మ ఒడిలోకి చేర్చేవాడు.
తర్వాత తర్వాత తణుకులో ఉంటున్నా నిరంతరం అమ్మ తలంపే, అమ్మ, నామమే, అమ్మ చింతనే. అమ్మ స్వర్ణోత్సవ సమయంలోనూ ఇంటింటికీ అమ్మ కాలండర్లు పంచి స్వచ్ఛందంగా ప్రజలు ఇచ్చిన విరాళాల ధనాన్ని జిల్లెళ్ళమూడికి పంపాడు. అలాగే వజోత్సవ సమయాలలోనూ కృషి చేసి తనవంతు సేవ చేశాడు. ఆర్థికంగా నలుగురు పిల్లలను చదివించి వృద్ధికి తేవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అందరినీ చక్కగా తీర్చిదిద్ది అమ్మపట్ల విశ్వాసాన్ని, సేవాభావాన్ని వాళ్ళలో నింపాడు. ఆడ మగా తేడా లేకుండా అందరికీ సేవ చేశాడు. సౌమ్యంగా ప్రేమగా, ఎంతో ఆప్యాయతతో పలకరించేవాడు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎంతో ఆత్మీయంగా అందరికీ తలలోని నాల్కగా ఉండేవాడు.
“అన్నీ తెలిసినవాడు అమావాస్యనాడు మరణిస్తే ఏమీ తెలియని వాడు ఏకాదశినాడు మరణించాడు” అనే ఒక సామెత ఉన్నది. అలాగే పుణ్యాత్ముడి పుణ్యం అతని మరణంలో తెలుస్తుంది అని కూడా అంటారు. సరిగ్గా సుబ్బారావు అవతారమూర్తి అమ్మ జన్మించిన మార్చి 28వ తేదీన అమ్మలోనే లీనం కావటంలో కూడా ఏదో దేవరహస్యం ఇమిడి ఉంటుంది. ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే 2005 మార్చి 28న ఆ నెల ‘విశ్వజనని మాసపత్రిక చదువుతూ తన భార్యకు ఏదో చెప్పబోతూ ఆ మాసపత్రికమీదే పడి అమ్మలో లీనంకావటంలో విశిష్టత లేదని అనలేం. అందుకే సుబ్బారావు సేవాభావం మూర్తీభవించిన, అమ్మకు నచ్చిన, అమ్మ మెచ్చిన ధన్యజీవి.