“కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నే గతుల్
పడసెం-బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీ శ్వరా!” అన్నాడు ధూర్జటి.
మూడు దశాబ్దాలకు పూర్వం జిల్లెళ్ళమూడిలో ఒకసారి నవరాత్రులలో అమ్మకు ముగ్గురు కలసి ఒకేసారి పూజ చేసుకుంటున్నారు. దేనికోసం? తమకు పిల్లలు కలగాలనే కోరికతో. అమ్మ చిరునవ్వులు చిందిస్తూ పూజ స్వీకరిస్తున్నది. ఒకరు వల్లూరు పాండు రంగారావు, రెండవవారు అంజన్ కుమార్ అమ్మతో నాదెండ్ల లక్ష్మణరావుగారు మరియు భ్రమరాంభగారు. ఆత్రేయ, మూడవవారు నాదెండ్ల లక్ష్మణరావుగారు. అమ్మ అనుగ్రహంతో పాండురంగా రావుకు, ఏకా అంజనక్కు పిల్లలు పుట్టారు. లక్ష్మణరావుగారికి పిల్లలు పుట్టలేదు. భ్రమరాంబక్కయ్య, లక్ష్మణరావుగారు అమ్మ వద్దకు చేరి తమ సంతానలేమికి చింతించారు. అప్పుడు “నేనే మీ కూతురును. మీకింకేం కావాలి” అన్నది. నిజమే. దేవతే తమ బిడ్డనని చెపుతుంటే అంతకంటే కావాల్సిందేముంది? అమ్మ మాట వారికి తృప్తి కలిగించింది. అమ్మ కూడా వారిని అలాగే చూచింది. ఆశ్చర్య మేమి టంటే నాన్నగారు (బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు) భ్రమరాంబ అక్కయ్యను, లక్ష్మణరావు గారిని తమ కూతురు అల్లునిగా గౌరవించేవారు. అలాగే రవిని కూడా తమవాడుగానే భావించారు వాళ్ళు. రవి కూడా వారి యెడల అలాగే వారి యోగక్షేమాలు కనిపెడుతూనే ఉన్నాడు.
నాన్నగారు సామాన్యంగా అలా అంత దగ్గరకు తీయరు ఎవరినీ. ప్రేమిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు కాని తమ కూతురు అల్లునిగా భావించిన సందర్భాలు నా అరవై ఏళ్ళ జిల్లెళ్ళమూడి జీవితంలో వినలేదు. దానికీ కారణం ఉన్నది. 1972లో ఒకసారి నాన్నగారికి ఆపరేషన్ జరిగింది. అప్పుడు హాస్పిటల్లోనూ ఆ తర్వాత లక్ష్మణరావు భ్రమరాంబక్కయ్య సేవలు చేశారు ఇంట్లో ఉంచుకొని. నాన్నగారి మనస్సును ఆ రకంగా కృతజ్ఞతాభావం వారిని దగ్గర చేసింది. అమ్మ కూడా వాళ్ళను బిడ్డగా అలా ఆదరించింది. అలా కాపాడుతున్న దేవత తమ బిడ్డయే. శ్రీకృష్ణుడు యశోదా నందులకు బిడ్డయై కా తరింపచేసినట్లు, అక్క మహాదేవిని పరమేశ్వరుడు బిడ్డగా తరింపచేసినట్లు, అమ్మ, వాళ్ళకు తృప్తి గూర్చి తరింప చేయటానికి కంకణధారియైంది. “తృప్తే ముక్తి” అని చెప్పింది కదా అమ్మ!. లోకంలో సంతానం వల్ల ఉత్తమగతులు ప్రాప్తిస్తయ్యని ఒక దురూహ ఉన్నది. అమ్మ నన్ను చూడటమే పొందటం అన్నది. పైగా అందరికీ సుగతే నన్నది. జిల్లెళ్ళమూడిలో మంచీ చెడూ ఏది చేసినా బంతి గోడకి కొట్టినట్టే నన్నది. చేసుకున్నవారికి చేసుకున్న దాని రెట్టింపు అనుభవిస్తారు.
ఉద్యోగరీత్యా బ్యాంక్ ఆఫ్ బరోడాలో నీతి నిజాయితీతో ఎన్నో విధాల ఎదుగుతూ పనిని దైవంగా భావించి ఉద్యోగం చేశారు. ఇక తమకు భౌతికంగా సంతానం లేకపోవటం వల్ల తన అన్న కుమార్తెలకు చదువులు, వివాహాది శుభకార్యాలు నిర్వర్తించారు. మితభాషి, స్మితభాషియైన లక్ష్మణరావుగారు. ఎవరితోను ఘర్షణను రానిచ్చేవారు కాదు. అవసరానికి మించి ఖర్చులు క్రమశిక్షణారాహిత్యం వారికి ఇష్టంలేని విషయాలు. కమ్మగా అమ్మ నామం, పాటలు, పద్యాలు పాగడల శక్తి వారికున్నది. సాహిత్యాభిమాని, హాస్య సంభాషణ ప్రియుడు, త్యాగధనుడు.
‘అమ్మ కళ్యాణం’ ఒక గంటలో పూర్తి చేసే విధంగా తయారు చేయాలని సంకల్పించినాను నేను. ఆ గ్రంథం ప్రింట్ చేసే అవకాశం మాకివ్వండి అని కోరారు ఆ దంపతులు. భ్రమరాంబ అక్కయ్య తమ్ముడు కూడా అదే భావం వెలిబుచ్చాడు. సామాన్యంగా నా పుస్తకాలకు ఎవరినీ ప్రింట్ చేయించమని యాచించని మనస్తత్వం అమ్మ ఇచ్చింది. సరే అడిగారు కదా! అని ఆ పుస్తకాన్ని వారికే అంకితం చేశాను డబ్బులేమీ తీసుకోకుండా.
గుంటూరులో వారు పనిచేసే రోజులలో వారింట్లో ప్రతినెలా అమ్మ పూజా కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. గుంటూరు మాతృశ్రీ అధ్యయన పరిషత్ మూడుపూలూ ఆరు కాయలుగా విరాజిల్లుతున్న రోజులవి. రిటైరైం తర్వాత జిల్లెళ్ళమూడిలో పరిషత్ పనిచూస్తూ నిత్యాన్నదాన పథకం మాత్రం పత్రికలో వేయండి. ఆపకండి. ధాన్యాభిషేకంలా అదీ సంస్థకు బాగా దోహదపడుతుంది అని ప్రోద్బలం చేసేవారు.
అమ్మ వారింటికి 1985లో వారి కూతురుగా మేళ తాళాలతో వెళ్ళి మూడురోజులుండి ‘వీళ్ళు తమ కూతురి పెళ్ళి చేస్తున్నారు’ అని అందరికి చెప్పింది.
అమ్మకు గత 50 ఏళ్ళకు పూర్వం నుండి సేవ చేస్తున్నారా దంపతులు. గత రెండు పుష్కరాలుగా జిల్లెళ్ళమూడిలోనే అందరింట్లో ఉండి నొప్పింపక తానొవ్వక సేవచేస్తున్నారు అమ్మ కుటుంబంలో ఒకరిగా. ఆ సర్వతోముఖమైన సేవలకు సిద్ధమై ఉన్నారు. నామం చేయనీయండి, సంధ్యావందనం కానీయండి, పాటలు పాడనీయండి, కాలేజీలో పాఠాలు (అవసరానికి) చెప్పనీయండి, ఆఫీసులో కోశాధికారిగా, కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, చివరకు అధ్యక్షునిగా సేవలు అందించ నీయండి, అమ్మ సేవలో తరతమ భేదం లేకుండా చిరునవ్వుతో అందరినీ ఆత్మీయంగా, సౌమ్యంగా, ఆదరంగా సంభావిస్తూ ఆచరణ రూపంలో ఉన్నారు. నా వంటి ఆవేశపరులను కూడా శాంతింప చేసే ఆయన మధురమైన వాక్కు, నవ్వు జయిస్తుంది. అమ్మ చిరకాలం సాయంకాలాలలో తన పాదస్పర్శతో పునీతం చేసిన స్థలంలో తాను ఒక మంచంపై సర్వులకు దర్శనాలు ప్రసాదించి, ఆత్మీయతతో సంభాషణలు చేసి, విశ్రమించిన స్థానంలో ఒక విగ్రహాన్ని అదే విధానంలో అమ్మ రూపాన్ని తలపించే విధంగా కూర్చో బెట్టిన ధన్యులు ఆ దంపతులు.
లక్ష్మణరావు గారి చేతిలో ధనరేఖ జర్రిపోతులా ఉన్నదేమో! ఆశ్చర్యమే మిటంటే ఆయన పరిషత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నడూ అన్నపూర్ణా లయానికి ఇబ్బంది కలుగలేదు. ధాన్యాభిషేకానికి, నిత్యాన్న వితరణ పథకానికి ఆ దంపతులు నిరంతరం తపించి సేవ చేసేవారు. తపనే తపస్సు కదా! ఆ తపస్సు ఫలించిందేమో!
లక్ష్మణరావుగారి మహాభినిష్క్రమణం చూస్తే అమ్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన ధన్యులు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించింది అమ్మ. లోకంలో ఎవరైనా విజ్ఞులు కోరుకొనేది “అనాయాసేన మరంణం – వినాదైన్యేన జీవనం” అనేది సత్యం. అయితే అది వాడి అనుగ్రహం వల్ల రావాలసిందే అనేది స్పష్టం. వారికి దైన్యమైన జీవితం కాకుండా తృప్తిగల జీవితం మరణం ప్రసాదించ బడింది. 30.9.2018 ఉదయం శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యకారిణీ సంఘ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ‘ఈ సమావేశానికి అధ్యక్షత వహించటం అమ్మ నాకు ప్రసాదించిన వరం’ అని పలుకుతూ సభ ప్రారంభించారు. కార్యదర్శి నివేదిక తర్వాత లక్ష్మణరావుగారు కూర్చుని మంచినీరు త్రాగి ఆ గ్లాసు క్రింద పెట్టబోయి వంగారు. అంతే రెండు సెకన్లు కూడా లేదు ఆ వంగటం వంగటం అమ్మ పాదాలపై (భూదేవి కదా అమ్మ) పరిపూర్ణంగా వంగిపోయారు. ఇక లేవలేదు. నాకు పరిపూర్ణ సమర్పణ చేసిన వారిని శరణాగతి పొందిన వారిని నేనెలా తరింప చేస్తానో చూడండిరా అని మనకు చూపించినట్లున్నదా సన్నివేశం. 1934 మే 15న భూలోకంలో అడుగు పెట్టిన లక్ష్మణరావు గారు భూమాత ఒడిలోనే ఒరిగిపోయారు 2018, సెప్టెంబరు 30న.
ఉత్తర అభిమన్యులు వివాహమై కుంతీదేవి పాదాలకు మ్రొక్కారు. ఆశీర్వదించమని. ‘నాలాగా వీరులు శూరులు అయిన పుత్రులు కనాలని కోరుకోబోకండి, అదృష్టవంతులైన బిడ్డలు కావాలని కోరుకోండి’ భగవంతుని అన్నది ఈనాడు అమ్మ (భగవంతుడు) బిడ్డయై తరింప చేసింది లక్ష్మణరావు గారిని. అంతకన్న కోరుకోవలసిందేం లేదు. ఎవరికైనా కావలసిందదే.