లక్ష్మణయతీంద్రులవారు 1970 దశకం చివరలో అమ్మ వద్దకు వచ్చారు. వారు మధురమైన కంఠంతో వారి ‘క్వణత్కింకిణి’లోని పూతపూతన పద్యాలు చదువుతుంటే అమ్మ ఎంతో ఆనందించేది. అమ్మ ప్రేమ వాత్సల్యాలకు ముగ్ధులై పోయారు. వారి కన్న తల్లి వారికి మూడవ సంవత్సరంలోనే వైకుంఠ నివాసం చేరటంతో అమ్మలోని మాతృత్వన్పర్శ వారి హృదయాన్ని పులకింపచేసింది. తండ్రి సీతారామయతీంద్రులవారు గురువు, దైవము, తల్లియై వీరిని పెంచి పెద్ద చేశారు. “భార్యను చనిపోయేముందు భగవంతుని చూడాలని కోరిక ఉందా?” అని సీతారామయతీంద్రులడిగితే – “భర్తను చూపిస్తూ మీరే దైవం ఇంకెవరిని దర్శించాలి” అన్న మహాపతివ్రత.
లక్ష్మణ యతీంద్రుల వంశానికి మూలపురుషులు పేరంరాజుగారు. కృష్ణాజిల్లా, దివి తాలూకా, మొవ్వమండలం, పెదముత్తేవి గ్రామంలో “లక్ష్మీపతి స్వామి” వారి ఆలయ ప్రతిష్ఠ చేసి, ఆ ఆలయానికి 60 ఎకరాల భూమిని నిత్యధూపదీప నైవేద్యాలు జరగటానికి ఆనాటి కోసూరు నవాబు, స్వామి శక్తిని పేరం రాజుగారి ద్వారా తెలుసుకొని, వారికి ఇచ్చిన పొలం అంతా స్వామి కైంకర్యానికే సమర్పించారు.
పేరంరాజుగారు నియోగి బ్రాహ్మణులు. అయితే పేరం రాజుగారు శ్రీమత్తిరుమల రామచంద్రాచార్యుల వద్ద వైష్ణవదీక్షను తీసుకొన్నారు. అప్పటి నుండి వైష్ణవులుగా పరిగణింపబడ్డారు. ఆ పేరంరాజుగారి 9వ తరం వారు లక్ష్మణయతీంద్రుల తండ్రి గారైన సీతారామయతీంద్రుల వారు. వారు సంస్కృతాంధ్ర హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించటమే గాక, శారీరకంగా దండాలు, బస్కీలు చేస్తూ కుస్తీలుపడుతూ, ఇనుప పలుగులు గడ్డపారలు వంచటం ఇనుప గొలుసులు త్రెంచటం చేసేవారు. శీర్షాసనం మున్నగు ఆసనాలు వేసి యోగవిద్యలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. యుక్త వయస్సు (16 ఏళ్ళు) రాగానే అప్పమ్మ అనే కన్యతో వివాహం జరిపించారు. వారికి ప్రథమ పుత్రుడు రామాచార్యులు.
సీతారామయతీంద్రుల రెండవ కుమారుడే లక్ష్మణయతీంద్రులవారు. 1930 జూలై 5వ తేదీ జన్మించారు. లక్ష్మణదాసు అని పేరు పెట్టారు. తండ్రిగారి శిక్షణలో అమరకోశము, భాగవతము చదువుకున్నారు. సీతారామ యతీంద్రులవారు లక్ష్మణయతీంద్రుల 9వ యేటనే యతులైనారు. అయినా వారి అడుగుజాడలలో విద్యాభ్యాసం చేశారు. తండ్రి వద్దను పినతండ్రి కృష్ణదాసుతో కలసి నామసంకీర్తన, ఛందస్సు నేర్చుకొని పద్యాలు వ్రాయటం అలవాటు చేసుకొన్నారు. కొన్ని వందల వేల పద్యాలు కంఠస్థం చేసి శ్రావ్యంగా చదివేవారు. తండ్రిగారితో కలిసి నామసంకీర్తన, ఏకాహాలు, సప్తాహాలలో పాల్గొంటుండేవారు. కమ్మని కంఠంతో సంకీర్తన చేసేవారు. ఆ సంకీర్తన పారవశ్యంలో మైమరచి పోతుండేవారు.
లక్ష్మణయతీంద్రులవారు కొవ్వూరులోని ఆంధ్రగీర్వాణ విద్యాపీఠంలో విద్యాభ్యాసం చేశారు. చదివిన ఆ కళాశాలలోనే కొంతకాలం అధ్యాపకులుగా పనిచేశారు. 17 ఏళ్ళు నిండగానే 1947 ఏప్రిల్లో గొట్టిముక్కల కృష్ణమాచార్యుల వారి మూడవ కుమార్తె శ్రీదేవితో వివాహం జరిగింది. వారి కుమారులే ఇప్పటి ముముక్షు జనపీఠాధిపతి ‘సీతారాం గారు.
లక్ష్మణయతీంద్రులవారు అప్పుడప్పుడు పద్యాలు వ్రాస్తున్నా ‘క్వణత్ కింకిణి’ అన్న పేరుతో గ్రంథం (1967)లో బయటకు వచ్చిం తర్వాత సాహిత్య లోకంలో కవిగా ప్రసిద్ధి వచ్చింది. 1969లో ‘నీలివెన్నెలలు’ అనే పేరుతో వ్రాసిన గేయాలు ప్రచురిత మయ్యాయి. 1970లో ‘తిరుప్పావై’ గోదాదేవి పాడిన పాశురాలను ద్విపదలో రసరమణీయంగా ‘రసధుని’ అన్నపేరుతో తెలుగు చేశారు. యతీంద్రుల రచనా శిల్పం మీద విశ్వనాధవారి ప్రభావమున్న దంటారు. వీరి రచనలకు తండ్రి సీతారామయతీంద్రుల ఆశీస్సులు, శ్రీభాష్యం అప్పలాచార్యుల మంగళాశాసనాలు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ప్రశంసలు అందుకున్నారు. ముళ్ళపూడి వెంకటరమణ ముక్తహారాలు లభించటమే గాక రసహృదయుడు, గీతాకారుడు బాపుచిత్రాలు వీరి గ్రంథాలకు వన్నె చేకూర్చాయి. ఆనంద తన్మయత్వంతో పాపతల్లితో కలసి సంకీర్తన నృత్యం చేస్తుంటే ఆనంద రసజలధిలో ఓలలాడుతున్నట్లే ఉంటుంది.
1972లో సీతారామ యతీంద్రులు వైకుంఠప్రాప్తి పొందిన దగ్గర నుండి ముముక్షుజనపీఠాధిపతులుగా ఎన్నో మహత్కార్యాలు నిర్వహించారు. అంతకుముందు నుండే ముముక్షు జనపత్రిక సంపాదకులుగా ఉన్నారు. 1991లో 108 రోజులపాటు వారు నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు, అఖండహరేరామ నామపారాయణ, అఖండ ఉపదేశ రామకథా యజ్ఞం జరిగింది. న భూతో న భవిష్యతి అన్నట్లుగా, దేశంలోని అన్ని రాష్ట్రాలవారు అన్ని ప్రాంతాలవారు వేల సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. పూర్ణాహుతి నాడు లక్షమందికి ఏకకాలంలో సమారాధన జరిగింది.
ఒకసారి హైమవతీదేవి జయంతికి జిల్లెళ్ళమూడికి వచ్చారు లక్ష్మణ యతీంద్రులవారు. అమ్మకు, హైమకు అభేదతత్త్వం చెపుతూ “ఆ వేదవేద్యుడే రాముడు. రాముడే లలిత. ఆ లలితయే మన అమ్మ. అమ్మ మరో రూపమే హైమ. అమ్మ లేకపోవడం ఉండదు. అలాగే హైమకూ లేకపోవడం లేదు. మాతృస్వరూపంగా, పితృస్వరూపంగా ఒకే తత్వం సగుణంగా, సాకారంగా దిగి ఈనాడు మన మధ్య ఇక్కడ ఉన్నది లలితామూర్తిగా. ఈ లలితామూర్తి తనలో నుండి మరొక లలితామూర్తిని మనకందించింది. ఈ రెంటికీ ఏ విధమైన భేదం. లేదు” అని వారు పలికిన పలుకులను అమ్మ అంతకు ముందే ధృవపరచింది, హైమ నేను బింబ ప్రతిబింబాలం అని.
నాన్నగారు అమ్మలో కలిసి పోయిన సందర్భంగా 1981లో లక్ష్మణ యతీంద్రుల వారు అమ్మ వద్దకు వచ్చారు. అమ్మ నాన్న గార్ల అర్ధనారీశ్వరతత్వాన్ని వివరిస్తూ “ఒకరు వేషం వేసి సగం పార్వతీదేవిగా, సగం పరమేశ్వరునిగా అలంకరించుకొని మధ్యలో తెరకట్టి ఆప్రక్కకు లాగుతూ అర్ధనారీశ్వర వేషంతో కనిపించేవారు. అలాగే మొన్నటి దాకా నాన్నగారుగా, అమ్మగా దర్శన మిచ్చిన వారిద్దరూ వేషం వేసినవాడు రెండు ఆకారాలు ధరించినా ఒకటే అయినట్లుగా, నాన్నగారిని తనలో కలుపుకున్న అమ్మ పూర్ణేశ్వరి. అసలు రెండయినది కనుక అమ్మ నాన్నలుగా అమ్మ కనిపించింది. అసలు రెండు రెండు గాక ఒకటి రెండుగా కనపడ్డప్పుడూ రెండు ఒకటిగా దర్శించటమే మన ధర్మం, బాధ్యత, ఏది మన అనుభవంలోకి వచ్చిందో అది పూర్ణతత్వం కాదు. పూర్ణతత్త్వాన్ని ఇంకా గుర్తించవలసే ఉన్నది. అమ్మ నాన్నగారూ వేరు కాదు. వారు వేరైతే మనమూ వేరే అవుతాం. అలాకాక వారు ఒకటైతే ఆ తత్త్వమౌతుంది. రెండుగా దిగివచ్చిన తత్త్వం ఒకటయి ఉన్నదిపుడు. నాన్నగారు పరమపదించారు అనటం తప్పు, ఒకప్పుడు ప్రాకృతపదంలో ఉన్నారా? ఎప్పుడూ పరమపదమే ఒక ప్రమిదలో వత్తులు రెండుంటాయి. జంటగా ఉంటాయి. రెండు జ్వాలలు కనిపిస్తాయి. ఒక దానితో ఒకటి కలపారనుకోండి ఒకటే జ్వాలగా ఉంటుంది. అయ్యయ్యో ఒక జ్వాల పోయిందండీ ! అంటామా? ఒకటిగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రేమ అనురాగాలలో మార్పుండదు” అన్నారు.
ఒకసారి అమ్మ వద్ద వారు ప్రసంగిస్తున్నారు. అమ్మవారి మెడలో పెద్ద గజమాల వేసింది. అమ్మ వేసింది కదా! తీయకుండా అలాగే ఉపన్యసిస్తున్నారు. ఎండాకాలం. చెమటలు పోస్తున్నాయి. గమనించిన అమ్మ ప్రక్కనే కూర్చొని ప్రసంగిస్తున్న ఆ యతీంద్రులవారి మెడలో నుండి ఆ దండను తాను స్వయంగా తీసిపక్కన పెట్టింది. అమ్మ కరుణకు తబ్బిబ్బైన యతీంద్రుల వారు ఇదీ మాతృప్రేమ అంటే. బిడ్డ ఎక్కడ కష్టపడతాడో అని నిరంతరం పహరాకాస్తూ రక్షిస్తుంటుంది అంటూ అమ్మ ప్రేమకూ, వాత్సల్యానికి మోకరిల్లారు.
మరొకసారి అందరినీ ఆశీర్వదించే శక్తి అమ్మకు మాత్రమే ఉన్నది. అయితే నాకూ అమ్మకూ ఒక పోలిక ఉన్నది. అమ్మ అందరికీ అమ్మ తనకంటే వయసులో పెద్దవారికీ, తనకంటే చిన్నవాళ్ళకూ. తానుమాత్రం కొడుకట. కనుకనే అందరినీ ఆశీర్వదించే హక్కు అమ్మది, అందరినుండీ ఆశీర్వాదం పొందే హక్కు తనది అంటూ చమత్కరించారు. రామునకు, అమ్మకూ భేదం లేదు. ఎవరైనా ఉన్నదని అంటే వారికి రాముడన్నా – అమ్మన్నా తెలియదని మనం అనుకోవాలి అన్నారు.
లక్ష్మణ యతీంద్రులవారు పూర్వం వ్రాసిన గ్రంథాలేకాక ‘శ్రీచైతన్యప్రభ’ (గౌరాంగ ప్రభువు జీవితచరిత్ర) నాలుగు భాగాలుగా వ్రాశారు. హనుమాన్. చాలీసాకు అనువాదంగా ‘హనుమద్విభూతి’ రచించారు. తండ్రి ప్రారంభించిన ఆధ్యాత్మిక ఉద్యమాన్ని అంకితభావంతో జనహృదయాలలోకి తీసుకొని వెళ్ళారు. సంకీర్తనా, నృత్యమా, ప్రబోధమా, ప్రసంగమా ఏదైనా సరే ప్రేమతో ఆత్మీయతతో భక్తుల హృదయకుహరాన్ని స్పర్శించారు. నిరంతర భగవత్ చింతనా ప్రయాణం చేస్తూ 13.12.1992న వైకుంఠ ప్రయాణం సాగించారు. అమ్మ అనురాగాన్ని వాత్సల్యాన్నీ పొందిన అమృతహృదయులు లక్ష్మణయతీంద్రులవారు.