అమ్మ ఒకసారి తెనాలి వెళ్ళిన రోజులలో అమ్మకు షుమారు 13 సంవత్సరాల వయస్సు. అప్పుడే అమ్మ పెళ్ళి విషయం ఆలోచనలు జరుగుతున్న రోజులు. ఆ రోజులలోనే అమ్మ మాతామహుడు (తాతయ్య) చంద్రమౌళి వెంకట సుబ్బయ్యగారు మతుకుమల్లి రఘూత్తమశాస్త్రిగారి అల్లుడు వారి తదనంతరం వారి గుడులు, సత్రాలు మేనేజ్మెంట్ చూస్తున్నారు తెనాలిలో. అక్కడ నిత్యము ఆలయంలో అభిషేకాలు, పూజలు, వేదపండితుల పారాయణలు, పురాణప్రవచనాలు, పండిత గోష్ఠులు, కవిసమ్మేళనాలు జరుగుతుండేవి. అమ్మ ఎక్కువగా ఆ కార్యక్రమాలలోనే కాలక్షేపం చేస్తూ ఉండేది.
అప్పుడు అక్కడ విన్నకోట వెంకటరత్నశర్మగారని మంచి విద్యాంసుడు ఉదయం భగవద్గీత, సాయంత్రం పురాణ ప్రవచనం చేస్తుండేవారు. అమ్మ ఎక్కువగా వారి దగ్గరే ఉండేది. ఆయన అమ్మను ప్రత్యేకంగా చూసేవారు. తన ఇష్టదైవంగా అమ్మ కనిపించేది వారికి. అమ్మ మాటతీరు, పొందిక, శ్రద్ధ, భక్తి అన్నీ కలసి వారిని ఆకర్షించేవి. ఒకసారి అమ్మ సత్రంలో బావి దగ్గర వారు స్నానం చేస్తుంటే, బావి ప్రక్కనే పెరిగిన చామాకు కోసుకొని పోవటానికి వచ్చింది. అక్కడ బురదలో అమ్మ కాలుపడ్డది. అది చూచిన శర్మగారు. అమ్మను పట్టుకొని బావిదగ్గరకు తీసుకొని వెళ్ళి నీరుతోడి అమ్మ పాదాల పై పోసి తనచేతులతో పాదాలు కడిగి శుభ్రం చేసి చామాకు ఆయన కోసి తెచ్చి అమ్మకిచ్చారు. అదృష్టవంతుడు – ఆ రోజులలోనే అమ్మ పాదాలు తనివారా ఆయన చేతులతో కడిగి గుడ్డతో తుడిచాడు గుహునిలాగా.
అమ్మలోని ఆకర్షణ వారిని కట్టిపడేసేవి. అమ్మ మూర్తీభవించిన ప్రేమమూర్తిగా అనిపించేది వారికి. అమ్మను గూర్చిన వివరాలు తెలుసుకుందాము అనుకొంటారు. అమ్మను చూచిన తర్వాత భగవత్తత్వం అర్థం చేసుకోవటం కష్టమనీ, పసిపిల్లలలో, వృద్ధులలో ఆ తత్త్వం ఎక్కడైనా ఉంటుందనీ, అనుభవంతో మాత్రమే ఆ తత్వం పట్ల విశ్వాసం కలుగుతుందనీ అనుకుంటారు. అమ్మను చూచినకొద్దీ ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా పొందని ఆనందం కలుగుతున్నది అనుకున్నారు.
ఒకసారి బందరులో (వారి ఊరు) అపర వివేకానందుడుగా లోకంలో గుర్తింపబడిన ప్రభాకర ఉమామహేశ్వర పండితులతో వాదం చేయాల్సి వచ్చింది. ఉమామహేశ్వర పండితులవారు కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదే ప్రధానం అన్నారు. వెంకటరత్న శర్మగారు భక్తి, ప్రేమ, జ్ఞానం ప్రధానం అని చెప్పారు. వాటి సమన్వయం చేసుకొంటుండేవారు. పండిట్ గారికి మతాలమీద, సిద్ధాంతాల మీద విమర్శ ఎక్కువ. శర్మగారు తగాదాల జోలికిపోయే వారు కాదు.
అమ్మ జాతకచక్రం చూద్దాం అనుకుంటారు శర్మగారు. అమ్మను గూర్చి మౌలాలీతో మాట్లాడిన శర్మగారు ఎన్నో విషయాలు తెలుసుకొని వేదాలు, ఉపనిషత్తులు, ఈ ప్రపంచం అంతా అమ్మ సృష్టించినట్లు అనిపిస్తున్నది. అనుకున్నారు. మౌలాలీ కారణజన్ముడు, మహమ్మదీయుడు కాడు అనిపించింది. అమ్మతో మహమ్మదీయుడంటే ఏంటమ్మా? అంటే అమ్మ గొప్ప మనస్సు కలవాడు అని అర్థమేమో! నాకలా అనిపించింది అన్నది. ఖురాను, బైబిల్ కూడా శర్మగారిని చదవమన్నది. బైబిల్లో ఏమున్నదమ్మా? అంటే “మమాత్మా సర్వభూతాత్మా” అనే చెబుతుంది అన్నది అమ్మ. గీత చెపుతున్నారు. కదా గీతాసారం ఏమిటి? అని అడిగింది శర్మగారిని. నాలుగువేదాల సారమే గీత. గీతాసారం చెప్పేదేముందమ్మా? అనుభవించటమే గాని అన్నారు శర్మగారు. ప్రతిదీ అంతే అంటుంది అమ్మ. గీతలో ప్రతిశ్లోకం జ్ఞానకణిక అంటారు అన్నారు శర్మగారు. అంటే ఏమిటి? అని అడిగింది అమ్మ. నువ్వేచెప్పమ్మా! అన్నారు శర్మగారు.
జ్ఞానకణిక అంటే కణికలోని పదార్థాన్ని గుర్తించిన వారు సృష్టికర్త. తనకు తెలియకుండానే ప్రేరణతో పదార్థాల మీదకు వెళ్ళి కణికలు చేసినవాడు జ్ఞాని. ఎవరో చెపితే విని తెలుసుకొని, నేర్చుకొని చేసేవాడు సాధకుడు. గుణము, శక్తి, తెలియక కణికను చాదుక త్రాగేవాడు భక్తుడు. విషమో, అమృతమో ఆలోచించకుండా నోట్లోవేసుకొనేవాడు త్యాగి అని అమ్మ వివరమిచ్చింది. సర్వసంగ పరిత్యామంటే, త్యాగము యొక్క చరమదశ, సంపూర్ణస్థితి అని అమ్మ చెప్పింది.
శర్మగారు అమ్మ చెప్పిన నిర్వచనాన్ని విని అప్రతిభుడై అమ్మా! కలియుగానికి కావలసిన అవతారమా? నీది అంటారు. అందరిదీ అవతారమే అంటుంది అమ్మ. మాది ప్రారబ్దంతో కూడిన జన్మ – నీది కారణజన్మ అంటారు. శర్మగారు. అమ్మా! నిన్ను గూర్చి చెప్పుకోటానికి అనుమతి ఇయ్యమ్మా! అని ఏదైనా సందేశమియ్యమ్మా! అంటారు. అప్పుడు అమ్మ ఏం చెపుతావు లోకానికి? నేను చీపురు – రోలు, రోకలి – పొయ్యి – కత్తిపీట నాలుగు వేదాలంటాను. వీటితోనే జీవితం గడుపుతాను అంటాను. ఇది చెపుతావా? లోకానికి అంటుంది. శర్మగారు చెపుతానమ్మా ! మరి మగవారి వేదాలేమిటమ్మా? అని అడిగారు. వాటి ఫలితాన్ని అనుభవించటమే అంటుంది అమ్మ. అవి వింటున్న మౌలాలి వెంటనే అమ్మ వేదమాత, వేదాలు ఆడవారిసొమ్ము అంటాడు. అమ్మ నిజంగానే వేదాలు ఆడవారు చదవకూడదంటారేం? అంటుంది.
అమ్మ పెళ్లి విషయం ప్రస్తావనకు వస్తే శర్మగారు నీవు కూడా పెళ్ళి చేసుకోవలసిందేనా? ఈ సంసారం అవసరమా? అమ్మా! అని శర్మగారడిగారు. అందుకు అమ్మ సంకల్పమే సంసారం. అన్ని ఆశ్రమాలకూ ఒకటే స్థితి. పెళ్ళిలో పెద్దపులి ఉన్నదనే వారి భయం పోగొట్టటానికే తన పెళ్ళి అన్నది. విన్నవాడు విమర్శిస్తాడు, కన్నవాడు వివరిస్తాడు. వినటం శాస్త్రం, కనటం అనుభవం. ఒక పెన్నిధి అండన చేరటం పెళ్ళి, ఆ అండన జరిగే పరిణామమే పరిణయం. కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా మరొకరికి అర్పణ చేయటమే కళ్యాణం. వివాదరహితమైనది వివాహం. రెండు భిన్న అభిప్రాయాలు ఒక చోట కలసి కాలం గడపటం వివాహం. పెళ్ళితోనే నిత్యానిత్య వస్తు వివేకాన్ని తెలుసుకోవటం, భర్త అంటే అన్నింటినీ భరించేవాడు. భార్య అంటే భర్త మనస్సు తెలుసుకొని ప్రవర్తించేది. మంగళసూత్రాల రూపంలో భార్య మెడలో భర్త రెండు పాదాలు ఎలా ఉంటాయో జందెం రూపంలో భార్య భర్త మెడలో శరీరాన్ని వదలక ఉంటుంది. భర్తను ఆధారం చేసుకొని పంచభూతాలను జయించటం పతివ్రత లక్షణం, భార్యకు భర్త ఎలా దైవమో, భర్తకు కూడా భార్య అలాగే దైవం. తాళికట్టటానికి మగవాడు నడుంవంచితే తలవంచి కట్టించు కుంటుంది భార్య. ఇద్దరూ ఒకరికొరకు వంగకతప్పదు. రెండుగా కనిపిస్తున్న వారు ఒకటిగా కావటమే ఇందులోని రహస్యం.
అమ్మ పెళ్ళికి వెంకటరత్నశర్మగారు పద్యాలు వ్రాసుకొని వస్తారు. చదవటానికి. చదవబోతే ఇప్పుడు కాదులేండి తర్వాత చూద్దాం అని ఆ పద్యాలు తీసుకుంటారు చిదంబరరావుగారు. శర్మగారు బయట మౌలాలీని, శ్యామలను చూచి పెళ్ళి పందిరిలోకి పిలుస్తానని అమ్మకు చెపుతారు. అమ్మ వద్దు లెండి వాళ్ళు బయట ఉన్నా నేను వారి దగ్గర ఉంటాను. వారితోనే ఉన్నా అంటుంది. గుర్తించే ‘గురుతు’ నీవేనన్నమాట అనుకుంటారు.
పెళ్ళిలో బంతులాటప్పుడు నాన్నగారి కోరికపై అమ్మ పాట పాడితే సంగీతం నేర్పించకపోయినా సంగీతజ్ఞానం ఉన్నది అంటారు. అక్కడ ఉన్న శర్మగారు అసలు జ్ఞానముంటే ఏ జ్ఞానమయినా ఉంటుంది అంటారు. నాన్నగారిది విన్నారు. వారివైపు చూస్తారు. నేను జ్ఞాపకమున్నావా? అని శర్మగారడుగుతారు. అమ్మ వారించటంతో ప్రక్కకు పోతారు.
వెంకటరత్నశర్మగారు ఇంత వివరంగా అమ్మను గూర్చి తెలుసుకొని తలకాయ ఊపుతూ అమ్మ రెండు పాదాలు పట్టుకొని సవరిస్తూ రెండు బొటనవేళ్ళు కాళ్ళకద్దుకొని ఇంత ప్రత్యక్ష దైవస్వరూపానికి ఇంత చాటుగా, గర్భితంగా ఎందుకుంటడం? త్వరగా బహిర్గతం చెయ్యి తల్లీ! అంటూ ఆనందపడతారు ! ఎంత ధన్యజీవి.