1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (రెడ్డి సుబ్బయ్య)

ధన్యజీవులు (రెడ్డి సుబ్బయ్య)

Pillalamarri Srinivasa Rao
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 12
Month : April
Issue Number : 2
Year : 2013

మంత్రాల తర్వాత నాన్నగారింట్లో పనిచేసినవాడు రెడ్డి చినసుబ్బయ్య. సుబ్బయ్య తండ్రి రెడ్డి రాఘవులు చందోలు గ్రామ కాపురస్థుడు. ఆయన భార్య సింగిరమ్మ, జిల్లెళ్ళమూడిలో ఖగ్గావారు సంపన్న కుటుంబీకులు. ఖగ్గా వారి దగ్గర జీతగానిగా చేరాడు రాఘవులు. రాఘవులకు పెద్ద సుబ్బయ్య, చిన్న సుబ్బయ్య అని ఇద్దరు కుమారులు. వీరిలో చినసుబ్బయ్యకు నాన్నగారింట్లో సేవచేసే అదృష్టం పట్టింది. రెడ్డి చిన్న సుబ్బయ్య ప్యాపట్టు చెందిన ఆదెమ్మను పెళ్ళి చేసుకున్నాడు. సుబ్బయ్యకు నలుగురు మొగ పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సుధాకరరావు, కృష్ణ మొగపిల్లలు. రాగమ్మ, పార్వతి, దైవలక్ష్మి ముగ్గురు ఆడపిల్లలు. అమ్మ దగ్గర బాగా అలవాటైనది పార్వతి. సుధ ఇప్పుడు మన సంస్థలో పనిచేస్తున్నాడు.

అయితే సుబ్బయ్య అమ్మ దగ్గరకు చేరటంలో కూడా ఊళ్ళో వాళ్ళ ప్రోద్బలం తోడయింది. జిల్లెళ్ళమూడిలోని ప్రజలకు స్త్రీల శీలసంపద పట్ల అంత విశ్వాసం ఉండేదికాదు. మంత్రాయి నాన్న గారింట్లో జీతగాడు. మంత్రా మీద అందరికీ అనుమానం. మంత్రాయి మీద నిఘా కోసం సుబ్బయ్యను వాళ్ళే నాన్నగారింటికి పంపించారు. ఆ రకంగా చేరాడు అమ్మ దగ్గరకు. మంత్రాయ మొక్క జొన్నలు దంచుతున్నాడు. అమ్మ రవ్వ జల్లెడ పడుతున్నది. గాదె చాటు నుండి రెడ్డి సుబ్బయ్య అనుమానంతో చూస్తున్నాడు. చాటుగా నిలుచున్న సుబ్బయ్యను కందిరీగ కుట్టింది. ఇవతలికి రాలేడు అక్కడ బాధతో ఉండలేడు. అంతటితో వదిలింది దయామయియైన అమ్మ. కాఫీ కలిపి మంత్రాయిని రమ్మని సంజ్ఞ చేసింది అమ్మ. చేతి సంజ్ఞతోనో, కళ్ళతోనో మంత్రాయిని రమ్మని ఏ పనికి పిలిచినా గాదెచాటు నుండో గడ్డివాము చాటు నుండో చూచిన సుబ్బయ్య అందరికీ చెప్పేవాడు అమ్మ పిలిచిందని. అమ్మ నాన్న గారికీ విషయం చెప్పింది. నాన్నగారు నీవు ఎవరినీ లెక్క చేయవలసిన అవసరం లేదని చెప్పారు. ఆ రకంగా దగ్గరకు చేరిన రెడ్డి సుబ్బయ్య మంత్రాయి చనిపోయిన తర్వాత అమ్మ ఇస్తున్న ఎన్నో అనుభవాలున్నా అమ్మను. పరీక్ష చేయటం మానలేదు.

అమ్మ నా వద్ద వందరూపాయిలు లేకపోయినా వంద మందికి అన్నం పెట్టుకుంటాననేది. ఎట్లా పెట్టుకుంటుందో చూడాలని సుబ్బయ్య అమ్మ చేతిలో చిల్లిగవ్వకూడా లేని రోజున ఆరుగురు బాగా తిండి పుష్టిగలవారిని తెచ్చి ఆకలిగా ఉన్నది అన్నం పెట్టమని అడగండి అని చెప్పాడు. వాళ్ళు వచ్చి నీ చేతి మీదుగా అన్నం తినాలని ఉందమ్మా ! అన్నారు. ఇంట్లో గ్లాసెడు బియ్యమే ఉన్నాయి. అవి కడిగి కుంపటి మీద పెట్టి వండింది. అందరినీ కూచోబెట్టి వాళ్ళు తృప్తిగా కడుపునిండా ఇంక తినలేము చాలమ్మా! అనేంత వరకూ పెట్టింది. రెడ్డి సుబ్బయ్యకు ఆశ్చర్యం వేసింది. అమ్మ ఎలా ఇంత మందికి పెట్టింది? ఏదో మహత్తు ఉన్నది అనుకున్నాడు. దూర్వాసునకు, శిష్యులకు ధర్మరాజు ద్రౌపదుల చేత శ్రీ కృష్ణపరమాత్మ కడుపునిండా భోజనం పెట్టించిన సన్నివేశం జ్ఞాపకం వచ్చింది సుబ్బయ్యకు..

ఒకసారి అమ్మ మూడు సోలల బియ్యం వండి 60 మందికి భోజనం పెట్టింది. రెడ్డి సుబ్బయ్య గొడ్లను తోలుకొని వచ్చాడు. కాళ్ళు కడుక్కొని రారా! అన్నం పెడుతానన్నది అమ్మ. ఇంత మందికి పెట్టావు ఇంకా అన్నం ఎక్కడిది? అన్నాడు సుబ్బయ్య. పోరా! కాళ్ళు కడుక్కొచ్చి గిన్నె చూడు అన్నది అమ్మ. తీరా సుబ్బయ్య మూత తీసి చూస్తే గిన్నె నిండా అన్నం ఉన్నది. ఆశ్చర్యంతో అమ్మకు నమస్కరించాడు. ఇలాంటి సన్నివేశాలెన్నో చూచాడు సుబ్బయ్య.

సుబ్బయ్య ఊళ్ళో టీలు అమ్ముకొని బ్రతికేవాడు. అమ్మ వద్దకు చేరి అమ్మను కనిపెట్టుకొని అమ్మ చెప్పిన పనల్లా చేసేవాడు. నాన్నగారు జమాబందీకి బాపట్లకు వెళ్ళినపుడు అమ్మ నాన్నగారి కోసం మూల పాలెం మీదగా అన్నం తీసుకెళ్ళేది. అమ్మకు సాయంగా వస్తాననేవాడు రెడ్డి సుబ్బయ్య. ‘నీవు పిల్లలకు తోడు ఉండు నేను పోయి వస్తాను’ అని అమ్మ బయలుదేరేది. ప్రాణం ఒప్పక సుబ్బయ్య కూడా అమ్మ వెనుక బయలు దేరేవాడు. సుబ్బయ్య ఎంత తొందరగా నడిచినా అమ్మ అందేది కాదు. అమ్మ కనిపించేవరకూ వెళ్ళి తిరిగి వచ్చేవాడు.

ఒకరోజు మామూలుగా అమ్మ ఇంటి ముందు కావలి కాస్తున్నాడు. భార్య ఆదెమ్మ పురిటి నెప్పులు పడుతున్నదని కబురు రాగా సుబ్బయ్య ఇంటికి వెళ్ళాడు. ఆనాటి రాత్రి నాన్నగారి ఇంట్లో దొంగలుపడి నగలు, వస్తువులు దోచుకున్నారు. మర్నాడు సుబ్బయ్య రాగా నాన్నా! రాత్రి నీవు లేవు. ఏం జరిగిందో చూచావుగా అన్నది. సుబ్బయ్య బాధపడ్డాడు.

సుబ్బయ్య పొలం దున్నుతుంటే అమ్మ నాగలిమీద కూర్చొన్నది. నీవు నాగలి మీద కూర్చుంటే నేనెలా దున్నేది? అన్నాడు. అంతే వామనుడు విరాట్ స్వరూపుడైనట్లు, శ్రీకృష్ణుడు కురుసభలో విశ్వరూప సందర్శనం చేయించినట్లు అమ్మ ఆకాశం నిండిపోయినట్లు తన ఆకారాన్ని పెంచింది. సుబ్బయ్య ధన్యుడు. అమ్మ విశ్వరూపం దర్శించాడు.

జిల్లెళ్ళమూడిలో ఎవరూ ఆకలిబాధతో ఉండకూడదనే ఉద్దేశ్యంతో అమ్మ పిడికెడు బియ్యపు పధకం ప్రవేశపెట్టింది. అమ్మకు సాయంచేసేవాడు సుబ్బయ్య. బియ్యం పోగుచేయటం అవసరమైన వారికి అప్పుగా ఇవ్వటం మళ్ళీ తీసుకు రావటం చేస్తుండేవాడు. అందులో నిల్వ ఉన్న బియ్యం జాగత్త చేసేవాడు. ఊళ్ళో రామాలయం కట్టాలని గ్రామ పెద్దలు తీర్మానించి అమ్మకు చెప్పారు. అమ్మ తన వద్ద నిల్వ ఉన్న బియ్యం అమ్మి రూ. 170/-లతో ఇప్పుడు అనసూయేశ్వరాలయం ఉన్న స్థలం కొన్నది. తీరా గుడి కట్టబోయే సమయానికి ఆ స్థలం అమ్మినవాడు నాకు సొమ్ము ముట్టలేదని అబద్ధమాడాడు. అమ్మ సుబ్బయ్యను పిలిచి డబ్బు ఇవ్వలేదంటున్నాడు మళ్ళీ డబ్బు ఇవ్వమన్నది. సుబ్బయ్య 20 బస్తాల ధాన్యం అమ్మి తెచ్చి ఇచ్చాడు. అసత్యదోషానికి అతని కుటుంబం చితికిపోయింది. అమ్మ పాదాలపై పడి క్షమాపణ కోరాడు. ఆ సొమ్ము తెచ్చి ఇచ్చాడు. ఆ ధనం సుబ్బయ్యకు ఇప్పించింది. సుబ్బయ్య ఆలయ నిర్మాణానికి ఖర్చుపెట్టాడు. అమ్మకు ఏమైనా ఇవ్వాలే కాని అమ్మ వద్ద తీసుకోకూడదని సుబ్బయ్య నిశ్చయం.

సుబ్బయ్య తాను ఇల్లు కట్టుకోటానికి పదివేల ఇటుక కాల్చి తెచ్చి పెట్టుకున్నారు. అధరాపురపు శేషగిరిరావుగారు వచ్చిం తర్వాత అమ్మ పూరింట్లో ఉండటం ఏమిటి? అని ఇటుకుల కోసం వెతుకగా సుబ్బయ్య వద్ద ఉన్నదని తెలిసి అడిగాడు. దానితో ప్రస్తుతం అలంకార హైమ ఉన్న ఇల్లు కట్టబడింది.

సుబ్బయ్యను ఎక్కడికీ వెళ్ళవద్దని చెప్పింది అమ్మ. తన పొలం కోతకు వచ్చింది కూలీలను పెట్టి వస్తానన్నాడు. పొలంపని నేను చూచుకుంటాలేరా అన్నది. అన్నా వినకుండా బయలుదేరాడు. తీరా వెళుతుంటే దారిలోనే కూలీలు కనిపించి కోతపని పని పూర్తి చేసి వస్తున్నామన్నారు. పోటా పోటీగా కోత పని చేశామని చెప్పారు. ఆశ్చర్యపోయాడు సుబ్బయ్య అమ్మ చర్యకు.

పొలంలో ఉన్న తన కుమారుడు సుధను పాము కరిచిందని వచ్చింది. వార్త. అమ్మ సేవలో ఉన్నాడు సుబ్బయ్య. సుధను తెచ్చి ఏదో మంత్రం వేయించారు కట్టు కట్టించారు. శరీరం చల్లబడిపోయింది. అమ్మ వద్ద ఉన్న సుబ్బయ్య వద్దకు వచ్చి నీ కొడుకు పరిస్థితి అలా ఉంటే ఇంకా నీవు ఇక్కడే ఏం చేస్తున్నావు? అని అడిగారు. సుబ్బయ్య వెంటనే వెళ్ళి సుధను బుజాన వేసుకొని వచ్చి అమ్మ పాదాల వద్ద ఉంచాడు. ఆ సమయానికి డాక్టర్ నారపరాజు శ్రీధరరావుగారు అక్కడే ఉన్నారు. సుధను చూచి పెదవి విరిచారు. అమ్మ సుధ చెవి పట్టుకొని ఏదో చెప్పింది. ఏదో చేసింది. కొద్ది క్షణాలలో సుధ లేచి కూర్చొన్నాడు. అమ్మ ఆనాడు సుధకు ప్రాణదానం చేసింది.

ఒకసారి నాన్నగారితో గుంటూరు ప్రయాణమైంది అమ్మ. అమ్మకు ఆ సమయాన వెంట తీసుకెళ్ళటానికి మరొక చీరె లేదు. ఊళ్ళోకి చీరలమ్మే వాడు వచ్చాడు. పరిస్థితి తెలిసిన సుబ్బయ్య ఏడు రూపాయలు పెట్టి ఒక చీరె కొని పరుగెత్తుకుంటూ ఏడవ మైలు వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్న అమ్మకు ఇచ్చి వచ్చాడు. ఈనాడు ఇరవై, ముఫ్పై వేలు ఖరీదు చేసే చీరె కూడా ఆ చీరె ముందు తీసికట్టే నంది అమ్మ. ఆనాటి ఆ చీరె వెనుక ఉన్న ఆపేక్ష, ఆర్ద్రత గొప్పవి కదా! అవసరం విలువైనది కదా! శ్రీ కృష్ణ పరమాత్మకు వేలుకోసుకొని రక్తం వస్తుంటే ద్రౌపది చీరె చెంగు చించి ఆ వేలుకు కట్టింది. అలాంటిదే సుబ్బయ్య చేసిన పని.

రెడ్డి సుబ్బయ్యను చూచినవారికి తెలుసు మనిషి ఎట్లా ఉండేవాడో. 3 అంత సుబ్బయ్యకు కూడా చీకటిపడితే భయం. ఒంటరిగా తిరిగేవాడు కాడు. ఒకసారి వరినారు కోసం బాపట్ల వెళ్ళాల్సి వచ్చింది. అమ్మతో అమ్మ! నీవు నాతో ఉండాలి. నేను వరినారు కోసం బాపట్ల వెళుతున్నాను అన్నాడు. అట్లాగే నాన్నా! అన్నది అమ్మ. నారు పీకించి కట్టలు కట్టించాడు. బండ్ల కెత్తించాడు. చీకటి పడ్డది. ఆ సమయానికి ఊరి వెలుపలి శ్మశానం దగ్గరకు వచ్చేటప్పటికి భయం. గుండెల్లో గుబులు. పొలం గట్టున ఉన్న ఒక పెద్దాయిన సుబ్బయ్యతో బండి వెంట వచ్చాడు. సుబ్బయ్యకు ధైర్యం వచ్చింది. ఆరవ మైలు దాకా వచ్చిన అతను ఒక పావలా అడగ్గా సుబ్బయ్య ఇచ్చాడు. జిల్లెళ్ళమూడి చేరగానే అమ్మ వద్దకు వెళ్ళాడు. జనం కూర్చుని ఉన్నారు అమ్మ చుట్టూ. అమ్మ ‘సారాయి తాగుతాను అంటే పావలా ఇస్తావా? నాకు నీ పావలా వద్దు ఇదుగో’ అంటూ పావలా నాణాన్ని సుబ్బయ్య చేతిలో పెట్టింది. సుబ్బయ్య తనకు తోడు వచ్చింది అమ్మే ఆ ఆకారంలో అని తెలిసి అమ్మ పాదాలపై వాలిపోయాడు. చుట్టూ ఉన్న జనం పూర్వాపరాలు తెలిసింతర్వాత ఆశ్చర్యపోయారు.

మిన్ని కంటి గురునాథశర్మగారు ఉభయభాషా ప్రవీణులు, వేదాంతపారీణులు, కవిశేఖరులు, కవితామహేశ్వరులు. వారు వ్రాసిన ‘అమ్మ’ కావ్యంలో రెడ్డి సుబ్బయ్యను గూర్చి వ్రాస్తూ

‘రెడ్డి సుబ్బయ్య నీకును ప్రీతిపాత్రు

 డాదుకొను నీదు చేతికి నడ్డు వచ్చి

 నిను నిదురలేపగా వచ్చి నిలివెడెత్తు

పాముతో నాడు నిను గనె బ్రధమమందు” అని వ్రాశారు. అంటే అమ్మతో పాము ఆడుకుంటుంటే చూచాడట రెడ్డి సుబ్బయ్య.

కులపతిగారు కూడా తమ ‘అంబికాసాహస్ర’, గ్రంథంలో దీనిని ప్రస్తావిస్తూ

‘ప్రకటీతరాగ్ని పూత్కృతి విభాసిత దివ్య ఫణామణి ప్రభా

 చకిత దిగంతురుండయిన సర్వవిభుండు సముజ్జ్వలమ్ముగా

 నికటము నందు నీ యెదుట నిల్చిన అద్భుత సన్నివేశపుం

 బ్రకృతి – ప్రశంస సేయును ప్రపంచము దాని స్మరింతు నంబికా!” అంటారు.

అంటే రెడ్డి సుబ్బయ్య అమ్మ ముందు పాము ఆడే సన్నివేశం చూచాడు. చిదంబరరావు తాతగారూ చూచారు ఒకసారి నాగులచవితినాడు.

ఇప్పుడు అన్నపూర్ణాలయం, అందరిల్లు ఉన్న స్థలం ఆనాడు పంట పొలం. ఆ పొలం అమ్మకానికి వచ్చింది. అమ్మా! నా దగ్గర అంత డబ్బు లేదు కొనటానికి కొద్దిగానే ఉన్నది అని అమ్మకు చెప్పాడు. అమ్మ నేనిస్తాలే కొనరా అని చెప్పింది. పొలం సుబ్బయ్య కొన్నాడు. సుబ్బయ్య పేరనే రిజిష్టరయింది. అయితే సుబ్బయ్య ఉండగానే ఆ స్థలంలో అన్నపూర్ణాలయము, అందరిల్లు నిర్మాణాలు జరిగాయి. అమ్మతో సుబ్బయ్య ఆ స్థలాన్ని రిజిష్టరు చేస్తాను. సంస్థకు, చేయించుకోమని అడిగాడు. తర్వాత చూద్దాంలే అన్నది అమ్మ. ఆ తర్వాత రెండు నెలలకే రెడ్డి సుబ్బయ్య అమ్మలో 15.1.1983న కలిసిపోయాడు. ఆ తర్వాత సుబ్బయ్య పిల్లలకు కొంత డబ్బు ఇచ్చి ఆ స్థలం శ్రీ విశ్వజననీపరిషత్ రిజిష్టరు చేయించుకుంది. మనం అమ్మకు సేవచేస్తే మన అవసరాలు మనం అడక్కుండానే తీరుస్తుంది, రక్షిస్తుంది, పోషిస్తుంది అనేది సుబ్బయ్య అచంచలమైన విశ్వాసం.

అమ్మకు ఆంతరంగిక సేవకునిగా, అంగరక్షకునిగా, భక్తునిగా, ఆత్మీయబంధువుగా సుబ్బయ్య నిలిచారు. వేద వేదాంగాలు చదివినా, కఠోర నియమ నిష్ఠలతో తపస్సు చేసినా, ఉపాసన చేసినా ప్రాప్తించని అనన్యశరణాగతి, ఏకాగ్రత, భక్తి విశ్వాసాలు సుబ్బయ్యకు అమ్మయందు కలిగాయి.

ధూర్జటి తన కాళహస్తీశ్వర శతకంలో సాలెపురుగు, పాము, ఏనుగు, చెంచుజాతివాడు ఏం చదువుకున్నారని మోక్షం ప్రసాదించాడు పరమేశ్వరుడు. చదువులు కాదు కావలసింది. అనన్యమైన భక్తి, భగవత్సేవ ఈ రెండూ రెడ్డి సుబ్బయ్యకు ప్రసాదించి తరింపచేసింది అమ్మ – ధన్యుడు – మనందరికీ ఆదర్శ సోదరుడు – అగ్రజుడు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!