శ్రీ మొసలికంటి తిరుమలరావుగారు అమ్మ వద్దకు 1960 మొదట్లోనే వచ్చారు. అధరాపురపు శేషగిరిరావుగారితో వారికి బంధుత్వమున్నదేమో! ఇద్దరూ మధ్వ బ్రాహ్మణులే – జిల్లెళ్ళమూడి అందరింటి రూపకర్తలలో శ్రీ శేషగిరిరావుగారు ప్రముఖులు మీదు మిక్కిలి ఇద్దరూ కాంగ్రెసువాదులు. గాంధీగారి ప్రభావంలో ఆ రోజుల్లో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితాన్ని అనుభవించినవారు.
శ్రీ తిరుమలరావుగారు జిల్లెళ్ళమూడి వచ్చిన క్రొత్తల్లో మేమంతా పిల్లలం. నేను అమ్మను గూర్చి పద్యాలు. గేయాలు వ్రాసి చదవటానికి వేదిక మీదకు వెళ్ళుతుంటే ఆ రోజుల్లో ఉన్న కుర్రకారంతా చప్పట్లు, ఈలలు వేసి నాకు మంచి మద్దతుగా నిలచి ఉత్సాహపరుస్తుండేవారు. అది చూచిన శ్రీ తిరుమలరావుగారు ఈ కుర్రాడికి మంచి ఫాలోయింగ్ ఉన్నదే ఇక్కడ అని ఆనందించేవారు.
అమ్మ వద్ద వారు కూర్చున్నపుడు చాల మంది చాల రకాల కోరికలు కోరుతుండేవారు. వాటిన్నింటికి అమ్మ నీ యిష్టం నాన్నా! మీ ఇష్టం ప్రకారం చెయ్యండి. నీకు ఏది మంచిదని తోస్తే అది చెయ్యండి. మీకు ఎప్పుడు మంచిదనిపిస్తే అప్పుడు చెయ్యండి నాన్నా! నీకు తోచిందేదో చెయ్యి అని నిర్లిప్తంగా చెప్పటం చూశారు. ఒకరు అమ్మా! ఈ కష్టాలు పడలేనమ్మా! చచ్చిపోవాలని ఉంది అంటే, నీ యిష్టం నాన్నా! అదీ నీ చేతిలోనే ఉంటే అట్లాగే చెయ్యి, అని అమ్మ అంటుంటే అమ్మలోని ఈ ఉదాసీనత తిరుమలరావుగారికి అర్థం కాలేదు మొదలు. అమ్మను అడిగారు “ఏమిటమ్మా! ఇదంతా” అని అమ్మ అన్నది “తోచిందేదో చెయ్యి – నీ ఇష్టం వచ్చింది చెయ్యి అని నేనటంలో తోపింప చేసేది ఆపైవాడే అనే భావనే ప్రధానం. నీ చేతుల్లో ఏమీ లేదనీ . అన్నింటికీ, అన్ని ప్రేరణలకూ కర్త వాడేననీ” అని అమ్మ చెప్పేసరికి వారు తృప్తి పడ్డారు.
ఎంతో కాలం దాస్య శృంఖలాలలో ఉన్న ప్రజలలో స్వతంత్రం వచ్చినా స్వతంత్ర భావాలు రావటం లేదే అని బాధపడుతున్నవారికి నిజమైన స్వాతంత్ర్యం అంటే ఏదీ నీ చేతిలో లేదని అన్నీ ఏది చేసినా పైవాడి ఆజ్ఞప్రకారమే జరుగుతున్నదనే నిశ్చితమైన భావన రావటమేననీ వారికి అవగతమై క్రొత్త కాంతి వారి జీవితంలో పరచుకున్నది.
తిరుమలరావు గారు 1901లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మొసలికంటి బాయన్న పంతులు, రమణమ్మలకు జనవరి 29న జన్మించారు. చదువుకుంటున్న రోజులలోనే గాంధీగారి స్వాతంత్రోద్యమం వల్ల ఆకర్షితులైనారు. గాంధీగారి ప్రేరణతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కాకినాడలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఎన్నో స్వాతంత్ర్య సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్పార్టీలో వాలెంటేర్ గా పనిచేశారు. దండి సత్యాగ్రహంలో పాల్గొని కారాగారంలో బంధింపబడ్డారు.
బ్రిటిష్ ప్రభుత్వం పొలాలపై పన్నులు పెంచినపుడు రైతుల పక్షాన నిలబడి సత్యాగ్రహాలు చేసి రైతు నాయకుడు యన్.జి.రంగా, దుగ్గిరాల గోపాల కృష్ణ (రామదండు) వంటి వారితో కలిసి జైలుకు వెళ్ళారు.
తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా రెండుసార్లు ఎన్నికైనారు. లెజిస్లేటివ్ అసెంబ్లీకి రెండుసార్లు, కాన్స్టిట్యుయంట్ ఎసెంబ్లీకి ఎన్నికైనారు. మొదటి ప్రొవిజినల్ పార్లమెంటేకే కాక కాకినాడ నుండి రెండవ, మూడవ, నాల్గవ లోక్సభ ఎన్నికలలో గెలిచి సెంట్రల్ కాబినేట్ మినిష్టరుగా పనిచేశారు. ఆహార వ్యవసాయ శాఖామాత్యులుగా ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మెచ్చుకొనే రీతిలో సమర్థపాలనను అందించారు. తర్వాత వింధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమింపబడ్డారు.
అమెరికా సంయుక్తరాష్ట్రాలు, కామన్వెల్త్ దేశాలు తూర్పు యూరప్ దేశాలు పర్యటించి భారతదేశం పట్ల, భారత ప్రజల పట్ల, ప్రభుత్వం పట్ల సహృదయ వాతావరణాన్ని కల్పించి తన ఆంగ్ల భాషా ప్రభావంతో దేశానికి పేరు ప్రతిష్టలు సాధించారు. పార్లమెంట్ డెలిగేషన్ సభ్యునిగా బ్రిటన్ సందర్శించారు.
యౌవనంలో ఆధ్యాత్మిక గురువు ‘అవతార్ మెహర్ బాబా’ బోధలపట్ల ఆకర్షితులై వారు ఇంగ్లీషులో వ్రాసిన ‘The God Speaks’ గ్రంధాన్ని తెలుగులోకి అనువరించారు. మన భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్తో కలసి పని చేశారు.
కులమత వర్గ వర్ణ వివక్షలేని ఒక సమసమాజ నిర్మాణం ఆనాటి కాంగ్రెస్ ఆదర్శం. అది అత్యాశ్చర్యకరంగా అతిసహజంగా అమ్మ ఆవరణలో, వారికి దర్శన మిచ్చింది. ఇక్కడి సోదర సోదరీభావము, ఆ ఆప్యాయతలు, ఆ ఆదరణలు, ఆ మహిమాన్వితమైన మమతాబంధము, నిష్కల్మషమైన హృదయాలు, అందరిలోనూ అంతశ్రోతస్వినిగా ప్రవహిస్తున్న అమ్మశక్తి పట్ల అచంచల విశ్వాసము, విశ్వకుటుంబ భావన వారిని కట్టిపడేసేవి.
ఢిల్లీ నుండి మెడ్రాసు మెయిల్లో స్టాప్ లేకపోయినా ప్రత్యేకించి వీరికోసం బాపట్ల వద్ద ఆపించుకొని జిల్లెళ్ళమూడి వచ్చిన ప్రతిసారి క్రొత్తరక్తాన్ని వంటబట్టించుకొని వెళ్ళేవారు. ఎన్నో శాసనాలు, ఎన్నో ప్రభుత్వాలు చేయలేని ఒక సమసమాజ నిర్మాణం ఇంత అలవోకగా అమ్మ చేసి చూపించటం వారిని మళ్ళీ మళ్ళీ జిల్లెళ్ళమూడి వైపు రావటానికి దోహదం చేసేది. రాజకీయాల నుండి విరమించుకొని విశ్రాంతి కొరకు మానసిక ప్రశాంతికి అమ్మ సన్నిధిలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించారు.
1970లో వారు చివరిసారిగా జిల్లెళ్ళమూడిలో దేవీనవరాత్రుల సందర్భంగా అమ్మను దర్శించుకొన్నారు. అప్పుడమ్మ తిరుమలరావులో మార్పు కన్పిస్తున్నదిరా! ఇక్కడకు వచ్చి ఈ విశ్వకుటుంబసభ్యునిగా ఉండాలనీ ఈ అందరింటి మహాసౌధ నిర్మాణంలో తానూ ఒక స్తంభం కావాలనీ, ఈ అన్నపూర్ణాలయ నిత్య మహాయజ్ఞంలో తానూ ఒకహోతగా ఉండాలనీ కోరుకుంటున్నాడు అన్నది. వారి ఆశ, ఆశయం, తపన, తహతహ అమ్మ గుర్తించింది. తపనే తపస్సు కదా!
నిజమే అమ్మను ఎవరమూ పూర్ణంగా తెలుసుకోలేం. మనం కూడా. అమ్మలం కావాలి కదా! అందుకే పూర్ణత్వం సాధించుకోలేకపోయినా అమ్మకు పూర్ణంగా సర్వస్వార్పణం చేయగలిగితే చాలు. తిరుమలరావుగారి మనస్సు ఆపని చేసింది. ఆయన శాశ్వత శాంతిని పొందారు. అమ్మలో 29.11.1970 నాడు లీనమైనారు.
ఈనాడు మొసలికంటి ఉషారావు హైదరాబాద్ నుండి వెలువడుతున్న Mother of All పత్రిక సంపాదకురాలుగా, అమ్మసేవ చేసుకొనే అదృష్టానికి నోచుకున్నది. ఆమె తిరుమలరావుగారి కూతురు. తిరుమలరావుగారు తన వారసురాలిగా అమ్మ సేవలో ఉంచగలిగారు. నిజంగా తిరుమలరావుగారు ధన్యజీవి.