ముని, ఋషి శబ్దాలు జిల్లెళ్ళమూడి సోదరులలో బాగా అతికి పోయే వ్యక్తి భాస్కరరావన్నయ్య. రైతు కుటుంబంలో పుట్టి సేద్యం చేసి జీవించటమే జీవనాధారమైనా, జీవనాధారమాత్రం దేవాలయాలవెంట, దేవతలవెంట, దైవజ్ఞులైన మహనీయుల వెంట, ఆధ్యాత్మ సంపన్నులవెంట పరు వెత్తింది. చిన్నతనం నుండి అబ్బిన ఈ ఆస్తిక్య భావసంపదకు సోదరులు యార్లగడ్డ రాఘవయ్యగారు మార్గదర్శకులైనారు. అంధులైన రాఘవయ్యగారి చెయ్యిపట్టుకొని లోకంలో భాస్కరరావు గారు నడిపిస్తే వీరి మనసు పట్టుకొని లోకంలో రాఘవయ్యగారు నడిపించారు.
వారి స్వగ్రామమైన సింగుపాలెం వచ్చిన సత్యానందస్వామి అమ్మను గూర్చి మొదటిసారిగా చెప్పనప్పుడు అమ్మను చూచివస్తే బాగుండును అనుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికే 1959లో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మలో నుండి ప్రవహించే దివ్యదీధితులకు పరవశించి తిరిగి వెళ్ళుతూ అమ్మకు మరొకసారి నమస్కరిస్తూ పాదాలు పట్టుకున్నారు. అమ్మ భాస్కరావన్నయ్య శీర్షిపరిభాగాన్ని స్పృశించి దీవించింది. అంతే, అన్నయ్యకు జిల్లెళ్ళమూడి సొంత ఊరై పోయంది. తర్వాత నెత్తిన మూట పెట్టుకొని పూళ్ళదాకా వెళ్ళింతర్వాత ప్రతివారు నీ తల పసుపు పచ్చగా ఉన్నదేమిటంటే ఒకనాడు కలలో అమ్మ తన తలపై పసుపు చల్లిన విషయం జ్ఞప్తికి వచ్చింది. తలపై పసుపు ఉండటానికి ఏ మాత్రం అవకాశం లేనప్పుడు ఇలా జరగటం అమ్మ మహిమగా భావించారు.
ఒకసారి భాస్కరరావుగారు, రాఘవయ్యగారు అమ్మ వద్ద సెలవు తీసుకొని సింగపాలెం పోవాలని ఒక బస్సువస్తే దానిలో ఎక్కబోయారు. ఖాళీ లేదు దిగిపోండని అన్నాడు కండక్టరు. అమ్మ ఇలా ఎందుకు చేసిందో? అనుకుంటూ అక్కడే నిలబడ్డారు. మరొక బస్సువస్తే ఎక్కారు. వీళ్ళను దించిన బస్సు మధ్యలో చెడిపోయింది. వీరెక్కిన బస్సు గమ్యాన్ని హాయిగా చేర్చింది. అమ్మ లీలలు అద్భుతాలు. మధ్యలో వీళ్ళు ఇబ్బంది పడకుండా చేసింది అమ్మ.
భాస్కరరావన్నయ్య యాగాలు చెయ్యలేదు, యోగాలు అభ్యసించలేదు. కాని ఆధ్యాత్మిక మార్గంలో తలలు పండిన వారికి కూడా అబ్బని ఏకాత్మ మానవతాస్థితి అవగతమైందనిపిస్తుంది. సింగుపాలెం నుండి వచ్చే సత్యవతక్కయ్య, చంద్రమ్మక్కయ్య వంటివారు ఆయనకు అమ్మలాగే దర్శనమిచ్చేవారు. కొంతకాలం ఇతరులు కూడా అమ్మలాగే కనబడేవారు. ఆ అనుభూతి మాధుర్యం సౌమ్యుడు, సౌజన్యహృదయుడు అయిన ఆయనకు అమ్మ ప్రసాదించటంలో ఆశ్చర్యం లేదు.
భాస్కరరావుగారికి సింగుపాలెంలో ఉండగా టైఫాయిడ్ జ్వరం తగిలింది. “నా బిడ్డ ఎంత బాధపడుతున్నాడో? వాడికి ఏమి పెడుతున్నదో? ఏమో!” అని సింగుపాలెం మనిషిని పంపి అమ్మ తనవద్దకు పిలిపించుకొని సేవలు చేసింది. అమ్మతో పరిచయమున్న మూల్పూరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అమ్మను గూర్చి భాస్కరరావుగారితో చెపుతుంటే అమ్మ వారి ప్రక్కనే దర్శనమిచ్చింది. అమ్మ దేవాలయంలో చేరిన తర్వాత కూడా గర్భగుడి ముందు కూర్చుని చూస్తుంటే పూలలో అమ్మ పాదాలు కదులుతున్నట్లు అనుభవమైంది.
“నా చరిత్ర పండితుడైన పామరుడు వ్రాయడు, పామరుడైన పండితుడు. వ్రాస్తాడు” అన్న అమ్మ మాటలోని పైపై అర్థం తీసుకుంటే భ్రష్టుడైన పండితుడు వ్రాస్తాడు అని అర్థం స్ఫురిస్తుంది. కాస్త లోతులలోకి పోయి ఆలోచిస్తే మహోన్నతమైన వేదాంత వాక్యార్థం అంతరార్థం అవగతమవుతుంది. పామరుడు అంటే అజ్ఞుడు, వీరుడు అని అర్థాలు. పండితుడు అంటే తలపండిన జ్ఞాని అని అర్థం. ఇప్పుడు “పామరుడైన పండితుడి”ని గూర్చి ఆలోచించండి. అజ్ఞుడైన పండితుడు అన్నమాట. అలాటి వాడెవడైనా ఉంటాడా? ఉంటాడు. ఎందుకంటే పండితుడు, అన్నీ తెలుసుకున్న స్థితి ఏదంటే తెలిసిందే తెలుసుకోవలసింది ఏదీ లేదు. తెలుసుకున్న దేదీ లేదు, అని తెలివిడియై ఉండుటమే. అందుకే అమ్మ నాది తెలిసీ తెలియని స్థితి అంటుంది. “నాది వల్లగాని మిట్ట ప్రదేశం” అంటుంది. అలాగే భాస్కరావన్నయ్య స్థితి పామరుడైన పండితుని స్థితి అయింది.
వ్యాసుడు భారతం చెపుతుంటే గణపతి వ్రాశాడంటారు. వాళ్ళ నియమాలు వాళ్ళకున్నాయి. అవి ఇప్పుడు అనవసరం. కాని భాస్కరరావన్నయ్య వ్రాస్తుంటే అమ్మ అనుగ్రహంతో పాత్రలు వారివారి కంఠాలలో వచ్చి పలుకుతున్నట్లుగా శబ్దాలు వినిపించేవి. ఆ సన్నివేశాలు వారికి కళ్ళవెంటనీళ్ళు తెప్పిస్తుండేవి. అమ్మ చరిత్ర చెపుతుంటే మామూలుగా ప్రక్క వాడికి వినబడేది కాదు, ఒక్క భాస్కరరావుగారికి తప్ప, చరిత్ర వ్రాసి సింగుపాలెం వెళ్ళితే కొన్ని రోజులకు అమ్మ జిల్లెళ్ళమూడిలో “భాస్కరుడు వస్తే బాగుండును” అనేదట. భాస్కర్రావుగారు సింగుపాలెంలో అమ్మదగ్గరకు పోవాలనిపించి వచ్చేసేవాడు. చరిత్ర మొత్తం 15 నోటు పుస్తకాలలో వారు వ్రాసినవే. ఎక్కడన్నా ఒకచోట అరచోట ఎవరన్నా వ్రాయటానికి కూర్చుంటే అమ్మ చెప్పలేక ఆపివేసేది. అంతా భాస్కర్రావన్నయ్య చేతి మీదుగా జరగాలనేది అమ్మ ఆకాంక్ష. అలాగే జరిగింది. తొలిరోజులలో ఒకసారి భాస్కరరావన్నయ్య అమ్మ వద్దకు వెళ్ళగా ఒకరు పుస్తకం అటకమీద పెట్టి కూర్చున్నారు. తర్వాత అతనే రహి అని అమ్మ చెప్పింది అన్నయ్యతో, ఈ రహి అమ్మ చరిత్ర మొదట వ్రాసినవాడు. అది శిధిలమైపోగా తిరిగి అమ్మ భాస్కరరావు అన్నయ్యచే వ్రాయించింది. ఇలా అమ్మ చరిత్ర వ్రాసే రోజుల్లోనే అమ్మ శరీరం సర్వమయి అయిన రోజున దివ్య విమానం మేడమీద ఆగిన శబ్దం వినిపిస్తుందిట. అలాగే ఆ శబ్దం వినే భాగ్యం భాస్కర రావన్నయ్యకు కలిగించింది. దివ్య శబ్దం, దివ్యవాణి, దూరశ్రవణం, దూరదర్శనం. భాస్కరరావన్నయ్యకు అబ్బినవి అమ్మ అనుగ్రహం వల్ల.
హైమకు భాస్కరరావుగారంటే ఎంతో ఇష్టం. హైమ జబ్బుగా ఉన్న రోజుల్లో అమ్మ దగ్గరకు వెళ్ళాలని హైమ అనుకుంటుంటే భాస్కరరావన్నయ్య ఎత్తుకుని అమ్మదగ్గరకు తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. భాస్కరరావన్నయ్యను శ్రమపెట్టినందుకు హైమ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కాని ఎంతమందికి హైమను ఎత్తుకొనే అదృష్టం లభిస్తుంది.
జిల్లెళ్ళమూడి వచ్చిన రోజుల్లో లలితా సహస్రనామాలు చదవటం వచ్చేదికాదు. తర్వాత అమ్మ దయవల్ల చాల స్పష్టంగా చదవగలుగుతున్నారు. పురుషసూక్త, శ్రీసూక్త పూజా విధానాలు, సుప్రభాత సంధ్యావందనాలు భాస్కరరావన్నయ్య పలికినంత స్పష్టంగా రాగయుక్తంగా మనం పలుకలేం. అమ్మనామామృతంతో జీవించి ఉండగానే దైవత్వాన్ని పొందిన జ్ఞానమణి. ఒక రకంగా ఆయన బ్రాహ్మణుడు, విప్రుడు, పురోహితుడు, పరుష వాక్కెరుగని పరమహంస, సత్వగుణ ప్రధానుడు, అంతరంగ పరిపక్వత కల్గిన పరమ పురుషుడు, అమ్మ చెక్కిన అపురూప శిల్పం, ఆటు పోటులకు తొణకని మహాసముద్రం. అర్కపురీశ్వరి అయిన అమ్మకు నచ్చిన అమ్మ మెచ్చిన అపర భాస్కరుడు. భక్తికి విశ్వాసానికి మరోపేరు భాస్కరరావన్నయ్య. మనమధ్య ఒక మహాఋషి సంచరించాడు. మన మెంత అదృష్టవంతులమో. ఆ అదృష్టాన్ని ఇప్పుడు పొగొట్టుకున్నాం.
అరవైయేళ్ళుగా జిల్లెళ్ళమూడి వస్తున్నా, యాభైఏళ్ళపైగా జిల్లెళ్ళమూడిలో అమ్మే జీవితంగా జీవిస్తున్నా, అమ్మ చెప్పినట్లు ఇతరులను విమర్శించకుండా తనపని తాను చేసుకుంటూ, ఏ పనిచేసినా, వ్యవసాయం కానివ్వండి, అమ్మ నామం కానివ్వండి, సుప్రభాతం కానివ్వండి, సంధ్యావందనం కాన్విండి, మంచినీళ్ళు చెరువునిండి లేనివ్వండి మరొకటి మరొకటి ఏ పనైనా ఇది అమ్మసేవ అని చేయగలిగిన, ఎవరికోసమో కాదు మనకోసమే మనం తరించటానికే మనం చేసుకుంటున్నాము అనే నిరంతర జాగృతితో ఉన్న మనీషి ఒక్క భాస్కరరావన్నయ్యే అంటే అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఒక మౌనిగా చిరునవ్వుతో నమస్కరిస్తూ అంతః చేతన గల ఋషిలా జీవించిన మహాముని భాస్కరరావు అన్నయ్య.
అమ్మ చరిత్రకు వ్రాయటానికి ఎన్నుకున్న బిడ్డ భాస్కరరావన్నయ్య. అలాంటి భాస్కరరావన్నయ్య 12.4.2018న 95వ ఏట అమ్మలో లీనమైనాడు. భాస్కరరావన్నయ్య అంతిమయాత్ర చూస్తే పూల రథంపై ఊరేగుతున్నాడా అనిపించింది. భాస్కర రావన్నయ్యకు అమ్మ తన దేహాన్ని ఆలయంలో భద్రం చేయకముందు తన కొరకు ఒక దివ్య రథం వస్తుందని చెప్పిందట. దాన్ని నేను దర్శించాను అని చెప్పాడు. భాస్కరరావన్నయ్య. మనకు మాత్రం భాస్కరరావన్నయ్య అంతిమంగా పూల రథంపై ఊరేగుతూ కనువిందు చేశాడు. అమ్మ వద్దకు నిష్క్రమిస్తూ శరీరం కూడా (అచేతనాలు లేవు అన్నీ చేతనలే) బ్రహ్మకాక పోలేదన్న అమ్మ మాటకు నిదర్శనంగా నిలిచాడు. భాస్కరరావన్నయ్య . వాళ్ళ పిల్లలు, బంధువులు, సింగుపాలెం గ్రామప్రజలు ఈ మహా ప్రస్థానం ఘనంగా జరిగిందని తృప్తి పడ్డారు.
సోదరుడు బ్రహ్మాండం రవి అన్నట్లు అమ్మవద్దకు చేరిన మన సోదరులంతా మాతృలోకంలో మన విశ్వజనని సన్నిధిలో పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నారేమో !