1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (రాచర్ల లక్ష్మీనారాయణ)

ధన్యజీవులు (రాచర్ల లక్ష్మీనారాయణ)

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 18
Month : July
Issue Number : 3
Year : 2019

అమ్మ తన ప్రణాళికలో భాగంగా కొన్ని పనులకు కొంతమందిని ఎన్నుకున్న మాట వాస్తవం. అందులో రాచర్ల లక్ష్మీనారాయణ ఒకరు. ప్రధానంగా ఆలయాల అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా కంకణం కట్టుకున్నవాడు. ఒక్క ఆలయాలకనే కాదు అమ్మ సంస్థల అవసరాలకు అండగా నిలచిన వాడు.

అమ్మ సర్వభూతైక జనని అనే విశ్వాసం వారి అడుగడుగులోనూ కనిపించేది. ఆయన ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే “ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై, ఎవ్వనియందు డిందు, పరమేశ్వరడెవ్వడు?” అనే పోతనగారి పద్యం చదివి ఆ పరమేశ్వరుడే అమ్మ అని వివరించేవాడు. సృష్టి స్థితి లయకారిణిగా తెలుసుకొని అమ్మ మాట వేదంగా పాటించిన మహనీయుడు. ఒక లక్ష్మీనారాయణే కాదు వారి కుటుంబం అంతా, బంధుగణం కూడా అమ్మకు సర్వార్పణ చేయటానికి

సర్వస్వార్పణ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకసారి లక్ష్మీనారాయణ గారింట్లో దొంగలు పడ్డారు. కొంత బంగారం, వెండివస్తువులు పోయాయి. కమల, లక్ష్మీనారాయణ అమ్మవద్దకు వచ్చి మిగిలిన బంగారం, వెండి సామాన్లే కాక నిలువుదోపిడీ అమ్మకు సమర్పించి అమ్మ యెడల తమకున్న అర్పణ భావాన్ని, అచంచల విశ్వాసాన్నీ చాటారు.

లక్ష్మీనారాయణ చాలామందికి తెలుసు. ఒక్క అమ్మ, అమ్మ కుటుంబము తప్ప ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. ఒకసారి అమ్మ రవి నీ తమ్ముడు అలాగే చూడు, అని చెప్పింది. జీవితాంతం అలా రవిని ఆదరించి ఆ విలువ ఇచ్చేవాడు. ఎంతమందితో పోట్లాడినా రవితో పోట్లాడే వాడు కాడు. ఒకసారి బ్రహ్మాండం సుబ్బారావుకు షుగర్ ఎక్కువ కావటం వల్ల హైదరాబాద్లో డయాలసిస్ చేయించటానికి తీసుకొని వెళ్ళారు. అవసరమైతే మూత్రపిండాలు మార్చవలసివస్తే లక్ష్మీనారాయణ ముందుకు వచ్చి రవీ! నీవు నేను పరీక్ష చేయించుకుందాం. నాది సరిపోతే మూత్రపిండం నేనిస్తాను. నీవు చిన్నవాడివి నాది సరిపోక పోతే నీవిద్దువుగాని ఇంకెవ్వరిని అడగవద్దు అని చెప్పాడు. అదీ ఆ కుటుంబంతో అతని ఆత్మీయత, అనుబంధము, అమ్మకిచ్చిన మాట! ఆ మాటలు చాలు ఎవరి హృదయాలనైనా ద్రవింప చేయటానికి.

అమ్మ తన అవతారాన్ని ఆలయానికి చేర్చేముందు ఒక సంవత్సరం ముందునుండే తన తిరోగమనాన్ని గూర్చి లక్ష్మీనారాయణకు చెప్పింది. హైమాలయ ముఖ మండపాన్ని కట్టించమన్నది లక్ష్మీనారాయణతో, వెసులుబాటు చూచుకొని చేద్దామమ్మా అన్నాడు. నేను ఈశరీరంతో చూడాలనుకుంటే వెంటనే కట్టమన్నది. అంతే అప్పులుచేసైనా ఆ పని పూర్తి చేశాడు. అంతే కాదు డాక్టర్ పాపకు ఉత్తరం వ్రాసి నాకు చూపించాడు. అమ్మ అవతార సమాప్తి దగ్గరపడుతున్నది. ఎవరు ఏ రకమైన సేవలైనా చేసుకొండి త్వరగా. తర్వాత మీరు చింతించి లాభం లేదు అని వ్రాశాడు.

హైదరాబాద్ లో అమ్మకు అనారోగ్యం చేయగా వైద్యం చేయిస్తున్నారు రాజగోపాలాచారి గారింట్లో ఉంచి. బయాప్సీ కూడా చేశారు. వైద్యులు ఎవరినీ అమ్మవద్దకు పోనివ్వ వద్దు అని నిర్బంధించారు. లక్ష్మీనారాయణ ఆ సమయంలో అమ్మవద్దకు వచ్చాడు. యధావిధిగా పూలు పండ్లు తీసుకొచ్చాడు అమ్మను పూజించడానికి. అభ్యంతరం చెప్పారు యీ పరిస్థితితులలో వీలుకాదని. లక్ష్మీనారాయణ నావల్ల ఏ మాత్రం అసౌకర్యం అమ్మకు కలిగినా తక్షణం నేను బయటకు లేచి వస్తాను అని ఒప్పించి లోపలకు వెళ్ళాడు అమ్మవద్దకు. ఆశ్చర్యం తనకేమి జబ్బులేనట్టుగా ఇతరులు చెపుతున్నది అబద్ధం అన్నట్లుగా లేచికూర్చుని అమ్మ చిరునవ్వుతో, సంతోషంగా పలకరించింది లక్ష్మీనారాయణను. ఆయన మామూలుగా పూజచేసి, నివేదనలిచ్చి, ప్రసాదం తీసుకొని మరీవెళ్ళాడు. అదీ అమ్మకు, లక్ష్మీనారాయణకు మధ్యఉన్న ఆత్మీయ బంధం, అనురాగ బంధం.

లక్ష్మీనారాయణ ఇల్లు ఒక జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయం. ఆదరణ ఆప్యాయతలు ఆ కమలా లక్ష్మీనారాయణలలో మూర్తీభవించాయి. ఊళ్ళో వాళ్ళమే కదయ్యా! అన్నా ఊరుకునేవారు కాదు. లక్ష్మీనారాయణ ఆ రాజసం, ఆ ధీమా, ఆ దీక్షా, ఆ పట్టుదల, సాహసం, అంకిత భావం అమ్మ ప్రసాదించినవే అనిపిస్తుంది. ఎన్ని గంటలసేపు కూర్చున్నా విసుగనిపించకుండా అమ్మ మాటలు, సన్నివేశాలు సంభాషిస్తూనే ఉండేవాడు.

అమ్మ చేతిలో ఒకపనిముట్టు లక్ష్మీనారాయణ అనిపిస్తుంది. “వత్రోత్సవానికి ముఖద్వారం కట్టిస్తావా నాన్నా” అని అమ్మ లక్ష్మీనారాయణను అడిగింది. నాకు డబ్బిప్పిస్తే అలాగే కట్టిద్దామమ్మా అన్నాడు. ఆశ్చర్యం అమ్మతో ఆ మాట అన్న వారంలోపలే ఒక ప్రతికంపెనీ వారు మా కంపెనీలో పని చేయండి ఇదిగో లక్ష రూపాయలు అని అతని చేతిలో అడ్వాన్సు ఉంచారు. అంతే ఇది అమ్మ సంకల్పం ఇంటికి పోతే మనసు మారవచ్చు అని ఎకాయెకి ఆ లక్షరూపాయలు తెచ్చి అమ్మ పాదాలపై సమర్పించాడు. అదీ లక్ష్మీనారాయణ అంటే సత్కర్మానుష్ఠ సేవలు, ధర్మాచరణ పట్ల అతని నిబద్ధత అది.

ఒకసారి అమ్మ లక్ష్మీనారాయణను తనవద్దకు పిలిపించి కన్నీళ్ళు పెట్టుకున్నది. ఏమిటమ్మా! ఈ కన్నీటికి అర్ధం అని అడిగాడు. “నాన్నా! నీవు నాకో వాగ్దానం చేయాలిరా!” అన్నది. అందుకు లక్ష్మీనారాయణ “నేను నీకిచ్చే వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని ముందు నీవు నాకు వాగ్దానం చెయ్యమ్మా! తర్వాత నీకు నేను వాగ్దానం చేస్తాను” అన్నాడు. హఠాత్తుగా దుఃఖాన్ని ఆపి అమ్మ పకపకా నవ్వింది. అలాగే అంటూ ముందు అమ్మ తన చేతిని లక్ష్మీనారాయణ చేతిలో ఉంచి పిమ్మట లక్ష్మీనారాయణ చేతిని తన చేతిలో ఉంచుకుంది. అమ్మ హృదయంలో లక్ష్మీనారాయణకు అంత విశిష్ఠమైన స్థానం ఉన్నది.

వత్రోత్సవ ముఖద్వారం కానివ్వండి. ఆలయాల రూపకల్పన కానివ్వండి, అమ్మ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం కానివ్వండి, సహస్ర ఘటాభిషేకం కానివ్వండి, నవనాగేశ్వరాలయం కానివ్వండి, వినాయకాలయం కానివ్వండి, పాదుకాలయం కానివ్వండి, హోమశాల కానివ్వండి. ఈ బృహత్కార్యక్రమాలన్నింటినీ దీక్షతో దక్షతతో నిర్వహించి కృతకృత్యుడైనాడు. తంగిరాల కేశవశర్మ కార్యక్రమ నిర్వహణలో సహాయ సహకారాలందించేవాడు.

అమ్మకు పూజచేయటంలో కూడా లక్ష్మీనారాయణది ఒక విశిష్ట పద్ధతి. అచ్యుతుని రామకృష్ణ శర్మగారు వ్రాసిన మాతృశ్రీ అష్టోత్తర శతనామావళి గుక్కతిప్పుకోకుండా చదవటంలోని నైపుణ్యం, అర్ధవంతంగా చదవటంలోని చాకచక్యం అమ్మను బాగా ఆకర్షించేవి.

లక్ష్మీనారాయణను మొదట విశాఖపట్టణంలో కేశవశర్మ ఏర్పాటు చేసిన సభలకు ఉపన్యాసం ఇవ్వటానికి తీసుకెళ్ళారు. నేనేం మాట్లాతానని అనగా, నీకు నచ్చింది మాట్లాడు అంటే వచ్చాడు. బాగా మాట్లాడాడు. గుంటూరులో జరిగే మాతృశ్రీ అధ్యయన పరిషత్ వారం వారం పూజలకు వెన్నుదన్నుగా నిలచేవాడు. జిల్లెళ్ళమూడిలో ఆలయాల కమిటీకి అధ్యక్షులుగా జేమ్స్న, కార్యదర్శిగా కురిచేటి వెంకటేశ్వరరావును ఉంచి తను వెనుక నిలబడి అన్నీ ని నిర్వహించేవాడు.

1968లో హైమ ఆలయంలో చేరినప్పుడు రాజస్థాన్లో ఉద్యోగం జేస్తూ ఆలస్యంగా వచ్చాడు. అమ్మ “నన్నందరూ హైమ విషయంలో దుర్మార్గురాలి క్రింద చూస్తున్నారురా” అన్నది. “ఎంత మంచి పని చేశావమ్మా! హైమను ఆలయంలోకి పంపి అన్నాడు. “నీ వొక్కడవేరా! ఈ విషయంలో నా చర్యని మెచ్చుకున్నది” అన్నది. హైమను భౌతికమైన బాధలనుండి విడిపించి, పారలౌకికమైన, దైవత్వాన్ని ఇచ్చినందుకు సంతోషించాలి కాని బాధపడటం ఎందుకమ్మా! అన్నాడు. హైమను ఆలయంలో ప్రతిష్ఠించినప్పుడు లక్ష్మీనారాయణ హైమకు కుట్టించిన పరికిణీ, రవికె, వోణీ హైమతోనే వేసింది అమ్మ- అమ్మ చాలాసార్లు లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళింది. హైమను చాలాసార్లు లక్ష్మీనారాయణ తన ఇంటికి తీసుకెళ్ళాడు. లక్ష్మీనారాయణ నివశించినచోటు దేవతలు నడయాడిన ప్రదేశం.

అక్టోబర్ 9, 1933న జన్మించి 81వ సంవత్సరాల వయసులో 13-04-2014 అమ్మలో ఐక్యం అయినాడు. లక్ష్మీనారాయణ ఉన్నంతకాలం అమ్మ వెలుగులో ప్రయాణం చేశాడు. ఇప్పుడు వెలుగులో వెలుగై కూర్చున్నాడు.

(సూచన : లక్ష్మీనారాయణ షుమారు 30 గంటలపాటు అమ్మతో అనుభవం చెప్పాడు. అవన్నీ శ్రీరావూరి ప్రసాద్ వీడియో రికార్డు చేశాడు. వాటిని వ్రాయించి ప్రింట్ చేస్తే అది అమ్మను గూర్చిన ఒక బృహద్గ్రంథమౌతుంది.

అదీకాక రాచర్ల లక్ష్మీనారాయణ అమ్మను గూర్చి కొన్ని వ్యాసాలు – పాటలు వ్రాశాడు. దానినీ ఒక గ్రంథంగా తీసుకు రావచ్చు. లక్ష్మీనారాయణ సంతానం ఆ పనిని చేపట్టితే బాగుంటుందని నేననుకుంటున్నాను.)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!