“అమ్మ” తొలినాటి భక్తులలో వఝ శివరామయ్యగారు ఒకరు.
భారద్వాజ గోత్రోద్భవులు, కవి, పండితులు, కొప్పరపు కవులకు, తిరుపతి వేంకటేశ్వర కవులకు సమకాలీనులు అయిన వఝ సూర్యనారాయణగార్కి . వారి ధర్మపత్ని శ్రీమతి హనుమాయమ్మ, గార్కి ప్రథమ సంతానంగా 1914వ సంవత్సరంలో వఝ శివరామయ్యగారు. జన్మించారు. శ్రీ సూర్యనారాయణగారు. శ్రీమదాంధ్ర మహాభారత గద్య పద్య సంశయవిచ్ఛేదము, తిరువతి వేంకటకవుల గ్రంథ విమర్శనము, క్షేత్ర గణితము, నన్నయ శాఖా నిర్ణయము మొదలగునవి వ్రాసిన గ్రంథకర్త. అభినవ తిక్కయజ్వ కవిశేఖర, సహజ పాండిత్య బిరుదాంకితులు.
శివరామయ్యగారు వారి సహధర్మచారిణి. శ్రీమతి బాలాత్రిపుర సుందరమ్మగారితో జిల్లెళ్ళమూడికి సుమారు 13 కి.మీ. దూరంలో నున్న బాపట్ల గ్రామంలో స్థిరపడ్డారు. సుమారు 1958 సం॥ ప్రాంతం నుండి “అమ్మ” ను తరచూ దర్శిస్తూ ఉండేవారు. నాన్నగారు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారితో కూడా సన్నిహితంగా ఎంతో ప్రేమగా ఉండేవారు. వారు “అమ్మ” దర్శనానికి వచ్చిన ప్రతిసారీ “అమ్మ” సేవలో పాలుపంచుకొనేవారు. ఆ సేవ “అమ్మ” స్నానానికి చెరువు నుంచి నీరు తేవటం కావచ్చు, అన్నపూర్ణాలయంలో వడ్డనకావచ్చు. “అమ్మ” పాదాల నొప్పులు తగ్గటానికి ఆ పాదాలను వత్తి సేవించటం కావచ్చు మరేదైనా కావచ్చు. ఎక్కువగా వడ్డనలో పాలు పంచుకొనేవారు. అభినవ నలుని వలే ఎంతోకాలం అన్నపూర్ణాలయంలో వంట చేసిన శేషయ్యగారు జిల్లెళ్ళమూడి రావటానికి వెనుక శ్రీ శివరామయ్యగారి కృషి ఎంతో ఉన్నది.
“అమ్మ”ను చూడగానే శివరామయ్యగారి కనులు ఆర్తితో, ఆనందంతో అశృపూరితాలయ్యేవి. వీరి తండ్రి సూర్యనారాయణగారి కవిత్వ అంశ కొంత వీరిలో ఉన్నదేమో. “అమ్మ” దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు “అమ్మ” సంబంధంగా ఏదో చిన్న పద్యం చెప్పుతూ ఉండేవారు. 1962 మొట్టమొదటి మాతృశ్రీ జన్మదినోత్సవ ప్రత్యేక సంచికలో తన అనుభవం వ్రాస్తూ
“మాతృదేవత కణువంత మమతకలిగి
తలచినంతనె తనతల్లి పిలిచెననుచు
భక్తినిల్చితి నీముందు ముక్తికోరి
ఎట్లుకాపాడుచుందువో ఏనెఱుంగ”
అని అమ్మ పాదాలకు సమర్పించారు. తమదొడ్లో కాసిన నిమ్మకాయలను భక్తితో “అమ్మ”కు సమర్పిస్తూ ఉండేవారు. వీరి పెద్దకుమారుడు వఝ సీతారామాంజనేయవరప్రసాదును కూడా సం॥ 1959-60లలో “అమ్మ” దర్శనానికి తీసుకొనివచ్చారు. అపుడు “అమ్మ” ఒక గ్లాసులో కాఫీ తెప్పించి తాను కొంచెం తాగి మిగతాది శివరామయ్యగారికి యిచ్చింది. వారు దానిని మహాప్రసాదంగా స్వీకరించి ఆస్వాదించారు. అట్లా “అమ్మ” దగ్గరకు వచ్చిన ప్రతిసారీ వారికి అమ్మ ప్రసాదం లభించేది.
“అమ్మ” తాను వివాహం చేసుకున్న శ్రీమతి వసుంధర తండ్రిగారు శ్రీ కోన సుబ్బారావుగారితో, “అమ్మ” ఛాయా చిత్రాలను తీసే శ్రీ పొట్లూరి సుబ్బారావుగారితో, అమ్మకు వైద్య సేవలందించిన డాక్టర్ సీతాచలంగారితో, హైమాలయంలో అర్చనలు నిర్వహించిన శ్రీ భద్రాద్రి రామశాస్త్రిగారితో గాన కళానిధి “అమ్మ” పై అచంచల భక్తి కల్గిన శ్రీ రాధాకృష్ణ రెడ్డిగారితో “అమ్మ” సేవయే పరమావధిగా ఎంచిన శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణగారితో “అమ్మ” మహత్యం గురించి ప్రేమను గురించి శ్రీ శివరామయ్యగారు జిల్లెళ్ళమూడి వచ్చినప్పుడు తరచూ ముచ్చటిస్తూ ఉండేవారు.
“అమ్మ” తన దగ్గరకు వచ్చిన బిడ్డల కుటుంబ సంక్షేమం కూడా చూసేవారు. అటువంటి వారితో ఆర్థికంగా ఎంతో ఉచ్ఛస్థితిలో ఉండి తరువాత వ్యాపారంలో నష్టపోయి ఇబ్బందులు పడిన పోతుకూచి విద్యాసాగర్ గారు ఒకరు. వారి కుటుంబాన్ని దగ్గరకు తీసి వారి అప్పులను తీర్చి “అమ్మ” వారిని ఒక ఒడ్డునకు చేర్చి తన దగ్గరే ఉంచుకొన్నది. దీనికి సాధనంగా శ్రీ శివరామయ్యగారిని “అమ్మ” ఉపయోగించుకొని వారిని ధన్యులను చేసింది.
విశ్వావసు ఉగాదికి అమ్మను ప్రార్థిస్తూ సర్వులకూ, శుభము, కళ్యాణము, వైభవము, ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఇస్తుందని విశ్వసిస్తూ
శశ్వచ్చుభ కళ్యాణము
విశ్వోన్నత వైభవంబు విమల యశంబున్
విశ్వావసు వర్షంబున
యీశ్వరి అనసూయ మాత యిడు మనకెపుడున్
అన్నారు. వారు కోరుకున్నట్లు లోకానికి వారికీ కూడా కళ్యాణాన్ని ప్రసాదించింది. అమ్మ.
శ్రీ శివరామయ్యగారి పెద్ద కుమారుడు సీతారామాంజనేయ వరప్రసాద్ అప్పట్లో వివాహానికి విముఖంగా ఆధ్యాత్మిక సాధనకు సుముఖంగా ఉండేవారు. అతను సన్యాసం తీసుకుంటాడేమోనని శివరామయ్యగారి మనసులో ఆవేదన. వారి ఆవేదన తీర్చటానికి “అమ్మ” ఆ పిల్ల వాని మనసు మార్చిందో లేక తరుణమే వచ్చిందో అతను వివాహం చేసుకోవటానికి సుముఖుడైనాడు. పెండ్లి “అమ్మ” పినతల్లి సౌభాగ్యమ్మగారి మనుమరాలు అంటే వారి పెద్దకుమారుని కుమార్తె అయిన అరుణశ్రీతో నిశ్చయమయింది. ఆ పెండ్లి కూడా “అమ్మ” చేతుల మీదుగా “అమ్మ” సాన్నిధ్యంలో 1967 ఫిబ్రవరిలో జరిగింది. ఆ పెండ్లి సమయంలోనే “అమ్మ” సన్నిధిలో సేవ చేసుకుంటున్న పోతుకూచి రవి మరణశయ్యపై ఉన్నాడని డా॥ జ్యోత్స్న పెండ్లి జరిగేవేదిక పైకి వచ్చి “అమ్మ” చెవిలో చెప్పింది. పెండ్లికి ఆటంకం అవుతుందని అందరూ భావించారు. “అమ్మ” వెళ్ళి రవిని చూచి అతనిని మరణాన్ని వాయిదా వేసింది. పెండ్లి నిర్విఘ్నంగా జరిగింది. పెండ్లి కుమారునికి, పెండ్లి కుమార్తెకు వచ్చిన చదివింపులు మరునాడు రవికి “అమ్మ” యిప్పించింది. ఆ తరువాత రవి మరణిస్తే దహన కార్యక్రమాలు జరిపించి, స్నానం చేసి వచ్చి పెండ్లి వారి బువ్వపు బంతి కార్యక్రమానికి హాజరై అద్భుతంగా జరిపించింది. “అమ్మ” మహాత్యం కార్యనిర్వహణాచాతుర్యం తెలియని కొందరు పెండ్లి వారి బంధువులు కుగ్రామమైన జిల్లెళ్ళమూడిలోని పెండ్లి అంటే అంతంత మాత్రమే. మర్యాదలు సక్రమంగా జరుగవు అనుకున్నారు. వారు ఆశ్చర్య చకితులయ్యేటట్లు ప్రతి అంశము వైభవంగా “అమ్మ” జరిపించింది. ఆ విధంగా తన ప్రేమ కరుణామృతాలను వర్షించి శివరామయ్యగారి ఆవేదనను తీర్చి వారిని ధన్యులను చేసింది.
అంతేకాదు శివరామయ్యగారి మనుమలు, మనుమరాళ్ళ నామకరణం మొదలుకొని ఎన్నో శుభకార్యములు అమ్మచేతులమీదుగా జరిగినవి.
శివరామయ్యగారి పెద్ద కుమారుడు వఝ ప్రసాద్, అతని భార్య అరుణ, వారి పిల్లలు శ్రీరాంరహి, హేమకుమార్, శివకుమారి, హైమ, అల్లుళ్ళు, గిరిధర్, పార్థసారధి, కోడళ్ళు సునీత, శైలజ వారి పిల్లలు పదిమంది, మనసావాచా కర్మణా అమ్మసేవకు అంకితమయినవారే. శివరామయ్యగారి రెండవ కుమారుడు మల్లికార్జున ప్రసాద్ (మల్లు) అతని భార్య పిల్లలు అందరూ “అమ్మ” పై అనన్య భక్తి కలవారే. మల్లికార్జున ప్రసాద్ (మల్లు) తన పదవీ విరమణానంతరం జిల్లెళ్ళమూడిలో సేవ జేశారు. ఈతని పెండ్లి కూడా అమ్మ చేతుల మీదుగానే జరిగింది.
అమ్మ పట్ల శివరామయ్యగారికి ఎంత విశ్వాసమంటే అమ్మను వారు ఎప్పుడు ఎక్కడ నుండి పిలచినా తలచినా అక్కడ దర్శనమిచ్చింది ఎంత విశిష్టుడో. ప్రహ్లాదుని నోట పోతన పలికించినట్లుగా
“ఇందు కలవందులేవను
సందియమే లేదు తల్లి సర్వమునీవై
ఎందెందు తలచి పిలచిన
అందందే కాన నగుదు నమ్మరొ ! నాకున్” అన్నారు.
అమ్మ కాల స్వరూపిణి. కాశీస్వరూపిణి. వారు కోరినట్లు శ్రీ శివరామయ్యగారు 1972 సంవత్సరంలో మహర్నవమినాడు అమ్మలో ఐక్యమయినారు.
“అమ్మకు తాను మాత్రమే అంకితమగుట కాక తన తరువాతి తరాలను సైతం “అమ్మ” సేవా తత్పరులుగా తీర్చిన వఝ శివరామయ్యగారు నిజంగా ధన్యజీవి.