అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం.
అయోగ్యః పురోషో నాస్తి యోజకః తత్ర దుర్లభః
మంత్రం కాని అక్షరం లేదు. నాని, త్రిలోకం సమ ఆగేతన ప్రజాప ఔషధం కాని వేరు లేదు. యోగ్యుడు కాని పురుషుడు లేడు. అన్నింటినీ సద్విని యోగం చేసుకోవాలనే ఆలోచన కలవారు (యోజకులు) తక్కువగా ఉంటారు. అటువంటి ఆలోచన గల వాళ్ళలో రాజు బావ ఒకరు.
“మీలో నేను దైవత్వం చూస్తాను. నాలో మీరు మానవత్వం చూస్తారు”. అన్నది అమ్మ. మానవిగా ఉద్భవించిన అమ్మలో దైవత్వాన్ని దర్శించిన మహానీయుడు రాజుబావ.
1954లోనే అమ్మవద్దకు చేరిన అదృష్టవంతుడు. అమ్మ స్వయంగా వడ్డించగా ఆ మాధుర్యాన్ని చవి చూచినవాడు. ఆ అన్నపు ముద్దలతోపాటు అమ్మ జీవిత రహస్యాలను అమ్మ చెప్పగా విని, ప్రత్యక్షంగా దర్శించిన వ్యక్తి. అమ్మ బాధామయగాథలు దర్శించి చలించి అమ్మ అనుభవ వేదాంత నిధులను హృదయగతం చేసుకుని తన మాట పాటగా ఆలపించి అమ్మను అర్చించుకున్న వాగ్గేయకారుడు మహాభాగ్యవంతుడు రాజుబావ.
అందరింటిలో అందరూ అక్కచెల్లెళ్లూ – అన్నా తమ్ముళ్ళే కదా మరి. అమ్మ బంధుగణంలో జిల్లెళ్ళమూడి వచ్చిన మొదటి బంధువు రాజుబావ. సుబ్బారావు, హైమ, రవి వచ్చిన వ్యక్తిని ఎగాదిగా చూస్తుంటే “రాజుబావ నాన్నా!” అన్నది అమ్మ. ఆ పేరే స్థిరపడిపోయింది.
1956లో నాన్నగారికి జిల్లెళ్ళమూడిలో నబీపొగాకు బేరన్ ఉండేది. అందులో పొగాకు క్యూర్ చేసేవారు. ఆ రోజుల్లో అమ్మ ఇంటిపని, వంటపని, గొడ్ల చావిడి పని, అతిథి మర్యాద, చెఱువు నుండి నీళ్ళు తెచ్చుకోవటం అన్నీ తనే చేసేవారు. ఒకరోజు రాజుబావ వచ్చేటప్పటికి అమ్మ ఇంట్లో లేదు. బయటకు వెళ్ళిందేమో ననుకున్నాడు. తాను పొగాకు కంపెనీలో పనిచేస్తూండటం వల్ల నాన్నగారి పొగాకు ఎంతవరకు క్యూరింగ్ అయిందో చూద్దామని బేరన్ తలుపులు తెరచి చూస్తే 140 డిగ్రీల టెంపరేచర్లో అమ్మ అందులో కమిలిపోయి సొమ్మసిల్లి పడిపోయి ఉన్నది. తరువాత నెమ్మదిగా లేచి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఎన్ని చూచాడో. అమ్మ చరిత్ర మొదట వ్రాసిన రహిని కూడా అమ్మ రాజుబావకు చూపించింది. కారణాంతరాల వల్ల అది కాలగర్భంలో కలసిపోగా తరువాత మళ్ళీ అమ్మ భాస్కరరావు అన్నయ్య చేత వ్రాయించింది.
అమ్మ జిల్లెళ్ళమూడిలో పడుతున్న కష్టాలను చూసి సీతాపతి తాతగారు నీ జాతకం చూసిన వారు ఈ జాతకురాలు చాలా సుఖం అనుభవిస్తుంద న్నారమ్మా ! నీవేమో ఇలా ఉన్నావు అన్నారు. అందుకు అమ్మ కష్టాలను కష్టాలనుకోకపోవటమే సుఖం నాన్నా! అన్నది. అమ్మ బాధనూ, దుఃఖాన్నీ, సుఖాన్నీ, ఆనందాన్నీ ఒకటిగానే అనుభవించేది. లౌకికమూ, ఆధ్యాత్మికము రెండు లేవన్నది. ఆ అనుభవసారామృతాన్ని గ్రహించిన కొద్దిమందిలో రాజుబావ ఒకరు.
పాడుచు పాడుచు నీ కథ చాటుచు పయనించెద నేనోయమ్మా ప్రాణము వదలెద నోయమ్మా! అంటూ రోజూ కొమ్మూరు నుండి సైకిలుపై వస్తూ పాడుకుంటూ ఉండేవాడు. అమ్మలోని అతి మానవ సహనశక్తిని దర్శించి “నీదు ఓరిమి భూమి ఓరిమి నీకు నీవే సాటి తల్లీ” అంటారు. హృదయమున బడబానలము, మౌళిపైన మంచుకొండలు పెట్టుకుని, ప్రతి మానవ హృదయాలలోని మలినమంతా కడిగివేసే పవిత్ర గంగా భవానిగా అమ్మను దర్శించారు. తమ హృదయ వీణాతంత్రులపై అమ్మ యశోగానలహరిని ఆలపించాడు. అమ్మ వెలలేని గాధ వినిపించి లోకాన అమ్మ జ్ఞానజ్యోతి వెలిగించాడు. ఆ వెలుగులో మనలను పయనించమన్నాడు.
విష్ణుమూర్తి చేతులలోని గద, శార్యము, కోదండము, సుదర్శనము అనేవి మామూలు ఆయుధములు కావు సజీవమైన దైవబలములు. వైష్ణవులు వాటికి దేవతా రూపము లిచ్చి పూజిస్తుంటారు. అలాగే రాజుబావ కూడా. రాధాదేవి, శ్రీకృష్ణుడు కూడా తమ పెదవుల పై వేణువు ధరిస్తారు. శ్రీకృష్ణుని వేణువులో నుండి బ్రహ్మ గాంధర్వ నాదం వస్తుందని భాగవతం చెపుతుంది. జగత్ చైతన్యమూర్తి అయిన అమ్మ పెదవులపై వెలసిన సువర్ణ వేణువు రాజుబావేమో! ఎందుకంటే అమ్మ అనుభవించిన వేదనాగ్నిలో, బాధలలో ఎర్రగా కాలిన రాజుబావ మనస్సు సువర్ణ వేణువు, గనుకనే అమృతమయమైన గీతా లాలపించాడు.
ఇంత వ్రాసినా, రాజుబావ వ్రాసింది తాను కాదు, అమ్మే నన్నాడు. చేయి రాజుబావది. వ్రాయించింది, వ్రాసింది అమ్మ. వేదాలు తెలుపు సారాలు రాజుబావ నుదుట వ్రాసింది. అది రాజుబావ అనుభవసారమై మనకు అందింది. ‘నీ మాట నామాట ఒకటేనులే’ అనగలిగిన చేవ, ధైర్యం ఎంతమందికి ఉంటుంది? ప్రహ్లాదుడు ‘పానీయంబులు త్రాపుచున్, కుడుచుచున్, భాషించుచున్…. సంతత శ్రీ నారాయణపాదపద్మయుగళీ చింతామృతా స్వాద సంధానుండై మరచె ఏతద్విశ్వమున్”. అలాగే రాజుబావ “అమ్మా! సంతోషం బులో, సంతాపంబులో సంగీతంబులో నాదు గీతంబులో నాదు శ్వాసంబులో నాదు ధ్యానంబులో నీవే నీవే” నంటూ తన్మయుడౌతాడు.
ప్రభావతక్కయ్య శవం ప్రక్కన ఉన్నది. రావూరి ప్రసాద్ రాజుబావ ప్రక్కన కూర్చున్నాడు. ప్రసాద్ను నాకొక మాటిస్తావా అని అడిగాడు. ఇస్తానన్నాడు. ప్రసాదు. శ్రీ కరము – శుభకరము అని తాను అమ్మను గూర్చి వ్రాసిన పాట పాడనున్నాడు. ప్రసాదు ఆ పాట ఆ సమయంలో పాడటమా అని ఆలోచించలేదు. ఎందుకంటే మాట ఇచ్చాడు కదా! పాట మొదలు పెట్టాడు. రాజు బావ – రాజుబావ పిల్లలు కూడా శ్రుతికలిపి పాడారు. అదీ రాజుబావకు అమ్మ ప్రసాదించిన సమదృష్టి.
1936-56 మధ్య అమ్మ అనుభవించిన తెరవెనుక గాధలు తన కళ్ళకు కనిపించగా చూచి తాను అనుభవించి వ్రాసిన అమృత గీతాలు రాజుబావవి. అమ్మ ఇచ్చిన ఆనందయోగంలో అమ్మై వ్రాసిన పాటలవి. స్థితప్రజ్ఞుడు వ్రాసిన గేయాలవి. మాతృతత్త్వార్థ దర్శనమే లోచూపుగా రాజు హృదయం ఆలపించిన రాగాలవి.
రాజు బావ అమ్మను ఏదీ కోరేవాడు కాదు. ఇంట్లో వాళ్ళంతా బలవంత పెడితే అమ్మను ILTD లో తన ఉద్యోగం పర్మినెంట్ విషయం అడిగాడు. అమ్మ సరేరా రాజూ! నీవు నా దగ్గరకు వస్తున్నావు కనుక నీ కోరిక తీర్చాలి కదా! నా దగ్గరకి రాని వాళ్ళు నా బిడ్డలు కాదా! అని అడిగింది. అందరూ నీ బిడ్డలేనమ్మా! అన్నాడు. అప్పుడు ఆ బిడ్డకొచ్చే అవకాశం తప్పించి నీకు ముందు ఇప్పించమంటావు. నీవు కావాలంటే అలాగే చేస్తాను అన్నది అమ్మ. అలా వద్దమ్మా! అని ఆ అనుభవంతో “కోరికలు కోరేటి-కోరికేలేనట్టి, మనసుండు నట్లుగా” – వరదోభవ “అమ్మా! స్థిరోభవ” అనే పాట వ్రాశాడు.
రాజుబావకు విశ్వరూప సందర్శనాన్ని ప్రసాదించింది అమ్మ. అనుభవంతో పంచభూతాలతో తాదాత్మ్యం చెందిన రాజుబావ నుండి “ఆ ఒక్క క్షణమైన చాలు జన్మజన్మల పుణ్యఫలమీదే కాబోలు” అనే గేయం వెలువడింది.
“పారిజాతమునకు పరిమళమ్ము విధాన
నాకు కవిత ఒకటి నైజమయ్యె
దాని అంత అదియె తరలి వచ్చుచునుండు
నచ్చినపుడు మనసు మెచ్చినపుడు’ అని అమ్మపై మొదటి గ్రంథం “అంబికాసాహస్ర” వ్రాసిన డా॥ ప్రసాదరాయ కులపతి అన్నారు. “అనుభూత్యా వేశంబుల జనితంబులు లలితకళలు” అన్నాడు మరొక కవి.
అలాగే రాజుబావ హృదయం ఆనందతరంగితమై బాధాతప్తమై అనుభూతిలో నుండి వెలువడిన గీతాలు రాజు గీతాలు. అవి రాజాపాటలు.
అమ్మ వద్దకు వచ్చేటప్పటికి కొంత సంప్రదాయ వేదాంతి అయిన రాజుబావ అంతా అదేననీ, పరిణామం తప్ప నాశనం లేదనీ, పునర్జన్మలేదనీ తృప్తే ముక్తి అనీ, పురుషప్రయత్నం లేదనీ అమ్మ చెప్పే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన అనుభవశీలి.
1958లో కనిపించినప్పుడు రాజుబావ ఎలా ఉన్నాడో చివరి వరకు ఆ చిరునవ్వే, ఆ నిరాడంబరతే, ఆ నిత్యతృప్తే, ఆ నిర్వికారతే. ఆ అచంచల విశ్వాసమే, ఆ కష్టసహిష్ణుతే, ఆ ప్రేమే. అలా అరుదుగా కనిపించే ఋషితుల్యు డైన శ్రీ రాజుబావతో కలసి ఉండటం మన అదృష్టం. అమ్మ మనకు ప్రసాదించిన వరం.
1930 జనవరి 3వ తారీకున మన్నవలో పుట్టిన రాజుబావ, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తొలగిపోయిన మనసుదుటి భాగ్యనగరంలా అక్కడే 2016 జులై 31వ తేదీన అమ్మ పెదవిపై దివ్యవేణువు స్థానాన్ని పొందటానికి అమ్మ వద్దకే వెళ్ళాడు.