శిష్ట్లా వరప్రసాద్ పేరు చెప్పగానే భక్తి భావంతో హైమాలయంలో అతడు చేసే ప్రదక్షిణలు జ్ఞాపకానికి వస్తాయి. పంచాంగంలో జాతక చక్రంలో మంచీ చెడులు చూసి చెప్పగల జ్యోతిశ్శాస్త్ర విశారదుడు గుర్తుకు వస్తాడు. మన సంస్కృత కళాశాలలో చదువుకొని, ఆంధ్ర సంస్కృ తాలలో సాధికారికమైన ప్రజ్ఞ సాధించాడు. శ్రీ ఎ.వి.ఆర్ సుబ్రహ్మణ్యం వ్రాసిన అంబికా సహస్రనామాల వ్యాఖ్యను అతనికి చూపిస్తే దోషాలను పరిహరించి, విశేషాంశాలను జోడించిన నిరాడంబరమూర్తి. అలాగే భద్రాద్రి తాతగారు (రాయప్రోలు భద్రాద్రి రామ శాస్త్రి గారు) వ్రాసిన హైమవతీ సమశ్శతికి అర్థతాత్పర్యాలు వ్రాసి ఇచ్చిన సౌజన్య మూర్తి.
వారి తండ్రి పల్లపట్ల వాస్తవ్యులైన శిష్టా రామస్వామి శాస్త్రి గారు అమ్మపట్ల ఆకర్షితులై జిల్లెళ్ళమూడిలో నివాసం ఏర్పరచుకున్నారు. పల్లపట్లలో ఉన్న రోజులలో కూడా ఇంటిముందు కుర్చీ వేసుకొని అమ్మనామం చేసే తండ్రిగారిని చూచి ఎనిమిదేళ్ళ వయస్సులో తండ్రిగారు గ్రామాంతరం వెళ్ళితే వరప్రసాద్ | తను అమ్మనామం బిగ్గరగా చేస్తుండేవాడు. తరువాత అదే అమ్మను దైవంగా భావించి ధ్యానం చేయటం అలవాటయింది. జిల్లెళ్ళమూడిలో అమ్మ అఖండనామంలో రాత్రిపూట వరప్రసాదు, సాగర్ గారి అబ్బాయి ప్రసాదు | చేసేవారు.
ఒకసారి భాగవతం చదువుతుండగా తొడ కండరాలు చాల నొప్పి పెట్టాయి. ఆ బాధతో మగత నిద్రలో ఉండగా అమ్మ కనిపించి ‘నొప్పిగా ఉందా నాన్నా!’ అంటూ చేతిత చేతితో రాస్తున్నట్లుగా స్వప్న దర్శనం కలిగింది. ఆ తర్వాత ఆ బాధ నివారణ అయింది. చాల రోజుల పాటు అమ్మ స్పర్శ గుర్తుండి పోయింది. సరైన పోషకాహరం లేక బలహీనంగా ఉన్న వరప్రసాద్ అమ్మ స్నానాల కోసం గంగాళాలతో నీళ్ళు మోస్తుంటే అమ్మ చూచి పిలచి అరటిపండు ఇచ్చి తినిపించింది. అంతే బలం అమ్మ ఇచ్చేది కదా! శరీర నలత వదిలి పోయింది.
మాతృశ్రీ నాట్యకళామండలి (మాతృశ్రీ క్రీడా సాంస్కృతిక మండలి) పక్షాన ఆటల పోటీలు, నాటకాలు వేయటం జరుగుతుండేది. వరప్రసాద్కు నాటకాలంటే మంచి ఆసక్తి. నంబూరు పరబ్రహ్మం జిల్లెళ్ళమూడిలో ‘గాలివాన’ నాటకం ట్రూపు తయారు చేస్తూ వరప్రసాద్కు మనుమడి పాత్ర ఇచ్చారు. అది ప్రదర్శింప బడింది. తరువాత బి.కాం చదివే రోజులలో కాలేజి పక్షాన ‘శకుని’ ఏకపాత్రాభినయం చేసి బహుమతి సాధించటానికి అమ్మ వద్ద వేసిన నాటకమే పునాది అయింది. ‘మృచ్ఛకటికం’ వంటి సంస్కృత నాటకాలలో కూడా పాల్గొని బహమతులు, ప్రశంసలు పొందాడు.
జిల్లెళ్ళమూడిలో నాన్నగారితో బాట్మెంటన్ గేమ్ ఆడేవాడు. కాలేజీలో చదివే రోజులలో బాల్బాట్మెంటన్ లో చూపిన నైపుణ్యం చూచి ‘బాట్మెంటన్ ప్రసాద్’ అని పిలచేవారు. నాన్నగారు “ఆడుకుండేటప్పుడు ఆడుకోవాలి, చదువుకుండేటప్పుడు చదువుకోవాలిరా” అని ఆడించిన ప్రోత్సాహమే అతడిని అంత వాడ్ని చేసింది. అమ్మ కూడా ఒక రోజు ప్రసాద్ తల్లిదండ్రులు జిల్లెళ్ళమూడిలో లేనప్పుడు అతని పుట్టిన రోజు వస్తే అమ్మ వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. ఇతడు చెప్పకుండానే అమ్మ ఈ రోజు నీ పుట్టిన రోజు కదా అని తలకు నూనె రాసి, లడ్డు తెప్పించి నోటిలో పెట్టింది.
ఒకసారి అమావాస్య రాత్రి బాపట్ల నుండి నడుచుకుంటూ వస్తుండగా మధ్యలో భయమేసి అమ్మను తలచుకున్నాడు. వెంటనే ఎక్కడ నుండో ఒక కుక్క వచ్చి జిల్లెళ్ళమూడి ఊరి బయట దాకా దించి వెళ్ళింది.
నాగార్జునసాగర్ కాలేజీలో పనిచేస్తున్న రోజులలో కొందరు విద్యార్థులు కామర్స్, మర్కెంటైల్లో వెనుకబడటం చూచి ఉచితంగా వారికా విద్య నేర్పాడు. యం.ఎ ఫస్ట్ క్లాసులో పాసై ‘శాంత రసం’ మీద పి.హెచ్.డి. చేద్దామనుకున్నాడు. అసలు ‘శాంతం’ రసమా? కాదా? అనే ప్రశ్న వచ్చింది గైడ్గా ఉన్న ఆచార్యులకు. కొంత ప్రసాద్ వ్రాసి చూపించిన తర్వాత నమ్మకం కలిగి అంగీకరించారు. అమ్మ అనుగ్రహంతో పి.హెచ్.డి. డిగ్రీ సాధించి డాక్టరయ్యాడు.
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వరప్రసాద్ తల్లికి అంతిమ సంస్కారాలు శాస్త్ర బద్ధంగా చేసి మాసికాలు కూడా బ్రాహ్మణులను పిలిచి చేసేవారు. ఒకసారి పిలిచిన బ్రాహ్మణులు ఎగగొట్టారు. అంతక్రితం తండ్రి. అమ్మకు నివేదన చేస్తే చాలురా యీ తంతు ఏమీ అక్కరలేదన్నా వినేవాడు కాడు. బ్రాహ్మణులు ఆసారి రాకపోవటంతో అనసూయేశ్వరాలయానికి వెళ్ళి అమ్మకు నివేదించాడు. అమ్మ స్వప్నంలో దర్శనం ఇచ్చి, “నివేదన స్వీకరించాను. నాన్నా!” అన్నది. అప్పటి నుండి అమ్మకు నివేదన చేయటమే అలవాటై పోయింది.
తన ప్రగతికి ప్రాణ రక్షణకు కారణమైన అమ్మ సేవలో తన శేష జీవితం గడపాలనే కోరికతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని జిల్లెళ్ళమూడి నివాసం ఏర్పరచుకొని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత బోధన అందించాడు. వారికి వ్యాసరచనలో తర్ఫీదునిచ్చి, చక్కగా తీర్చిదిద్దేవాడు.
నిత్యం ధ్యానాలయంలో ధ్యానం చేసేవాడు. ధ్యానంలో వినాయకుడు కనిపించి, “పిల్లల వినాయక చవితి కార్యక్రమాలు జరుగుతున్నాయి వెళ్ళలేదేమిటి?” అన్నాడట! తన కుమారునికి జిల్లెళ్ళమూడిలో వివాహం జరుపు దామని సంప్రదించి ముహూర్తం కూడా నిర్ణయించబడింది. డిసెంబరు 31, 2018 రాత్రి అనుకోకుండా అమ్మలో ఐక్యం కావటం జరిగింది. అమ్మలోకి పోయేముందు “నేనే కాదు, నా సూక్ష్మ శరీరం అలసిపోయింది” అన్నాడుట. నిజానికి అతను లేని లోటు కళాశాల విద్యార్థినీ విద్యార్థులనూ, అందరింటి సోదరులనూ కలచి వేస్తుంటుంది. పదిమందికి సాయపడాలనే వరప్రసాద్ హంసలా శ్వాసించి పరమహంసలా జీవించిన సోదరుడు ధన్యజీవి.