1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (రైతు కొట్టా పాపయ్య)

ధన్యజీవులు (రైతు కొట్టా పాపయ్య)

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 18
Month : January
Issue Number : 1
Year : 2019

అమ్మ ఏ మాత్రం అవకాశమున్నా మన్నవలో రాత్రిపూట పున్నయ్యగారి తోటకు వెళుతుండేది. ఒకరోజు తోటలో అమ్మ అడుగు పెట్టగానే చెట్లన్నీ సంతోషంతో కదిలి కౌగిలించుకున్నాయి. చెట్లతో పాటు చెట్ల మొదళ్ళలో ఉండే చీమలు, గాజుపురుగులు, ఉసుళ్ళు, మిడతలు, యెలుకలు, ముంగిసలు, పాములు అమ్మ ఒడిలోకి వచ్చి శత్రుత్వాన్ని మరచి ఆడుకున్నాయి. తెల్లవారు ఝామున జోరున వర్షం కురుస్తుంటే పొలంలో నీళ్ళు బయటకు వెళ్ళగొట్టటానికి రైతు పాపయ్య ఆ వైపు వచ్చాడు. అమ్మకు ఒకటి రెండు సంవత్సరాలప్పుడు అమ్మను ఎత్తుకున్నవాడే కాని అమ్మ పెద్దదయిన తర్వాత అమ్మను చూడలేదు, గుర్తుపట్టలేదు. అమ్మ గుర్తుపట్టింది.

పాపయ్య రోజూ గ్రామదేవత “పోతరాజు” గుళ్ళోకి వెళ్ళి బియ్యము బెల్లము కలిపి నివేదన చేసేవాడు. ఒకరోజు పాపయ్య గుడికి వచ్చే సమయానికి పోతరాజు విగ్రహం దగ్గర అమ్మ నిలుచున్నది. పోతరాజే అమ్మగా రూపం దాల్చి దర్శనమిచ్చాడని అమ్మను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. అతడి భార్య సుబ్బలక్ష్మి అమ్మను భుజం మీద నుండి దించి ‘కరణం గారి పిల్లను ఎత్తుకొచ్చావేంటి?’ అని అడిగింది. నా భుజం మీద నుండి దేవుడ్ని దించాలే ఏమైనాడు అని అడిగాడు. ‘నీవు దించింది యీ అమ్మాయినే’ అంటుంది భార్య. మళ్ళీ అమ్మనుభుజం మీద కెత్తకోగా పోతరాజు బాగానే కనిపిస్తుంది. అమ్మా! నన్ను కన్నతల్లీ ! అంటూ మూడు గంటలు భజన చేసి వళ్ళు తెలియకుండా పడిపోయాడు. సుబ్బలక్ష్మి భయపడి అమ్మను తీసుకెళ్ళి మరిడమ్మ గారిని పిలుచుకొని వచ్చింది. తాతమ్మ అమ్మతో ‘ఏమిటమ్మా!’ అంటే, ‘నాకేం తెలియదు’ అని నవ్వింది అమ్మ. తెలియంది. నవ్వుకా? నీకా? అంటే అమ్మ ‘నవ్వేకాదు మీరందరు ఎవరో నాకు తెలుసు, నేనెవరో మీకు తెలియదు’ అన్నది. మాకు తెలియపోతే మాన్లే నీవెవరో నువ్వే చెప్పు అన్నది. అమ్మ గిరగిరా అల్లీ బిల్లీ తిరుగుతూ ‘మీరంతా నేనే మీదంతా నేనే, ఇదంతా నేనే’ అంటూ పాటపాడుతూ తిరిగింది. భగవంతుడనుకొని అమ్మాయిని చూచి భ్రాంతి పడ్డాడు వదిలించమ్మా! మరిడమ్మా తల్లీ! అని సుబ్బలక్ష్మి తాతమ్మను అడిగింది. ఆయనకు మత్తు వదిలింది, మనకే మత్తు వుంది అన్నది అమ్మ. ఇంతలో హనుమంతయ్య గారు వచ్చి ఇది బహుశా సవికల్ప సమాధి అన్నారు. తాతమ్మ కాదురా నిర్వికల్ప సమాధే అన్నది. నిర్వికల్ప సమాధి అయితే పిల్లనెట్లా ఎత్తుకొచ్చాడు అన్నారు హనుమంతయ్య. తన్మయావస్థ అన్నది తాతమ్మ. మెలకువ వచ్చిన పాపయ్యను ‘విషయమేమిటి’? అని అడిగారు. ‘నాకేం తెలియదు. చూడాలనిపిస్తున్నది. నమస్కారం చెయ్యాలనిపిస్తుంది. అప్పుడెత్తు కొచ్చింది. పోతరాజునే, ఇప్పుడు చూస్తున్నది పోతరాజునే’ అన్నాడు. ఆ తర్వాత అమ్మ, ఎదురుకుండా లేకపోయినా, పదిరోజులు నీరు ఆహారం నిద్ర లేకుండా అన్నివేళలా తన యిష్టదైవాన్ని చూసాడు. మొదట తన దున్నలకు జబ్బు చేస్తే పోతరాజుకు మొక్కుకున్నాడు. తగ్గింది. అలా రెండు సంవత్సరాలు ఆరాధిస్తే. కలిగిన ఫలితం యిది.

ఒకరోజు పాపయ్య తెల్లవారుజామున పొలంలో నీరు బయటకు పెట్టటానికి వస్తూ తోటలో అమ్మను చూచి దగ్గరకు వచ్చి అమ్మ వళ్ళో ఉన్న జంతువులను చూచి భయపడ్డాడు. ‘అమ్మా! నీవెవరివి? మాంత్రికురాలవా’ అన్నాడు. ‘భయంలేదు నాయనా! చిన్న జంతువులు నిను దగ్గరకు వచ్చి కూర్చో అన్నయ్యా! అంటున్నవి’ అన్నది. తర్వాత మాటలలో ‘పాపయ్యా! చేయరాని తప్పు నీవు చేశావు, చెప్పరాని తప్పు నేను చేశాను’ అన్నది అమ్మ. ‘అదేంటమ్మా? నేనేం చేశాను? నీవేం చేశావు’? అన్నాడు పాపయ్య. ‘పోతరాజుకు నిత్యం చేసే నివేదన ఎందుకు మానుకున్నావు? అది నీవు చేయరాని తప్పు. పిలుస్తున్నది. నీవని తెలిసి నేను ఫలానా అని చెప్పకుండా నిన్ను తిప్పలు పెట్టటమే నేను చేసిన చెప్పరాని తప్పు’ అన్నది అమ్మ. ‘నేను నివేదన చేయటం లేదని, నీకెట్లా తెలుసు? ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటే ఎక్కడని నివేదన పెట్టేది? ఇప్పుడు నీలో కూడా కనిపిస్తున్నాడు. మాంత్రికురాలిగా, కరణం గారి పిల్లగా, పోతురాజుగా ‘ కనిపిస్తున్నావు. సరే ఆ జంతువుల భాష నీ కర్ధమవుతున్నదా? ఈ విషయం ఊరంతా చెబుదామనిపిస్తున్నది అమ్మా! అన్నాడు పాపయ్య. ‘నీవు చెప్పినా ఎవరూ నమ్మరు గాని, నీవు గుర్తుపెట్టుకొని ఆనందపడు. ఊళ్ళో చెప్పకు పోతరాజుకు కోపం వస్తుంది’ అన్నది అమ్మ.

తోట ప్రక్కనే ఉన్న చెరువులో కొన్ని జంతువులు, చెరువు వద్ద కోయిలలు, పాలపిట్టలు, గోరంకులు, పావురాలు, చిలకలు, గుడ్లగూబలు అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి చెట్లు ఎక్కుతై. ‘ఈ పక్షుల లోకం ఏమిటమ్మా!’ అన్నాడు పాపయ్య. “పక్షుల కొరకు మానవులు, మానవుల కొరకు పక్షులు ఒకదాని కొకటి అవసరం. ప్రపంచం అంతా ద్వంద్వాలతోనే ఉంది. ప్రొద్దు గుంకితే దీపం అవసరం. దీపం గుర్తుకు రావాలంటే చీకటి రావాలి. అన్నీ అంతే”, అని అమ్మ చెప్పి చెరువులో స్నానం చేసి పోదాం రమ్మని పాపయ్యను పిలిచింది. ఇంత ప్రొద్దున్నే అని చింతపుల్ల విరిచి నోట్లో పెట్టుకొని అమ్మకు కూడా ఒక పుల్ల తెస్తాడు. ఇంతలో ఒక కాకి తన గూటిలోని ఒక పుల్ల తెచ్చి అమ్మ పాదాల ముందు వేసింది. ఇదిగో అమ్మా! అని పాపయ్య అమ్మకు పుల్ల ఇవ్వబోగా “యెందుకులే నాయనా! కాకి తెచ్చి ఇచ్చిందిలే” అంటుంది. పాపయ్య నీ దృష్టిలో మనుషులూ ఇతర జంతువుల ఒకటిగానే ఉన్నై అన్నాడు. “అవును ఇతరమని అనిపించటం లేదు. అన్నీ నేనే అనిపిస్తున్నది” అన్నది అమ్మ. అన్నీ నీవే అనిపిస్తే యీ పనులన్నీ ఎట్లా చేస్తా అన్నాడు పాపయ్య. “నేను అన్ని రూపాల్లో అన్నింటిని వాడుకుంటున్నా ననుకుంటా” అన్నది అమ్మ. ఒక్క పోతరాజు తండ్రిని కొల్చుకోవటమే తప్ప యితరమేమీ తెలియదమ్మా? అన్నాడు పాపయ్య. “వాడొక్కడ్నే తెలుసుకోవటం కంటే కావల్సిందేముంది?” అన్నది అమ్మ.

కార్తీక స్నానాలకు జనం వస్తున్నారు చెరువు వద్దకు. చెరువులో నీళ్ళు నీ వద్దకు వస్తున్నవేమిటమ్మా? అని పాపయ్య అంటే ఆ జంతువుల లాగానే చెరువు కూడా పలకరిస్తూ నవ్వుతున్నది అన్నది అమ్మ. చెరువు కూడా నిన్ను అమ్మ అనే అనుకుంటుందా? అన్నాడు. ఆ అనుకుంటున్నది అన్నది అమ్మ. చెరువులో దిగుతారు స్నానానికి; చాలామంది జనం కార్తీక స్నానం చేసి నారింజ కాయడిప్పల్లో, కొబ్బరి చిప్పలలో, అరిటాకు డిప్పలలో జ్యోతులు తెలిగించి. నీళ్ళల్లో వదిలారు. దీపాలన్నీ బారులు తీరి వస్తూ లైనులో ఉన్న వల్లా గుండ్రంగా ‘అఆ’ అని అక్షరాలు వ్రాసినట్టు వచ్చి అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసినై. నా పోతరాజే ఈ అమ్మ అని పాపయ్య ఆశ్చర్యపోయి యేనాటికైనా ఈ ఊరంతా నీకు కొబ్బరికాయలు కొడుతారా తల్లీ! అన్నాడు పాపయ్య. ముందు తలకాయ పగలగొట్టి పంపుతారు తరువాత కొబ్బరికాయ మాట అన్నది అమ్మ. చెర్లో మునిగి అమ్మ రకరకాల భంగిమలలో చాలా సేపు ఈత కొడుతుంది. నీళ్ళల్లో పదిహేను నిమిషాలు మునిగి ఉండి బయటకు వచ్చింది. పామన్నా తలబైటకు పెట్టుతుంది. అమ్మ తలకూడా బయటకు పెట్టటం లేదే అని ఆశ్చర్యపోయాడు పాపయ్య.

అమ్మా! ఇందాక పువ్వులు, ఆకులు, తీగల్లో నిన్ను చూసినప్పుడు ఒకరకం, నీవు దగ్గరకు పోయినపుడు ఒకరకం, తాకినపుడు ఒకరకం ఇన్ని రకాలుగా కనిపిస్తున్నావేం? అని అమ్మను అడిగాడు పాపయ్య. నీవు ఇంత శ్రద్ధతో ఎట్లా కనిపెట్టావు? నీకెందుకొచ్చిందీ అనుమానం? అన్నది అమ్మ. జంతువులను నీ ఒడిలో చూచినపుడు ఇదేమిటో తెలుసుకుందామనిపించింది.

కాకి పుల్ల తెచ్చి ఇచ్చినపుడు, పక్షులన్నీ నీ చుట్టూ తిరిగినప్పుడు, పువ్వులు వాలటం ఎదురుగుండా కనపడ్డప్పుడు, దీపాలు ప్రదక్షిణం చేసేటప్పుడు శ్రద్ధతో కనిపెట్టాను. నీవు చెప్పింది నిజమవుతుంది తల్లీ! చెప్పు ఏమిటిదంతా? అన్నాడు పాపయ్య. “ఇంత బాగా మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నా” అన్నది అమ్మ. గంపెడంత కన్నులున్న దానివి, నీకు తెలియందేముంది అన్నాడు పాపయ్య. అప్పుడు అమ్మ ఎప్పుడో కనిపెంచాను వీటన్నింటిని, ఇప్పుడు కనిపించాను వాటికి, ఆ ఆనందం అదే అన్నది అమ్మ. అర్థం కాలేదమ్మా వివరించి చెప్పు అన్నాడు. అమ్మ “యేమీ లేదు, ఒక పిల్లవాడ్ని కన్నాననుకో, అయిదారేళ్ళు పెంచాను. ఎవరికో పెంపుడిచ్చాను. పాతిక సంవత్సరాల తర్వాత వెళ్ళి నేనే మీ అమ్మను అంటే ఎట్లా ఉంటుంది. అదే వాటిదీ” అన్నది అమ్మ.

ఇలా పాపయ్యకు తానే తను కొలిచే దేవత పోతరాజుగా తననే గాదు సృష్టిలోని చరాచర జీవకోటికి తల్లిగా అవగాహన కలిగించి మహాపండితులు మనుకొన్న వారికి కూడా దొరకని అదృష్టం ఒక రైతుబిడ్డకు ప్రసాదించి ధన్యజీవిని చేసి సుగతిని ప్రసాదించింది ఆదెమ్మగా అమ్మ.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!