అమ్మ అనుగ్రహానికి ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారు. ఇతర దేశాల నుండి వచ్చేవారు. సంఖ్య తక్కువే అయినా వారంతా అమ్మ పట్ల అచంచల భక్తి విశ్వాసాలు కలవారు. సామాన్యంగా అమ్మ వద్దకు వచ్చేవారిలో ఎక్కువమంది అమ్మ మహిమలకు ఆకర్షితులయ్యే వస్తారు. అమ్మ ఎన్నడూ అన్నం తినకపోయినా ఏ మాత్రం వర్చస్సు తగ్గకుండా ఉంటుందనీ, అమ్మవద్దకు వెళ్ళితే మా అమ్మాయి పెళ్ళయిందనో, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందనో, మా వాడు పరీక్షలు పాసైనాడనో ఏదో, ఏవేవో ఎవరో తెలిసినవారు చెపితే విని వచ్చే వారి సంఖ్య ఎక్కువ. అంతేగాని అమ్మ ఏం చెప్పింది? ఏం చెబుతుంది? ఎవరెవరికి ఏలా సమాధానాలిస్తున్నది? అని విని తెలుసుకోవటానికి వచ్చే వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. అయితే అమ్మ ఒక మాట అంటుంది “ఎవరైనా నేననుకుంటేనే ఇక్కడికి వస్తారు” అని. కాబట్టి ఏ ఆలోచనతో ఎలా వచ్చినా అమ్మ సంకల్పం లేకుండా రాలేరు అనేది సత్యమైన విషయం.
చెన్నై నుండి సోదరులు పద్మనాభన్, పి. వెంకటేశ్వర్లు, సుందరరామన్ వంటి వారి కుటుంబాలు అమ్మవద్దకు వస్తుండేవారు. అమ్మ 1962లో మద్రాసు వెళ్ళి వచ్చింతర్వాత సినిమా యాక్టర్లు లక్ష్మీరాజ్యం, కృష్ణ, విజయనిర్మల, సి. హెచ్.నారాయణరావు వంటివారు కూడా వచ్చారు.
1972లో ఆనంద వికటన్ పత్రికా సంపాదకుడు జిల్లెళ్ళమూడి అమ్మతో వివిధ విషయాలపై చర్చించి తన పత్రికలో పవిత్రయాత్రపేరుతో వరుసగా 2, 3 మాసాలు వ్యాసాలు ప్రచురించాడు. అవి చదివింతర్వాత తమిళనాడులోని ఆస్తికులు చాలమంది అమ్మను దర్శించాలని ఉత్సుకపడ్డారు. అలా ఆ పత్రిక చదివి వచ్చినవారిలో పార్థసారధి అయ్యంగార్ ఒకరు.
పార్ధసారధి అయ్యంగార్ గారికి తెలుగురాదు. అమ్మకు అరవం రాదు. ఇంగ్లీషు నేర్చుకోలేదు. తెలుగే 2వ తరగతి దాటి చదువలేదు. అయితే ఆశ్చర్యమేమిటంటే ఏ రకమైన దుబాసీల అవసరం లేకుండా అమ్మ ఇతర రాష్ట్రాల వారితోటి ఇతర దేశాల వారితోటీ ప్రసంగిస్తూనే ఉంటుంది. ఎదుటి వారికి అమ్మ భాషతో సంబంధం లేదు. అమ్మ భావ ప్రకటన అర్థమౌతూనే ఉంటుంది. ఎవరైన ప్రక్కనున్నవారు తప్పుగా అమ్మ మాటలు అనువాదం చేసిగాని అమ్మకు తెలుగులో అవతలి వారి మాటలు చెపుతుంటే ఇద్దరిని సరిచేసి అలా కాదు ఇలా అని చెప్పేవారు.
పార్థసారధి అయ్యంగారు ఇంగ్లీషులో అమ్మతో మాట్లాడుతుండేవారు. అప్పుడప్పుడు అమ్మ వద్దకు వచ్చి వారం పదిరోజులుండి వెళ్ళేవారు. 1972 73లలో ఒకసారి కొన్ని నెలలు అమ్మ వద్ద ఉన్నారు. ఆయన మద్రాసు పోస్ట్మాస్టరు జనరల్ ఆఫీసులో పనిచేసేవారు. అమ్మ వద్ద ఉన్న రోజులలో అమ్మను గూర్చి ఉన్న ఆంగ్ల గ్రంథాలు అధ్యయనం చేశారు. అమ్మతో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవారు. ఒక చైతన్యశక్తి భూమిపై అవతరించి మాతృత్వదీప్తితో వాత్సల్యంతో అపారమైన ప్రేమతో అందరినీ తన బిడ్డలుగా లాలిస్తున్నదని అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడు. అమ్మసన్నిధిలో గడిపిన కాలంలో ఇది వాస్తవంగానూ, ప్రత్యక్షంగానూ నిరూపితమౌతున్న విషయాన్ని గ్రహించిన సత్యం. ఇది ఒకరి పట్లనో కాదు తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల ఇలాటి వాత్సల్యాన్నే అమ్మ చూపటం, రానిబిడ్డలపట్ల కూడా నా ప్రేమ ఇలాగే ఉంటుందని చెప్పటం అర్థం చేసుకున్నాడు.
మద్రాసు మాతృశ్రీ మిషన్ వారి కోరికపై అమ్మ జీవితచరిత్ర చిన్నగ్రంథాన్ని ఆంగ్లంలో వ్రాసి ఇచ్చారు. 1973లో అమ్మ స్వర్ణోత్సవాలలో లక్షమంది ఒకే పంక్తిని భోజనం చేస్తున్న దృశ్యం అమ్మ తిలకించి తర్వాత కోటిమంది బిడ్డలను చూడాలనే సంకల్పంతో చాలా ప్రాంతాలు తిరిగింది. 1975 మార్చిలో అమ్మ మద్రాసు వెళ్ళినపుడు మద్రాసు మాతృశ్రీ మిషన్వారు ఆ గ్రంథాన్ని అచ్చొత్తించి అమ్మకు. సమర్పించి అమ్మ చేత ఆవిష్కరింప చేశారు.
“తెలిసీ తెలియని స్థితిలో అమ్మని చూస్తున్న ఆనంద తన్మయత్వంలో స్మృతిలేని మానసిక పరిస్థితులలో అమ్మను గూర్చి ఎంత తెలిసిందో ఎంత తెలియలేదో ఎవరం చెప్పలేం. ఎవరికైనా తరుణం వచ్చినప్పుడు మాత్రమే అమ్మ తన విశ్వమాతృత్వాన్ని తెలియజేస్తుంది. అయితే అమ్మ జీవిత చరిత్రలోకి వెళ్ళితే కొన్ని ఘట్టాలు ఆనందాన్ని తృప్తిని ప్రసాదిస్తుంటాయి. అంతుచిక్కని, శాశ్వతమైన అమ్మతత్వం తెలియటమంటే అమ్మ అనుగ్రహం తప్ప మరోమార్గం లేదు” అని వారు తమ గ్రంథంలో తెలియజేశారు.
పార్థసారధి గారి భార్య అమృతవర్షిణి, సత్యసాయి భక్తురాలు. ఆమెకు మరొక వ్యక్తిగాని, దేవత గాని గిట్టదు. మంచి సత్యసాయి ఉపాసకురాలు. అనుమానాలతో తన ఇంటికి వచ్చిన వారికి సాయిబాబా నడిగి ధ్యానంలో తెలుసుకొని వారికి తగు సలహాలు, సూచనలు, పరిష్కారాలు చెబుతుంటుంది. అలా చాలమందిలో ఆమె పట్ల విశ్వాసం ఉండేది.
పార్థసారధిగారికి వారింటికి అమ్మని తీసుకెళ్ళాలని కోరిక. మళ్ళీ వారి శ్రీమతిని గూర్చిన అనుమానం. అమ్మ తనంత తానే వారింటికి వస్తానని పార్థసారధిగారికి చెప్పింది. ఆయన ఆనందానికి అవధులు లేవు. అమ్మే వస్తానంది. కదా! అన్నీ అమ్మే చూచుకుంటుంది అని భావించారు. ఆశ్చర్యం ఏమిటంటే అమ్మ వారింటికి వెళ్ళింది. పార్థసారధి అయ్యంగారి భార్య అమ్మను సాదరంగా భక్తిభావంతో ఆహ్వానించింది. తను నిత్యమూ ఆరాధించే సాయిబాబా చిత్రపటమున్న ప్రత్యేక సింహాసనంపై అమ్మను కూర్చోబెట్టి షోడశోపచారాలతో అమ్మను తన భర్తతో కలిసి పూజించింది. వారికి పిల్లలు లేరు. అమ్మ సాయిబాబానే తమ దేవతలు పిల్లలు అని పలికింది.
అమ్మ అనుగ్రహ ప్రవాహానికి పార్థసారధి అయ్యంగారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి అమ్మకు శతకోటి నమస్కారాలు చేసుకున్నాడు. నిజంగా పార్థసారధి అయ్యంగారు ధన్యజీవి.
అమ్మ వద్దకు రాకముందు పార్థసారధిగారు జిడ్డు కృష్ణమూర్తి భావాలను బాగా అధ్యయనం చేశారు. సంప్రదాయ వేదాంతాన్ని చక్కగా గ్రహించారు. అన్నీ చదివి అమ్మను చూచిం తర్వాత అమ్మ చెప్పేది Absolute, ultimate truth అని శిఖరాయమాన అనుభవపూర్వకము అయిన సత్యం అని నిగ్గుతేల్చుకున్నారు. అమ్మవద్ద పనిచేస్తున్న కొండముది రామకృష్ణ అన్నయ్య గూర్చి ఒక ఇంగ్లీషు ఆర్టికల్ (super human in action) కర్తవ్యపరాయణుడైన మానవాతీతవ్యక్తి అని ప్రశంసించాడు. ఒక జైనమునిలాగా తెల్లటి వస్త్రాలలో కనిపించే పార్థసారధి అయ్యంగార్గారు ఆలోచనాలోచనాలు గల (లోచూపు) వ్యక్తిగా దర్శనమిస్తాడు.