ఉభయభాషాప్రవీణ, వేదాంతపారీణ, కవిశేఖర, విద్యానాథ, కవితా మహేశ్వర బిరుదాంచితులైన శ్రీమిన్నికంటి గురునాథశర్మగారు అవధానిగా, ఆశుకవిగా, ఒక వయ్యాకరిణిగా, పండిత పరమేశ్వరునిగా లోకంలో ప్రసిద్ధి వహించినవారు. ఆంధ్రమహాభాగవతంలో ఏకాదశ ద్వాదశ స్కంధాలను సప్రమాణంగా తెనిగించిన మహానుభావులు. ప్రస్తుతం కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులైన శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వాములకు వీరు గురుదేవులు. చిన్నతనంలోనే శతావధానులు, ఆశుకవి చక్రవర్తులు, కుండినకవి హంసులు అయిన కొప్పరపుకవుల ఆశీస్సులతో కింకవీంద్ర ఘటాపంచాననులైన తిరుపతి కవులపై సాహిత్య పోరాటానికి ధ్వజమెత్తినవారు. “అక్కరమును వీక్షింపక ఒక్క నిముసమైన బుచ్చనోపను” అన్న సాహిత్య తపస్వి.
ఒకసారి 1960లో డాక్టర్ ప్రసాదరాయకులపతి ‘జిల్లెళ్ళమూడి అమ్మను గూర్చి పది పదిహేను పద్యాలు వ్రాయండి. మనవారు కూడా కొంతమంది వ్రాస్తారు, ఒక సంచికగా ప్రకటిస్తామని’ చెప్పారు. అంతకుముందే శర్మగారికి జిల్లెళ్ళమూడికి వెళ్ళి అమ్మను సందర్శించే భాగ్యం కలిగింది. 23.4.1960న అమ్మకు అత్యంత ప్రీతిపాత్రులు, గుంటూరులో న్యాయవాది, శ్రీ గోవిందరాజు దత్తాత్రేయశర్మ గారితో కలసి అమ్మను దర్శించి వచ్చారు. శ్రీ కులపతి అడిగిన అభ్యర్థన మేరకు ముక్తక పద్ధతిలో పది పదిహేను పద్యాలు వ్రాద్దామని మొదలు పెట్టారు. కొన్ని పద్యాలు వ్రాశారు. ఈ విషయం తెలుసుకొన్న దత్తుగారు అమ్మవారు గూర్చి తాను సేకరించిన విషయాలు తెచ్చి యిచ్చారు. శర్మగారు తమ అనుభవము, దత్తుగారి విషయ సేకరణలతో పద్యాలు శరపరంపరంగా వచ్చి అనుకోకుండానే 250 పద్యాలు గల గ్రంథమైంది. 1961 సంక్రాంతికి ‘అమ్మ’ అనే పేరుతో ప్రచురింపబడింది.
“ముకుత్రాడంది విభుండు లాగికొనుచున్ పోవంగ ఆ గంగిరెద్దుకు శక్యంబటె నేను రాననుచు గంతుల్వైయ్య” అని వారే గురు భాగవతంలో వ్రాసుకొన్నట్లుగా అమ్మ ఆయనలో దూరి వ్రాయించింది. ఆయన వ్రాయకుండా ఉండలేకపోయారు.
అమ్మ వద్దకు పోయినప్పుడు వారెంత హాయిని అనుభవించారో వ్రాస్తూ పండు వెన్నెలలో పడుకున్నట్లు, తృప్తిగా అమృతం తాగినట్లు, కోరిన కోర్కెలన్నీ తీరినట్లు ఉన్నది అన్నారు. అమ్మా నీ దగ్గరకు ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తున్న ఒక విచిత్రమైన అనుభూతి వస్తున్నది అంటారు. అమ్మ ఈ అవతారం ఎందుకు దాల్చిందో చెపుతూ ప్రేమ అంటే ఏమిటో, ఎట్లా ఉంటుందో తెలియజేయటానికే కాదు, ప్రేమను జూపించటానికి అవతరించిందనీ కాదు, అందరి చేత ప్రేమను అనుభవింపచేయటానికి అవతరించిన ప్రేమావతారం అంటారు.
అంతేకాదు అమ్మలోని పతివ్రతా లక్షణాలను గమనించిన శ్రీ శర్మగారు. ‘అత్తగారి మాటకు అడుగుదాటవు-భర్తమాట చెవి సోకగానే లేచి నిలబడి భక్తి శ్రద్ధలు చూపిస్తావు’ అంటూ భారతీయ ఆదర్శ స్త్రీ ధర్మాన్ని అమ్మ ఆచరించి చూపించిన వైనాన్ని చెప్పారు. ఏదైనా ఎవరైనా ప్రశ్నవేస్తే వాడి స్థాయికి వెళ్ళి అమ్మవాడికి తగిన సమాధానం చెప్పటం గమనించారు శర్మగారు. మహాత్ములైన వారెందరో అమ్మవద్దకు రావటం చూచిన శర్మగారు ఏదో అమ్మలో మహత్తర సిద్ధశక్తి ఉన్నదనీ, అమ్మ ఎవరో ఆదిమశక్తి, లలిత అనీ భావించారు. అమ్మ ఏమీ చదువుకోలేదని చెపుతున్నారు, జపాలు, తపమూ చెయ్యలేదని చెపుతున్నారు, ఉపనిషత్తులు చూడలేదంటున్నారు కదా! ఎట్లా చెపుతున్నది పండితులడిగే ప్రశ్నలకు సమాధానాలు? అమ్మే ఉపనిషన్మూర్తిగా కూర్చున్నదా అంటూ ఇనుమును బంగారం చేయటానికి పరుసువేది లాంటిది కావాలి కాని అమ్మే బంగారము పరసువేది అయితే ఇంకొకదానితో పనేమున్నది. అమ్మది పూర్ణావతారము అని నిర్ణయానికి వచ్చారు.
అమ్లలోని యోగవిద్యారహస్యాలను కూడా శర్మగారు చాలా తెలుసుకొన్నారు. అమ్మ శీర్షం చిట్లి చిన్నశీర్షకావటం, నుదురుచిట్లి చిమ్మిన రక్తం భస్మంగావటం, ఖేచరీ ముద్రవేయటం వంటి వాటిని స్పర్శించి ఒకే సమయంలో ఒక కాలు చల్లగా, ఒక కాలు వెచ్చగా ఉండటం, ఎక్కడో శర్మగారు, దత్తుగారు మాట్లాడుకున్న విషయాలు అమ్మ చెప్పటం వారికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. అమ్మ దూరశ్రవణ, దూరదర్శన, దూరాగమనాది విషయాలు, అమ్మకు వశమైన అష్టసిద్దులు, పంచభూతాల విషయాలు తెలుసుకొని అమ్మ ఒక అతీతమైన శక్తిగానే వారు భావించారు.
అమ్మ వద్ద ఒకసారి శర్మగారు, ప్రసాదరాయకులపతిగారు మరికొందరు ఉన్నప్పుడు అమ్మ ఆశువుగా ఒక పద్యం చెప్పమని ప్రసాదరాయకులపతిని అడిగింది. వారు వెంటనే పద్యం చెప్పారు. అప్పుడు అక్కడే ఉన్న ఒక ఇంగ్లీషు పుస్తకం పొత్తూరి వెంకటేశ్వరరావు దగ్గర వుంటే అది తన చేతిలోకి తీసుకొని ఒక చోట పేజీ తీసి కృష్ణభిక్షుగారికిచ్చి అందులో ఏముందో చదువమన్నది. అందులో ఈ కవిత్వం చాలా ఉత్తమమైనది ఈ కవి చాల ఉన్నతుడని ఉన్నది. ఇంగ్లీషు భాష రాని అమ్మకు ఆ పుస్తకం ఏ పేజీలో ఏముందో ఎలా తెలిసింది? అంటే అన్నీ అయిన తల్లి అంతా అయిన తల్లి, అంతటికీ ఆధారమైన తల్లిని తను అని తెలియచేసింది అందరికీ అనుకొన్నారు అందరూ.
శర్మగారు తాను వ్రాసిన గురుభాగవతాన్ని అమ్మకిచ్చారు. అమ్మ ఆ పుస్తకాన్ని తీసి అందులో 132 పేజీ తీసి అందులో ఏముందో చదివి అర్థం చెప్పమన్నది. శర్మగారిని. అందులో అవధూత ఏ విధంగా ప్రవర్తిస్తుంటారో వివరింపబడి ఉన్నది. దానిని వివరించి అమ్మకూడా యీలాగే ప్రవర్తిస్తున్నదా? అనుకున్నారు.
అమ్మ నేనూ మీలాంటి దానినే అంటుంటే శర్మగారు ఏదో దేవరహస్యం దాక్కున్నది ఇందులో నీ మాటలలో – నేనే కాదు అందరూ అలాగే అనుకుంటున్నారు అన్నారు. అమ్మను చూస్తుంటే ఆ ముఖంలో ఏదో ఒక వెలుగు కనిపిస్తున్నది. ఒక అనిర్వచమైన అనుభూతి కలుగుతున్నది. అమ్మ ఒకసారి చూచి “ఏమి నాయనా?” అంటే ఆ అయిదు అక్షరాలు నా పాలిటికి పంచాక్షరిగా కనిపించింది అని మురిసిపోయాను అంటారు శర్మగారు. ఒక మానసిక శాంతి కలుగుతుంది అమ్మను చూచినప్పుడు అంటారు.
శర్మగారికి అమ్మ ప్రేమ ఒక్కటే నిస్వార్థమైనదిగా కన్పించింది. జిహ్వ తియ్యదనాన్ని గ్రహిస్తుంది. అమ్మ ప్రేమ తియ్యదనం సర్వవేళల్లో సర్వేంద్రియాలూ గ్రహిస్తాయి. అందువల్ల అమ్మ ప్రేమకు సాటిలేదు. అందువల్లే అమ్మది ప్రేమావతారం అని శర్మగారు తన హృదయ పుష్పాన్ని అమ్మ పాదాలపై సమర్పించారు.
శర్మగారు సహస్రచంద్ర దర్శనం చేసిన మహానుభావులు. వారు 10.4.1897న గుంటూరు జిల్లా నర్సరావుపేట తాలూకా ఏల్చూరు గ్రామంలో మిన్నికంటి వెంకట లక్ష్మయ్య, వెంకట సుబ్బమ్మలకు జన్మించారు. గుంటూరు, తెనాలిలో విద్యాభ్యాసం చేశారు. ప్రసాదరాయకులపతి గారి ముత్తాతగారు. కొప్పరపు కవులకు గురువు అయిన పోతరాజు రామకవి వద్ద పద్యవిద్య నేర్చుకున్నారు. శ్రీ శృంగేరీ విరూపాక్ష పీఠాధిపతులు శ్రీ కళ్యాణానంద భారతీమాతాచార్య స్వామి వారి వద్ద ఉపనిషత్తులు, గీతాభాష్యము, బ్రహ్మసూత్రాలు భాష్యశాంతి చేసి వేదాంతపారీణులుగా బిరుదు పొందారు. గుంటూరు హిందుకాలేజి హైస్కూలులో ప్రధాన ఆంధ్రపండితులుగా ఉద్యోగించారు. షుమారు 66 గ్రంధాలు రచించారు. అందులో పద్య, గద్య, నాటక, హరికథ, విమర్శ, సుప్రభాత, ఆధ్మాత్మికవిచార, వ్రతకల్ప, అనువాద, పరిశోధక, వ్యాకరణ, వ్యాఖ్యాన గ్రంథాలెన్నో ఉన్నాయి. ఎందరి గ్రంధాలనో పరిష్కరించి ఇచ్చారు. పత్రికలలో వ్యాసాలు, రేడియో ప్రసంగాలు ఎన్నో ఎన్నో చేశారు.
వీరిని గూర్చి సర్వశ్రీ కళ్యాణానంద భారతీ, విశ్వనాథ సత్యనారాయణ, వేలూరి శివరామశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, వడ్డాది సుబ్బరాయకవి, వఝుల చిన సీతారామశాస్త్రి, కొప్పరపు సోదరకవులు, తాతా సుబ్బరామశాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, యస్వీ జోగారావు, శివశంకరస్వామి, కృష్ణభిక్షు, కాశీ కృష్ణాచార్యులు, పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యులు, ప్రసాదరాయ కులపతి వంటి పెద్దలెందరో ప్రశంసించారు. అమ్మ ఆశీస్సులు పొందారు.
ఇంతటి ఉద్దండ పండితుడు, నిరంతర పంచాక్షరీ మంత్ర జప విరాజితుడు, అయిన శర్మగారు ఆ పంచాక్షరికీ నీకూ తేడా లేదు అని అమ్మతో
“ఈశ్వరశక్తివె నీవు మ
హేశ్వరునకు నీకు భేదమేమియు లేదో
విశ్వజనని” అంటూ ఆ మంత్రాన్ని ఈశ్వరుని వదలని స్థితిని అనుగ్రహించమని అమ్మను వేడుకున్నారు.
“శ్రీ వత్ససగోత్రుడు – భూ
దేవుడ – ఆర్వేల వాడ – దేవీ ! నీకున్
సేవకుడు ఉభయ భాషా
కోవిదుడను మిన్నికంటి గురునాథుండన్” అని తనను తాను చెప్పుకుంటూ “అమ్మ ! రాజరాజేశ్వరీ! అస్మదంతరంగపీఠి కూర్చుండి హృదయ సామ్రాజ్య మేలు” అని వేడుకుంటూ 10.12.1984న అమ్మలో కలిసిపోయారు. వారి అభ్యర్థనను అమ్మ మన్నిస్తుందనేది నిర్వివాదం. నిరంతర సాహిత్య సత్యవ్రతుడైనటువంటి శర్మగారు నిజంగా ధన్యజీవి.