జిల్లెళ్ళమూడికి 1960 దశకంలో అమ్మను చూడటానికి వచ్చిన వారందరకీ రామరాజు కృష్ణమూర్తిగారు తెలిసే వుంటారు. ఏ భేషజాలు లేకుండా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా అమ్మతో కూడా ఏ సంకోచం లేకుండా మాట్లడగలిగినవాడు కృష్ణమూర్తి. అమ్మ వద్దకు వచ్చే నాటికే అరవింద యోగి రచనలు ఆకళింపు చేసుకొన్నవాడు. చలం రచనల శైలీ విన్యాసం వారికి బాగా వంటపట్టింది. అమ్మను గూర్చి 1968లో వారు వ్రాసిన ప్రస్తుతి గ్రంథంలోని గల్పికలపై చలం ప్రభావం కనపడుతుంది. మాతృశ్రీలో కూడా వారి వ్యాసాలు ఎన్నో ప్రచురితమైనాయి.
గుంటూరులో 13.9.1933న రామరాజు వెర్రయ్య, లక్ష్మమ్మలకు జన్మించిన కృష్ణమూర్తిగారు గుంటూరులో పాఠశాల మరియు కాలేజీ విద్య పూర్తిచేసి, పూనాలో న్యాయశాస్త్ర పట్ట భద్రుడైనాడు. జిల్లెళ్ళమూడి నాన్నగారు గురువుగా భావించే శ్రీ మోతడక రామచంద్రరావుగారి ద్వారా జిల్లెళ్ళమూడి అమ్మను గూర్చి విని తన మిత్రుడైన చీరాల భాస్కరరావుతో కలసి 1956లో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను చూచాడు. ప్రధమ దర్శనంతోనే అమ్మ పట్ల అచంచల విశ్వాసం ఏర్పడింది. సాధనల ద్వారా మహర్షులు ఏది సాధించాలని కోరుకుంటారో ఆ లక్ష్యం ఇక్కడ మానవదేహం ధరించి మాతృమూర్తిగా అవతరించిందని నిశ్చయానికి వచ్చారు. అమ్మను చేరటము, అమ్మ సన్నిధిలో జీవితం గడపటమే జీవితపరమావధిగా మనస్సుకు తట్టింది. బాల్యంలోనే తండ్రి పోయాడు, ఐదుగురు ఆడ పిల్లల తర్వాత తను ఒక్కడు మగ శిశువు. ఇలా సాధనచేసుకుంటూ ఏ జిల్లెళ్ళమూడిలోనో ఉంటానంటే తల్లి ఎలా అంగీకరిస్తుంది? ఇంట్లో చెప్పా పెట్టకుండా జిలెళ్ళమూడి వస్తూవుండేవాడు. ఇంట్లో తల్లి గాభరాపడేది. అక్కలు, బావలూ మందలించేవారు. గుంటూరులో సుప్రసిద్ధ క్రిమినల్ లాయర్ శ్రీ మన్నవ నరసింహారావుగారు వీరి బావగార్లలో ఒకరు. అప్పటికి కృష్ణమూర్తిగారు న్యాయశాస్త్రం చదువు పూర్తి కాలేదు. అప్పుడు అమ్మ మందలించి చదువు పూర్తి చేయమని చెప్పింది. అమ్మ మాట మీద లా చదువు పూర్తిచేశాననిపించు కున్నాడు. కాని న్యాయవాది వృత్తి చేయడే! అందులో అబద్ధాలు చెప్పటం క్లైంటులను మోసం చేయటం వంటివి ఆయనకు నచ్చేవి కాదు. ఇది తన ప్రవృత్తికి భిన్నమైనదని భావించారు.
ఒకరోజు అర్థరాత్రి ఇంట్లోంచి చెప్పకుండా బయలుదేరి తన దగ్గర దాచి పెట్టుకున్న డబ్బుతో ఒక చీర, ప్లాస్కులో కాఫీ తీసుకోని ఒక లారీ పట్టుకొని పెదనందిపాడుదాకా వచ్చి అక్కడ నుండి జిల్లెళ్ళమూడికి నడిచి తెల్లవారుఝామున అమ్మ వద్దకు చేరాడు. తాను తెచ్చిన చీరెను అమ్మ మంచం మీద పెట్టి, కాఫీ ఫ్లాస్కు క్రింద పెట్టి అమ్మకు నమస్కరించి కూర్చున్నాడు. అమ్మ ‘ఈ సమయంలో ఎలా వచ్చావు నాన్నా!’ అని అడిగింది. నీవు త్రాగుతావని కాఫీ తెచ్చానమ్మా! అని కప్పులో పోసి ఇస్తే తాను కొద్దిగా త్రాగి కృష్ణమూర్తిచేత ఆప్యాయంగా త్రాగించింది. ఎన్ని కష్టనష్టాలనైనా భరించి తనను చూడటానికి వచ్చిన బిడ్డను చూచి అమ్మ కళ్ళు చెమర్చాయి. అమ్మదగ్గరకు రాగలిగాననే విజయ గర్వంతో హాయిగా గడిపాడు ఆ రోజు అమ్మ వద్ద కృష్ణమూర్తిగారు. అమ్మకు విషయం తెలియందేముంది. ప్రయోజకుడిపై పెద్దలను నొప్పించకుండా జిల్లెళ్ళమూడి వచ్చి ఉండమని అమ్మ పంపించింది ఇంటికి. తర్వాత కృష్ణమూర్తిగారికి, వారి బావగారికి అమ్మ యొక్క దైవత్వాన్నిగూర్చి- అమ్మలోని అతిమానుషశక్తిని గూర్చి వాదన ప్రారంభమైంది.
ఇరువురు ఒకరికొకరు తమతమ వాక్చాతుర్యాన్ని చూపించుకున్నారు. కృష్ణమూర్తిగారితో వాదించి లాభం లేదని వాళ్ళ బావగారు మీ అమ్మ నిజంగా దైవమైతే ఎలక్ట్రిసిటీ మెయిన్ లోని ఫ్యూజుతీసి ఆ కరెంటు వైరు నీవు పట్టుకో ఎంతవరకు కాపాడుతుందో చూద్దాం అన్నారు. ఆయన వీడెట్లాగూ పట్టుకోడని మాటవరసకు భయపెట్టడానికి అన్నాడు. కాని కృష్ణమూర్తికి పట్టుదల పెరిగింది. విశ్వాసం వెన్నుతట్టింది. అంతే వెళ్ళి ఆ కరెంటు వైరు పట్టుకున్నాడు. వారి బావగారు భయపడ్డారు నిర్ఘాంతపోయినారు. అది కృష్ణమూర్తిగారిని షాక్ కూడా కొట్టలేదు. ఇప్పటికైనా నమ్మండి అమ్మ దైవమని అన్నాడు కృష్ణమూర్తి. వాళ్ళ బావగారికి అనుమానం వచ్చింది. బహుశా ఆ సమయానికి కరెంట్ పోయి ఉంటుందని, అదీ మీ అమ్మ మహిమేనా? అన్నారు. అప్పుడు ట్యూబ్ లైట్ వేసి వెలిగి తర్వాత ఇప్పుడు కరెంట్ ఉన్నది కదా అని హోల్డర్ తీసి కరెంట్ పాస్ అవుతున్న హోల్డర్లో చేతివ్రేళ్ళు పెట్టి మీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకోండి అన్నాడు కృష్ణమూర్తి. అప్పటి నుండి అమ్మ దైవత్వాన్ని గూర్చి కృష్ణమూర్తి విశ్వాసాన్ని గూర్చి వాళ్ళు తర్కించలేదు- ఎప్పుడూ. ఏ పరిస్థితుల్లోనైనా అమ్మ కాపాడుతుందనే నమ్మకమే ఆయనను కాపాడింది. అయితే ఈ సంఘటన జరిగిన సమయానికి జిల్లెళ్ళమూడిలో సోదరి సోదరులతో మాట్లాడుతున్న అమ్మ ఒక అంగుళం అంగుళంన్నర ఎత్తు ఎగిరిపడింది. అమ్మ ముఖం కూడా ఎర్రగా కమిలి పోయింది. ఏమైందమ్మా అని అక్కడి వారడిగితే కరెంట్ షాక్ కొట్టిందిలేరా అన్నదిగాని వివరాలు చెప్పలేదు. తర్వాత జిల్లెళ్ళమూడి వచ్చిన కృష్ణమూర్తిని సున్నితంగా మందలించింది ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని.
ఆ తర్వాత కృష్ణమూర్తిగారి తల్లి వివాహ ప్రస్తావన తెచ్చింది. జిల్లెళ్ళమూడి అమ్మ ఎవరిని చేసుకోమంటే ఆమె మెళ్ళో తాళి కడతానన్నాడు కృష్ణమూర్తి. మొత్తంమీద అమ్మ ఇష్టప్రకారమే గూడవల్లిలో హైస్కూలో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్న శ్రీనాధుని రాజగోపాలరావుగారి మూడవ కుమార్తె ద్వారక్తో 1963లో వివాహమైంది. జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో 1967లో అమ్మ నివసించే భవనం ప్రక్కనే ఇల్లు కట్టుకొని అందులో చేరాడు. అప్పటి అమ్మను చూడటానికి వచ్చిన వారిలో ఎవరూ ఇల్లు కట్టుకొని స్థిరనివాసం ఏర్పరచుకోలేదు. వీరే మొదటి వారు. అతడు చిన్న వయసులో ఇలా ఈ పల్లెటూళ్ళో ఇల్లు కట్టుకోవటం బంధువులకూ, మిత్రులకు నచ్చలేదు. అన్నీ అమ్మే. చూచుకుంటుందనే అచంచల విశ్వాసం ఈ విమర్శలను లెక్క చేయనీయలేదు. ఈ అందుకే అమ్మ అన్ని విషయాలలోనూ ఆయన కుటుంబాన్ని కాపాడుతూ ఆదుకుంటూ వచ్చింది.
అమ్మతో ఎక్కువకాలం గడపాలనుకున్నా వారి కోరిక రోజురోజుకూ వచ్చే జనాభా పెరగడంతో అవకాశం తగ్గిపోతున్నది. దానికి తోడు పిల్లలు పెరిగి పెద్దవారై పాఠశాలలో చదువుకొనే వయసు వస్తుండటంతో మళ్ళీ గుంటూరుకు కాపురం మార్చారు కృష్ణమూర్తిగారు 1976లో జిల్లెళ్ళమూడిలో ఉన్న రోజులలో శ్రీవిశ్వజననీ పరిషత్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పని చేశారు. ఆ సమయంలోనే 1974లో అమ్మ నెల్లూరు డాక్టర్ శిష్ట్లా సుబ్బారావుగారింటికి వైద్యం నిమిత్తం వెళ్ళింది. అమ్మ వెంట కార్యకర్తలంతా వెళ్ళారు. సంస్థను నడిపే బాధ్యత కృష్ణమూర్తిగారి పై పడ్డది. జనం తక్కువగా ఉండటంతో అఖండనామం జరగడం కష్టమౌతున్నది. నిర్వాహకులకు “ఎలాగో సర్దుకుని అమ్మ వచ్చే దాకా కొనసాగించండి అమ్మ వచ్చి చూచుకుంటుందని” చెప్పారు కృష్ణమూర్తి. వాళ్ళు ససేమిరా మా వల్ల కాదన్నారు. అయితే ఈ రోజు నుండి అఖండనామం ఆపేద్దాం. అన్నారు కృష్ణమూర్తి. నిరంతరాయంగా జరుగుతున్న అఖండనామం ఎక్కడ తమ వల్ల ఆగిపోయిందని చెడ్డపేరు వస్తుందో అనే భయంతో ఆవరణలోని వాళ్ళంతా పాల్గొని అంతకుముందుకన్నా బాగా చేశారు. అమ్మ తిరిగి వచ్చిం తర్వాత కృష్ణమూర్తిగారు అఖండనామం ఆపేస్తానన్నారమ్మా! అని ఫిర్యాదు చేశారు. అమ్మ కృష్ణమూర్తిని పిలిపించి అడిగింది. ఔనమ్మా! అలా నేనన్న తర్వాతే వీళ్ళంతా అంతకు ముందుకన్నా ఉత్సాహంగా చేశారు. అందుకే నేనలా అన్నాను అన్నారు వారు.
జిల్లెళ్ళమూడి సంస్థకు అత్యవసరమైన ఇబ్బందులు రావడంతో గుంటూరులోని తన ఇంట్లో వెనుకవైపున గల పెద్ద భవనాన్ని అమ్మి అప్పుగా ఇచ్చారు కృష్ణమూర్తిగారు. ప్రతినెలా దానిపై ఇచ్చే వడ్డీతో ఆయన తన ఇల్లు గడుపుకొనేవారు. సంస్థ సకాలానికి ఇవ్వకపోతే ఇబ్బంది పడుతుండే వాడు. ఆ సమయంలో ఈ ప్రస్తావన అమ్మ వద్ద వస్తే తాత్కాలికంగా కొద్దిగా సద్దమంటే నేను సర్దుతానమ్మా అని నేను చెప్పాను. అలా నా వద్ద తీసుకొన్న ధనం జిల్లెళ్ళమూడి సంస్థ తెచ్చి ఇవ్వగానే నాకు తెచ్చి ఇచ్చేవాడు. అమ్మ ఆలయంలో చేరిన తర్వాత సంస్థలో వచ్చిన మార్పులలో వారికి వడ్డీ ఇవ్వటం కొంతకాలం ఆపటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. సంస్థ వారు వ్రాసి ఇచ్చిన ప్రోనోటు కాలం చెల్లిపోతుంటే కోర్టులో పడేయమని సలహా ఇచ్చాము. కాని కృష్ణమూర్తిగారు అలా చేయక నేను అమ్మ చేతికిచ్చాను నా డబ్బు. నేను దావా వేస్తే అమ్మ మీద వేసినట్టే కదా! ఇక అమ్మ మీద మన విశ్వాసం ఏమైనట్టు? ఇవ్వదలచుకుంటే అమ్మే ఇస్తుంది. నన్నెలా పోషించాలో అమ్మకు తెలుసు అని ఊరుకున్నారు.
గుంటూరులో వారి ఇంటి మేడ మీద ఉన్న గదిలో రాచర్ల లక్ష్మీనారాయణ కొంతకాలం ఉన్నాడు. నేను కొంతకాలం ఉన్నాను. అంత ఇబ్బందులలో కూడా కరెంట్ ఖర్చులు కూడా నా వద్ద తీసుకోలేదు. తర్వాత 1988లో మాతృశ్రీ అధ్యయన పరిషత్ కేంద్రం ఆ గదిలోకి మార్చబడింది. అంతే కాదు జిల్లెళ్ళమూడి గ్రామంలో అమ్మ ఏర్పాటు చేసిన పిడికెడు బియ్యపు పథకం గుంటూరు మాతృశ్రీ అధ్యయన పరిషత్ ఏర్పాటు చేసింది. ప్రతినెల రెండు మూడు క్వింటాళ్ళ బియ్యం సేకరించి జిల్లెళ్ళమూడి పంపటం జరిగేది. ఆ సేకరణ కార్యక్రమమంతా కృష్ణమూర్తిగారి పిల్లలే నిర్వహించేవారు. అది యజ్ఞంగా చేసేవారు వారి కుటుంబం అంతా కృష్ణమూర్తిగారు కూడా హోమియో వైద్యం చదివి ఉచిత వైద్యసేవ చేస్తుండేవారు.
పిల్లలందరికీ మామూలు లౌకిక విద్యతో పాటు సంగీత విద్య కూడా నేర్పించారు. కృష్ణమూర్తిగారు. ఏమిటయ్యా ఇది అంటే. ఉద్యోగాలు రాకపోతే త్యాగరాజులాగా అమ్మనామం చేసుకొంటూ వీధి వీధికి తిరిగి బిచ్చమెత్తుకొనైనా బ్రతుకుతారుకదా? అనేవారు. కాని వారి పిల్లలందరూ మంచి సంగీత విద్వాంసులైనారు. మృదంగంలో, వయోలిన్లో మంచి పరిణతి సాధించి పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. వారి పెద్దకూతురు వివాహం చేయాల్సి వచ్చినపుడు అమ్మ రెండవ కుమారుడు రవి ప్రత్యేక శ్రద్ధ తీసికొని (అప్పటికి కృష్ణమూర్తిగారు అమ్మలో ఐక్యం అయినారు. వారి బాకీ క్రింద పెద్ద మొత్తాన్ని సేకరించి ఆదుకున్నారు. పిల్లలందరూ అమ్మ దయ వల్ల స్థిరపడ్డారు. అమ్మ యెడల భక్తి ప్రపత్తులు కలిగి సేవ చేసుకుంటున్నారు.
అమ్మ సేవలో, అమ్మ ధ్యాసలో నిరంతరం గడుపుతూ 13.7.1993న రాత్రి నిద్రలో నిశ్చింతగా అమ్మలో లీనమైన ధన్యజీవి, ఆదర్శపురుషుడు, విశ్వాసానికి మరో పేరు శ్రీరామరాజు కృష్ణమూర్తి.