1968లో శ్రీపూర్ణానంద స్వామి, సోదరులు శ్రీ అన్నంరాజు రామకృష్ణారావుగారితో కలిసి అమ్మవద్దకు వచ్చారు. ఆ రావటం కూడా ఒక విచిత్రమైన అలౌకిక సన్నివేశమే – అమ్మ జన్మదినోత్సవ సందర్భంగా మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ అమ్మను గూర్చి వ్రాసిన వ్యాసం ఇండియన్ ఎక్స్ప్రెస్లో అచ్చయింది. అమ్మ ఛాయాచిత్రము, ఆ వ్యాసము చూచి అమ్మను గూర్చిన విశేషాలు అందులో ఉటంకించినవి సోదరులు అన్నంరాజు రామకృష్ణారావుగారు స్వామికి చెప్పి ఆ పత్రిక చూపించారు. చూసీ చూడగానే అమ్మ “రాజరాజేశ్వరి”, అమ్మను దర్శించు అని రామకృష్ణారావుగారికి చెప్పారు స్వామి. అప్పటికి రామకృష్ణారావు గారికి కూడా అమ్మను గూర్చి తెలియదు. అందువల్ల స్వామివారిని, రామకృష్ణారావుగారిని అమ్మే తన వద్దకు రప్పించుకుంది అనటం వాస్తవం.
స్వామి కాషాయాంబరధారియై నిగనిగలాడే నల్లని జటాజూటంతో విబూధిరేఖలు నుదుటన, జబ్బలపై, ముంజేయిపై మురుపు చూపుతుండగా, బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతుండగా దండకమండలాలు చేతులలో ధరించి నవయౌవనంలో అపరశంకరులా అన్నట్లుగా ఎవరినైనా ఆకర్షించే స్ఫురద్రూపియైన ఒక మహాతపస్వి కనిపించారు.
పూర్ణానందస్వామి తాతగారు పిచ్చుమణి అయ్యార్ తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధురైలో నివసించేవారు. ఆయన మంచి కవీశ్వరుడు. ‘కవిరాయర్’ అనే బిరుదు కూడా ఉండేదివారికి. వారి కుమారులు, సుబ్రహ్మణ్యశాస్త్రి శ్రీచక్రోపాసకులు. సంస్కృత తమిళభాషలలో మంచి పాండిత్యం సాధించారు. తాతతండ్రుల నుండి వచ్చిన సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్నారు పూర్ణానంద స్వామి. పూర్ణానందుల తల్లివైపువారు కూడా అత్యంత ప్రతిభావంతులు, పండితులు. స్వామివారి తల్లి పర్వతవర్ధని. ఆ అమ్మ సుబ్రహ్మణ్యస్వామి ఆశీర్బలంతో జన్మించిన పుణ్యాత్మురాలు. పర్వతవర్ధని సుబ్రహ్మణ్యశాస్త్రి కామకళా యాగం చేసిన తర్వాత 7.11.1939న జన్మించడం వల్ల స్వామికి “కామేశ్వరన్” అని పేరుపెట్టారు తల్లిదండ్రులు. చిన్నతనంనుండే ఆధ్యాత్మిక జిజ్ఞాసలోనే కాలంగడిపేవారు. తన ఆరవయేటనే తనకు పాఠం చెప్పే ప్రధానోపాధ్యాయులచే యజ్ఞం చేయించారు స్వామి. యస్.యస్.యల్.సి. దాకా చదివిన స్వామి కొంత కాలం ఒకటి రెండు చోట్ల ఉద్యోగాలు కూడా చేశారు. అయితే ఆధ్యాత్మిక జిజ్ఞాస ఆ ఉద్యోగాలలో ఎక్కువ కాలం ఉండనిచ్చేడి కాదు.
తమిళనాడులోని కరచూర్ దగ్గర గల బాణ తీర్థంలోనూ, పొదుగై పర్వతాలలోని వరుణ గుహలోనూ తపస్సులో కాలం గడుపుతుండేవారు. ఆ రోజులలో రాఖాడీ బాబా (ఓంకారానంద్) అనే సన్యాసి వీరి తపస్సుకు మెచ్చి 1967 కార్తీక పూర్ణిమనాడు సన్యాస దీక్షను ప్రసాదించి “పూర్ణానంద స్వామి”గా దీక్షానామాన్నిచ్చారు. గురువుగారి ఆజ్ఞననుసరించి “పాపనాశనం” శివాలయంలో కొంత కాలం తపస్సు చేశారు. అక్కడ నుండి శ్రీశైలంలోని హటకేశ్వరలో దేవాలయం వద్దగల ఆశ్రమంలో పంచాగ్ని మధ్యంలో ఒంటి కాలిపై నిలబడి ఏకదీక్షగా భగవత్సాక్షాత్కారం కోసం తపించిన స్వామికి అమ్మ సాక్షాత్కారం. కావటం విశేషం. ఆదిశంకరులు తపస్సు చేసిన ప్రాంతమది. జ్ఞాన రోచిస్సులు వెదజల్లుతూ తపోదీక్షలో ఉన్న స్వామిని ప్రజలు కనుగొన్నారు. ఒక్కొక్కరే వారి వద్దకు చేరటం ప్రారంభమైంది. అలా చేరిన మొదటి ఒకరిద్దరు వ్యక్తులలో శ్రీ అన్నంరాజు రామకృష్ణారావుగారొకరు. అలా ఒక చోటకు చేరిన గురుశిష్యులిద్దరూ అమ్మ వద్దకు వచ్చారు.
అమ్మ తన సహజ సిద్ధమైన వాత్సల్యంతో స్వామీజీని పసిపిల్లవానికి వలెనే లాలించి సపర్యలు చేసింది. అన్ని విషయాలు స్వయంగా చూసింది. గోరుముద్దలు చేసి భోజనం పెట్టింది. గుడ్డలు పెట్టింది. ఆప్యాయతతో నిమిరింది. అమ్మకు దేవుళ్ళూ బిడ్డలే బిడ్డలూ దేవుళ్ళే. ఆ తర్వాత స్వామి రెండు మూడు సార్లు అమ్మ జన్మదినోత్సవాలప్పుడు దసరా ఉత్సవాలకు వచ్చారు. అమ్మ మామూలుగా తాను వేసే తీర్థం అందరికీ స్వామి చేత వేయించింది. అమ్మ చెప్పిన “సర్వావస్థలయందు సమానస్థితే సమాధి స్థితి” అన్న సూక్తికి పరవశించి అమ్మను గూర్చి “షీయీజ్ నన్ అదర్గాన్ భువనేశ్వరి” అని భావించిన స్వామి మొదటిసారి రెండు గంటలకుపైగా అమ్మ వద్ద మౌనంగా కూర్చొని అమ్మ సపర్యలు పొందిన స్వామిని అమ్మను గూర్చి ఇప్పటి మీ అభిప్రాయమేమిటి అని అడగ్గా “సంపూర్ణత్వం అంటే అమ్మే అమ్మ అంటే సంపూర్ణత్వమే” అని చెప్పారు. అమ్మ పెట్టిన అమృతపు ముద్దలు తిన్న స్వామి “At last the motherless Shiva has found his mother” అని ఆనంద పరవశులయ్యారు.
1970 దసరాలలో వచ్చిన పూర్ణానందస్వామిని పర్సా దుర్గాప్రసాద్ రావు (మాజీప్రధాని కీ.శే. పి.వి. నరసింహారావుగారి బావగారు) గారు అమ్మను గూర్చి స్వామిజీ అభిప్రాయం అడుగగా ‘అమ్మ’ అనటంలోనే సర్వదేవతలకు ఆధారమైనదన్న భావం ఉన్నది కదా! అన్నారు స్వామీజీ. అప్పుడు దుర్గాప్రసాద్దావుగారు “Please clarify whether Amma is Mother or Father” అనగా వెంటనే స్వామి “Mother of Father” అన్నారు. అక్కడి వారందరూ ఆ అసంకల్పిత సమాధానానికి సమ్మోహితులైనారు. అయితే ప్రసాదరావుగారు అంతటితో వదిలిపెట్టక Father of Mother కూడానా? అన్నారు. అందుకు స్వామి “No. Mother of All means the origin of everything అని వివరించారు.
అమ్మ స్వామీజీతో స్వామిజీకి శరీరాన్ని ప్రసాదించిన అమ్మను కూడా జిల్లెళ్ళమూడికి తీసుకొని రమ్మంది. అమ్మ ఆజ్ఞను శిరసావహించి తన తల్లి “పర్వతవర్ధని”ని అమ్మ వద్దకు తీసుకొని వచ్చారు. అమ్మను చూచి ఆ తల్లి కూడా పరవశించింది.
స్వామిజీ శిష్య పరంపర వందలు వేలకు పెరిగింది. శ్రీశైలంలోని సున్నిపెంటలోనూ భాగ్యనగరం దగ్గరి హటకేశ్వరంలోనూ ఆశ్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముమ్మరమైనవి. లలితా సహస్ర, త్రిశతి, ఖడ్గమాలా, అష్టోత్తర శతము, చండీ సప్తశతి పారాయణలు హోమములు అత్యంత ఉత్సాహంతో వీనుల విందుగా, కన్నుల పండువుగా వేదనాదాలు మిన్ను ముట్టుతుండగా లలితలలితంగా కన్యలు మధుర కంఠస్వరంతో స్వరయుక్తంగా రాగయుక్తంగా ఆలాపనచేస్తుండగా భక్తుల మనస్సులు వాటిలో లగ్నమై ఎంతో హాయిగా, తృప్తిగా ఊపిరి పీల్చుకుంటాం స్వామి సన్నిధిలో, ఆ వాతావరణం ఒక ఆధ్యాత్మిక తపోమందిరం. మధుర మధురానందబంధురం. భయము భక్తి పడుగు పేకల్లా పెనవేసుకొని నడుస్తున్న సుమనోసుందరం. జిల్లెళ్ళమూడి నుండి ఒకపరి నాన్నగారు సున్నిపెంటలోని స్వామి ఆశ్రమానికి వెళ్ళగా స్వామి నాన్నగారిని ఒక మహాశివునిగా వారికి జరిపిన పూజలు గౌరవాలు ఉపచారాలు చూచి అక్కడి జనం పొంగిపోయారు. అంతేకాదు జిల్లెళ్ళమూడి నుండి ఎవరు వెళ్ళినా మామూలుగా అక్కడ ఉండే విధినియమాలు ప్రక్కనపెట్టి స్వామి అత్యంత ఆప్యాయతతో ఆత్మీయంగా దగ్గరకు తీసుకోవటం చూచిన వారిశిష్యులు ఆశ్చర్యపోతుండేవారు. అమ్మ చూపిన ఆదరణే స్వామివద్ద జిల్లెళ్ళమూడి సోదరీసోదరులు పొందేవారు.
స్వామీజీ సున్నిపెంటలోని తమ ఆశ్రమంలో అన్నపూర్ణాలయం నెలకొల్పారు. అమ్మ నిలువెత్తు ఛాయాచిత్రాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. యాతావాత భక్తబృందానికి అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన ఉచిత భోజన సదుపాయం ఆ అన్నపూర్ణాలయంలో ఏర్పాటు చేశారు స్వామి.
ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా మానసికోన్నతికి, సమాజసేవకు స్వామీజీ ఎంతో తోడ్పడుతున్నారు. స్వామీజీ ప్రేమతో శిష్యులు తన్మయులైపోతుంటారు. స్వామీజీ సున్నిపెంటలో వేదపాఠశాల ఏర్పాటు చేశారు.
జిల్లెళ్ళమూడిలోని సోదరిసోదరులు భౌతికంగా అమ్మలేని లోటును విపరీతంగా అనుభవిస్తున్న తరుణంలో స్వామీజీ 1991 ఆగష్టులో జిల్లెళ్ళమూడి వచ్చారు. వారి రాక చాల మందికి ఆనందాన్ని కలిగించింది. అమ్మ మాదిరిగానే ప్రేమతో పలకరించటం, ఆప్యాయంగా ఒళ్ళు నిమరటం, ఆదరణగా మంచి చెడులు విచారించటం, అండగా స్వామీజీ ఉన్నారనే భావన కల్గించటంతో హృదయాలు ద్రవించాయి. ఎన్నో మనోమయూరాలు పురివిప్పి నాట్యం చేశాయి. జిల్లెళ్ళమూడి అందరింటిలోని ప్రతిభాగానికి వెళ్ళి పలకరించారు. పూజలు స్వీకరించారు. శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యకర్తలతో మంచి చెడులు మాట్లాడారు. భవిష్యత్కార్యక్రమాలు తెలుసుకొన్నారు. అమ్మే తిరిగి స్వామీజీ రూపంలో వచ్చింది అన్న భావన సోదరీ సోదరుల మనస్సులలో బాగా నాటుకుంది.
ఆ రకంగా ఎవరి మనసులూ నొప్పించకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక సమిష్టి కుటుంబ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించాలని స్వామి భావించారు. ప్రతి సంవత్సరం కనీసం ఒక పక్షం రోజులు జిల్లెళ్ళమూడిలో సోదరీ సోదరుల మధ్య గడపటానికి చండీ సప్తశతి హోమాలు పూజలు నిర్వహించటానికి అంగీకరించారు. అమ్మ ఈ అవకాశాన్ని కల్గించిందనుకున్నాం. కాని స్వామి ఆరోగ్యం రోజు రోజుకు సన్నగిల్లటం మొదలైంది. షుగరు జబ్బు వారి శరీరంపై ప్రతాపం చూపించటం ప్రారంభించింది. వారి శిష్యగణం స్వామిని సాధ్యమైనంత వరకు తిరగనివ్వకుండా తగుజాగ్రత్తలు తీసుకున్నారు. తగిన వైద్య సదుపాయం కల్గించారు. స్వామి ఆరోగ్యం క్షీణించటం ప్రారంభించింది. చివరకు 6.4.2000న స్వామి అవతారం పరిసమాప్తి అయింది. ఒక విచిత్రమేమిటంటే స్వామివారి గురుదేవులు రాఖాడీబాబాది కూడా అనసూయాశ్రమమే – స్వామి వచ్చింది అనసూయ మందిరానికే పూర్ణానందస్వామి అనసూయలోనే – చేరడంలో ఆశ్చర్యమేముంది? స్వామి శివులు. త్రిమూర్తులను ఆడించిన, స్తన్యమిచ్చిన తల్లి కదా అనసూయ. స్వామీజీ శాశ్వతులు నిరంతరం చిరకాలం మనమనస్సులలో నిలచి పోతారు.