అనురాగరూపిణి అయిన అమ్మ ఎవరిని ఎప్పుడు ఏ రీతిగా తరింప చేస్తుందో చెప్పలేము. వారి యోగ్యతా యోగ్యతలతో కూడా పని లేదు. అమ్మకరుణ అకారణంగా ప్రవహిస్తుంది. కారణమున్నట్లు మనకు కనుపింప చేస్తుంది ఒక్కొక్కసారి. ప్రేమా-ద్వేషము కూడా అమ్మ రూపాలే అనిపిస్తుంది. అమ్మ చరిత్ర చూస్తే అవతరించిన నాటి నుండి ఆ రకమైన అనుగ్రహమే కనిపిస్తుంది. తన నగలు దొంగిలించిన జాలరిని కాని, పెమ్మరాజు సత్యనారాయణ మూర్తిని కాని ఎవరినైనా శిక్షణేగాని శిక్షలేదు అమ్మ దగ్గర – పద్ధతులలో తేడాలుండ వచ్చు. దేశిరాజు రాజమ్మగారిది మరొక పద్ధతి.
బాపట్లలో దేశిరాజు రాజమ్మగారుండేవారు. ఆమె ఒక యోగిని. మంత్రోపాసకురాలు. రాజయోగ అనుభవం పొందినది. చాలా మంది ఆమెవద్ద మంత్రోపదేశం పొందారు. ఆమె సంప్రదాయ పద్ధతిలోని మంత్ర గురువు. సహజంగా పురుషులకున్నంత విస్తృత గోష్ఠి అవకాశాలు స్త్రీల కుండవు. రాజమ్మగారు పాత ఆచారాలకు, మంత్రాలకు అంటుకుపోయిన వ్యక్తి.
అమ్మలోని అసాధారణ మేధా సంపత్తిని కాంతిని గమనించిన పిన్నత్తగారు బ్రహ్మాండం అనసూయమ్మగారు అమ్మను ఎవరైనా పెద్దవాళ్ళ వద్దకు తీసుకొని వెళ్ళి ఉపదేశం చేయిస్తే ఇంకా ఉన్నత స్థితి వస్తుంది అని భావించి 1949 అగస్టులో రాజమ్మగారి దగ్గరకు తీసుకొని వెళ్ళి:ది. ఆ అనసూయమ్మ ఏ ఉద్దేశంతో తీసుకొని వెళ్ళినా ఈ అనసూయమ్మ మాత్రం రాజమ్మగారికి ఉద్ధరింపబడే తరుణం ఆసన్నమైంది కనుకే అక్కడకు వెళ్ళింది.
అమ్మ ఎవరి మార్గంలో వారికి ప్రోత్సాహాన్నిచ్చినా అమ్మది ప్రధానంగా జిజ్ఞాసా మార్గం. రాజమ్మగారిని కలిసిన మొదటి రోజు ప్రొద్దుపోయే సమయంలో దీపం వెలిగించే ప్రస్తావన వచ్చింది. అమ్మను దీపం వెలిగించమంది రాజమ్మగారు. అమ్మను దీపం వెలిగించమంటే అమ్మ జ్ఞాన దీపం వెలిగించే ప్రయత్నం చేసింది. అయితే అంతలో వారి మనుమరాలు దీపం వెలిగించి తెచ్చింది. అందువల్లె రాజమ్మగారికి అమ్మ వెలిగించటానికి పూనుకున్నా పూర్తిగా ఆ వెలుగులో వెలుగు కాలేక పోయింది. – మెరుపులు చూచిందేకాని వెలుగును చూడలేకపోయింది.
ఇంటికి తిరిగి వెళ్ళేముందు అమ్మను రాజమ్మగారు బొట్టు పెట్టుకొని వెళ్ళమంది – మీరే పెట్టండి అన్నది అమ్మ – ఆమె విధవరాలు కావడంచేత తనకా భాగ్యం లేదన్నది. అందుకు అమ్మ మీకు తప్పులేకపోతే పెట్టమన్నది. అనాది ఆచారం కనుక పెట్టలేనన్నది. రాజమ్మగారు. “కీడు చేయటమైనా మీ చేతులో ఉంటే చేయండి చూద్దాం” అన్నది అమ్మ ముత్తైదువుల చేతే మొదట పెట్టిస్తారు కదా ? వైధవ్యం ఎందుకు వచ్చింది అని అడిగింది ? అమ్మ. వాళ్ళ యోగ్యత అన్నది రాజమ్మగారు. “అంటే బొట్టు కారణం కాదు గదా !” అని అమ్మ పాత ఆచారాన్ని ఖండించింది.
రాజమ్మగారికి దైవ సంకల్పం కాదు సంకల్పమే దైవమనీ, అమ్మ అంటే అంతులేనిది. అడ్డు లేనిది అని; మనస్సును ఒక స్థాయిలో పెట్టించ గల్గినదే మంత్రం అనీ, వేదాంతం చెప్పేవాడికీ వినేవాడికీ తెలియనిస్థితి అనీ, సృష్టి అంటే హెచ్చు తగ్గులేననీ, అన్నీ తానైనది జ్ఞానమనీ, తల్లి అంటే తొలి అనీ, గురుశిష్యు లంటే పరమాత్మ జీవాత్మలనీ, నేనే సర్వమనీ, దైవం అంటే ఒక్కడే, అతడు స్త్రీగా కూడా ఉండవచ్చుననీ, పంచామృతాలంటే ఒక అమృతంలో నుండి పంచబడ్డవి. పాలు, మీగడ, పెరుగు, వెన్న, నెయ్యి అనీ, అమ్మ తమ సంభాషణలో వివరించింది.
రాజమ్మ గారు ఈ మాటలు వింటూ అమ్మవంక కన్నార్పకుండా చూచింది. ఆమెలో కదలిక ఆరంభమైంది. కొన్ని క్షణాలు అలా చూచి కొన్ని క్షణాలు ఆలోచించి ‘ఓం’ అని ప్రణవం పట్టింది. తను ఎన్నడూ ఎప్పుడూ చూడని అనన్యతేజస్సూ అద్భుత దృశ్యమూ దృగ్గోచరమైంది. శరీరం పులకించింది, కన్ను చెమర్చింది, కంఠం గద్గదమైంది “తల్లీ! తల్లీ ! అన్నపూర్ణేశ్వరీ ! అంటూ తన పాదాల మీద ఉన్న అమ్మ చెయ్యి తీయమని “అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ” అనే పద్యం చదివింది. అమ్మలో ఏదో అద్భుతం చూచిన రాజమ్మగారు అమ్మకు గురువుననిపించుకోవాలనే తపన ఎక్కువైంది. లేకపోతే ఒక మహాభాగ్యాన్ని పోగొట్టు కుంటానేమోనని భావించి మనసులో రేగిన కల్లోలానికి కలిగిన అయోమయావస్థకూ మాటల రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ; “అమ్మా! ఏమిటో ఏమీ తోచడం లేదు. నీవు ఎవరో అర్థం కావటం లేదు. నీవు ఎందుకు వచ్చావో తెలియడం లేదు. ఏమి చేయాలో తెలియడం లేదు” అని అమ్మకు అన్నం పెట్టి తులసీదళాలు కోసుకొని రమ్మని అమ్మకు చెప్పి “నేను ఏ దళం వేసుకొని పుట్టానో ఈ దానం కోసం” అనుకున్నది. రాజమ్మగారు అమ్మను సంకల్పం చెప్పుకో మన్నది. సంకల్పం చెప్పుకొనేది కాదు కలిగేది. అన్నది. సంకల్పం కలిగింది అన్నది. రాజమ్మగారు గురు ధ్యానం చేసుకోమని అమ్మకు చెప్పింది. గుర్తు చూపినవాడే గురువు అంటుంది అమ్మ. రాజమ్మగారు అమ్మకు ఏ గుర్తు చూపలేదు. పైగా అమ్మ ఆమెకు చూపిన గుర్తులు ఆమె గుర్తించలేదు. ఈ తతంగం తర్వాత అమ్మ తమ ఇద్దరి సమావేశం భవిష్యత్తులో సర్వప్రయోజనకారి అవుతుందని వివరించింది. సర్వత్రా భిన్నత్వం లేకపోవడమే పరిపూర్ణత్వం అని చెప్పి, తనకున్నది తప్పించుకోలేని, దైవం తలిస్తేనే తాను తలుస్తాడు కాని తాను తలచేది వేరే లేదనీ, గుర్తించే గుర్తులేక కన్నులున్నా దీపమున్నా చూడలేమనీ, తన్నుతాను తెలుసుకోవటమంటే భగవంతుని తెలుసుకోవటమేననీ, సర్వాన్నీ తెలుసుకొనే తెలివే భగవంతుడనీ అమ్మ చెప్పే మాటలకు దిమ్మెరపోయి “నీ యదార్ధస్థితి ఏమిటో చెప్ప”మని అమ్మను అడిగింది. అమ్మ అంతలో తెరవేసి మాయగప్పి “నా యదార్థ స్థితి నాకు తెలిస్తే మీ వద్దకు వచ్చే దాన్ని కాదుగా” అన్నది.
ఈ కార్యక్రమం అంతా అమ్మకు మంత్రోపదేశంకోసమే ఏర్పాటయిందని భావించిన రాజమ్మగారికి భ్రాంతిని వదలించటానికి సంకల్పించిన అమ్మ ఈ కార్యక్రమం మీకు, నాకూ, ప్రపంచానికీ అని చెప్పింది. ఎక్కడో రాజమ్మగారింట్లో సంభాషణ వల్ల ప్రపంచానికి ప్రయోజనమేమిటి ? అంటే కృష్ణార్జునుల సంభాషణే భగవద్గీత అయింది కదా ! నేటికీ మార్గదర్శనం చేస్తున్నది కదా ! అలాగే ఈ సంభాషణ కూడా లోకానికి మార్గదర్శనం చేయాలని అమ్మ ఆకాంక్ష !
ధ్యానం అంటే ధ్యేయాన్ని స్మరించటమేనని, మాటలన్నీ మంత్రాలేననీ, గురువు బ్రహ్మమయితే ఆత్మార్పణ చేసుకోవడమేనని, ఏ మంత్రమైనా దైవానికి శబ్ద స్వరూపమేననీ, ఏ అవతారమైన రూప స్వరూపమేనని అమ్మ చెపుతుంటే అమ్మ అసాధారణ అలౌకికవ్యక్తి అన్న గుర్తింపు రాజమ్మ గారికి కలిగినా, తాను అలాంటి అమ్మకు గురువేదామన్న ఉబలాటానికే పనికి వచ్చింది.
అమ్మకు “ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం” అని మంత్రోపదేశం చేసింది రాజమ్మగారు. అమ్మ ‘ఓం’ సుదీర్ఘంగా పలికే లోపలే సర్వేంద్రియాలు నిశ్చలత పొందాయి – అ సమాధిలోకి వెళ్ళింది. చాల సమయం తర్వాత అమ్మ రాజమ్మగారి పాదాలు పట్టుకోబోగా రాజమ్మగారే “అమ్మా ! తల్లీ ! జగజ్జననీ! నా కాళ్ళు పట్టు కుంటావా వద్దు వద్దని అమ్మ పాదాలు పట్టుకున్నది. అమ్మ రూపాన్ని హృదయంలో నింపుకున్నది. అమ్మ ఆనంద స్వరూపమయిన బ్రహ్మగా అనిపించింది, రాజమ్మగారికి.
అమ్మకు రాజమ్మగారికి ఈ సంభాషణ జరుగుతున్నంత సేపు అమ్మ రెండవ కుమారుడు ‘రవి’ మూడేళ్ళవాడు అమ్మ వద్దే ఉన్నాడు. బహుశా నారదుడు లీలావతికి మంత్రోపదేశం చేస్తే గర్భంలోని ప్రహ్లాదుడు ఆ మంత్రాన్ని ధ్యానించినట్లుగా అమ్మ గర్భవాసాన పుట్టిన రవికి ఈ సంభాషణలోని సారాంశం వంట బట్టిందేమో, అంత కంటే మనసుకు అతనికి తెలియకుండా పట్టిందేమో అనిపిస్తుంది. మనందరికి కూడా అమ్మ ఆ యోగం పట్టించాలని కోరుకుందాం..
‘మాతృదేవోభవ’ అంటే తల్లి దేవతగా కలవారము అవుదాం. అమ్మ రాజమ్మగారి కోరిక ప్రకారం కొన్ని వందల మందికి మంత్రోపదేశం చేసింది. మంత్రమే అమ్మ కదా ! – భవతు –