అమ్మ నాన్నగారు జిల్లెళ్ళమూడిలో కాపురం పెట్టిన క్రొత్తల్లో ఒక పద్నాలుగు సంవత్సరాల బాలుడు మంచి నీళ్ళడిగాడు దాహం వేసి అమ్మను. అమ్మ ఆకలితో ఉన్న అతన్ని చూచి అన్నం తిన్నావా? నాయనా! అని అడిగింది. లేదన్నాడు. అమ్మ అతనికి కడుపునిండా గడ్డ పెరుగు వేసి అన్నం పెట్టింది. అదృష్టవంతుడు. కల్పవృక్షం క్రింద నిలిచి మంచి నీళ్ళు కావాలనుకుంటే మంచి నీళ్ళే రావచ్చు నేమో! కామధేనువు వద్దకు వెళ్ళి కోరిన కోర్కెలు తీరు కోవచ్చునేమో కాని అతను అంతంలేని అమ్మకు తెలియక పోయినా మంచి నీళ్ళడిగాడు. అమ్మ అమృతాన్ని ప్రసాదించింది. బిడ్డ ఆకలి గుర్తించి పెట్టింది. కడుపునిండా. ఒక్కొక్క మెతుకూ ఎన్నెన్ని జన్మలను తీసివేసిందో సద్గురువులు శ్రీ శివానందమూర్తిగారు చెప్పినట్టు.
అతడి పేరు పుల్లయ్య. పుల్లయ్య అంటే పూర్ణయ్యకు వికృతి రూపం. అంటే పూర్ణ స్వరూపమైన అమ్మ వద్దకు రావటం వల్ల అంతకు ముందు పేరులోనే పూర్ణయ్య పుల్లయ్య అయినా అమ్మ కరుణా వాత్సల్య పూర్ణుడై నిజమైన పూర్ణయ్య అయినాడు. అతడిది గుంటూరు జిల్లా నర్సరావుపేట దగ్గర గురవాయపాలెం. ఆ ఊరి కరణంగారి దగ్గర వెట్టివానిగా పనిచేస్తున్నాడు. ఆ కరణంగారి కోసం వారు పంపగా గడ్డికొనటం కోసం జిల్లెళ్ళమూడి వచ్చాడు. వచ్చేటప్పుడు చద్దిమూట కట్టుకొని వచ్చాడు. కాని అతడు అనుకొన్నంత తొందరగా గడ్డి దొరకలేదు. ఆలస్యం అయింది. తెచ్చుకొన్న చద్ది తిన్నాడు. హోటళ్ళో, పూట కూళ్ళ ఇళ్ళో ఉంటయే అనుకున్నాడు అవేవీ ఈ పల్లెటూళ్ళో దొరకలేదు. చిల్లరకొట్లో వేయించిన శనగపప్పు బెల్లం కొనుక్కుని తిని కాసిని మంచి నీళ్ళు త్రాగి కాలక్షేపం చేద్దామనుకున్నాడు. అదృష్టవశాత్తు అన్నపూర్ణ అయిన అమ్మ దృష్టిలో పడ్డాడు. అమ్మ పెట్టిన అన్నంతోపాటు ఆప్యాయత అనురాగము అనుభవించి తన పని పూర్తిచేసుకొని తిరిగి గురవాయపాలం వెళ్ళాడు.
అతడికి వివాహమైంది. కాలం గడుస్తున్నది. ఇంతలో విషజ్వరం దాపురించింది అతనికి. ఎన్నో మందులిప్పించారు. ఎంత మంది డాక్టర్ల దగ్గరకో తీసుకొని వెళ్ళారు. కానీ వ్యాధి తగ్గే లక్షణం కనిపించలేదు. చివరకు ఆ వ్యాధి పెరిగి అతడు నిలబడలేడు. నడువలేడు, చేతులతో దేనినీ పట్టుకోలేడు, మాటాడలేడు, ఆఖరికి చూడలేడు. పంచేంద్రియాలు అతని వశం తప్పాయి. నోటి నుండి అసంకల్పితంగా చొంగకారుతున్నది. తల్లిదండ్రులు అతని జీవితంపై ఆశవదులుకున్నారు.
ఇదే సమయంలో అమ్మ వద్దకు వచ్చిన రాచర్ల అనంతరామయ్యగారు (సోదరుడు రాచర్ల లక్ష్మీనారాయణ తండ్రి) అనుకోకుండా వారి ఊరువెళ్ళగా అతడి తల్లిదండ్రులు తమ కొడుకుకు వచ్చిన దుస్థితి చెప్పారు. అనంతరామయ్యగారు పురోహితుడు. అంటే పురముహితము కోరేవాడు అని అర్థం. ఆయన మనస్సులో అమ్మ మెదలింది. ఈ పరిస్థితులలో జిల్లెళ్ళమూడి అమ్మను గూర్చి చెప్పి అమ్మే ఉద్ధరించాలి వీడ్ని అమ్మ వద్దకు తీసుకెళ్ళమన్నాడు. గురువుగారి మాట మీద ఉన్న విశ్వాసంతో వాళ్ళు మంచంమీద వేసుకొని పుల్లయ్యను జిల్లెళ్ళమూడి తీసుకొచ్చారు. ఆ సంవత్సరం 1962. అమ్మ ఇప్పుడు హైమాలయం ఉన్నచోట ఒక పూరి పాక ఉండేది. ఆ పాకలో ఉండేది అమ్మ. అమ్మ వద్దకు మోసుకొచ్చారు పుల్లయ్యను. నీవే వీడిని కాపాడాలమ్మా! అని అతని తల్లిదండ్రులు అమ్మ పాదాలపై పడ్డారు.
అమ్మ పుల్లయ్యను చూచి “నాన్నా! నీవు మునుపు ఇక్కడకు వచ్చినట్లుందే” అని పలకరించింది. అంతే పుల్లయ్యలో కదలిక మొదలైంది. నంగినంగి మాటలతో కొన్ని సంవత్సరాల క్రితం గడ్డికొనటానికి బండితోలుకొని వచ్చి నీ చేతి అన్నం తిన్నానమ్మా!” అని ఆనాటి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు. అమ్మ అప్పుడు “ఔను నాన్నా! 1946లో వచ్చావు” అని పుల్లయ్యతో అని అప్పటి విషయమంతా అక్కడ చేరిన వాళ్ళందరికీ చెప్పింది. అప్పటికి 16 సంవత్సరాలవాడు జరిగిన సన్నివేశాన్ని పూసగుచ్చినట్టు వివరిస్తుంటే కళ్ళప్పగించి విన్నారు సోదరీసోదరులు. ఆనాటి ఆ అన్నపు ముద్దలుతిన్న అదృష్టమే అతనిని అమ్మ వద్దకు చేర్చింది కష్టకాలంలో.
ఆనాడు వచ్చిన పుల్లయ్య కొంత కాలం అమ్మ దగ్గరే ఉన్నాడు. అతన్ని మోసుకొచ్చి రోజూ అమ్మ దర్శనం చేయించేవారు. జిల్లెళ్ళమూడిలో ఆనాడు ఈనాడున్న సౌకర్యాలేవీ లేవు. కరెంటు లేదు. పంపులు లేవు. ఫాన్లు లేవు. పడకలు లేవు. అమ్మ స్నానం చేయాలంటే చెరువు నుండి పీపాలతో బిందెలతో నీళ్ళు తెచ్చేవాళ్ళు. లాంతర్లు వెలిగించి ఆ వెలుతురులోనే కాలక్షేపం – అమ్మకు విసనకఱ్ఱలతోనే విసిరేవారు. ఆ రోజుల్లోనే పుల్లయ్య అక్కడ నెలలతరబడి ఉన్నాడు. ఒక రోజు రాత్రి పుల్లయ్య పడుకున్న చోట చీకటిగా ఉన్నది. ఆ వైపు వచ్చిన నాన్నగారు చూచి “దారికి అడ్డంగా పడుకున్నావు చీకట్లో ఎవరైనా త్రొక్కుతారు. అవతలికి వెళ్ళి పడుకో” అన్నారు. అందుకు పుల్లయ్య నాకు కళ్ళు కనిపించవు నేను గుడ్డివాడనయ్యా! కళ్ళున్న మహానుభావులునన్నెందుకు త్రొక్కుతారయ్యా! అంటూ నంగి నంగి మాటలతో చెప్పాడు. నాన్నగారు అయ్యో! అనుకున్నారు.
ఆ తర్వాత అమ్మకు అనారోగ్యం చేయటం వల్ల చీరాల తీసుకుని వెళ్ళుదామనుకున్నారు. అమ్మ జిల్లెళ్ళమూడిలో లేకపోతే అమ్మకోసం వచ్చిన వారెవరుంటారు? అందుకోసం పుల్లయ్యను వాళ్ళ ఊరు వెళ్ళమని చెప్పారు.. కాని పుల్లయ్య “ఆస్పత్రిలో అమ్మ మంచం ప్రక్కనే పడుకుంటానయ్యా! నన్ను రానివ్వం”డని ప్రాధేయపడ్డాడు. ‘ఏ తీరుగనను దయ చూచెదవో అర్కపురీశ్వరి ‘అమ్మా’ అనే భావం వచ్చేటట్లు రామదాసునివలె పాడుకుంటుండేవాడు. అమ్మను “నాకు ఈ జబ్బునయమయ్యేట్లుంటే ఉంచు లేకపోతే నన్ను తీసుకెళ్ళు. నేను పోయేలోపలే నాభార్యకు మరో మనువు చెయ్యి” అని ప్రార్థించేవాడు. ఎప్పుడూ అమ్మ సన్నిధిలోనే ఉండాలని కోరిక. జబ్బు నయం కావాలి అనే దాని కన్నా బాధలన్నీ ఈ జన్మలోనే అనుభవిస్తే మంచిదని అదీ అమ్మ చరణ సన్నిధిలో అనుభవిస్తేచాలనీ, ఈ జబ్బు రావటం కూడా ఒక అదృష్టమే అనుకున్నాడు. ఈ రకంగా అమ్మను చూడగలగటం, అమ్మ దగ్గర ఉండగలగటం జరిగింది. ఈ అంగవైకల్యం వల్ల మరో పని ధ్యాసలేకుండా ఎప్పుడు అమ్మనే తలుచుకుంటూ ఉండే అవకాశం కల్గింది. ఎప్పుడూ నా మనస్సు నీ మీదనే ఉండేటట్లు చూడమని వేడుకొనేవాడు.
అమ్మను చీరాల సోదరులు వాళ్ళ ఊరుతీసుకొని వెళ్ళే సమయం రావటంతో అప్పటికే జిల్లెళ్ళమూడి వచ్చి మూడు నెలలు కావటంతో తల్లిదండ్రులు అతన్ని గురవాయపాలెం తీసుకొని వెళ్ళారు.
1962 జూన్లో అమ్మ చీరాల వెళ్ళింది. రెండు నెలలు అక్కడ ఉండి పిలిచిన జిల్లెళ్ళమూడి సోదరీసోదరులందరి ఇళ్ళకు వెళ్ళింది. పిలవని వారిండ్లకూ వెళ్ళింది. ఓడరేవులో బెస్తవారి గుడిసెలకు, పల్లెలకు, యానాది ఎఱుకల కాలనీలకు వెళ్ళి వాళ్ళను ఆనంద పరిచేది. ఇలా వందలకు వందలు వేలకువేల మంది అమ్మను దర్శించుకొనేవారు. అనుకోకుండా వారు ఆరాధించే దేవత కరుణించి వారింటికి వచ్చిందని దర్శించుకొనేవారు, ఆనందించేవారు. ఇలా అమ్మ తనలీలా విలాసాలతో లోకాన్ని సమ్మోహన పరుస్తుండగా ఒక రోజు అకస్మాత్తుగా వెంటనే కారు పిలిపించమన్నది. ఇంత అర్జంటుగా ఉన్నది ఉన్నట్టు కారు పిలిపించమన్నది ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఏ గజేంద్రుని మొర ఆలకించిందో ఏ సిరియాళునకు దర్శనం ఇవ్వాలనుకున్నదో జిల్లెళ్ళమూడికే తిరిగిపోవాలనుకున్నదో ఎవరికీ అర్థం కాలేదు. కారువచ్చింది. ఆ విషయం అమ్మకు చెప్పారు. నర్సరావుపేట దగ్గర గురవాయ పాలెం వెళ్ళి పుల్లయ్యను తీసుకు రమ్మంది. అందరూ ఒకరి ముఖాలొకరుచూచుకున్నారు. ఎవరీ పుల్లయ్య? అమ్మకు అంత కావలసినవాడెట్లా అయినాడు? కారు పంపించి పిలిపించుకొనేంత సన్నిహితుడెప్పుడైనాడు? అనుకున్నారు. అతని అదృష్టాన్నితలచుకొని నివ్వెరపోయారు.
ఎట్టకేలకు కారు గురవాయపాలెం చేరుకుంది. ఎక్కడోకడజాతి పల్లెల్లో ఒక గుడిసెలో రోజులు లెక్కిస్తూ కాలం వెళ్ళబోస్తున్న పుల్లయ్య ఇంటి ముందుకు వెళ్ళి ఆగింది కారు. ఇంట్లో వాళ్ళు బయటకువచ్చారు. జిల్లెళ్ళమూడి అమ్మ కారు పంపించిందని, పుల్లయ్యను తీసుకురమ్మన్నదని చెప్పారు. వాళ్ళ నోట మాటరాలేదు. అతని అదృష్టానికి ఇంట్లో వాళ్ళేకాక పల్లెలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు.
పుల్లయ్యను అమ్మ దగ్గరకు తెచ్చారు. పుల్లయ్యను అమ్మ సముద్రంలోకి తీసుకొని వెళ్ళి ముంచి స్నానం చేయించింది. సముద్రస్నానంవల్ల ఏం పొందాడో లేదోకాని అమ్మదయాసముద్రంలో మునిగి పునీతుడైనాడు. కొన్నివందల వేల మంది అమ్మదర్శనం కోసం ఎదురుతెన్నులు చూస్తుంటే ఏ మూలనో కుగ్రామంలాంటి పల్లెలో వున్న వాడ్ని, కారు పంపించి పిలిపించుకొన్నదంటే పుల్లయ్యలోని తపన, ఆర్తి, అమ్మను కదిలించి వేసిందనేది అర్థమౌతున్నది. అమ్మ అనుగ్రహాన్ని, కరుణను పుష్కలంగా పొందిన వాడని తెలుస్తున్నది. ఆ తర్వాత వారు ఊరువెళ్ళిన కొద్ది కాలానికే అమ్మలో లీనమైన ధన్యజీవి పుల్లయ్య.
అమ్మ చాల మందితో పుల్లయ్య పరమభక్తుడని చెపుతూ ఉండేది. అంతటి ఆదర్శభక్తుడు పుల్లయ్య.