1960 కి పూర్వం అమ్మను దర్శింపవచ్చిన వారిలో వల్లూరు రామ మోహనరావు ఒకరు. చీరాలలో టీచర్ గా పనిచేస్తుండేవాడు. అమ్మను ఏ సుముహూర్తాన చూచాడోగాని, చూచిన నాటి నుండి అమ్మను వదిలిపెట్టి ఉండలేకపోయేవాడు. సూదంటురాయికి ఇనుపముక్కలా అతుక్కుపోయాడు. ఆ సూదంటురాయి పరుసువేది అని తనకు తెలియదు. అతడు బంగారం అయిపోయాడు. విచిత్రమేమిటంటే తాను బంగారమయినానని బంగారానికి తెలియదు. ఆ విషయం ఇతరులకు మాత్రమే తెలుస్తుంది.
చీరాల నుండి రోజూ అమ్మదగ్గరకు వచ్చేవాడు. సాయంత్రం బడి అయిపోగానే పిల్లలకు ప్రైవేట్లు చెప్పి సైకిల్పై బయలుదేరి జిల్లెళ్ళమూడి వెళ్లేవాడు. రాత్రి ఎక్కువభాగం అమ్మసేవలోనే గడిపేవాడు. మళ్ళీ ప్రొద్దున్నే బయలుదేరి చీరాల వెళ్ళేవాడు.
ఆ రోజుల్లో ఇప్పటిలాగా భవనాలు, కరెంటు సౌకర్యాలులేవు. కృష్ణవేణమ్మగారికి అమ్మకు కలిపి ఒక పూరిపాకలో రెండు భాగాలు ఉండేవి. ఒక రోజు అమ్మ స్నానం చేస్తున్నది. ఆ సమయంలో కూరలు తరగటానికో, దేనికో కత్తిపీట కావలిసి వచ్చింది. మోహనరావు బయటనుండి అడిగాడు. లోపల ఉన్నవారు చూరులో నుండి బయటకు ఇచ్చారు. ఎలా ఇచ్చారో ! ఆ కత్తిపీట మోహనరావు తలపై పడి ఒక అంగుళం లోతు గాటుపడి అలాగే తలలో దిగిపోయింది. మానవుడు ఎంత బాధ పడ్డాడో! రక్తం కారుతున్నా ఏడవటం లేదు. డాక్టర్ సాంబయ్య వచ్చి మందు వేసి కట్టు కట్టాడు. విచిత్రం; సెప్టిక్ కాకుండా నయమై పోయింది. ఎందుకంటే అమ్మ ‘వాడికేం కాదు’ అని అభయం ఇచ్చింది. అంతేకాదు. అంతకు క్రితం కొంతకాలంగా అతడు వేపాకు తింటుండేవాడు. బహుశా అది కూడా ‘యాంటి సెప్టిక్గా పనిచేసి ఉండవచ్చు.
వివాహం అయిన తర్వాత “బాల”క్కయ్యను కూడా అమ్మ సేవలో వుంచాడు. తాను రోజూ చీరాల పోయి వస్తుండేవాడు. కొన్ని సంవత్సరాలు అలా చేశాడు. పెళ్ళయినా పిల్లలు కలగలేదు. అతడు వేపాకు తినటం వలన పిల్లలు కలగలేదు అనుకున్నారు అందరూ. ఒక రోజు అమ్మ బాలక్కయ్య చేత పొట్టరుద్దిచ్చుకుంటూ “ఈ బాధ నీ కెప్పటికి వస్తుందో”? అన్నది. నాకెందుకు వస్తుందమ్మా? నాకు పిల్లలు కలుగరు కదా! నీవంటే బాలింతవు నిత్య చూలింతవు’ అన్నది బాలక్కయ్య. అప్పుడు అమ్మ, “నీకు ఒక రోజు ఈ బాధ తప్పదు”అన్నది. విచిత్రం. పిల్లలు కలుగరనుకున్న ఆ దంపతులకు వివాహం అయిన పాతిక సంవత్సరాలకు వంశోద్ధారకుడు కలిగాడు. అమ్మది తోలు నోరు కాదు కదా తాలుమాట రావటానికి.
చీరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసే రోజులలోనే రైల్వే సర్వీస్ కమిషన్ వారు ఉద్యోగాలకు ప్రకటన ఇస్తే దానికి దరఖాస్తు చేసి పరీక్షలు వ్రాశాడు. నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా దాని అతీగతీలేదు. తాను పరీక్ష వ్రాసిన విషయం కూడా మరిచిపోయిన మూడు సంవత్సరాలకు ఇంటికి వెతుక్కుంటూ రైల్వే ఉద్యోగంలో ప్రవేశించమని అపాయింటుమెంట్ ఆర్డర్ వచ్చింది. అమ్మను వదలి దూరంగా వెళ్ళే ఉద్యోగం నాకు వద్దు అన్నాడు. మోహనరావు. అమ్మ కాదు, కూడదు; మంచి ఉద్యోగం; వెళ్ళి తీరాల్సిందేనని బలవంతం చేసి పంపింది. మద్రాసులో ఉద్యోగరీత్యా ఉన్నాడు. బాలక్కయ్య ‘నేను వెళ్ళను’ అన్నది. అమ్మ, “నేను నీ వెన్నంటే వుంటాను. నీ వెక్కడ వుంటే అక్కడ వుంటాను” అని చెప్పి పంపింది. మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత వారికి ఒక రోజు పూజలో అమ్మ ఎనిమిదేళ్ళ కన్యగా సర్వాభరణ భూషితయై దర్శనమిచ్చింది. పూజామందిరంలో గజ్జల శబ్దం వినిపిస్తుండేది.
బాలక్కయ్య అన్నం చాల తక్కువ తినేది. అమ్మ పెట్టితే మాత్రం ఎంత తిండి తిన్నా ఆకలివేస్తునే వుండేది. అమ్మ పాకలో ఉన్న రోజులలో అమ్మ నాగేంద్రుని రూపంలో కనిపించింది. అవి బాల బహిష్టు అయిన రోజులు. ఆ తర్వాత అమ్మ వద్దకు వెళ్ళితే,” ఈ మూడు రోజులలో నీకేమన్నా కనిపించిందా? అని అమ్మ అడిగితే ‘ఏం లేదమ్మా’ అన్నది బాల. “ఏమీ కనపడలేదా ఈ మూడు రోజులలో” అని అమ్మ మళ్ళీ అడిగి ‘కనపడినా గుర్తించలేరు” అని అమ్మ అంటూ ఉండగా, ఆ నాగేంద్రుని రూపం అమ్మ ముఖంలో కనిపించింది. తనను గుర్తించాలన్నా తన అనుగ్రహం కావాల్సిందే.
బాలక్కయ్య రాత్రిళ్ళు అమ్మ ప్రక్కనే పడుకుండేది. ఎక్కడో కొండలలో, కోనలలో ఋషులకు తపస్వులకు అన్నం పంపుతున్నాననేది అమ్మ. ఆయా సమయాలలో అమ్మకు వచ్చే ముద్రలు చూచింది బాల, ఓంకారనది (డ్రైయిన్)లోకి అందరినీ వెంట తీసుకొని వెళ్ళి, అమ్మ తానొక్కతే దూరంగా వెళ్ళి నీటిని అటూ ఇటూ విసిరివేసేది. “మీకేమి కనపడింది? అని బాల వాళ్ళని అడిగితే ‘పాముల్ని అటూ ఇటూ విసిరివేశావు కదమ్మా! అంటే “ఓసి! మీకు కూడా కనబడిందే” అనేది అమ్మ. అమ్మ ఆడిన ఎన్నో ఆటలలో భాగస్వామిగా కాలం గడిపింది బాలక్కయ్య.
రామమోహనరావు, బాల దంపతులకు లేక లేక కలిగిన కొడుకు ‘హైమాకర్’. 2000 సంవత్సరంలో హైమాకర్ వివాహం జరిగింది. పెళ్ళి అయిన తర్వాత కొత్త జంట జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మకు నమస్కరించుకొన్నారు. వారి కోడలు పెళ్ళి అయిన తర్వాతనే అమ్మను గురించి వినటం జరిగింది. అయితే ఆ కొత్త కోడలుకి కూడా అమ్మ విచిత్రమైన అనుభవాన్ని ప్రసాదించింది.
రామమోహనరావును అనారోగ్య కారణంగా హాస్పటల్లో చేర్చారు. కోడలు ఇంట్లో వున్నది. ఎఱ్ఱపట్టు చీర కట్టుకొని, బులాకీ పెట్టుకొని ఒక ముత్తైదువ వారి కోడలు వద్దకు వచ్చి, “నేను వచ్చిన పని అయింది. వెళ్తున్నాను” అన్నది. ‘అప్పుడే వెళ్తానంటారేమిటి? రండి. కూర్చోండి’ అని ఆమె చెయ్యి పట్టుకున్నది వారి కోడలు. “కాదు. నేను వెళ్ళాలి” అని చేయి విదిలించుకొని బయటికి వెళ్ళింది ఆ ముత్తైదువ. కోడలు ఇంటి బయటకు వచ్చి చూస్తే ఎవరూ కనిపించలేదు. ఇంటికి వచ్చిన బాలక్కయ్యకు ఈ సంఘటన చెప్పితే ‘ఇది అమ్మ పనే’ అని అన్నది. తమ కోడలికి కూడా దర్శనము, స్పర్శనము ప్రసాదించినందుకు బాలక్కయ్య, రామమోహనరావు మురిసిపోయారు.